Previous Page Next Page 
రక్తచందనం పేజి 29


    అంతే....రంజిత్ విజిల్ ని పెదాలమధ్య ఇరికించుకొని ఒక్కక్షణం ఆగి ఊదాడు.
    అగ్నిపర్వతం బ్రద్దలయితే ప్రచండ వేగంతో పెల్లుబికే లావాలా రెండొందలమంది ఒక్క పెట్టున పొదల్లోంచి లారీలకేసి దూసుకుపోయి, కన్నుమూసి తెరిచేలోపే వాటిని చుట్టుముట్టి, లారీల కేబిన్స్ కేసి గన్స్ ని ఎయిమ్ చేసి సెర్చ్ లైట్స్ ని ఆన్ చేశారు.
    లారీల డ్రైవర్స్, వాటిలో వచ్చిన వ్యక్తులు, చెక్ పోస్టు గార్డ్స్ ప్రక్కలో బాంబు పడ్డట్లు అదిరిపడ్డారు. ఆ హఠాత్పరిణామాన్ని వారూహించలేదు.
    ఆ మాత్రానికే వీరూ సరుకు పట్టుబడుతుందా అని ఎంతో తెలివైన రంజిత్ కూడా ఆలోచించలేకపోయాడు.
    చకచక లారీల్ని చెక్ చేసి నివ్వెరపోయింది సిబ్బంది. అన్నీ ఖాళీ లారీలు....పూచికపుల్ల కూడా వాటిల్లో లేదు.
    లారీలకు ఆర్.సీ.లు, టాక్స్ టోకెన్స్, డ్రైవర్స్ కి లైసెన్స్ లు సక్రమంగానే వున్నాయి.
    మరెందుకు ఖాళీగా ఆ టైములో అటు వెళుతున్నాయి....? అని అడగబోయి మా ఇష్టం అని వాళ్ళంటారేమోనని ఆగిపోయాడు రంజిత్.
    క్షణాల్లో లారీల వివరాలు, డ్రైవర్స్ అడ్రస్ లు తీసుకొని వదిలేశారు.
    అందరికీ ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది.
    అందరూ ఇక వెళ్ళిపోదామని అంటే రంజిత్ ఆపేశాడు. తెల్లవారేవరకు వుండే వెళ్దామని. గత్యంతరం లేక అందరూ వెహికల్స్ లోకి ఎక్కి సిగరెట్స్ వెలిగించుకొని చలిని తరిమేసే ప్రయత్నంలో పడ్డారు.
    అప్పుడే గనక రంజిత్ కాని, దినేష్ కాని నదిలోకి చూసివుంటే ఫలితం మరోలా వుండి వుండేదేమో?
    పెద్దపెద్ద గడ్డి దిబ్బలు, చెత్త, చెదారం నదిపై తెప్పల్లా తేలుతూ ప్రవాహంతోపాటు సాగిపోతున్నాయి.
    వాటికిందే వీరూ పథకం తాలూకు ఫలితం సాగిపోతోంది. సుమారు కోటి రూపాయల ఖరీదయిన గంధం చెక్కలు పైన చెత్తా చెదారం ముసుగేసుకొని గమ్యానికేసి నిశ్శబ్దంగా సాగిపోతున్నాయి.
    తిరిగి బయలుదేరిన లారీలు నదికి ఆవేపున నిర్దేశించిన రేవులో సరుకు లోడ్ చేసుకొనేందుకు సిద్ధం కాబోతున్నాయని వీరి ఊహకే అందని విషయం.


