భూతాలరాజు ఎత్తుకెళ్ళి పోతుంటే పెనుగులాడిందన్న మాట స్వప్న. మోటుగా ముళ్ళ కంచెలు ఆమెకు తగులుతాయన్న లక్ష్యం కూడా లేకుండా తీసుకెళ్ళిపోయాడన్న మాట భూతాలరాజు!
స్వప్నకి ఏమన్నా జరిగిందో, ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు వీణ్ని తను! శరీరం తునాతునకలయ్యేలా బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు. వీడి చావువల్ల తన ప్లానంతా మట్టిగొట్టుకు పోయినా సరే!
స్వప్న అంటే తనకి అంత అభిమానం పేరుకుపోయిందని అప్పుడే మొదటిసారిగా అర్థం అయింది అతనికి.
మరికొంత దూరం పోయాక ఒక చెట్టు బెరడుని అంటుకున్న రక్తం కనబడింది. ఎండి, జేగురు రంగుకి తిరిగి ఉంది అది. పరిశీలనగా చూడడానికి దగ్గరగా వెళ్ళాడు సందీప్.
చటుక్కున చెట్టు బెరడు ఊడి, అతని మీదకు దూకింది.
ఉలిక్కిపడి అంతలోనే తమాయించుకున్నాడు సందీప్. అది చెట్టు బెరడు కాదు. అచ్చం అలాగే ఉండే కప్ప. చెట్టు బెరడులాగే ఉంటుంది దాని చర్మం, రంగూ, డిజైనూ కూడా. ఆ జాతి కప్పలు చెట్లమీద ఉంటాయి.
దాన్ని పోనిచ్చి మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చాడు. రక్తంతోబాటుగా, బట్ట తాలూకు సూక్ష్మమైన పేలికలూ, చర్మం ముక్కా కనబడ్డాయి.
స్వప్న భుజమో ఏదో గీసుకుని చెట్టుకి ఆ రక్తం అంటి ఉండాలి.
అడుగుజాడలని తీక్షణంగా చూస్తూ ముందుకు పోతున్న సందీప్ షాక్ తగిలినట్లు ఒక్క అడుగు వెనక్కి వేశాడు.
భూతాలరాజు అడుగులు హఠాత్తుగా సైజు మూడు రెట్లు పెరిగినట్లు అనిపిస్తున్నాయి.
వాటీజ్ దిస్ ? రాక్షస మాయలాగా?
కళ్ళు నులుముకుని చూశాడు సందీప్. తన భ్రమ కాదు ! నిజమే !
ఒక్కొక్క అడుగూ పద్దెనిమిది అంగుళాల పొడుగున వుంది! అడుక్కీ అడుక్కీ మధ్య దూరం అయిదేసి అడుగులు ఉంది !!
స్తంభించిపోయినట్లు చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు సందీప్. తర్వాత గన్ ఒకసారి సరిచూసుకుని, మెల్లగా ముందుకి సాగాడు.
వంద గజాల దూరంలో ఉంది ఒక బండ. దాని పక్కన మలుపు తిరిగి అదృశ్యమై పోయింది కాలిబాట.
అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నాడు సందీప్. సవ్వడి చెయ్యకుండా మలుపు తిరిగాడు.
అక్కడ నేలమీద పడి వుంది స్వప్న. ఆమె చీర అస్తవ్యస్తంగా వుంది స్పృహలేదు తనకి.
ఆమె మీదికి ఒంగుతున్న ఆకారాన్ని చూసి నిర్ఘాంతపోయాడు సందీప్. తర్వాత తెప్పరిల్లుకుని, తుపాకిని భుజం లెవెల్ కి తీసుకొచ్చి గురిపెట్టాడు.
నరవానరం
పెద్దసైజు గొరిల్లాలాగా వుంది ఆ జంతువు. కానీ అది గొరిల్లాలాగా ప్రవర్తించడం లేదు. ఒక పురుషుడు స్త్రీని ఆక్రమించుకునే ప్రయత్నం చెయ్యబోతోంది.
తన వెనక ఎవరో నిలబడి వుండడం పసిగట్టింది అది. లేచి నిలబడింది. దాదాపు ఎనిమిది అడుగుల పొడుగు వుంది. బలిష్ఠంగా వున్న చేతులు మోకాళ్ళని దాటి కిందికి వస్తున్నాయి. ఎరుపూ, గోధుమ వర్ణం కలిసిన వెంట్రుకలు వళ్ళంతా దట్టంగా పెరిగి వున్నాయి. కండలు తిరిగివుంది శరీరం. కోతుల్లా వంగి నడవకుండా, నిటారుగా రెండు కాళ్ళమీద నిలబడి నడవడానికి అలవాటుపడ్డ జీవిలా వుంది. గొరిల్లాలూ, తదితరమైన కోతులు కొద్దిసేపు నిటారుగా నిలబడగలిగినా, అతి త్వరలోనే అలిసిపోతాయి. వెన్నెముక వంగకుండా సూటిగా వుండడమే అందుకు కారణం. మనిషి వెన్నెముక ఫ్లెక్సిబుల్ గా, వంగడానికి వీలుగా వుంటుంది కాబట్టి నిలబడి నడవడానికి అనువుగా వుంటుంది.
ఈ జీవి చూడడానికి ఏప్ లాగా, అంటే కోతి రూపంలోనే వున్నా, నిశ్చయంగా కోతి మాత్రం కాదు.
కోతులలోనుంచే పరిణామ క్రమంలో మానవుడు ఉద్భవించాడని చెబుతారు.