తనకెవరున్నారని? కేవలం కొద్దిమంది స్నేహితురాండ్రు. అంతేకానీ ఎక్కడికెళ్ళినా, ఎవరి దగ్గరున్నా తనను వెతికి చంపటం వాళ్లకు కష్టమేమీ కాదు. వేడి 'టీ' తీసుకొచ్చి తనపక్కనున్న షెల్ప్ మీద గ్లాసులో పోసి వెళ్ళిపోయాడు వార్డు బాయ్.
అంటే తెల్లారిపోయిందన్నమాట.
ఆమెకు తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. బహుశా మందులు పనిచేసి ఉంటాయ్.
లేచి తనంతట తనే 'టీ' తాగబోయిందామె. ఆ రుచి చూడగానే వెంటనే వాష్ బేసిన్ దగ్గరకు నడిచి ఊసేసింది.
తన జన్మలో ఇంత సబ్ స్టాండర్డ్ 'టీ' తాగలేదు.
మరికాసేపట్లో డాక్టర్, నర్స్ వచ్చారు.
"హే ఆర్ యూ ఫీలింగ్ నో?" అడిగాడు డాక్టర్.
"ఓ.కే." అంది దీప.
"ఫైన్! ఇప్పుడయినా యాక్సిడెంట్ ఎలా జరిగిందో గుర్తుకొచ్చిందా?
"లేదు" అంది దీప తడుముకోకుండా. మతిపోయినట్లు నాటకం ఆడితే తనను ఇంటికి పంపకుండా తప్పించుకోవచ్చు.
"పోనీ మీ పేరు, మీ ఫాదర్ పేరు చెప్పగలరా?"
"ఏమీ గుర్తురావటం లేదు" అబద్ధం చెప్పేసిందామె.
డాక్టర్ పెదాల మీద నవ్వు ఆరిపోయింది.
"నీ పేరు కూడా నీకు గుర్తు రావటం లేదా?"
"లేదు డాక్టర్"
"తమాషాగా ఉందే! ఇంత చిన్న దెబ్బకి అంతగా బ్రెయిన్ ఎఫెక్ట్ ఇవ్వకూడదే" ఆలోచనలో పడుతూ అన్నాడు.
"ఓ.కే. లెటజ్ సీ" అన్నాడు డాక్టర్ పక్క బెడ్ దగ్గరకు నడుస్తూ.
మరికాసేపట్లో పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ వచ్చాడు.
"హలో" అన్నాడతను చిరునవ్వుతో.
"హలో" అంది దీప.
"నేను గుర్తున్నానా?"
"ఉన్నారు."
"నన్నెప్పుడు చూశారు?"
"నిన్న పొద్దున్న."
"గుడ్! మరి మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇల్లు అన్నీ గుర్తుకొచ్చే ఉండాలి."
"ఎంతో ట్రై చేస్తున్నాను. అయినా ఏమీ గుర్తురావటం లేదు" అబద్ధం చెప్తూంటే గుండె వేగంగా కొట్టుకుంటోంది.
సబిన్ స్పెక్టర్ మొఖంలో ఆశ్చర్యం కనిపించింది.
"ఆల్ రైట్. మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ ఎవరి పేరు గుర్తుకొచ్చినా వెంటనే నర్స్ ద్వారా నాకు ఫోన్ చేయించండి."
"సరే."
"ఈ విషయం మాత్రం మర్చిపోకండి. నా పేరు హరనాథ్! సబిన్ స్పెక్టర్."
"గుర్తుంచుకుంటాను."
అతను వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వాళ్ళు పెట్టే భోజనం రెండు ముద్దలు తినేసరికి వాంతి వచ్చినట్లయింది. భోజనం అనేది ఇంత దారుణంగా కూడా ఉంటుందని మొదటిసారి ఆమెకు తెలిసింది. ఆ రోజంతా కూడా ఆలోచనతోనే గడిపిందామె.
సాయంత్రం మళ్ళీ హరనాథ్ వచ్చాడు తన సైన్యంతో.
"ఎనీ ఇంప్రూవ్ మెంట్?"
"నథింగ్!"
