సూటిగా నిశాంత కళ్ళల్లోకి చూశాడు.
"సుశీలకు తెలుసు. ఆ బ్యాగ్ లో వున్నవి రెండూ నల్ల గులకరాళ్ళేనని... ఏం చేస్తుంది చెప్పు? ఆ రాయిని తియ్యటానికి నిరాకరిస్తుందా? షావుకారు మోసపూరితమైన చర్యను బయటపెట్టడానికి పూనుకుంటుందా? లేక నల్లరాయినే తీసి తను ఆ వయసు మీరిన షావుకారికి భార్యగా అయిపోయి తన తండ్రిని బాకీ నుండి రక్షిస్తుందా? అదే పరిస్థితుల్లో నువ్వే వుంటే ఏం చేస్తావు?" సోఫాలో కూర్చుని నిశాంత మొహంలోకి చూశాడు దేశ్ ముఖ్.
ఒక వ్యక్తిలోని ఉపాయం... యుక్తికి పదును... మేధస్సుకో ఛాలెంజ్...
తనప్పుడు యుక్తితో సమాధానం చెప్పి దేశ్ ముఖ్ ని మెప్పించాలి. అప్పుడే తనను దేశ్ ముఖ్ వుపయోగించుకుంటాడు. అలా వుపయోగించుకున్నప్పుడే తన ప్రయోజనం, తన ఊరి బాగు నెరవేరుతుంది.
ఎలా యీ సమస్యని పరిష్కరించాలి? ఎలా క్షణాలు నిశ్శబ్దంలో కరిగిపోతున్నాయి.
నిశాంత ఒక ఆయుధంగా తనకి పనికివచ్చేది లేనిది దీంతో తేలిపోతుంది అని దేశ్ ముఖ్ ఆలోచిస్తున్నాడు.
(ప్రియమైన పాఠకులారా! మీరూ ఆ సమస్యకి పరిష్కారం ఆలోచించండి. మీ మేథస్సుకి చిన్న పరీక్ష ఇది -రచయిత)
రెండు నిమిషాలు గడిచాయి.
నిశాంత ఆలోచనల్నుంచి తేరుకుంది.
"నేనయితే ముందు నా తండ్రిని కాపాడాలనుకుంటాను. కాపాడతాను. అంతటితో ఆగను నన్ను కాపాడుకొనే ప్రయత్నం కూడా చేస్తాను" అంది నిశాంత చిన్నగా నవ్వుతూ.
దేశ్ ముఖ్ కళ్ళు ఒక్కక్షణం మెరిశాయి."షావుకారు దుర్మార్గుడు. ఆ సంచిలోంచి ఒక గులకరాయిని తీయనంటే ఊరుకోడు. ఆ రచ్చబండ దగ్గరున్న ప్రజలు కూడా వూరుకోరు. అప్పూ తీర్చక, సుశీలనిచ్చి పెళ్ళి చేయకపోతే ఎలా వూరుకుంటాడు? కనుక సుశీల ఆ సచిలో చేయిపెట్టి ఏదో ఒక రాయి తీసి తీరాలి. అది అనివార్యం.
ఇకపోతే షావుకారు మోసపూరితమైన చర్యను బయటపెట్టటానికి పూనుకోవొచ్చు. దాని మూలంగా రభస... గందరగోళం చోటు చేసుకుంటాయి. ఒకవేళ షావుకారు చర్య మోసపూరితమైందని రుజువు చేస్తే ఏమవుతుంది? షావుకారిని అక్కడున్న ప్రజలు మందలించి, అందరూ చూస్తూండగా వాళ్ళే ఒక నల్లరాయిని, తెల్లరాయిని తీసి సంచిలో వేస్తారు.
అప్పుడు సుశీల సంచిలో చేయిపెట్టి ఒక రాయిని తీసిందనుకోండి అది నల్లరాయి అయితే? సుశీల తండ్రి రుణ విముక్తుడవుతాడు కానీ సుశీల షావుకారుకి భార్య కాక తప్పదు."
నిశాంత రీజనింగ్ వింటూ అప్రతిభుడే అయ్యాడు దేశ్ ముఖ్. నిజానికి దేశ్ ముఖ్ కి కూడా ఆ సమస్యకి పరిష్కారం తెలీదు.
"మరయితే సుశీల ఏం చేయాలంటావ్?" అడిగాడు దేశ్ ముఖ్ ఆసక్తిగా.
"నిజానికి షావుకారు చేసిన మోసం సుశీల పాలిట వరం. షావుకారు ఆ మోసం చేయకపోతేనే సుశీల అదృష్టం 50 శాతం దురదృష్టం 50 శాతం అయ్యేవి" నవ్వుతూనే అంది నిశాంత.
