Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 29

    ఆమెను ఎంత హింస పెట్టాడో తను అంచనా వెయ్యగలడు. ఇప్పుడతడిని రెచ్చగొట్టడంవలన ప్రయోజనంలేదు. అతని మనసులో వున్నదేదో బయటికి కక్కేందుకు అవకాశం ఇవ్వాలి.
   
    ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు.
   
    అంతవరకూ కోపంతో ముడిపడిన కనుబొమలు విడిపడ్డాయి. కళ్ళల్లో కదిలిన ఎర్రజీరలు మాయమయ్యాయి. బిగుసుకున్న అతని ముఖకండరాలు మెత్తబడ్డాయి.
   
    చాలా ప్రశాంతంగా, నింపాదిగా కృష్ణను సమీపించాడు. అతని భుజంమీద చెయ్యివేసి వాత్సల్యం ఉట్టిపడే కంఠంతో అన్నాడు__
   
    "చూడు కృష్ణా! సుధకు జరిగిన అన్యాయం గురించి గానీ, నీకు జరిగిన మోసంగురించి గానీ నిజంగా నాకేమీ తెలియదు. మీ మామ-సారీ-అదే రమణమూర్తి నా బాల్యస్నేహితుదే కావచ్చు! కాని అతడు నీకు చేసిన మోసం, ఒకవేళ చేసివుంటే దానితో నాకెలాంటి సంబంధమూ లేదు. నామీద నీకు నిజంగా నమ్మకముంటే జరిగిందేమిటో వివరంగా చెప్పు. నాచేతనైన సహాయమేదో తప్పకుండా చేస్తాను. బిలీవ్ మి మైబాయ్!"
   
    చౌదరి కంఠంలో ధ్వనించిన నిజాయితీ కృష్ణను ఆకట్టుకొంది. అతనికి తన మనసు విప్పి చెప్పుకోవాలనే కోరిక బలపడింది.
   
    "నేను మద్రాస్ వెళ్ళినప్పుడు, జగన్మోహనరావు బట్టలషాపులో కన్పించి__"అంటూ ప్రారంభించాడు కృష్ణ.
   
                                               20
   
    "ఇదీ జరిగింది. ఇప్పుడు చెప్పండి. సుధ తండ్రి చేసింది మోసంకాదా?" అంటూ ఓక్షణమాగి నిట్టూర్పు విడిచి మళ్ళీ ప్రారంభించాడు కృష్ణ.
   
    "అతి దుర్మార్గంగా ప్రేమికులిద్దరినీ విడదీశాడు. గర్భవతిగా వున్న కూతుర్ని ఎక్కడో రహస్యంగ దాచాడు. ప్రసవించిన తర్వాత, అభం శుభం ఎరుగని పసిగుడ్డును ఆయాకు అప్పగించి, అనాధశరణాలయంపాలు చేశాడు. అంతటితో ఊరుకోక బిడ్డతల్లిఐన కూతురికి పెళ్ళిచేశాడు. అలా చేసి తన గౌరవ ప్రతిష్టల్ని కాపాడుకున్నాననుకున్నాడు. పోలీసువాని అహంకారం అతడి నరనరాన పట్టివుంది. దౌర్జన్యం అతని ప్రవృత్తిగా మారింది. పశువులా ప్రవర్తించాడు. అగ్నిగుండాన్ని సృష్టించాడు. నలుగురి జీవితాలు ఆ గుండంలో పడి బూడిద అవడానికి ఇంకెంతో వ్యవధిలేదు. మీరే చెప్పండి. ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?"
   
    ఆ వేగంతో ఊగిపోతూ అడిగాడు కృష్ణ.
   
    చలనరహితంగ సోఫాలో కూరుకుపోయిన డాక్టర్ చౌదరి బుర్ర పనిచెయ్యడం మానేసింది.
   
    గుడ్లు తేలవేసి కృష్ణకేసి చూస్తూండిపోయాడు.
   
    "అలా చూస్తారేం సార్? చెప్పండి! నన్నేం చెయ్యమంటారు?"
   
