Previous Page Next Page 
ఆక్రోశం పేజి 29


    ఇదెలా సాధ్యం! సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు. చూద్దాం. మానవ శక్తినీ, శాస్త్ర విజ్ఞానాన్నీ మనం అంచనా వెయ్యలేం..." జోక్రిబ్ వుపన్యాసం ముగిసింది.

 

    చాలాసేపు కూర్చున్నాడు సిద్ధార్ధ.

 

    ప్రపంచంలో డబ్బు... బిజినెస్ ఈ రెండేనా వున్నది. నిజానికి వున్నది ఒకటే...

 

    అదే డబ్బు... దానిచుట్టూ తిరిగేదే బిజినెస్... వి.సి. ఆర్ ఆపేసి రూమ్ లోంచి బయటికొచ్చి, మేడమెట్లు దిగి, క్రిందకొచ్చాడు.

 

    గార్డెన్ లోకి అడుగుపెట్టాడు. దట్టంగా పెరిగిన చెట్లమధ్య నడుస్తున్నాడు సిద్ధార్ధ.

 

    దూరంగా హిమాలయాల మీద నుంచి వస్తున్న మబ్బులు రాజహంస రెక్కల్లా వున్నాయి. బిల్డింగ్ కి చాల దూరంగా వచ్చేశాడు. ఆ బిల్డింగ్ లోంచి బయటపడాలని చాలారోజుల్నుంచి అనుకుంటున్నాడు సిద్ధార్ధ.

 

    బిల్డింగ్ బయట ఏం వుందో తెల్సుకోవాలని వుంది సిద్ధార్ధకి. మనుషుల్ని చూడాలని వుంది, వాళ్ళెలా బ్రతుకుతారో చూడాలని వుంది.

 

    కానీ తనకి, ఆ వూరుకి మధ్య ఎత్తయిన గోడలు... సెక్యూరిటీ గోడలు...

 

    అవును-

 

    తన తండ్రి తననింత కట్టుదిట్టమైన ఒంటరి ప్రపంచంలో ఎందుకు పెంచుతున్నాడు? అతనిలో ఇలాంటి ఆలోచన కలగడం యిది మొదటిసారి కాదు.

 

    తననెవరైనా చంపేస్తారని తండ్రికి భయమా!

 

    పూర్వం మహారాజులు కోటల్లోనే తమ పిల్లలు వుంటే, వంటరి తనంతో పాడైపోతారని, గురుకుల విద్యాభ్యాసానికి పంపేవాళ్ళు. మారువేషంలో దేశాటనకు పంపేవారు.

 

    కానీ సైంటిఫిక్ ప్రపంచంలో విద్యా విధానం మారింది. దిసీజ్ బిజినెస్ సోలిటటీ కన్ సైన్ మెంట్... ఇలాంటి పరిస్థితుల్లోనే తన తండ్రిని తన తాత పెంచాడా? తండ్రి నోటి వెంట తన తాత పేరును ఎప్పుడూ వినలేదు. చిత్రం! తల్లి పేరును కూడా వినలేదు.

 

    తల్లి పేరుగానీ, తల్లి రూపంగానీ సిద్ధార్ధకు తెలీదు. ఈ రోబోట్ మనుషుల్ని తప్ప, తను మామూలు మనుషుల్ని చూడటానికి వీలులేదా?

 

    నడుస్తూ నడుస్తూ ఆగిపోయాడు సిద్ధార్ధ.

 

    దూరంగా ఓ చెట్టు దగ్గర చెట్టుకి నీరు పోస్తూ ఒక వృద్ధుడు. అతడికో డెభై ఏళ్ళుంటాయి. పంజాబీ-

 

    తనలో తను ఏదో మాట్లాడుకుంటూ, చెట్టుకి నీళ్ళు పోస్తూ అడుగుల చప్పుడికి తల తిప్పి చూశాడు.

 

    ఎందుకో తుళ్ళిపడ్డాడతను. ఆ పంజాబీ పేరు రఘువీర్ సింగ్.

 

    సిద్ధార్ధ యింతదూరం ఎలా వచ్చాడు? రఘువీర్ భయంగా అతనివైపు చూసి లేచి నిలబడ్డాడు.

 

    "మిస్టర్ సిద్ధార్ధ! మీరెందు కిక్కడకొచ్చారు... ప్లీజ్ గో బ్యాక్... వెళ్ళిపోండి" లేచి వినయంగా చెప్పాడు రఘువీర్.

 

    "నేనడిగే ప్రశ్నలకు జవాబు చెప్తావా? నేను లోనికి వెళ్ళిపోతాను" ఆరేళ్ళ కుర్రవాడు తల్లిని అడిగినట్టుగా వుందా ప్రశ్న.

