ఇక లాభం లేదనుకుని హెడ్ వార్డర్ ని పిలిచాడు. "వాళ్ళు కోరినట్టు చేస్తానని చెప్పు. ముందు ఆ చేష్టలను మానమని చెప్పు" అని తన గదిలోకి వెళ్ళిపోయాడు విసురుగా.
తాము అనుకున్నది సాధించామని తెలియగానే తిలక్ ను కొందరు ఖైదీలు పైకి ఎత్తుకుని జేజేలు కొట్టారు.
దూరంగా నిలబడి ఇదంతా గమనిస్తున్న దాదా ఈర్ష్యతో బుసలు కొడుతున్నాడు. దీనికంతా ప్రతీకారం తీర్చుకోవడానికి అప్పటికప్పుడే ఒక కుట్రపన్నాడు.
అయితే అప్పుడు అతను కుట్ర పన్నింది తిలక్ మీద కాదు, ఉత్తరుడి మీద. తిలక్ కి ప్రాణమిత్రుడు కావడమే ఉత్తరుడు చేసిన తప్పు. ఉత్తరుడిని దెబ్బ కొట్టి తిలక్ మీద కసి తీర్చుకోబోతున్నానన్న శాడిస్టిక్ ప్లెజర్ అతని ముఖంలో దెయ్యం మాస్క్ లా వుంది.
* * * *
ఆరోజు వచ్చిన కలెక్షన్స్ ని లెక్క వేస్తున్నాడు ఆర్ముగం. అతని చుట్టూ మరో అయిదుగురు వార్డర్లు తదేకంగా ఆర్ముగం చేతుల్లో నలిగి పోతున్న కరెన్సీ వంక చూస్తున్నారు. జెయిలు కిచెన్ రూమ్ లో ఈ తతంగం అంతా జరుగుతోంది.
సాయంకాలం అంతర్థానమై రాత్రి పుట్టుకొచ్చి కొన్ని క్షణాలే అయింది. ఖైదీలంతా బ్యారెక్కులలో వేసి తమ వాటా పంచుకునేందుకు వార్డర్లు ఒక్కొక్కరే కిచెన్ వైపు వస్తున్నారు.
"ఈరోజు కలెక్షన్ మొత్తం ఏడువందలు" ఆర్ముగం లెక్క పూర్తి చేసి చెప్పాడు.
"కైలాసం ఎంతిచ్చాడు?" ఓ వార్డర్ అడిగాడు.
"ఈరోజు విజిటర్స్ ఎక్కువమంది లేరు. అదీగాక విజిటర్స్ ని ఎలో చేయవద్దన్నాడు సూపరింటెండెంట్. దాంతో అతికష్టంమీద నలుగుర్ని మాత్రం పంపగలిగాం. ఆ నలుగురి దగ్గరా ఇరవై రూపాయల చొప్పున వసూలు చేశాడు కైలాసం. వాడి కమీషన్ పదిహేను రూపాయలు పోను మిగిలిన అరవై అయిదూ ఇచ్చాడు" ఆర్ముగం వివరంగా చెప్పాడు.
"ఆ తిలక్ గాడికోసం వచ్చిన వాళ్ళను పంపకపోతే సరి. ఎవరినీ వద్దంటాడేమిటి శ్రీపతి?" కలెక్షన్ తగ్గిపోయినందుకు బాధపడిపోతూ అడిగాడు ఓ వార్డర్.
"ఆ తిలక్ గాడు పారిపోవడానికి ప్రయత్నించడం మన జేబుకి చిల్లు తెచ్చి పెట్టింది. ఈరోజు కలెక్షన్ ఎంత డల్ గా వుందో మీరే చూశారుగా. ఖైదీలకు గవర్నమెంట్ ఇచ్చే కూరగాయాల్లో కొంతేగదా అమ్ముకోగలం. మొత్తం అమ్మేస్తే మొదటికే మోసం వస్తుంది. అందువల్ల పాతిక కేజీలలో పదిహేను కేజీలు అమ్మి, మరో పదికేజీలు జైలుకి తెచ్చి వండి వేస్తున్నాం. ఈరోజు ఆదివారం కాకపోవడం వల్ల మటన్ కోటా లేదు. ఇక పప్పూ, ఉప్పులో రోజుకు రెండు వందలు కూడా రావడం లేదు. ఎంత మేనేజ్ చేసినా ఈరోజు ఇంతకంటే కలెక్షన్ రాలేదు" ఆర్ముగం నిరుత్సాహంగా చెప్పాడు.
"అందరికీ వాటాలేస్తే క్వార్టర్ బాటిల్ కైనా వస్తుందో రాదో!" మళ్ళీ ఆర్ముగమే అన్నాడు.
