"కేసు గురించి మావయ్యా!" మనోజ్ అన్నాడు.
"కేసా? మళ్ళీ ఏదయినా కొత్తకేసా లేక పాతకేసుల గురించే ఆలోచిస్తున్నావా?"
"కేసు పాతదే విషయం కొత్తదయింది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ఈ కొత్తకేసు తయారయింది. ఈ కేసుని నేనొక చాలెంజీగా తీసుకుంటున్నాను."
"ఇంతకీ ఆ కేసేమిటి?"
"ది గిఫ్ట్ ముక్తసరిగా చెప్పాడు మనోజ్,
"ఓ పక్క కేసంటావు. మరోపక్క గిఫ్ట్ అంటావు. కేసేమిటి? గిఫ్ట్ ఏమిటి?" చటర్జీ కుతూహలంగా ప్రశ్నించాడు.
"వివరంగా చెబుతాను" అంటూ ప్రారంభించాడు మనోజ్.
"నేను ఈ ఊరు ట్రాన్స్ ఫర్ అయ్యొచ్చిన మొదటే నా ప్రాణానికి ఓ గిఫ్ట్ గా ఈ కేసు రెడీ అయివుంది. నేను వచ్చేసరికే ఓ నేరం జరిగిపోయివుంది. మొదటిగా ఎర్రరంగు మారుతీకారుని తగలబెట్టారు. తరువాత స్కూటర్ ని, ఆ తరువాత రెడీమేడ్ బట్టలషాపులో కొన్ని రెడీమేడ్ గుడ్డలని. ఇలాంటివే మరికొన్ని కూడా తగలబెట్టడం జరిగింది...." మనోజ్ మాటలకి అడ్డు తగిలి__
"మీ పోలీసువాళ్ళకి ఇవి ఒక పెద్ద కేసులా?" నవ్వుతూ అన్నాడు ఛటర్జీ.
"నిజం చెప్పాలంటే ఇవి పెద్ద కేసులు కావు. కానీ ఈ పనిచేసిన వాళ్ళే ఒక హత్యను కూడా చేశారు. మొదట్లో నేను ఎవరో ఆకతాయి పనులుగా ఇవన్నీ చేస్తున్నారని అనుకున్నాను. వారంక్రితం ఒకహత్య జరిగింది. ఆ పాపకి నిండా ఆరేళ్లు వుంటాయి. తల్లితండ్రులకి ఒక్కతే అమ్మాయి.
తల్లీతండ్రీ యింట్లోలేనపుడు అక్క వరస అయ్యే అమ్మాయి, ఆ పాప వరండాలో పడుకున్నారు. రాత్రి రెండు గంతలావ్వేళ. ఆ పాపని ఆ యింటి కాంపౌండులోనే ఒకపక్కగా తీసుకువెళ్ళి కాల్చి చంపడం జరిగింది...."
"చాలా ఘోరం! పసిపిల్ల మీద ఎవరికి కక్ష వుంటుంది. ఆ పాపని కాలుస్తూంటే అరవలేదా? మంచందగ్గర నుంచీ కాంపౌండు దాకా తీసుకు వెళుతూంటే ఎలా వూరుకుంది? అసలు నువ్వు మొదట చెప్పిన కేసులకీ, ఈ కేసుకీ సంబంధం ఏమిటి?" ఛటర్జీ ప్రశ్నల వర్షం కురిపించాడు.
"అన్ని పనులు చేసింది ఒకరే! నేను మొదట ఈ కేసులో చాలామంది అల్లరి చిల్లరి వాళ్ళు వున్నారేమో అనుకున్నాను. ఆకతాయి వెధవలు చేసినపనేమో అని అనుకున్నాను.
కానీ అన్నిచోట్లా వేలిముద్రలు సేకరించడం జరిగింది. ఒకే మనిషి వేలి ముద్రలే దొరికాయి. వాడు వేలిముద్రలు చెరిపేసే ప్రయత్నం కూడా చెయ్యలేదు. దీనినిబట్టి వాడు పాత నేరస్థుడు కాదనే నిర్ణయానికి వచ్చాను.
పాత నేరస్తుల వేలిముద్రలతోనూ, ఇతని వేలిముద్రలు సరిపోలేదు. ఈ నేరాలు చేసేవాడు ఈ కేసులోని పూర్వాపరాలు కానీ, పథకం కానీ, నా మెదడుకీ అర్ధం కావటంలేదు.
కానీ. నా ఊహ ప్రకారం అయితే ఇది చాలా పెద్దకేసు. తిక్కపనులు చేసి మా డిపార్ట్ మెంట్ ని తప్పుదోవ పట్టించడానికి ముందు ప్రయత్నం జరిగింది. ఆ తరువాత ప్లాన్ లో ఒక భాగంగా తల్లీతండ్రీ యింటిలో లేనప్పుడు చూసి, ముక్కుపచ్చలారని ఆరేళ్ళ జెన్నీని హత్య చేయటం జరిగింది.
