Previous Page Next Page 
కొత్తనీరు పేజి 29


    రాధ ముఖం ఒక్కక్షణం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె జవాబు చెప్పకుండా తల తిప్పుకుని వెళ్ళిపోయింది.
    "ఇదమ్మా! నీ కూతురి సంగతి! బోధపడిందా!" అన్నారు జగన్నాథంగారు.
    శకుంతల నిట్టూర్చింది.
    "బాగుంది. ఇదో కొత్త గొడవ! దాని వరస చూస్తే యే వెయ్యిరూపాయల ఉద్యోగస్థుడో కావాలని ఉన్నట్లుంది! ఎక్కడ నుంచి తేవడం? పదివేలు కట్నం పొయ్యందే అంత పెద్ద సంబంధాలు ఎక్కడ కుదురుతాయి? ఇదొక్కర్తేనా, ఉన్నదంతా పెట్టి చేయడానికి! మిగతా పిల్లలు ఏమవుతారు? సాలు దాన్నింతవరకు చదివించడంవల్లే సంబంధాలు వెతకడం కష్టంగా ఉంది! ఎమ్ యే చదివిన దానికి అంతకంటే పై మెట్టుమీద ఉన్నవాడిని తేలేకపోయినా, కనీసం ఇంకో ఎమ్ యేతోనైనా చెయ్యాలిగదా పెళ్ళి. అంతవరకే కుదరడం కష్టం అవుతూంటే, యింక దీని గొంతెమ్మ కోరికలు ఎలా తీరుతాయి?"
    "ఈకాలపు పిల్లలందరూ పుట్టడంతోనే కోరికలు వెంటబెట్టుకు వస్తున్నారు! కాలమే అలావుంది, వాళ్ళనని ఏం లాభం? ప్రతీ ఆడ పిల్ల సినిమా హీరోలాటి మొగుడు-మేడలు, సోఫాలు, రేడియోలు ఉండి, కాలు కిందపెట్టనియ్యకుండా కార్లో తిప్పే మొగుడు కావాలని ఉంటుంది. సినిమాలు చూసి, నవలలు చదివి, అంతా వాస్తవ జీవితంలో ఊహించుకుంటారు. రాధా అంతేనమ్మా! అందులో తన యీడు పిల్ల ఉషకి మొన్న పెళ్ళయిందా? దాన్ని చూశాక దీనికి మాత్రం అలాంటి మొగుడు రావాలని ఉండదూ!"
    "బాగుంది......ఎవరి అదృష్టం వాళ్ళది! అన్నయ్యకి యిద్దరే పిల్లలు! బోలెడు ఆర్జిస్తున్నాడు.....ఉషతో వంతు పెట్టుకుంటే యెలా?...."
    "అదంతా దానికి ఎందుకు తడుతుంది పిచ్చిదానా? ఆ వయసులో ఆ కోరికలు సహజమే!"
    "కోరికలు నాకూ వుండేవి! కాని... .....నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకోలేదూ!"
    "బాగుంది. నీకంటే యివరయ్యేళ్ళు వెనకపుట్టింది అది. ఆ రోజులకి ఈరోజులకి చాలా తేడావుంది. అంతేకాక. 'నా ఖర్మ ఇంతేనని' సరిపెట్టుకో నవసరం లేకుండా దాని కో డిగ్రీ వుంది. సంపాదించుకుని బ్రతకగలన్నన ధీమావుంది!"
    "ఇంతకీ ఏం చేద్దామంటారు? నాకేం బోధపడ్డంలేదు. ఎక్కడనుంచి తీసుకువస్తారు ఆయన అంత పెద్ద సంబంధాలు ఆయన్ని అనడం కాదుగాని, తాహతుకి మించి ఆయనమాత్రం ఎక్కన్నించి తెస్తారు? పోనీ ఏ కట్నం లేకుండా పిల్లను హ్కోసి ఎవరేనా చేసుకుంటారేమో అనుకోడానికి, ఇదేం రంభా, ఊర్వశా! మనం సిద్దంగా ఉన్నా, చేసుకునేవాళ్ళు అంతస్తులు చూసుకోరూ! వియ్యానికి, కయ్యానికి సమంగా ఉండాలిగాని, పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు ఉషలాగ దీనికి కావాలంటే యెలా?" విసుగ్గా అంది శకుంతల.
    జగన్నాథంగారు ఆలోచనలో పడ్డారు.
    "ఏమంటారు నాన్నా?"
    "నన్నడిగితే, మీ ఆయన ఎలాగూ పెద్దపెద్ద సంబంధం చేయలేడు. అది యెలాగూ మామూలు సంబంధం అయితే చేసుకునేట్టులేదు. అంచేత అదన్నట్టే దానిని ఉద్యోగం చేయనీయండి కొన్నాళ్ళు. ఆ ఉద్యోగం చేస్తూ ఎవరినయినా అదే ఎన్నుకుంటుంది. లేదా, కొన్నాళ్ళు ఉద్యోగం చేశాక సాధక బాధకాలు అర్ధమయో, ఆ జీవితం విసుగెత్తో పెళ్ళికి సుముఖురాలై మీరు చెప్పినట్టు వింటుంది. ఈ రోజుల్లో పాతిక, ముఫ్ఫయ్యేళ్ళ పెళ్ళికూతుళ్ళు రివాజే కదా! అది చెప్పినట్లు-ఊరికే కూర్చునేకంటే, నాలుగురాళ్ళు తెస్తూ కుటుంబాన్ని ఆదుకోవడం నయం కదా!"
    "అలా అయన ఒప్పుకోరు గదా!"
    "ఒప్పుకోకపోతే, కూతురికి నచ్చినవాడిని తెచ్చి పెళ్ళి చేయమను. అది చెప్పినమాట చెప్పి, యీ సలహా చెప్పు! తరవాత అతని యిష్టం! వింటే సరే సరి. లేకపోతే అది యెలాగూ ఇంట్లోంచి వెళ్ళిపోయేటట్టు ఉంది! ఆ తండ్రీ కూతుళ్ళే చూసుకుంటారు లే! అంత కంటే నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను?"
    "బాగానే ఉంది గోల! వీళ్ళిద్దరి మధ్య నా ప్రాణాలు పోతున్నాయి!"
    "తరవాత యింకో మాట! రాధ పెళ్ళికి నేను, మీ ఆయనకేం అభ్యంతరం లేకపోతే, రెండు మూడువేలు సర్దుతానని చెప్పు!"
    "లాభంలేదు నాన్నా......ఆయన తీసుకోరు. మీ దగ్గిర డబ్బు తీసుకోడం ఆయనకి నామర్దా! మీ పేరు చెపితేనే కోపం. మీ దగ్గిర 'దానం' తీసుకుంటారా, పిల్ల పెళ్ళన్నా చేయడం మానేస్తారుగాని!" శుష్కహాసం చేసింది శకుంతల.
    "అయితే అంతకంటే నేనుమాత్రం ఏం చెయ్యగలనమ్మా? కాని, ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది. నువ్వు అనవసరంగా బాధపడి ఆరోగ్యం చెడగొట్టుకోకు."
    "బాధపడి చేసేదిమాత్రం ఏముంది?.....సరే.....మీరు పడుకోండి నాన్నా కాసేపు...." శకుంతల లేచి వెళ్ళింది.
    