దేశ్ ముఖ్ నిశాంతకేసి విస్మయంగా చూశాడు. నిశాంత తిరిగి చెప్పటం ప్రారంభించింది.
"సుశీల రచ్చబండ దగ్గరకు చేరుకుంటుంది. అలవోకగా కిందకు చూస్తుంది. అక్కడ రకరకాల రంగుల్లో వున్న గులకరాళ్ళ గుట్ట వుంది. రకరకాల రంగుల్లో కాకపోయినా తెలుపు- నలుపు రంగులున్న గులకరాళ్ళు వుంటాయి గదా?
సుశీల షావుకారువైపు, తన తండ్రివైపు అక్కడున్న ప్రజలవైపోసారి చూస్తుంది.
ఆపైన సంచిలో చేయి పెడుతుంది. బ్యాగ్ లోని సుశీల చేయి బయటకు రావటానికి కొన్ని క్షణాలే సమయం. ఆ అతికొద్ది సమయంలో ఆమె తీసుకొనే నిర్ణయం మీదే ఆమె భవిష్యత్ ఆధారపడి వుంటుంది.
సుశీల చేయి నెమ్మదిగా బయటకు వస్తోంది ఆమె చేతిలో ఒకే ఒక గులకరాయి వుంది.
కంగారుని, గాభరాని నటిస్తూ, చేతిని పైకి తీసి, ఆ గులకరాయిని కిందకు వదిలేసింది. ఆ గులకరాయి మిగతా రాళ్ళలో కలిసిపోయింది!
"తీసిన తెల్లరాయి పొరపాటున కిందపడిపోయింది" అని గట్టిగా చెబుతుంది సుశీల గాభరాగా కిందకు వంగి వెతుకుతూ.
"నువ్వు తీసింది తెల్లరాయా?" షావుకారు ముందుకొస్తాడు అనుమానంగా.
"కావలిస్తే చూసుకో నీ దగ్గరున్న బ్యాగ్ లో నల్లరాయి వుంటుంది" అని అంటుంది.
షావుకారు షాక్ తింటాడు.
ఏం చేయాలో తోచక పిచ్చెత్తిపోతాడు.
నువ్వు తీసి పొరపాటున జారవిడిచింది తెల్లరాయనే ముందని సహజమయిన ఆసక్తితో అక్కడున్న ప్రజలు అడుగుతారు.
సంచిలో ఉన్నది తెల్లరాయి అయితే, నేను జారవిడిచింది నల్లరాయి అవుతుంది. సంచిలో వున్నది నల్లరాయి అయితే నేను జారవిడిచింది తెల్లరాయి అవుతుంది గదా అని.
సుశీల చటుక్కున సంచిలో చేయిపెట్టి నల్లరాయిని తీసి అక్కడున్న ప్రజలందరికీ చూపిస్తుంది బస్...అంతే... వ్యాపారి కథ కంచికి, సుశీలకి, ఆమె తండ్రికీ ఋణవిముక్తి! స్వేచ్చ..." కళ్ళతోటే నవ్వుతూ కనుబొమల్ని ఎగురవేస్తూ చెప్పింది నిశాంత.
ముందు తను విన్నదేమిటో దేశ్ ముఖ్ కి అర్ధం కాలేదు. అర్ధంకాగానే అతను అనుభూతించిన ఉద్వేగం బహుశా అతని లైఫ్ లోనే అరుదైనది కావచ్చు!
ఈ పల్లెటూరి చదువులేని పిల్లలో ఇన్ని తెలివితేటలా...? ఇంత మేథస్సా? ఇంత సమయస్ఫూర్తా? ఇంత యుక్తా?
ఈ వయస్సుకే ఈ పిల్లలో ఎంత మెచ్యూర్టీ? ఎంత పరిణతి?
నిశాంతని చూస్తుంటే కలిగిన ఎగ్జయిట్ మెంట్ తీవ్రత ఆయన నరనరానికి పాకిపోయింది.
ఎందుకో నిశాంతను చూస్తుంటే ఆయనలో చిరుభయం చోటు చేసుకుంది. ఆమె మీద అనంతమైన గౌరవం... గగుర్పాటు... తనకు తెలిసిన లోకంలోని అత్యున్నతమైన మేధా సంపత్తి ముందు నిల్చున్నప్పుడు కలిగే గౌరవం, భయం, గగుర్పాటు...
"ఇంక్రిడిబుల్... ఫెంటాస్టిక్... పాబ్యులస్" ఆనందోద్వేగంతో అన్నాడాయన.
తను ఎలాంటి యువతి కావాలని కోరుకున్నాడో, సరిగ్గా అలాంటి యువతే ఈమె!