భుజంగరావు ఇంట్లోనే వున్నాడు. వెంటనే పరామర్శించడానికి పైకి వచ్చాడు. రాజారావుకు సిగ్గేసింది. "కూర్చోండి" అన్నాడు ఎలాగో. ఆయన కూర్చుని లక్ష ప్రశ్నలు వేశాడు. చివరకు "డాక్టరుగారికి కబురు చేస్తాను. ఈలోగా మా ఆవిడతో కషాయం చేసిపెట్టమని చెబుతాను" అన్నాడు.
"వద్దండీ" అన్నాడు రాజారావు ఆతృతగా. అతనికి ఏదో నరకంలో పడినట్లు అనిపించింది.
"ఓ! కషాయం అంటే భయం" అంటూ ఆయన నవ్వుతూ లేచి "పోనీ డాక్టరుకైనా కబురుచేయనివ్వండి" అంటూ వెళ్ళిపోయాడు.
ఆ సాయంత్రందాకా రాజారావు అట్లా అవస్థపడుతూ పడుకుని వున్నాడు. అతన్లో మంజువాణి వస్తుందేమోనని ఆశవుంది. ఆ ఆశ నిరాశగా మారిపోవడం, దుఃఖం క్రింద పరిణమించింది. ఎంత కఠినత్వం ఆమెకు! రాత్రికి వస్తే నాలుగూ దులిపెయ్యాలనుకున్నాడు. అందుకోసం మాటలన్నీ ఏర్చికూర్చి సిద్ధంగా తయారయ్యాడు. రాత్రి పన్నెండయింది. ఒంటిగంటయింది. ఆమె రాదేం! తనకోపం ఎవరిమీద చూపుతాడు?
ఇహ ఆమెను గురించి ఆలోచించకూడదనుకున్నాడు. మరునాడు ఉదయం నిద్రలేవగానే కష్టంమీదలేచి కిటికీదగ్గరకు వెళ్ళి స్టవ్ అంటించటం మొదలు పెట్టాడు. అగ్గిపెట్టెలో రెండే పుల్లలున్నాయి. అవి అయిపోయినాయి. కాని కార్యం సఫలంకాలేదు. ఇంతలో ఏదో అనుమానం తోచి కిటికీలోంచి క్రిందకు చూశాడు. ఏదో ముఖం చప్పున తలుపుచాటుకు తప్పుకుంది. 'ఊ' అనుకున్నాడు కసిగా. ఇంతలో పాంచాలి పైకి వచ్చింది. ఆమెను అగ్గిపెట్టె తీసుకురమ్మని పురమాయించి నీరసంతో కళ్ళు తిరుగుతున్నా, అలానే గోడకు ఆనుకుని నిలబడ్డాడు. ఆమె ఇట్టే వెళ్ళి అట్టే తిరిగి వచ్చి అగ్గిపెట్టె అందివ్వబోయింది. ఎక్కడిదంటే క్రింద అమ్మగార్ని అడిగి తెచ్చానంది. 'ఛస్!' ఆమెను గబగబ నాలుగుతిట్టి, బజారుకుపోయి పట్రమ్మని అరిచాడు. ఓ పదినిమిషాలయినాక వస్తూ "మీరు లేవండి. నేను వెలిగిస్తాను" అన్నది పాంచాలి. "అక్కర్లేదు" అని కసిగా అతను పనిలో నిమగ్నుడయ్యాడు. ఇంతలో క్రిందనుంచి ఏదో సన్నని కంఠం వినిపించింది. పాంచాలి క్రిందికి దిగిపోయింది. ఈలోగా అతను స్టవ్ వెలిగించి నీళ్ళు పెట్టాడు. అట్లా అట్లా మొహం కడుక్కున్నాడు. కాస్త హర్లిక్సు కలుపుకుని తాగుదామని అతని ఊహ. ఓ అయిదు నిమిషాలు గడిచాక పాంచాలి పైకి వచ్చింది చేతిలో కాఫీ కప్పుతో. "ఛీఛీ! వద్దు" అంటూ అతను తల ప్రక్కకి తిప్పుకున్నాడు. ఆమె మొండిగా అందివ్వబోయింది. విసురుగా ఒక్కతోపు తోశాడు. క్రిందపడి పగిలిపోయింది.
మధ్యాహ్నం - సాయంత్రం గడిచాయి. అతనిలో అశాంతి పెరగసాగింది. ఇంతే ఈ ఆడవాళ్ళు. మొదట ప్రాధేయపడేదీ వాళ్ళే. నెత్తి నెక్కేదీ వాళ్ళే. తన పరిస్థితి తెలుసుకదా. ఇక్కడ ఒంటరిగా సతమతమైపోతూ వున్నాడే, తన సంగతి ఆమెకు తెలియనక్కర్లేదా? తన జీవితం నాశనం చేసింది. ఇంతవరకు తననిట్లా ఎవరూ బాధపెట్టలేదు. తాను చక్రపాణికి ఏం రాశాడు? ఆ ఉత్తరం రాసేటప్పుడు తన ఊహలు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి? అసలు ఉత్తరాల్లో మనిషి ఎప్పుడూ ఉదాత్తంగా బ్రతుకుతాడా? ఇది ఎన్నోరకం ఆత్మవంచన? పాపం తననిగురించి అమాయకంగా, పసిగా ఊహించుకుంటాడు పాణి. సుకుమారుడు వాడు. ఇటువంటి స్త్రీగాలి ఒకింత సోకిందంటే భస్మం అయిపోతాడు. దేముడు మేలుచేయుగాక!