అతనికేం చేయాలో అర్థంకాలేదు. హెడ్ కానిస్టేబుల్ ని పిలిచాడతను.
"మన ఫోటోగ్రాఫర్ ని తీసుకొచ్చి ఈ అమ్మాయి ఫోటో తీయించండి. ఆ ఫోటో అన్ని పోలీస్ స్టేషన్స్ కీ పంపండి. ఎక్కడయినా ఈ అమ్మాయి వర్ణనలతో ఏమయినా కంప్లెయింట్స్ వస్తే కంపేర్ చేయవచ్చు."
"సరే సార్."
"ఇంకో పని కూడా చేయండి. రేపే ఈ ఫోటో అన్ని దినపత్రికల్లో పబ్లిష్ చేయించు. ఒకవేళ ఈమె ఫ్యామిలీ మెంబర్స్ పేపర్ చూస్తే మనల్ని కాంటాక్ట్ చేస్తారు."
"అలాగే సార్."
అతను వెళ్ళిన అరగంటకు హెడ్ కానిస్టేబుల్ ఫోటోగ్రాఫర్ తో వచ్చాడు. దీపకు భయం పెరిగిపోతోంది. ఇలా తను హాస్పటల్లో చేరిన విషయం బహుశా శ్రీరంజనికి తెలీదేమో! తెలిస్తే తనను ఇంటికి తీసుకెళ్ళేవారే కదా!
ఇప్పుడీ ఫోటో పేపరులో చూస్తే వెంటనే వచ్చి తనను ఇక్కడే హత్య చేయవచ్చు. లేదా ఇంటికి తీసుకెళ్ళి చంపవచ్చు.
"లేచి కూర్చోమ్మా!"
దీప లేచి కూర్చుంది. చకచక రెండుసార్లు ఫోటోలు తీశాడతను.
ఈ ఫోటోలు పేపరులో రాకముందే తను పారిపోవటం మంచిది.
ఎక్కడికెళుతుందో తనకే తెలీదు. కానీ ముందు పారిపోవాలి.
వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా లేచి వార్డులో నుంచి బయటకు వచ్చిందామె. నర్స్ ఎదురుగా వచ్చిందప్పుడే!
"ఎక్కడికి వెళుతున్నావ్?" అనుమానంగా అడిగిందామె.
"ఊరికే నిద్రపట్టక అలా...." అనేసి వెనక్కు తిరిగివచ్చి తన పక్కమీద పడుకుంది.
మర్నాడు! ముఖ్యమయిన పేపర్స్ లో దీప ఫోటో పబ్లిష్ అయింది. అయితే తలకున్న బాండేజ్ తో ఫోటో తీయటం వల్ల ఆమెను గుర్తుపట్టటం ఎవరికయినా కష్టమయ్యే రీతిలో వుంది.
ఆ ఫోటోను ముందు సిద్ధార్థ చూశాడు. శ్రీరంజని ఇంకా నిద్రలోనే వుంది.
"రంజనీ! ఇదిగో. ఈ శుభవార్త చూడు" అన్నాడతను ఆమెను నిద్రలేపుతూ.
ఆమె చటుక్కున నిద్రలేచి చూసింది.
"ఏమిటది?" అంది ఆశ్చర్యంగా.
"దీప ఫోటో వచ్చింది పేపరులో" పేపరు ఆమె ముందుంచాడతను.
ఫోటో కింద రాసిన మేటర్ త్వరత్వరగా చదివిందామె.
"ఈ ఫోటోలోని యువతి బేగంపేట ప్రాంతంలో గాయాలతో రోడ్డు పక్కన పడివుండగా కనుగొనటం జరిగింది. తలకు తగిలిన గాయాల కారణంగా ఆమెకు జ్ఞాపకశక్తి నశించింది. అందువల్ల తన గురించిన వివరాలు, తనవారి గురించిన వివరాలు ఆమె ఏమాత్రం తెలియజేయలేకపోతుంది. ఆమె కుటుంబానికి చెందినవారుగానీ, ఆమె ఫ్రెండ్స్ లేక పరిచయస్తులు గానీ దగ్గరలో వున్న పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆమె వివరాలు తెలుపవలసినదిగా కోరుతున్నాం."