Previous Page Next Page 
చెక్ పేజి 29


    అందుకే జనం తిరునాళ్ళలా గుమిగూడారు.

 

    సాయంకాలం వరకు మోడీ జరుగుతుంది. మధ్యాహ్నం కాసేపు బ్రేక్. ఆ సమయంలో పెరుమాళ్ ప్రతి ఇంటికీ వస్తాడు. ఇచ్చింది పట్టుకుపోతాడు. ధాన్యం, పాతబట్టలు బాగానే వస్తాయి. వాటిని తీసుకున్నాక తిరిగి మధ్యాహ్నం మోడీ ప్రారంభమై సాయంకాలం వరకు సాగుతుంది. పక్క గ్రామాల నుంచి వచ్చినవాళ్ళు మధ్యాహ్నం తమ బంధువుల ఇళ్ళల్లోనూ, లేదూ తెలిసిన వాళ్ల ఇంట భోజనం చేస్తారు. కొందరైతే భోజనం పొట్లాలు తెచ్చుకునేవారు.

 

    జనం మర్రిచెట్టు చుట్టూ దడి కట్టేశారు. దాదాపు రెండువేలమందికి పైగానే వుంటారు.

 

    ఊర్లోని చిల్లరకొట్టు మంగమ్మ మర్రిచెట్టు దగ్గర చిన్న దుకాణాన్ని పెట్టింది. షోడాలు, క్రష్ లు, బీడీలు, సిగరెట్లు క్షణాల్లో ఖాళీ అవుతున్నాయి.

 

    పెరుమాళ్ తన సరంజామా సర్దుకోవడంలో బిజీగా వున్నాడు.

 

    మర్రిచెట్టు మొదట్లో ఒక బొమ్మను పెట్టాడు. ఆ బొమ్మను 'జుట్టు పోలుగాడు' అని అంటారు. అది మంత్రాల దేవుడు. మొత్తం మోడీ అంతా ఆ పేరుమీదే జరుగుతుంది.

 

    ఆ బొమ్మ రకరకాల గుడ్డలతో చేసింది. రెండు జానడలంత వుంటుంది. ఎవరో అక్కడక్కడా కొరుక్కు తినేసినట్టు ఆ బొమ్మ వికారంగా వుంది. దాని నడుముకు కట్టిన ఎర్రటి దారం కిందకు వేలాడుతూ వుంది. ముఖంలో నల్లటి రంగుతో తీర్చిదిద్దిన కనుబొమ్మలు చచ్చిపోయిన కంబళి పురుగుల్లా వున్నాయి. నోటికంతా ఎర్రటి రంగు పూయడం వల్ల ఆ బొమ్మ పాలకు బదులు రక్తం తాగే దెయ్యం పిల్లలా వుంది.

 

    ఆ బొమ్మకు ముందు ఎముకల పొడితో వేసినట్టు ముగ్గులున్నాయి. ఆ ముగ్గుల్లోనే ఓం, హ్రీం, ఫట్ అనే అక్షరాలున్నాయి. వాటినీ ముగ్గు పిండితోనే రాసాడు. ముగ్గు మధ్యలో పాముల బుట్ట ఒకటి వుంది. ఆ బుట్టపైన ఒక పుర్రె వుంది. ఆ పుర్రె భయంకరంగా వుంది. దాని పక్కన చేతి ఎముక అడ్డంగా పడివుంది. బుట్ట ముందు కొన్ని దారాలు, ఒక ఢమకం వుంది. దాని పక్కన ఒక పిల్లన గ్రోవి వుంది. బొమ్మకు ముందు ఒక మద్దెల చచ్చిపోయిన పిల్లాడిలా నిస్తేజంగా పడి వుంది.

 

    ముగ్గు పైభాగాన కుంకుమ ఉంది. దూరానికి రక్తం ముద్దలా కనబడుతోంది.

 

    అక్కడి వాతావరణం అంతా బీభత్సంగా ఉంది.

 

    వాటిని అమర్చిన విధానంలోనే ఎంతో నేర్పుంది. అవన్నీ ఏదో తెలియని భయాన్ని కలుగజేస్తున్నాయి. పిశాచాల ఇంటి ముందున్న అలంకరణలా ఉన్న ఆ ప్రదేశాన్ని చూస్తే ఎంత ధైర్యవంతుడికైనా గుండె జారిపోయేటట్టుంది.

 

    జనం నిక్కి నిక్కి చూస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఏదో తెలియని ఉద్వేగం పాము పడగవిప్పుకున్నట్టుంది. వాళ్ళ నుదుళ్ళు చీలిపోయినట్లు గీతలు కనిపిస్తున్నాయి. ముఖాలు సీరియస్ గా వుండడంవల్ల వికృతంగా వున్నాయి.

 

    వస్తువులనంతా సర్దిన పెరుమాళ్ పైకి లేచాడు.

 

    అతనికి నలభై ఏళ్ళ వయసే అయినా అరవయ్యేళ్ల ముసలాడిలా కనిపిస్తున్నాడు. అంతక్రితం చలాకీగా వున్న అతను అలా మారిపోవడానికి కారణం అతనిలో క్షుద్రశక్తులు ప్రవేశించాయని వృద్ధుల నమ్మకం. అతని వంట్లోని రక్తాన్నంతా జుట్టుపోలుగాడు తాగేసినట్టు నీరసంగా ఉన్నాడు. అతని ముఖంమీద దెయ్యాలు ఆడుతున్నట్టుంది. నుదురు చిట్లి రక్తం గడ్డకట్టుకుపోయినట్టు రూపాయిబిళ్ళ సైజులో కుంకుమ బొట్టు మెరుస్తూ వుంది.

