Previous Page Next Page 
ఆక్రోశం పేజి 30


    "ఇది మా వూరే! ఇది మా గంగిరెడ్డిపల్లే" ఎక్సైట్ అవుతూ అంది నిశాంత.

 

    దేశ్ ముఖ్ నవ్వాడు.

 

    ఆ రోడ్డునీ, పొలాల్నీ, ఇళ్ళనీ, వాకిళ్ళనీ, ఎండిపోయిన చెరువునీ, మనుషుల్నీ అన్నిటినీ గుర్తుపట్టింది నిశాంత.

 

    ఆ గుడిసెల్లో తమ గుడిసె కనబడుతుందేమోనని ఆశతో చూసింది.

 

    అప్పుడామెకు అకస్మాత్తుగా ఓ విషయం జ్ఞాపకానికొచ్చింది.

 

    "మా నాన్న... మా నాన్న కనిపిస్తాడా?" అమాయకంగా అడిగింది నిశాంత.

 

    "కన్పించడు" రిమోట్ కంట్రోల్లో ఆఫ్ బటన్ ని ప్రెస్ చేస్తూ అన్నాడు దేశ్ ముఖ్.

 

    "నాది గంగిరెడ్డిపల్లి అని మీకెలా తెలుసు? ఈ క్యాసెట్ ఎవరు తీశారు? మా నాన్న ఎందుకు కన్పించడు?" గబగబా ప్రశ్నలు వేసింది ఆమె.

 

    దేశ్ ముఖ్ నవ్వాడు-

 

    "నేను మనిషి ఆలోచనకన్నా ముందుంటాను. కాలానికి నాకూ ఒకటే తేడా అది పరుగెడుతుంది. నేను నడుస్తాను" చెప్పాడతను.

 

    "మా వూరు క్యాసెట్ ని ఎందుకు చూపించారు?" నిశాంత అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు అతను.

 

    రెండు నిమిషాలు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.

 

    "రెండు నెలల క్రితం రెడ్ లైట్ ఏరియాకి అమ్మకాని కొచ్చిన నువ్వు ఒక మామూలు ఆడపిల్లవు... ఇప్పుడు దొరికిన అవకాశాన్ని వుపయోగించుకుని నిన్ను నువ్వు తీర్చిదిద్దుకున్న నిశాంతవు... మధనం లేనిదే మనిషి డెవలప్ కాలేడు... నీలో నన్ను ఎట్రాక్ట్ చేసిన ఫస్టు పాయింట్. అదే... అందుకే" ఆగిపోయాడు దేశ్ ముఖ్.

 

    "నీకో ప్రాబ్లమ్ ఇస్తాను సాల్వ్ చెయ్యగలవా?" అకస్మాత్తుగా అడిగాడు.

 

    "ప్రాబ్లమా!" ఆసక్తిగా అడిగింది ఆమె.

 

    "అవును! మంచి, చెడు, నిజం, అబద్ధం, దుర్మార్గం, ప్రేమ, స్వార్ధం, ఆత్మీయత ఇవ్వెప్పుడూ మనిషిని టెస్ట్ చేస్తూనే వుంటాయి... అనుభవం కొలబద్దలోంచి ప్రపంచాన్ని అంచనా వేసే మనిషి, ఆ అనుభవం కన్నా గొప్ప విషయం వుందనే సంగతి తెలీదు" సీరియస్ గా అన్నాడు దేశ్ ముఖ్.

 

    "అనుభవం కన్నా గొప్ప విషయం వుందా?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఆమె.

 

    "అవును నిశాంతా! అనుభవానికి అందని గొప్ప విషయం వుంది. బాగా ఆలోచించి చెప్పు... దిసీజ్ ఎ టెస్ట్ ఫర్ యూ... నీకే కాదు... వ్యక్తిత్వంలో ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తికీ ఇదొక టెస్ట్..." చెప్పడం ప్రారంభించాడు దేశ్ ముఖ్.


                                                   *    *    *    *


    ఆంధ్రప్రదేశంలోని అతి సాధారణమైన ఒక కుగ్రామం. ఆ గ్రామం మొదట్లో రావిచెట్టు కింద రచ్చబండ మీద కొంతమంది వ్యక్తులు కూర్చున్నారు.

 

    చుట్టూ జనం గుమిగూడి వున్నారు.

 

    ఆ జనం దృష్టి ముగ్గురు వ్యక్తుల మధ్య కేంద్రీకృతమై వుంది.

 

    "చూడు సుబ్బడూ... నువ్వు నా దగ్గర బాకీ తీసుకున్న విషయం అందరికీ తెలుసు. ఏళ్ళు గడుస్తున్నా నువ్వు ఒక్క చిల్లి ఏగాణీ కూడా ఇవ్వని విషయం కూడా అందరికీ తెలుసు. ఇవ్వడానికి నీ దగ్గర సెంటు భూమి కూడా లేదన్న విషయం అందరికీ తెలుసు. కానీ... నువ్వు నా బాకీ పూర్తిగా తీర్చే ఉపాయం చెప్తాను. వింటావా?" అలా అంటున్న గ్రామంలోని షావుకారు వెంకటేశం వైపు, యాభై ఏళ్ళ సుబ్బయ్య అనే వ్యక్తి జాలిగా చూశాడు.

