Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 30


    శ్రీధరం వారించేలోగా చక చకా ఆమె ఫోటోలు తీసుకుంది.
    ఎప్పుడూ తనతో వుంచుకొనే మినీ కెమెరాతో.
    శ్రీధరం పోలీసులకి ఫోన్ చేశాడు. అంకిత నెమ్మదిగా జారుకుందక్కణ్నించి.
    నేరుగా ఆఫీసుకెళ్ళింది. సిద్ధార్థ లేడాఫీసులో. ఇంటికి డయల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా ఎంగేజ్ టోన్ వచ్చింది.
    రిపోర్ట్ తయారుచేసి ఫోటోతో సహా కంపోజింగ్ కి ఇచ్చి, ఫోన్ డయల్ చేసింది. అరగంట తరువాత.
    రింగౌతుంది. ఎవరూ ఎత్తలేదు. అది సాగర్ ఇంటి ఫోన్.
    ఆ ఫోన్ రిసీవ్ చేస్కోడానికి సాగర్ అక్కడ లేడు. అంకిత ఫోన్ చేసే సమయానికి అతను బార్ లో కూర్చొని నాలుగో పెగ్గు విస్కీ తాగుతున్నాడు. అది పూర్తికాగానే లేచి బిల్ చెల్లించి కొద్దిగా తూలుతూ బయటికొచ్చాడు.
    తొమ్మిదిన్నర దాటింది టైం అప్పటికే. చాలా నీరసంగానూ, నిస్సత్తువగానూ అనిపించింది అతనికాక్షణం. తుపాకీని దాచేసే పని వాయిదా వేద్దామనుకొన్నాడు. కాని భయంతో వెంటనే ఆటో ఎక్కి టాంక్ బండ్ చేరుకొన్నాడు.
    ఓ మూలగా వెళ్ళి నిల్చున్నాడతను. హుసేన్ సాగర్ నుండి వేడి గాలి వీస్తోంది. చెమట తుడుచుకున్నాడు కర్చీఫ్ తో.
    గట్టిగా వూపిరి పీల్చుకున్నాడు.
    ఎయిర్ బాగ్ జిప్ లాగాడు. తెరుచుకుందది.
    అందులో నుండి తుపాకి సైలెన్సర్ తో సహా బయటికి తీశాడు.
    దాన్ని నీళ్ళల్లోకి విసిరేద్దామని చేయి ఎత్తాడు.
    ఎత్తిన అతని చేయి అలాగే గాలిలో ఆగిపోయింది.
    బలమైన పిడికిలి అతని మణికట్టు చుట్టూ బిగుసుకుంది.
    సాగర్ పై ప్రాణాలు పైనే పోయాయి.
    నెమ్మదిగా వెనక్కి తిరిగాడు.
    పోలీసు కానిస్టేబుల్ కళ్ళతణ్ని తీవ్రంగా చూస్తున్నాయి.


                                     12


    "అంకితా....కాల్ ఫర్ యూ...." పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతున్న అంకితకి ఫోన్ రిసీవర్ చూపిస్తూ చెప్పింది. "ది న్యూస్" రిసెప్షనిస్టు.
    రిసీవర్ అందుకుంది అంకిత.
    "హలో...."
    "నేనమ్మా....శ్రీధరాన్ని."
    "ఓ....గుడ్ మార్నింగ్ అంకుల్....ఏమిటి హఠాత్తుగా"
    "ఏం లేదు, సాగర్ అరెస్టయ్యాడు. రాత్రి మనం శవాన్ని మొదట చూశాం కాబట్టి స్టేషన్ కి రావాలి నువ్వు.... వివరాలు చెప్పవలసి వుంది."
    "వాట్....సాగర్ అరెస్ట్ కావడమేమిటి?"
    "నిన్న రాత్రి టాంక్ బండ్ పై నుండి పిస్టల్ నీళ్ళలోకి విసిరేస్తుంటే ఎవరో బీట్ కానిస్టేబుల్ కస్టడీలోకి తీసుకున్నాడు. ఈరోజు ప్రొద్దున్నే భరద్వాజ హత్య గురించి అనుమానితుడిగా అఫీషియల్ గా అరెస్ట్ చేశారతణ్ని."
    "ఓ...."
    "వస్తావా?"
    "ఏ పోలీస్ స్టేషన్?"
    చెప్పాడు శ్రీధరం.
    కెమెరా తగిలించుకొని బాగ్ భుజాన వేసుకొని కదిలేటంతలో ఫోన్ మళ్ళీ మోగింది.
    "అంకితా కాల్ ఎగైన్ ఫర్ యూ."
    ఫోన్ విసుగ్గా అందుకుంది అంకిత.
    "హలో"
    "హలో....నేను సిద్ధార్థ."
    విసుగుపోయింది అంకిత.
    "హాయ్....హౌ ఆర్యూ?"
    "ఫైన్....అంకితా....నీతో....సారీ....మీతో అర్జెంటుగా మాట్లాడాలి."
    "ఇప్పుడా?"
    "ఇప్పుడే."
    "కాని....నేను చాలా ముఖ్యమయిన...."
    "నాకు తెలుసు మీరేం చెప్పబోతున్నారో.... కాని....ఐయామ్ సారీ! సాగర్ ని మీరు స్టేషన్ లో కలుసుకొనేలోగా నేను మీతో మాట్లాడాలి!"
    "వాట్? సాగర్ మీకు ఐ డింట్ గెటిట్."
    "యూ విల్....సూన్....పరిశ్రమ భవన్, బషీర్ బాగ్ లో ఔటర్ గేట్ దగ్గర నిల్చుంటాను నేను....స్టార్ట్ రైటెవే."
    అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. బయటికి వెళ్ళబోయి ఆగి రిసెప్షనిస్ట్ కేసి తిరిగింది అంకిత. "డోంటో గివ్ మీ ఎనీ మోర్ ఫాక్స్ ఫర్ ది డే హనీ."
    చర చరా బయటికి నడిచింది.
    పరిశ్రమ భవన్ ముందు ఆటో ఆపి దిగేసరికి ఔటర్ గేట్ దగ్గర రెడీగా నిల్చున్నాడు సిద్ధార్థ.
    ఆటో దిగిన అంకితని తన కార్ దగ్గరికి తీసుకెళ్ళాడు.
    "ఎక్కండి" డోర్ తీస్తూ అన్నాడు.
    కార్ లో కూర్చుంది అంకిత.
    అట్నుంచి తిరిగి వచ్చి డ్రైవర్ డోర్ తీసి స్టీరింగ్ ముందు కూర్చొని స్టార్ట్ చేశాడు సిద్ధార్థ.
    కారు తారురోడ్డుమీద హుందాగా కదిలింది.
    "ఎక్కడికి వెళుతున్నాం మనం?" అడిగింది.
    "మా ఇంటికి."
    "దేనికి?"
    "చెప్తా."
    ఇల్లు చేరేదాకా ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు.
    సిద్ధార్థ ఇల్లు చిన్నగా, పొందిగ్గా వున్నా ఇంటి చుట్టూ స్థలం చాలా వుంది. అతని అభిరుచికి ప్రతిబింబాల్లా ఎదుటివైపు రకరకాల పూల మొక్కలు, పచ్చటి గడ్డి మెత్తగా పరచి వుంది.
    కాలింగ్ బెల్ నొక్కాడు.
    ఎవరో యువతి తలుపు తీసింది.

 Previous Page Next Page