"ఈరోజు క్వార్టర్ బాటిల్ అంటున్నావ్. కొంపదీసి జైలుకి ఏ ఆడ ఖైదీ అన్నా వచ్చిందా?" ఆర్ముగం ఏ సమయంలో మందు బిగిస్తాడో తెలిసిన ఓ వార్డర్ అడిగాడు.
"ఆఁ దేవకీ అనే ఓ కొత్త ఖైది వచ్చింది. చోరీ కేసు. సంవత్సరం శిక్ష. పిల్ల మాత్రం పాతికేళ్ళ వయసులో పనసపండులా వుంది" మరో వార్డర్ అన్నాడు.
ఆర్ముగం కళ్ళల్లో ఆ మాటలు వింటూనే ఎర్రజీరలు అలుముకున్నాయి. కోరిక కార్చిచ్చులా ఒంటినంతా కాల్చేస్తోంది.
ఇక అక్కడ ఓ క్షణం వుండలేకపోయాడు.
వార్డర్లకు, జైలు ఆఫీసర్లకు ఎవరికెంత రావాలో వాటాలు పంచేసి, తన వాటా జేబులో వేసుకుని బయల్దేరాడు.
జైలు బయటకు వచ్చి అటూ ఇటూ చూశాడు.
కైలాసం కనిపించాడు. దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేశాడు. కైలాసం రాగానే అతని భుజం మీద చెయ్యేసి నడిచాడు.
"ఏం ఆర్ముగం! ఏంది కథ? భలే ఖుషీగా వున్నావే" కైలాసం అడిగాడు. ఆర్ముగం ముఖానికేసి చూస్తూ.
"కొత్తపిట్ట వచ్చింది జైలుకి"
"కేసేమిటి?"
"చోరీ కేసు. పిల్ల భలే బావుందేలే. ఆ పిల్లకు తెలివి లేదుగానీ, బిజినెస్ పెట్టుకుంటే హాయిగా గడిచిపోయేది. దొంగతనం చేసి జెయిలు కొచ్చింది వెర్రిబాగుల్ది"
"ఏమో ఆ పిల్లే దొంగతనం చేసిందని రుజువేమిటి? ఈ కాలం న్యాయం కలికం వేసుకుందామన్నా దొరకడం లేదు. అమాయకపు పిల్లని నువ్వే అంటున్నావ్. ఈ పోలీసులు, లాయర్లు ఆ పిల్ల చేయని నేరాన్ని చేసినట్టు ఒప్పించేసి వుంటారు. ఇంకా ఖచ్చితంగా మాట్లాడాలంటే చోరీలు చెయ్యందెవరు? వుదాహరణకు మీ మీ వార్డర్లనే తీసుకోండి. ఖైదీలకొచ్చే భోజనం కోటాను, మటన్ కోటాను బజార్లో అమ్ముకోవడం లేదూ. ఖైదీలు పండించిన కూరగాయల్ని చౌకగా అమ్ముకోవడం లేదూ?"
"ఏమిటోయ్ కైలాసం! వురిము వురిమి వూరిమీద పడ్డట్టు నువు మీద పడ్డావ్."
"అందుకే నిజం మాట్లాడకూడదంటారు పెద్దలు"
"నీ తత్వాలు కట్టినట్టు కానీ, మనసు భలే ఖుషీగా వుందిగానీ రా. చెరో క్వార్టర్ లాగించేద్దాం"
ఇద్దరూ ఓ బ్రాందీ షాపులోకి దూరారు.
ఆర్ముగం గ్లాసులో విస్కీ పోసుకుని, షోడా కలుపుకున్నాడు. ఎంతో ఆర్తిగా గ్లాసందుకుని గటగటా అర్థభాగం తాగి కింద పెట్టాడు.
"అంత అర్జంటేమిటి ఆర్ముగమా! నీ పనికి ఇంకా టైమ్ వుందిగా! అయితే నీ సర్వీసులో ఇలా ఎంతమంది ఆడ ఖైదీల్ని చెరిచావో చెప్పగలవా?" కైలాసం కూడా సిప్ చేస్తూ అడిగాడు.
ఆర్ముగం ఆ ప్రశ్న విని ఆనందపడిపోయాడు.
"ఎంతమంది అంటే ఏం చెప్పగలను కైలాసం! ఖైదీగా వచ్చిన ఏ ఆడపిల్లా నన్ను తప్పించుకు పోలేదు."
"ఇప్పుడొచ్చిన పిల్ల ఎవరు?"
"ఇంకా కేసును స్టడీ చేయలేదు. అయితే ఫేసును మాత్రం స్టడీ చేశాను. చీకట్లో దీపం పెట్టినట్టు వుందనుకో."
ఆర్ముగం తట్టుకోలేనట్టు గ్లాసెత్తి మొత్తం తాగేశాడు. ఇప్పుడతన్ని చూస్తుంటే కైలసానికే భయమేసింది.