క్షణంలో ఆ ఎ.సి. గదిలో మొహంపై చిరు చెమటలు పోశాయి.
ఎదురుగా వున్న వ్యక్తి కళ్ళల్లో ఎర్రటి జీర మృత్యువు పిలుపులా ఉంది.
అతని చూపు అర్థరాత్రి ఆకలితో పచ్చిక మేస్తున్న జింకను చూసే పులి చూపులా ఉంది. ఆ చూపులో క్రోధమా? పగా? కసా?.... కాటు వేయడానికి సిద్ధపడ్డ పాములా నిగనిగలాడుతోంది అతని చేతుల్లోని పిస్టల్.
"ను....ను....నువ్వా?" అన్నాడు భరద్వాజ తడబడుతున్న గొంతు పెగల్చుకొని.
"అవును. నేనే" అన్నాడతను లోపలికొచ్చి తుపాకి సూటిగా భరద్వాజ మెదడుకేసి గురిపెట్టి.
* * * *
అంకిత చెప్పిన లొకాలిటీకి రానన్నాడు ఆటోడ్రైవర్ మామూలుగానే! అక్కడికి సగం దూరంలో వున్న ఓ మార్కెట్ సెంటర్ కయినా తీసుకెళ్ళమని కూర్చుంది అంకిత.
ఆటో మార్కెట్ సెంటర్ కి చేరగానే దిగి ఫేర్ చెల్లించి గబగబా మరో ఆటో దగ్గరికి నడుస్తూ వాచీ చూసుకుంది.
ఎనిమిదీ పది అయ్యింది.
ఆటో ఎక్కుతూ ప్రక్కనే మరో ఆటోలోంచి దిగుతున్న వ్యక్తిని చూసింది ఓరగా. ఆ వ్యక్తి కూడా అంకితను చూసి వెంటనే పలకరించాడు శ్రీధరం అతను.
"ఏమ్మా.... ఎక్కడికి?"
ఎందుకో అంకిత క్షణం కొట్టుమిట్టాడింది, శ్రీధరానికి సాగర్ విషయం చెప్పడమా మానడమా అని. అదంత మంచిది కాదనే నిర్ణయానికి వచ్చి, ఆగి, నవ్వి,
"ఏం లేదంకుల్.... భరద్వాజ అంకుల్ ఇంటికి వెళుతున్నాను."
"ఈ టైంలోనా?.... ఇంత రాత్రేమిటమ్మా?"
"ఊరికినే అంకుల్...."
"కాఫీ తాగి వెళదాం రామ్మా....నేనూ వస్తాను. డ్రాప్ చేస్తానులే."
"ఒద్దంకుల్.... తరువాత త్రాగుదాం...."
"సరే పద. నేనూ వస్తాను. అటే వెళుతున్నాను నేను కూడా."
అంకిత ఇంకా ఆలోచనలో వుండగానే ఆయన ఆటోని అడగటం ఎక్కడం, "రామ్మా" అనడం కూడా అయిపోయింది.
ఆటో కదిలింది. అంకిత ముళ్ళమీద కూర్చున్నట్టుగా కూర్చుంది.
ఇక్కడ ఆటో కదిలే సమయానికి వెనక కిటికీ గుండా భరద్వాజ ఆఫీసు గదిలోకి చూశాడు సాగర్.
'ఆయన నీరసంగా టేబుల్ పైన వాలి వున్నాడు' అనిపించింది సాగర్ కి.
చేతులు టేబుల్ పైన విశాలంగా పరచుకొని వంగి కుడివేపు తిరిగి పడుకొని వున్నాడతను. అయితే అప్పటికే అతను మరణించి పది నిముషాలు దాటిందన్న విషయం సాగర్ కి తెలీకపోవడంతో ఎయిర్ బాగ్ లోంచి పిస్టల్ తీశాడు.
చెమటలు పోస్తున్నాయతనికి.
గోడకి అవతల రోడ్డు వారగా నిల్చుని ఇటే చూస్తున్న ఆ పిచ్చివాడిని గమనించలేదు సాగర్.
భుజాలవరకూ పెరిగిన చింపిరి జుత్తు.... మాసి గజిబిజిగా వున్న చిన్న గెడ్డం.... ముడతలు పడ్డ ముఖంపై చిన్న ముక్కు, పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్న కళ్ళు....
