Previous Page Next Page 
జయ - విజయ పేజి 29


    ఆ ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి విజయ మనసంతా ఆనందముతో నిండిపోయింది. ఏదో తన్మయత్వం! సంతృప్తి కొద్దిక్షణాలు అలా అచేతనావస్థలో ఉండిపోయిందామె. అయితే ఆ ఆనందం క్రమేపీ దుఃఖంగా మారిపోయింది. అతను ఆ ఉత్తరం రాసింది నిజానికి జయకు. అతని హృదయంలో ఏర్పడ్డ ఆ ప్రగాఢమైన ప్రేమ తనదికాదు. జయ కోసం అతను పరితపించిపోతున్నాడు. తన సాన్నిధ్యం కోసం కాదు. జయ సాన్నిధ్యం కోసం. అతను జయ రూపాన్నేంతగా ప్రేమిస్తున్నాడో తను అతనిని అంత గాఢంగా ప్రేమించింది.
    తనంతటి దురదృష్టవంతురాలు ఇంకెవరయినా ఉంటారా? అతని ప్రేయసి స్థానాన్ని పొందే అదృష్టానికి తను నోచుకోలేదు. ఇప్పుడీ ఉత్తరానికి ఏమని జవాబు రాయడం. హైద్రాబాద్ లో బస్ స్టాప్ లో చంద్రకాంత్ కనబడ్డారనీ, లేనిపోని సమస్యలు తలకు చుట్టుకునేట్లున్నాయనీ జయ రాసిన ఉత్తరం తనకు అప్పుడే అశాంతిని కలుగజేసింది.
    ఆ ఉత్తరానికి జవాబు రాయకపోతే అతను నిజంగా తమ ఇంటికొచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. అతని హృదయం అంతగా అంకితమయిపోయింది జయకు.
    "ఎవరి దగ్గర్నుంచి ఉత్తరం?" టీ తీసుకొచ్చి విజయకు అందిస్తూ అడిగింది పార్వతి.
    "చంద్రకాంత్ గారు రాశారమ్మా! మన సమస్యల్లో మనం సతమతమవుతోంటే నేను చేజేతులా సృష్టించుకున్న సమస్య కూడా ఇప్పుడే ప్రాణం మీదకొచ్చింది."
    "ఏమయింది?"
    "ఇంకేమవుతుంది. ఆ రోజు నువ్వు వారిస్తున్నా వినకుండా చెప్పిన అబద్ధానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవించాల్సివస్తోంది. ఆయన జయనే విజయ అనుకుని మనస్ఫూర్తిగా ప్రేమించారు. జయకు హైద్రాబాద్ లో కనబడి తనతో వివాహానికి అంగీకరించమని ఎంతో ప్రాధేయపడ్డారట. ఇప్పుడీ ఉత్తరం నిండా కూడా అదే రాశారు. 'ఊ' అంటే చాలుట! వెంటనే వివాహం చేసుకుంటారట. లేకపోతే జీవితాంతం వివాహమే చేసుకోరట. ఆయనకు జవాబు ఏం రాయాలో తెలీటంలేదు. అసలు జవాబు రాయడానికే భయంగా ఉంది నాకు!నేను చెప్పిన అబద్ధం ఎక్కడ బయటపడుతుందో ఆయనకు అప్పుడు నా ముఖం ఎలా చూపించాలో అని గుండెలదిరిపోతున్నాయ్."
    ఆమె మాటలు పార్వతికి వినిపించడం మానేసినయ్. ఆమె మనసులో ఆలోచనలు విజయ చెప్పిన మాటల చుట్టూ పరిభ్రమిస్తున్నాయ్.
    "ఆయన జయనే విజయ అనుకుని ప్రగాఢంగా ప్రేమించారమ్మా! 'ఊ' అంటే చాలు. వెంటనే వివాహం చేసుకుంటారట..." అన్నమాటలే ఆమె చెవిలో గింగుర్లెత్తుతున్నాయ్.