                                                 *    *    *    *


    ఉదయం ఏడు గంటలకు ఎమ్.ఎమ్.హిల్స్ పోలీస్ కేంప్ కి చేరుకున్న సిబ్బంది బ్రేక్ ఫాస్ట్ చేసి నిద్రలోకి జారుకున్నారు.
    రంజిత్, శర్మ, దినేష్ మాత్రం అలసటని, నిద్రలేమిని సయితం మర్చిపోయి ఒకింత విచారంగా కూర్చున్నారు.
    "మనం ఎటాక్ చేయబోతున్నట్లు తెలిసి గంధం చెక్కని తరలించే కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని వుండాలి. ఎందుకంటే పాలార్ బ్రిడ్జి ఒక్కటే అతనికున్న దారి...." శర్మ అన్నాడు సాలోచనగా.
    "ఎలా తెలిసుంటుంది....? ఎవరు ఇన్ఫర్మేషన్ లీక్ చేసుంటారు?" దినేష్ కసిగా పళ్ళు కొరుకుతూ అన్నాడు.
    రంజిత్ ఆలోచిస్తున్నాడు....
    "ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ అతనికి సహకరించేవాళ్ళే. మన హడావుడి_మనం సృష్టించిన సంచలనం_ ఎవరి దృష్టినయినా ఇట్టే ఆకర్షిస్తుంది" శర్మ అన్నాడు.
    "ఇప్పుడేమిటి చేయటం....?" దినేష్ ఎప్పుడూ యుద్ధరంగంలోకి ఉరికే సైనికుడిలా వుంటాడు.
    తెల్లవారుజామున తిరిగి వస్తున్నప్పుడు యాభైమంది పోలీసుల్ని పాలార్ బ్రిడ్జి వద్దనే వుంచి, వారికి అవసరమయిన ఎమ్యునేషన్, వైర్ లెస్ సెట్స్, వెహికల్స్ వదలిరావటంతో, వారినుంచి రానున్న వైర్ లెస్ మెసేజ్ కోసం ఎదురుచూస్తున్నాడు రంజిత్.
    పోలీస్ క్యాంప్ మెస్ లో వారికోసం భోజనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవి పూర్తయిన మరుక్షణం ఒక వ్యాన్ లో వాటిని పాలార్ బ్రిడ్జి ప్రాంతానికి చేర్చాలి.
    తనకి వ్యతిరేకంగా పోలీసులు ఏ చర్య తీసుకున్నా, వీరూ రెచ్చిపోవటం ఖాయం అని తెలిసిన పోలీసు, అటవీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
    పరిస్థితి గంభీరంగా వుంది.
    ఎమ్.ఎమ్.హిల్స్ ప్రజలు ప్రతిఒక్కరు మౌనాన్ని ఆశ్రయించారు.
    ఉద్రిక్తత సాంద్రత పెరుగుతూ పోతోంది. వేసిన ప్రతి అడుగులోనూ విజయం సాధిస్తూ వచ్చిన రంజిత్ దెబ్బతిన్న పులిలా గుర్రుగా వున్నాడు.
    ముందు నుయ్యి వీరూ అయితే_వెనుక గొయ్యి రంజిత్_
    చాలాసేపటి మౌనం తరువాత రంజిత్ నోరు విప్పాడు. "వీరూ అతని అనుచరులు ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలోనే వుండి వుంటారు. పోలీసులతో, ఫారెస్టర్స్ తో, ఫారెస్ట్ గార్డ్స్ తో బృందాన్ని తయారుచేయండి. ఒక్కో బృందం ఈ చుట్టుప్రక్కలవున్న ఒక్కో ఊరుకి వెళ్ళాలి. పచారి సామాన్ల షాప్స్ పై నిఘా వేయాలి. నిత్యావసర వస్తువులేవీ తెలీని వ్యక్తులకు అమ్మకుండా చూడాలి. తెలిసిన వ్యక్తులకయినా పెద్ద మొత్తంలో అమ్మరాదు.
    అడవిలో జంతువుల్ని వేటాడి వాటితోటే ఆకలి ఎలా తీర్చుకుంటారో చూద్దాం.
    ఒక్కొక్క మార్గాన్నీ మూసుకుంటూ వెళ్ళాలి. కమాన్....దినేష్ డూ దీ నెస్సెసరీ అరేంజ్ మెంట్స్ ఇమ్మీడియట్లీ...." ఒక స్థిరమయిన నిర్ణయానికి వస్తూ ఆజ్ఞల్ని జారీచేశాడు రంజిత్.
    దినేష్ సంధించి వదిలిన బాణంలా పోలీస్ క్యాంప్ కేసి దూసుకుపోయాడు.
    "ఇక మూయవలసిన మార్గాలు_ఒకటి ఆయుధాలు_ఫైర్ ఆర్మ్స్_మోడరన్ ఏమ్యునేషన్....
    రెండు_మందులు, డాక్టర్స్....
    మూడు_దుస్తులు, బ్లాంకెట్స్, ఉలన్ క్లాత్స్, టెంట్ మెటీరియల్స్, రోప్స్, క్లాంప్స్, కొక్కాలు....
    నాలుగు_ ఎప్పటి వార్తలు అప్పుడు వీరూకి తెలిసిపోతున్నాయంటే_ డైలీ పేపర్స్ అతనికి అందుతుండాలి.
    ఐదు_ అటవీ మార్గంలో వేగంగా నడవవలసి వున్నవారికి రఫ్ అండ్ టఫ్ గా ఉపయోగపడే చెప్పులు, షూస్....
    ఆరు_ వాళ్ళు వాడే జీప్స్, టెంపోలకు స్పేర్ పార్ట్స్.
    ఏడు_ అన్నిటికంటే ముఖ్యమయినది _ వాళ్ళ సరుకును కొనే దొంగ వ్యాపారస్తులు.... వాటి వివరాలు.... వాళ్ళ సరుకును తరలించే మార్గాలు.
    ఎనిమిది_ వాళ్ళ సరుకును అటవీ అంతర్భాగంలోంచి నిర్దేశించుకున్న స్థలాలకు చేర్చే లారీలు....
    తొమ్మిది_ వాళ్ళకు లైఫ్ లైన్స్ అయిన వాటర్ సోర్సెస్ ని నిఘాలో పెట్టటం.
    పది_ లిక్కర్, బీడీలు, సిగరెట్స్....
    _ఈ మార్గాలన్నింటిని ఒక్కొక్కటి మూసుకుంటూ పోవాలి. అతని కార్యకలాపాల పరిధిని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. అప్పుడతనిమీద, అతని అనుచరులమీద ఒత్తిడి ఎక్కువవుతుంది. అదే మన తొలి ఎత్తుగడ.
    ఒక్కమాటలో చెప్పాలంటే_ ఉయ్ షుడ్ మేక్ ఇట్ నోన్ టూ వీరూ దట్ ఉయ్ ఆర్ ఎట్ హిజ్ డోర్ స్టెప్_
    ఈలోపు అటవీ ప్రాంతాలలో బ్రతుకు భయంతో, దాడులతో మనల్ని మనం శిక్షణకు గురిచేసుకోవాలి.
    ఉయ్ షుడ్ హెవీ ఫెమిలైజర్డీ అవర్ సెల్వ్స్ విత్ ది టెర్రెయిన్.
    అందుకుగాను అడవులమధ్య సుదీర్ఘమయిన ప్రయాణాల్ని కొనసాగించాలి. ఎగ్రిసివీ పెట్రోలింగ్ కండక్ట్ చేయాలి. ప్రతిక్షణం అతనిపై, అతని కార్యకలాపాలపై ఒత్తిడి తీసుకురావాలి.
    ఆపైన తమిళనాడు పోలీసు, అటవీశాఖ సిబ్బందితో సామరస్యంగా మెలుగుతూ వారి సహకారాన్ని తీసుకోవాలి.

 Previous Page Next Page