"ఇదే ఆఖరిసారి కూడా"
ప్రకాష్ అదిరిపడ్డాడు "అంటే?"
"అంటే ఇకనుంచి నువ్వసలు అంకుల్ కి చెప్పాల్సిన అవసరమే లేదు. క్లీన్ చిట్ ఇచ్చేస్తాను నీకు"
"ఓహో - ఆఖర్లో మనం సుష్మ సంగతి చెప్తాం అంతేనా?"
"మాంచి అవకాశం చూసి"
"కాదనడానికి వీల్లేకుండా"
"కాదంటే మీ అంకుల్ చావుదెబ్బ తినే స్టేజ్ లో"
"ఆ స్టేజ్ ఎప్పటికొస్తుందంటావ్ గురూ?"
"అతి త్వరలో బ్రదర్. అతిత్వరలో... అంకుల్ మూడ్ మారిపోకముందే మనం త్వరగా ఆ సినిమా ఏర్పాట్లు చేయాలి. రేపే పేపర్ పబ్లిసిటీ మొదలుపెట్టాలి."
"ఓ.కె" ఉత్సాహంగా అన్నాడు ప్రకాష్.
ప్రతిమ అప్పుడే ఓ యువతితోపాటు లోపలికొచ్చింది "హలో మైడియర్ క్వీన్! ఉదయం నుంచీ మీ దర్శన భాగ్యం కరువయిన కారణంబేది?" ప్రతిమనడిగాడతను.
"భవానీ! లెట్ మీ ఇంట్రడ్యూస్ మై క్లాస్ మేట్ మృదుల" అంది ప్రతిమ.
"హలో మృదులాజీ - హౌడుయూడూ?"
"ఫైన్! థాంక్యూ"
"యూ ఆర్ వెరీ బ్యూటిఫుల్"
"థాంక్యూ"
"అండ్ లవ్లీ"
"ఓ థాంక్యూ"
"అండ్ క్యూట్"
"అహ్- థాంక్యూ"
"అండ్..." అతని ధోరణి ప్రతిమకు చిరాకు కలిగింది.
"భవానీ" అంది చిరుకోపంతో.
"ఎస్ డియర్"
"మృదులకు మనం హెల్ప్ చేయాలి"
"ఎలాంటి హెల్ప్ అయినా సరే చేయడానికి రడీ డియర్"
"వాళ్ళ ఫాదర్ పేరు సుధీర్ కుమార్"
"ఓ ఫేమస్ సుధీర్ కుమార్- తెలుసు. నువ్వు లక్ష సార్లు చెప్పావ్ ఆస్తి అంతా ఆర్పేసి పూరి గుడిశెలో కాపురం వుండాలని కలలు కనే క్రేజీ క్రీచర్"
"కరెక్ట్! అతను ఇప్పుడు పాపం మృదుల లవ్ మ్యారేజ్ కి అడ్డుపడుతున్నాడు."
"ఎందుకని?"
"ఆ కుర్రాడు ఆరు నెలల్లోగా తన ఆస్థినంతా హారతి కర్పూరంలా హరించగలిగితే పెళ్ళికి పర్మిషన్ ఇస్తానంటున్నాడు."
"పిచ్చి బాగా ముదురినట్లుంది- వెంటనే మనందరం కలిసి మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి. ఇదేగా మీక్కావల్సిన సహాయం?" అడిగాడు భవానీశంకర్.
"కాదు! ఇదిగో ఈ ప్రకటన చూడండి! మా డాడీ ఇచ్చారిది" అంటూ పేపర్ కటింగ్ చూపించిందామె.
"సైక్రియాటిస్ట్ లు స్టడీ చేయటానికి సూపర్బ్ కేస్ ఇది" చదివాక అన్నాడతను.
"ఆ ప్రకటనకు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ చింపి అవతల పారేయించాను. దాంతో ఆటోమేటిగ్గా విజయ్ జనరల్ మేనేజర్ అయ్యాడిప్పుడు."
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు.
"ఈ విజయ్ ఎవరు మధ్యలో?"
మృదుల సిగ్గుపడింది- "నా లవర్"
"ఓహ్. సో ఇప్పుడు మనందరం రంగంలోకి దూకి ఆరు నెలల్లో మీ డాడీని అడుక్కుతినేవాడిగా మార్చేయాలి. అంతేనా?"
"ఎగ్జాక్ట్ లీ"
"ఓ.కె! ఇంక ఆ విషయం నాకొదిలేయండి. రేపట్నుంచీ రంగంలోకి దిగుదాం."
"థాంక్యూ సోమచ్" అంది మృదుల.
"థాంక్యూ భవానీ" అంది ప్రతిమ.
"ఇటీజ్ ప్లెజర్ డియర్! మీకు, మీ చెలియలకు సేవ చేయటమే నా జీవిత ధ్యేయం."
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
అతను తన సీట్లో కూలబడేసరికి ఫోన్ కొంప ఎగిరిపోయేంత శబ్దంతో మోగసాగింది.
"హల్లో!" అంది అవతలి గొంతు ముద్దగా.
"హలో" అన్నాడు భవానీశంకర్.
"హలో...హలో" మళ్ళీ అరిచిందా గొంతు.
"హలో...ఎవరు బ్రదర్ మాట్లాడేది?"
"హలో!...హలో!"
"హలో బ్రదర్! ఎవరు మాట్లాడేది? మీ చెవి తాలూకూ కొన్ని భాగాలు గానీ, లేదా టెలిఫోన్ డిపార్ట్ మెంట్ తాలూకూ బ్రెయిన్ విడి భాగాలు గానీ ఏవోకటి చెడిపోయి వుండాలి. యామై కరెక్ట్ బ్రదర్?"
"హలో...అయ్ వాంట్ టు ష్పీక్ విత్ భవానీశంకర్!"
"ఎస్! భవానీశంకర్నే మాట్లాడుతున్నాను మిత్రమా! నువ్వు నా అనుంగు మిత్రుడు వర్మవి అయుంటావనటంలో ఎలాంటి సందేహం లేదు. ఏ కల్లు కాంపౌండ్ నుండి మాట్లాడుతున్నావ్ బ్రదర్?"