    "అవును! ఈ పరిస్థితుల్లో జయను చంద్రకాంత్ వివాహం చేసుకోడానికి అంగీకరిస్తే ఎలా వుంటుంది? వెంటనే వివాహం చేసుకుంటాడతను. దాంతో జయ సమస్య పరిష్కారమయిపోతుంది. చంద్రకాంత్ ని మోసంచేసినట్లవుతుందని తనకు తెలుసు. అలా ఓ వ్యక్తిని మోసగించడం తనకూ అయిష్టమే. ఇదే మరో పరిస్థితిలో అయితే ససేమిరా ఇలాంటి పనికి అంగీకరించేది కాదు. వంద అబద్ధాలు చెప్పి ఓ పెళ్ళి చేయమన్న నానుడి ఉండనే ఉంది.
    కానీ ఇక్కడ పరిస్థితి వేరు.
    తన కూతురు మోసానికి గురి అయింది.
    అందుకని ఆ మోసం మరొకరికి రుద్దాల్సి వస్తోంది. అయితే వివాహం అయ్యాక ఆమె విజయ కాదన్న విషయం తెలిస్తే ఏం జరుగుతుందా అన్న సందేహం పీడిస్తూనే వుంది.
    అయినా తన భయమేకాని వివాహమయిపోయాక అప్పుడిక ఎవరేం చేస్తారు!అప్పటికే ఇద్దరూ అన్నివిధాలా ఒకటయిపోతారు. ఆలోచిస్తున్నకొద్దీ పార్వతికి ధైర్యం తిరిగివస్తోంది. అంతకంటే మరో మార్గమే లేదు తనకి.
    తమ కుటుంబం పరువు ప్రతిష్టల కోసమయినా ఈ మార్గాన్ని అనుసరించక తప్పదు.
    "విజయా!" నెమ్మదిగా విజయను పిలిచిందామె.
    "ఏమిటమ్మా!"
    "నాకో ఆలోచన వచ్చింది. అది మంచో చెడో నేనేమీ ఆలోచించదల్చుకోలేదిప్పుడు! జయ ఈ గండం నుంచి బ్రతికి బయటపడాలంటే నేనాలోచించిన విధంగా జరగాల్సిందే!"
    "ఏం చేయాలంటావ్?" ఆత్రుతగా అడిగింది విజయ. మనం అంగీకరిస్తే వివాహం కూడా చేసుకుంటాడు! అంతేనా?"
    "అవును!"
    "ఇప్పుడు జయ జీవితం చక్కబడాలంటే ఇంతకంటే మంచి మార్గం ఇంకోటి లేదు విజయా! ఎలాగొలా జయను ఒప్పించి మరో ఆలోచన లేకుండా వెంటనే మన అంగీకారం తెలిపి వారం రోజుల్లో వివాహం జరిపించేయాలి. ఏమంటావ్?"
    "అమ్మా!" ఆమె మాటలకు నివ్వెరపోయింది విజయ.
    "ఏం? నీకు నచ్చలేదా?" సందేహంగా అడిగింది పార్వతి.
    "వద్దమ్మా! చంద్రకాంత్ గారిని అలా మోసం చేయడం బావుండదు." వణుకుతోన్న స్వరంతో అందామె.
    ఆ క్షణంలో ఆమెకు చంద్రకాంత్ రూపం కళ్ళముందు కనిపించి కళ్ళనిండుగా నీళ్ళు తిరిగినయ్.
    అతను తనను ప్రాణ స్నేహితురాలిగా భావించాడు. ఒకరినొకరు చూసుకోకుండానే ఇద్దరూ ఎంతో ఆత్మీయత ఏర్పరచుకున్నారు.
    "కాని విజయా... పోనీ నువ్వే ఇంకో మార్గమేదయినా చెప్పు..." దీనంగా అంది పార్వతి.
    "వద్దమ్మా! ఇప్పటికే ఆయనను మోసగించినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. ఇప్పుడు గర్భంతో ఉన్న జయతో వివాహం జరిపిస్తే, జీవితాంతం నేను నరకయాతన అనుభవిస్తూనే ఉండాలి." జారిపోతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అందామె.
    పార్వతి చటుక్కున విజయ రెండు చేతులూ పట్టుకుంది.
    "విజయా! ఇది జయ జీవన్మరణ సమస్య! నేను నీ తల్లిగా కాదు. జయ తల్లిగా ప్రార్ధిస్తున్నాను. దాన్ని రక్షించుకోవాలంటే ఇంతకంటే వేరే ఉపాయం లేదు. నువ్వే ఆలోచించు." కళ్ళవెంబడి నీరు పెట్టుకుంటూ అంది పార్వతి.

 Previous Page Next Page