 

    ఖరీదైన ఈవెనింగ్ డ్రెస్ లో మిలమిలా మెరిసిపోతున్నాడు సిద్ధార్ధ.

 

    'అడగండి."

 

    "ఈ బిల్డింగ్ లో అందరూ మగ వ్యక్తులే తప్ప, ఒక్క ఆడమనిషి కూడా ఎందుకు లేదు? ఇక్కడ పనిచేసే స్టాఫ్ ఎవరికీ పెళ్ళిళ్ళు కాలేదా? నీకు పెళ్ళయిందా? నీ భార్యా, పిల్లలు ఎక్కడున్నారు?" అమాయకంగా అడిగాడు సిద్ధార్ధ.

 

    మరో కొన్ని నిమిషాల్లో సిద్ధార్ధ బిల్డింగ్ లో లేడనే విషయం తెలుస్తుంది. సెక్యూరిటీ స్టాఫ్ వెతకడం ప్రారంభిస్తారు. సిద్ధార్ధతో తనని చూస్తే... వెంటనే జవాబు చెప్పేసి, పంపేయడం మంచిది అనిపించింది అతనికి-

 

    "అది... మీ డాడీ... అంటే చీఫ్ మహంత విధించిన ఆర్డర్. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కద్దుకల్ ప్రాంతంలో వుంటారు. స్టాఫ్ కి సంబంధించిన స్త్రీలెవరూ ఇక్కడకు రావడానికి వీల్లేదు..."

 

    "నీకు పెళ్ళయిందా?" మళ్ళీ అడిగాడు అతను.

 

    "అయింది బాబూ! భార్య చనిపోయింది. ఒక్కగానొక్క కూతురు వుంది."

 

    "ఏం చేస్తుంది? ఎం.బి.ఏ. చదివిందా నాలా?" ఉత్సాహంగా అడిగాడు సిద్ధార్ధ.

 

    "ప్రపంచంలో వున్న వాళ్ళందరూ మీలా ఎం.బి.ఏలు చదవలేరు బాబూ! తహ్రీ బస్టాండ్ దగ్గర మిర్చీ షాపు నడుపుతోంది బాబూ!" గబగబా ముందుకు వెళ్ళిపోతూ అన్నాడు రఘువీర్.

 

    "నీ కూతురు పేరు?" అడిగాడు అతను.

 

    "ఆరతీదేవి" ముందుకెళ్ళిపోతున్న రఘువీర్ వైపు చూస్తూ... వెనక్కొస్తున్న సిద్ధార్ధ మనసులో తహ్రీ బస్టాండ్, మిర్చీషాపు, ఆరతి... ఈ మూడు పేర్లే కదలాడుతున్నాయి.

 

    పరధ్యానంగా అడుగులు వేస్తున్న అతను అడుగుల చప్పుడికి తల ప్రక్కకు తిప్పి చూశాడు.

 

    సెక్యూరిటీ చీఫ్ ప్రభాకర్ దేవ్. సెల్యూట్ చేసి చెప్పాడు-

 

    "అనంతమూర్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది సర్."

 

    "ఏంటట?"

 

    "ఇంకో ఇరవై నాలుగు గంటల తర్వాత కానీ ఆయన రాలేడట... షెడ్యూల్ తప్పకుండా మీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో లేదో నన్ను చూసుకోమన్నాడు."

 

    'అయితే చూసుకోండి" చికాగ్గా అనేసి ముందుకు నడిచాడు సిద్ధార్ధ.

 

    "అరగంటలో మీరు బ్యాండ్ మింటన్ కోర్టుకు రావాలి సర్! ఆ తరువాత స్విమ్మింగ్" తన చేతిలో వున్న కంప్యూటర్ షీట్ వైపు చూస్తూ చెప్తున్నాడు ప్రభాకర్ దేవ్.

 

    పాలరాతి శిల్పంలా ముందుకెళ్ళిపోయాడు సిద్ధార్ధ.


                                *    *    *    *


    నిశాంత కళ్ళు పెద్దవి చేసుకుని టీవీ స్క్రీన్ వైపు చూస్తోంది. నిశాంత ముఖంలోకి దీర్ఘంగా చూస్తున్నాడు దేశ్ ముఖ్.

 

    టీవీ స్క్రీన్ మీద మొదట గట్లు, చెట్లు, పుట్టలు, మట్టిరోడ్లు... ఆ తరువాత శిధిల దేవాలయం ప్రత్యక్షమైంది.

 Previous Page Next Page