 

    అతను కట్టుకున్న పంచె ఆవు చర్మంలా ఉంది. వేసుకున్న పొడుగు చేతుల నల్లటి చొక్కా తిరగేసి గబ్బిళాన్ని ఒంటిమీద అతికించినట్టుంది. మెడచుట్టూ వేసుకున్న తెల్లటి మఫ్లర్ పాము కుబుసంలా వుంది. అతను అచ్చు దెయ్యాలను ఆడించే మనిషిలా వున్నాడు. లేదూ దెయ్యాలు పెంచుతున్న రాక్షసుడి బిడ్డలా వున్నాడు.

 

    బుట్టలోని పాము కదిలినట్టు జనంలో కలకలం బయల్దేరింది. కీ ఇచ్చిన బొమ్మలా జనం తమ తలలను వీధి చివరకు తిప్పారు.

 

    సత్యనారాయణరెడ్డి వంది మాగధులతో వస్తున్నాడు.

 

    ఆయన సిల్కు బట్టల్లో మంచు మనిషిలా మెరిసిపోతున్నాడు.

 

    ఆయన హుందాగా నడిచి వచ్చాడు. జనం మధ్యలో చీలి ఆయనకు దారి ఇచ్చారు.

 

    పెరుమాళ్ గౌరవ సూచకంగా పంచెను పాదాల వరకు దించి, రెండు చేతులూ ఎత్తి వినయంగా నమస్కరించాడు. సత్యనారాయణరెడ్డి కిళ్ళీతో నవ్వాడు.

 

    జుట్టు పోలుగాడి బొమ్మకు కొద్ది దూరంలో, మర్రిచెట్టు మొదట్లో పాలేరు మంచం వేశాడు. ఆయన దానిపై ఆశీనుడయ్యాడు.

 

    ఆయనొచ్చారు కాబట్టి మోడీ ప్రారంభమవుతుందని జనం సర్దుకున్నారు. మోడీ ప్రారంభమైంది.

 

    పెరుమాళ్ ఓ మారు ఢమరక మ్రోగించి, ఆపి గొంతును సవరించుకున్నాడు.

 

    "ఈ వూరికి నేను బిడ్డలాంటివాడ్ని. నాకు రెడ్డిగారు తండ్రిలాంటివారు. ఇక మీరంతా నాకు తోడబుట్టిన లాంటి వాళ్ళు. అయిదు సంవత్సరాలుగా నేను ఇక్కడ మోడీ పెడుతున్నాను. బంగారు కడ్డీలా వుండే సత్యనారాయణబాబు ధర్మం వల్ల. మీ గుణంవల్ల నాకు బాగానే ముడుతోంది. ఈ సంవత్సరమూ వచ్చాను. నాకు ఈ వూరిని చూడకపోతే నిద్రపట్టదు. నాకూ ఈ వూరికీ తెలియని బంధం ఏర్పడింది. మీరు నన్ను ఒట్టి చేతులతో పంపగూడదు. మీరు దోసిళ్ళను ముంచి ధాన్యం పెట్టాల. నేను నా పిల్లలు మీపేరు చెప్పుకుని తినాల. ఒక్కసారి సత్యనారాయణ బాబుకు జేజేలు చెప్పి, మోడీ ప్రారంభిస్తాను" అని చేతులు తట్టాడు. జనం అతన్ని అనుకరించారు. చప్పట్లతో ఆ ప్రాంతం మార్మోగింది.

 

    జుట్టు పోలుగాడి బొమ్మకు పూజ చేశాడు. ఆ బొమ్మ దగ్గర అగరత్తులు వెలిగించాడు. వాటి పరిమళం గాలిలో తేలింది.

 

    "ఇప్పుడు మరో అద్భుతం చూస్తారు" అని గట్టిగా అరిచి చెప్పాడు పెరుమాళ్.

 

    అతనిది ఏ ఊరో అక్కడున్న వాళ్ళల్లో ఎవరికీ తెలియదు. కొందరు మదనపల్లి దగ్గరంటే, మరి కొందరు పుంగనూరు అని అంటారు. ఇంకొందరు నెల్లూరు జిల్లా అనుకుంటారు. అతను ఏ ప్రాంతంవాడైనా అతని తెలుగు మాత్రం స్వచ్చమైన ఆవునెయ్యిలా ఘుమఘుమలాడుతూ వుంటుంది.

 

    పెరుమాళ్ పాము బుట్టను అందుకున్నాడు. దాని మూత తీశాడు. అందులో ఏమీ లేదు. ఖాళీగా వుంది.

 

    "ఇందులో ఏమీలేదు. ఖాళీగా శెట్టిగారి ఛాతీలా వుంది. మగాడి ఛాతీ మీద తారు కుమ్మరించినట్టు వెంట్రుకలుండాలా. పెళ్ళాం రాత్రిపూట ముద్దొచ్చి వాటితో ఆడుకోవాల. అలానే పాముల బుట్టలో పాముండాలి. అది పడగవిప్పి బుసలు కొట్టాలి. మరిప్పుడు జుట్టు పోలుగాడు ఇందులో పామును పెడతాడు" అని బుట్ట మూశాడు.


                                        8


    శెట్టి తన ఛాతీ కనపడకుండా టవల్ కప్పుకున్నాడు. అప్పటికే ఆలస్యమైంది. కొన్ని వందల కళ్ళు ఆయన ఛాతీమీద వాలి, ఆ నునుపుకు జారాయి. అందరూ శెట్టిని చూసి ఎగతాళిగా నవ్వారు.

 

    శెట్టిగారు రక్తంలేని నవ్వును పెదాలపై పూయించారు.

 

    సత్యనారాయణరెడ్డి పెదవి విడీ, విడకుండా హుందాగా నవ్వారు.

 Previous Page Next Page