Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 29


    వ్యాన్ లోయలోకి పడిన తర్వాత... జరిగిన కాల్పులు గుర్తుకొచ్చాయి. తమ మీద కాల్పులు జరిపిన వాళ్ళెవరు? నడుస్తున్న ఆదిత్య కాళ్ళకు చల్లగా నీళ్ళు తగలడంతో-

 

    అక్కడేదో చెరువుందని అర్ధమైంది ఆదిత్యకు.

 

    కడుపునిండా నీళ్ళు తాగి, కాళ్ళూ చేతులూ కడుక్కుని... చెరువు ఒడ్డున ముందుకు నడవడం ప్రారంభించాడు.

 

    అప్పటికే గాలిహోరు ఎక్కువవడం ప్రారంభించింది. టపటప పడుతున్న సన్నటి చినుకులు.

 

    వంటికి తగిలిన గాయాల బాధ... తుప్పలు, డొంకల రాపిడికి చీరుకుపోయిన శరీరంలోంచి స్రవిస్తున్న రక్తం.

 

    ఆదిత్యకు పరిగెత్తడానికి ఓపికలేదు. కనీసం నడవడానిక్కూడా ఓపిక లేదు.

 

    ఆఖరి ప్రయత్నంగా-

 

    "ధరణీ... ధరణీ" అరిచి చెరువు ఒడ్డున పడిపోయాడు.

 

    అదే సమయంలో...

 

    చిన్నగా విన్పించిన మూలుగు... బాధతో లుంగలు చుట్టుకుపోతున్న మనిషి మూలుగు.

 

    అతి ప్రయత్నమ్మీద లేచి, ఆ శబ్దం విన్పించిన వైపు అడుగులు వేశాడు ఆదిత్య.

 

    "ధరణీ... ధరణీ... ధరణీ" అని తిరిగి అరిచాడు.

 

    అప్పుడు విన్పించింది ఆదిత్యకు.

 

    "ఆ... ది... త్యా..." అంటూ ఓ మూలుగు.

 

    ఆ శబ్దం విన్పించిన వైపుకు అతి ప్రయత్నమ్మీద చూశాడు ఆదిత్య.

 

    కొంచెం దూరంలో...

 

    బండరాయి పక్కన పడున్న ఆకారం ఒకటి కనిపించింది.

 

    శక్తి కూడదీసుకుని పరుగెత్తాడు ఆదిత్య.

 

    ఆ బండరాయి పక్కన పడివున్న వ్యక్తి ధరణి కుమారే... వళ్ళంతా తుపాకీ తూటాలకు అప్పటికే చిల్లులు పడిపోయింది. వళ్ళంతా గాయాలు. ధరణీ వంటి మీద చెయ్యి వేశాడు ఆదిత్య.

 

    చేతికంటిన నెత్తురు వెచ్చగా వుంది.

 

    "ఆదిత్యా... నే...నే..." హీన స్వరంతో అన్నాడు ధరణి.

 

    తనిప్పుడు ఏం చేయాలి? ధరణిని ఎలా రక్షించుకోవాలి?

 

    "ధరణీ... ఏమైంది... చీకట్లో నాకేం కన్పించటంలేదు" చేత్తో అతని దేహాన్ని తడుముథూ అన్నాడు ఆదిత్య.

 

    "అంతా అయిపోయింది. మరి... నేను ఎక్కువసేపు బ్రతకను... ప్లీజ్... ఆదిత్యా... నేను చెప్పింది విను... నేను... వెళ్ళాలని అనుకున్నది... ఒక దగ్గరికి... వెళుతున్నది... యింకోదగ్గరికి... ఈ ప్రపంచంలో నా భార్య సుమబాల... నా కూతురు ప్రెటీకి... నేను తప్ప... మరెవ్వరూ లేరు... వాళ్ళని ఇక నుంచీ...చూసుకోవాల్సిన బాధ్యత నీదే... చూసుకుంటావు కదూ... ముఖ్యంగా మా నాన్న బారినుండి నా భార్య సుమబాలను... రక్షిస్తావు కదూ... మైడియర్ ఫ్రెండ్... ఆదిత్యా... మాట్లాడు" ఏడుస్తూ అన్నాడు ధరణి.    

 

    ఆదిత్య మాట్లాడలేకపోతున్నాడు. అతని గొంతు దుఃఖంతోను, అతని దేహం గాయాలతోను పూడుకుపోయి వుంది.

 

    "అలాగే ధరణి! మీరు చెప్పినట్టుగానే చేస్తాను. కానీ మీకేం కాదు. భయపడకండి... మిమ్మల్ని ఈ లోయలోంచి రక్షించే పూచీ నాది" తన చేతుల్తో ధరణిని ఎత్తబోయాడు.