                            *    *    *
    
    మర్నాడు ఉదయం శకుంతల ప్రయాణమయింది. పార్వతమ్మ కూతుర్ని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని పదిసార్లు హెచ్చరించింది. "డాక్టరుచేత చూపించుకుని, పురుడు వచ్చేముందు రాస్తే వస్తాను" అంది.
    "శకూ, ఆ మందుల చీటీ జాగ్రత్తపెట్టావా! వెళ్ళగానే మందులు ఆరంభించు, అశ్రద్ధ చెయ్యక. అంత అయాక యిప్పుడు పంతాలతో ఆరోగ్యం చెడగొట్టుకోకు.....మందులు సరిగా తీసుకో!" తండ్రి హెచ్చరించాడు.
    "వాసుకి క్లాసు వస్తే వాడి నిక్కడపెట్టి ఇంజనీరింగు చదివించండి." రామం అన్నాడు చెల్లెలితో.
    శకుంతల పేలవంగా నవ్వింది.
    "సరే,.....వాడికి క్లాసు వచ్చినప్పటిమాట, సీటు దొరికినప్పటిమాట!"
    "అనూరాధని కొన్నాళ్ళు ఇక్కడ ఉంచకూడదమ్మా, అక్కడ పడేపాటేముంది? ఉష వెళ్ళిందా, అది ఉంటే మాకు కొంచెం తోస్తుంది .....ఏం రాధా, ఉంటావా?"

 Previous Page Next Page