 

    "చెప్పండి బాబూ... మీరెలా చెప్తే అలా చేస్తాను" నెమ్మదిగా అన్నాడు సుబ్బయ్య.

 

    షావుకారు వెంకటేశం కళ్ళు, సుబ్బయ్య ప్రక్కనే అమాయకంగా నిల్చున్న అందమైన పదహారేళ్ళ సుశీల మీదున్నాయి. సుశీల సుబ్బయ్య కూతురు.

 

    రచ్చబండ మీద కూర్చున్న గ్రామపెద్దల వైపు, జనంవైపు చూసి చెప్పడం ప్రారంభించాడు షావుకారు వెంకటేశం.


    
    "సుబ్బయ్య నా బాకీ తీర్చాలంటే చిన్న పరీక్ష... ధర్మపరీక్ష... మనం కాలితో తన్నే రెండు గులకరాళ్ళే యీ సమస్యని పరిష్కరిస్తాయి."

 

    "గులకరాళ్ళు సమస్యని పరిష్కరించడమేమిటి?" జనం ఆసక్తిగా నక్కజిత్తుల షావుకారు వైపు చూడసాగారు.

 

    "ఇదిగో... చూడండి... నా చేతిలోని ఖాళీ సంచి" ఆ ఖాళీ సంచిని అందరికీ చూపించి-

 

    "ఈ సంచిలో ఒక నల్ల గులకరాయి, ఒక తెల్ల గులకరాయిని వేస్తాను. సుబ్బయ్య కూతురు సుశీల ఈ రెండు రాళ్ళలో ఒక రాయిని తియ్యాలి."

 

    "రాయిని తీస్తే ఏవవుద్దట?" అమాయకంగా ప్రశ్నించాడో వ్యక్తి.

 

    "చేతి సంచిలోంచి సుశీల నల్లరాయి తీసిందనుకో... సుశీల నా పెళ్ళాం అవుతుంది. సుబ్బయ్య అప్పు తీరిపోతుంది. సుశీల తెల్ల గులకరాయి తీసిందనుకో... సుశీల తండ్రితోనే వుండిపోతుంది... అప్పు తీరిపోతుంది. ఈ రాళ్ళల్లో ఏదో ఒక రాయిని సుశీల తియ్యడానికి ఒప్పుకోకపోతే మాత్రం సుబ్బయ్యని జైల్లో పెట్టిస్తాను. బలవంతంగా దాన్ని లాక్కెళతాను" ఖరాఖండిగా చెప్పాడు షావుకారు వెంకటేశం.

 

    "ఇందులో ఏదో మడత పేచీ వున్నటుందిరోయ్" జనం గుసగుసలాడుకుంటున్నారు. అంతకంటే చేయగలిగింది కూడా లేక మిన్నకుండి పోయారు.

 

    సుబ్బయ్య అదృష్టాన్ని అతని కూతురు సుశీల అదృష్టాన్ని నల్లరాయి, తెల్లరాయి ద్వారా ఆ భగవంతుడే నిర్ణయిస్తాడనుకున్నారు.

 

    షావుకారు గబుక్కున నేలమీద కొంగి అక్కడున్న గులకరాళ్ళ గుట్టలోంచి రెండు గులకరాళ్ళని తీసి సంచిలో వేశాడు. ఆ షావుకారు చర్యని ఎవరూ గమనించకపోయినా సుబ్బయ్య కూతురు సుశీల గమనించి షాక్ తిన్నది.

 

    షావుకారు నేలమీద నుంచి తీసి సంచిలో వేసినవి రెండూ నల్ల గులకరాళ్ళే!

 

    అందరివైపు చూస్తూ ఆ సంచిలోని గులకరాళ్ళని ఆడిస్తూ ఆ సంచిని సుశీల ముందుంచి-

 

    "ఒక రాయి తియ్యి" అన్నాడు.

 

    సుశీల నిస్సహాయంగా తన తండ్రివైపు చూసింది.

 

    సుబ్బయ్య కూతురివైపు చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

 

    సుశీల ముందుకు కదిలింది.

 

    అందరి కళ్ళూ, సుశీల చేతివేళ్ళ మీదే వున్నాయి.

 

    ఏం జరుగుతుంది?

 

    రచ్చబండ న్యాయస్థానంలో జరిగే అరుదైన వింత రాతి తీర్పు. ది స్టోన్ జడ్జిమెంట్" చెప్పటం ఒక్కక్షణం ఆపి వూపిరి పీల్చుకున్నాడు దేశ్ ముఖ్.

 Previous Page Next Page