ఆ పాప అరవకుండా ముందుగా గొంతు నులిమివేసి, ఆ తరువాత పెట్రోల్ జల్లి తగలబెట్టాడు. పోస్టుమార్టమ్ ఈ విషయం తెలిసింది. హంతకుడు ఎవరో చాలా తెలివిగలవాడు. వాడిది అఖండమైన బుర్ర.
ఎవరినో పెద్దవాడిని చంపదలచుకున్నాడు. ముందే పెద్దవాడిని చంపితే నేరస్థుడు బయటపడడానికి అవకాశం వుంది. తిక్కపనులు చేస్తూన్నట్లు నటిస్తూ చిన్నవాళ్ళనీ చితకవాళ్ళనీ చంపుకుంటూ వెళ్ళి చివరికి అసలు వాళ్ళని హత్య చెయ్యటం జరుగుతుంది. జరిగి తీరుతుంది.
ఈ మర్డర్ తోనే ఈ కేసు ఆగదు. ఈ కేసుని నేను ఒక ఛాలెంజీగా తీసుకుంటాను. అసలు విషయం మర్చేపోయాను. మమ్మల్ని ప్రక్కత్రోవలకి పట్టించటానికి కాబోలు హంతకుడు ప్రతిచోటా "ది గిఫ్ట్" అని రాసివున్న అట్టముక్క దానిమీద ఆర్ట్ గా గీసివున్న గిఫ్ట్ బొమ్మకూడా వేసి వుంది.
కేసుని తప్పుదోవ పట్టించటానికి ఇవి వదిలిపెడుతున్నాడు ఆ అట్టముక్కని వర్ణిస్తున్నాడు మనోజ్.
మనోజ్ చెప్పుకుపోతూంటే ఛటర్జీ ఏవో జ్ఞాపకాలు రాసాగాయి. "గిఫ్ట్, గిఫ్ట్ తాలూకా అట్టముక్క అలా తయారుచేసేది ఎవరు?" ఆ ఎవరా అన్నది తెలుసుకోడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఆలోచిస్తున్నాడు ఛటర్జీ.
ఫోన్ "ట్రింగ్!" మని మ్రోగింది.
ఫోన్ దగ్గరికి నడిచాడు మనోజ్.
ఫోన్ చేసింది బబిత.
"మనోజ్ ఇక్కడ మరో హత్య జరిగిపోయింది. ది గిఫ్ట్ తాలూకా హంతకుడే ఈ హత్య కూడా చేశాడు. నువ్వు వున్నవాడివి వున్నట్లు వెంటనే వచ్చేసెయ్యి" అంటూ బబిత హత్య ఎక్కడ జరిగిందీ వివరాలు ఇచ్చింది.
"మావయ్యా! మళ్ళీ ఇంకో గిఫ్ట్ వచ్చి పడింది. బబిత ఫోన్ చేసింది అర్జంట్ గా వెడుతున్నాను. నాకోసం నువ్వు ఎదురు చూడవద్దు. పదకొండులోపలే భోజనం చెయ్యి, వీలైతే భోజనానికి వస్తాను లేకపోతే లేదు" అని చెబుతూ మనోజ్ హడావుడిగా డ్రస్ వేసుకుని వెళ్లిపోయాడు.
అంతరంగపు అట్టడుగు పొరల్లో ఏదో లీలగా గుర్తుకు వస్తూంటే విషయాన్ని బయటకి లాగడానికి చాలా లోతుగా ఆలోచిస్తున్నాడు ఛటర్జీ.
విసుగుతో తల బలంగా విదిలించాడు అయినా అతని ప్రయత్నం ఫలించలేదు.
22
ముందు పాండురంగం.
వెనుక కామాక్షి.
ఆ చీకటిలో అలా నడుస్తున్నారు.
పాండురంగం ఆగటంతో అతనికి కొంతదూరాన అనుసరించి వస్తున్న కామాక్షి, గోడవారంగా ఆగిపోయింది.
పాండురంగం చిన్న టీ బంకు వుంటే అక్కడ ఆగాడు. వేడి వేడిగా ఒక కప్పు టీ తాగాడు.
టీ బంకుకి కొద్దిగా ప్రక్కగా కొన్ని రిక్షాలు వున్నాయి. కొందరు రిక్షావాళ్ళు మేలుకుని బీడీలు తాగుతుంటే ఒకరిద్దరు అదే రిక్షాలో ఒదిగి చిన్న కునుకు తీస్తున్నారు.
టీ తాగిన తరువాత పాండురంగం, నిద్రపోతూవున్న ఒక రిక్షా అతన్ని లేపాడు. వాడు విసుక్కుంటూ లేచాడు. రిక్షా కావాలని కామోసు ప్రాధేయపూర్వకంగా అడుగుతున్నాడు పాండురంగం, వాడు తలకాయ అడ్డంగా తిప్పి మళ్ళీ ముడుచుకు పడుకున్నాడు.
పాండురంగం ఈ తఫా మరో రిక్షా వాడిని లేపాడు. వాడు కాసేపు మాట్లాడి పాండురంగానికి రిక్షా ఇచ్చి, టీ బంకు దగ్గర వున్న బల్లమీదకి వచ్చి పడుకున్నాడు.
పాండురంగం రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.