చినిగిన చొక్కా, లుంగీ_ భుజానికో జోలె.
కాళ్ళు వణుకుతున్నాయి సాగర్ కి.
పిస్టల్ స్టడీగా పట్టుకోలేకపోతున్నాడు.
ఎక్కడో వీధిలో కుక్క భౌ మని అరవడంతో అదిరిపడ్డాడు.
అక్కడ డి.యస్.పి. ఆఫీసు నుండి బయటపడ్డాక మార్కెట్ కి వెళ్ళి పళ్ళు కొన్నాడు హబీబ్.
హోటల్లో దూరి భోజనం చేశాడు.
తరువాత బయటికి వచ్చి బస్సెక్కాడు.
అతను బస్సెక్కే సమయానికి తనను తాను సంభాళించుకొని తుపాకీని కాస్త స్టడీగా పట్టుకొని తనలోని ధైర్యాన్నంతా కూడ గట్టుకొని ట్రిగ్గర్ నొక్కాడు సాగర్.... "ధుప్"మన్న శబ్దంతో గుండు గదిలోకి దూసుకుపోయింది.
వెనక్కి తిరిగి గబ గబా ఆటో కోసం నడవసాగాడు సాగర్.
అతనా బంగళా దాటి వంద గజాలు ప్రయాణించాక బంగళా ముందాగింది అంకిత వచ్చిన ఆటో.
ఆటో ఫేర్ చెల్లించి గేటు దాటి లాన్ లో నడిచి తలుపు సమీపించారు అంకిత, శ్రీధరం.
బెల్ నొక్కింది అంకిత.
సమాధానం లేదు.
మళ్ళీ నొక్కింది.
శబ్దం లేదు.
గేటు చప్పుడు కావడంతో వెనక్కి తిరిగి చూసింది అంకిత.
హబీబ్ చేతిలో సంచీతో తలుపు తీసుకొని లోపలికి వస్తున్నాడప్పుడే.
వారిని చూసి, "మీరా?....రండి రండి" అని సాదరంగా అంకితను ఆహ్వానించి శ్రీధరానికి నమస్కరించాడు.
"ఏవిఁటి హబీబ్.... ఎక్కడి కెళ్ళావ్?" అడిగింది అంకిత.
"ఏలూరెళ్ళానండి. రేపు రావలసింది. ఈ రోజే వచ్చాను. బస్ స్టాండు నుండి నేరుగా వస్తున్నాను."
"ఇంట్లో ఎవరూ లేరనుకుంటా హబీబ్, తలుపెవరూ తీయడం లేదు."
"అయ్యగారీ టైంలో ఎక్కడకీ వెళ్ళరే...."
సాలోచనగా అని బంగళా వెనక్కి వెళ్ళాడు హబీబ్.
రోడ్డు కవతల దాదాపు గంట నుండి నిల్చుని పిచ్చిగా ఇటే చూస్తున్న ఆ వ్యక్తి వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోయాడు.
రెండు నిమిషాల్లో పరుగెత్తుకుంటూ తిరిగొచ్చాడు హబీబ్. అతని మొహం పాలిపోయి వుంది.
"ఏవఁయ్యింది హబీబ్?" ఆదుర్దాగా అడిగాడు శ్రీధరం.
"ర....ర....రక్తం.... అయ్యాగార్ని ఎవరో చంపేశారు." అంతకుమించి ఏమీ మాట్లాడలేకపోయాడు హబీబ్.
తలుపులు బ్రద్దలు గొట్టారు అందరూ కలిసి.
లోపలికి పరిగెత్తాడు హబీబ్. అతడ్ని అనుసరించారు అంకిత, శ్రీధరం.
లోపల టేబుల్ పై వాలి వున్నాడు భరద్వాజ. అతని తల్లోని తుపాకి గాయంలోంచి కారిన రక్తం టేబుల్ పై చిన్న కొలనులా వుంది. తల చిట్లి వుంది. అంకితకు వణుకు పుట్టిస్తోందా దృశ్యం. అంతలోనే తనను తాను కూడదీసుకుని మరోసారి పరీక్షగా చూసింది.
"ఎవరో మెదడుకు గురి పెట్టారు" అనుకుందామె.