 

    "లాభంలేదు... ఆదిత్యా... ఇద్దరి రాజకీయ నాయకుల కుట్రకు మనిద్దరం బలైపోయాం... నన్ను బ్రతికించాలని... చూడకు... ప్లీజ్... ఆదిత్యా... నువ్వయినా యిక్కడ నుంచి వెళ్ళిపో... నువ్వు బ్రతికి... నా వాళ్ళని బ్రతికించు. సుమబాలను రక్షిస్తావు కదూ... ప్రెటీని ఆదరిస్తావు కదూ. చెప్పు... చెప్పు... ప్లీజ్."

 

    ధరణి పరిస్థితి అర్ధమైంది ఆదిత్యకు.

 

    ధరణి కొన ఊపిరితో మాట్లాడుతున్నాడు.

 

    లాభం లేదు. ధరణి మరి బ్రతకడు... ఓ నిర్ణయానికొచ్చిన ఆదిత్య-

 

    "మీ భార్యా, పిల్లలు ఎక్కడుంటున్నారు చెప్పండి ధరణి."

 

    చెప్పాడు ధరణి అతి కష్టం మీద.

 

    "మా ఇంట్లో... మా బెడ్ రూమ్ లో... డబుల్ కాట్ బెడ్ కున్న సీక్రెట్... బాక్స్ ల్లో.. నా డైరీలుంటాయి. ఆ డైరీలు చదువు... నా గురించి, నా తండ్రి గురించి... నా భార్య గురించి నీకు తెలుస్తుంది. ఇలాంటి ప్రమాదం ఎప్పుడైనా రావచ్చన్న వూహతో... ముందుగా... నా ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు బ్యాంక్ లాకర్లో వుంచాను. నా డైరీలు చూస్తే... నీకే అన్ని విషయా...లూ తెలుస్తాయి. మన మధ్య ఏమీ సంబంధం లేకపోయినా... అతి తక్కువ సమయంలో... నిన్ను యిష్టపడే వ్యక్తిగా నీకేమీ చేయకుండానే... నీకు పెద్ద భారం... అప్పగిస్తున్నందుకు... నన్ను క్షమిస్తావు కదూ... ఫ్రెండ్" ఆదిత్య రెండు చేతుల్నీ తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఆ చేతులతో తన గుండెను రాసుకున్నాడు ధరణి.

 

    ఆదిత్య పూర్తిగా మూగవాడైపోయాడు.

 

    ఎక్కువైన హోరుగాలి... ఆకాశంలో మెరుపులు... ఆ మెరుపుల వెలుగులో... రక్తం ముద్దలా ధరణి.

 

    ఆదిత్య కళ్ళనుంచి కారిన కన్నీళ్ళు ధరణి కనురెప్పలమీద పడి, బుగ్గల మీద రక్తపు చారికల్లో కలిసిపోతున్నాయి.

 

    బలవంతంగా ధరణి వూపిరి పీలుస్తున్నాడు.

 

    ఒక్కసారిగా వర్షం ఎక్కువైంది.

 

    ధరణి చేతుల్లో ఆదిత్య చేతులు బలంగా బిగుసుకున్నాయి.

 

    ఎక్కడో ఉరుము వురిమిన చప్పుడు.

 

    అయిదు నిమిషాలు... పది నిమిషాలు.

 

    ధరణి చేతుల్నించి తన చేతుల్ని విడిపించుకోడానికి చూసిన ఆదిత్య ధరణి పిడికిట్లో ఏవో కాగితాలు వుండడంతో ఆ కాగితాల్ని తీసి తన ఫ్యాంటు జేబులో పెట్టుకున్నాడు.

 

    మరుక్షణం కొద్ది దూరంలో ఏదో టార్చిలైటు కాంతి... మనుషుల మాటలు వినబడడంతో-

 

    అక్కడ నుంచి వేగంగా లేచి, పక్కనే వున్న బండరాయి పక్కకు తప్పుకుని... చెరువు ఒడ్డు నుంచి-

 

    చెట్లచాటులోకి భారంగా కదిలాడు ఆదిత్య.

 

    టార్చిలైటు పట్టుకొని ముందుకొచ్చిన జైల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం బండరాయి పక్కన పడున్న ధరణి శవాన్ని చూసి నిశ్చేష్టుడైపోయాడు. అంత గాలిలోనూ... వర్షంలోనూ భయం మూలంగా సుబ్రహ్మణ్యం వంటిమీద చెమటలు పట్టేశాయి.

 

    అప్పటికి రాత్రి పది గంటలు దాటింది.


                             *    *    *    *    *


    రాత్రి సరిగ్గా పన్నెండు గంటలైంది.

 

    చీఫ్ మినిస్టర్ అహోబలపతి, హోం మినిస్టర్ యిద్దరు, ముగ్గురు అంతరంగిక ఎమ్మెల్యేలు ఓ హాల్లో సమావేశమయి వున్నారు.

 Previous Page Next Page