వరుసగా మరి రెండు మూడురోజులు గడిచాయి. జ్వరం నెమ్మదిగా దిగిపోతోంది. కాని జ్వరంలో వచ్చిన అసహ్యం పెరిగిపోతోంది. భుజంగరావు వచ్చి క్షేమం విచారించి పోతున్నాడు. ఇది మరింత దుస్సహంగా వుంది. మంజువాణి చాటునుండి నాటకం ఆడిస్తోందా?
ఓరోజున అతనికి కాస్త కులాసాగా వుంది. ఆమె తననిలా గాలికి విడిచి, తను హాయిగా సుఖభోగాలతో ఓలలాడుతున్నట్లుగాతోచింది. భుజంగరావు కూడా ఇంట్లో లేడు. క్యాంపుకో, ఎక్కడికో పోయినట్లున్నాడు. వెళ్ళి ఐసాపైసా తేల్చుకోవాలనుకున్నాడు. "నువ్వు నన్ను దగాచేశావు..." ఇలా డైలాగులు ఊహించుకున్నాడు.
మొదట కొంత అహంభావం అడ్డువచ్చింది. కాని దాన్ని మించింది కుతి. గబగబా మెట్లు దిగి క్రిందికి వెళ్ళాడు. సంకోచించకుండా లోపలకు పోయాడు. ఇటు చూసుకోకుండా ఎదురుగా వస్తోంది ఆమె. "మంజువాణీ!" అన్నాడు. ఉలిక్కిపడి చూసి వెనువెంటనే లోపలికి గబగబ వెళ్ళిపోయింది. అక్కడే నిలబడి వస్తుందేమోనని చూశాడు రాజారావు రెండునిముషాలు. ఇహ అప్పుడు సందేహించకుండా లోపలికి నడిచి, మూసివున్న వంటింటి తలుపులు తట్టుతూ "మంజువాణీ! దా బయటకు. ఒక్కముక్క అడిగిపోతా" అన్నాడు.
లోపలనుంచి జవాబు రాలేదు.
"తలుపులు బ్రద్దలుకొట్టనా?" అన్నాడు రాజారావు.
అప్పటికీ సమాధానం లేదు.
అంతపని ఎందుకు చేయలేదోగాని "ఎక్కడికి పోతావులే" అంటూ ప్రగల్బాలు పలుకుతూ వెలుపలికి వచ్చేశాడు.
అప్పటినుంచీ అతను సమయంకోసం కాచుకుని కూర్చొని వున్నాడు. మధ్యాహ్నం అదను కనిపెట్టి హఠాత్తుగా లోపలికి వెళ్ళాడు - మంజువాణి చాపమీద కళ్ళుమూసుకుని ఓ ప్రక్కనే తిరిగి పడుకొని వుంది. అలికిడి విని తృళ్ళిపడి లేవబోయింది. కాని లేచి పారిపోవటానికి వ్యవధి లేదని గ్రహించిందేమో అలాగే పడుకుని వుండిపోయి తలగడలో ముఖం దాచుకుంది.
"మంజువాణీ! నీ ముఖాన్ని వెలికితియ్యి. నీతో చాలా మాట్లాడాలి" అన్నాడు రాజారావు.
ఆమె అటువంటి ప్రయత్నం చేసినట్లు కనబడలేదు.
"ఏమిటీ అభినయం? క్రొత్తరకం శృంగారమా? మనమిద్దరం ఒకేసారి చచ్చన్నాపోదాంగాని, ఈ వేషాలు వద్దు. ఎవరు ఎలా నాశనం అయినారో దాన్ని గురించి తర్జనభర్జనలు చేయదలచలేదు. కాని నన్ను నడిసముద్రంలో దింపి నువ్వు అవతలి ఒడ్డుకి పోవాలనుకోవటం మాత్రం నేను సహించను."
కదల్లేదు మంజువాణి.
"ఈరకంగా కూడా నన్ను సాధించుదామనివుందా? ఇరుగూ, పొరుగూ ఇళ్ళవాళ్ళందరికీ మన వ్యవహారమంతా తెలిసిపోయింది. నేను బయటికివెళ్తే ఓ మృగంక్రింద చూస్తున్నారు. కాలేజీలో ఆ గుసగుసలు వింటూ తలయెత్తుకు తిరగలేకుండా ఉన్నాను. నా అన్నవాళ్ళందరికీ విరోధినయ్యాను. వింటున్నావా?"
మార్పులేదు మంజువాణిలో.