    "నువ్వేం చెయ్యాలనుకుంటున్నావ్?" పూడిపోయిన బావిలోని ఊటలా చౌదరి గొంతులోనుంచి మాటలు పెగల్చుకొని బయటకు వచ్చాయి.
   
    "పాప మోనోని తల్లిదగ్గిరకు చేర్చడం మనందరి కర్తవ్యంగా భావిస్తున్నాను."
   
    "అంటే?" తలవిదిలించుకున్నాడు చౌదరి. ఇంకా మైకం వదిలి నట్టు లేదు.
   
    "సుధ జగన్మోహన్ ను పెళ్ళిచేసుకోవాలి."
   
    ఉరమకుండానే నెత్తిన పిడుగుపడ్డట్టయింది డాక్టర్ చౌదరికి.
   
    మత్తొదిలిపోయింది.
   
    మెదడులో పాములా చుట్టుకొంటున్న సందేహం పూర్తిగా తొలగిపోయింది.
   
    సుధ చెప్పిందంతా నిజమే. సందేహంలేదు. కృష్ణకి పూర్తిగా మతిచలించింది. ఇది పిచ్చివాడి ప్రేలాపన కాకపోతే మరేమిటి? ఆలోచిస్తూ చౌదరి కృష్ణకేసి చూశాడు. మనసులోని భావాలు ముఖంలో కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు. పెదవులపైకి నవ్వును తెచ్చిపెట్టుకొంటూ.
   
    "మిస్టర్ కృష్ణా భర్త వుండగా రెండో పెళ్ళి చట్టవిరుద్దంకదా?" అన్నాడు.
   
    "డైవర్సు ఇవ్వడానికి నేను సిద్దంగా వున్నాను, సుధతోకూడా చెప్పాను. ఆవిడకూడా అంగీకరిస్తే విడాకుల తీసుకోవడం చాల సులభం ఔతుంది. ఏమంటారు?"
   
    చౌదరికి ఏం చెప్పాలో తోచక పైన తిరుగుతున్న ఫాన్ కేసి చూడసాగాడు.
   
    "మీ అభిప్రాయం ఏమిటో తేల్చిచెప్పండి. సుధతో నేను కాపురం చెయ్యడం అసంగతం, అసంభవం. మా భార్యాభర్తల నాటకానికి తెరదించే సమయమొచ్చింది." కృష్ణ దీర్ఘంగ నిట్టూర్చాడు.
   
    "సుధ ఎక్కడా?" హాల్లోనుంచి లేచి లోపలకు వెళుతూ అడిగాడు చౌదరి.
   
    "గుడికెళ్ళింది."
   
    "గుడికా?"
   
    "ఔను సార్! పక్కింటి బామ్మగారితో నా బలవంతంమీదే గుడికి వెళ్ళింది."
   
    "ఓ ఐసీ? నువ్వె పంపించావన్నమాట?" సాలోచనగా అన్నాడు చౌదరి.
   
    "అవును! సుధ ఇంట్లో వుంటే మీతో ఫ్రీగా మాట్లాడటానికి వీలువుండదని నేనే పంపించాను.
   
    చిఉదరి మస్తిష్కానికి పట్టిన మత్తు వదిలిపోయినట్టయింది.
   
    పిచ్చివాడైతే ఇంత తెలివిగా ప్రవర్తిస్తాడా? ఇన్ని తెలివితేటలున్న వాడు పిచ్చివాడెలా ఔతాడు? ఒకవేళ అతను చెప్పేది నిజమేనేమో!
   
    ఆలోచిస్తూంటే చౌదరికి మతిపోతున్నట్టుగా వుంది. ఏం మాట్లాడాలో తోచడంలేదు.
   
    "మీ అభిప్రాయం ఏమిటో చెప్పలేదు" హెచ్చరిస్తున్నట్టుగ అన్నాడు మురళీకృష్ణ.
   
    "ఇది చాలా జటిలమైన సమస్య. నిండుజీవితాలతో ముడిపడివుంది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం మంచిది."
   
    ఏమిటోగా మాట్లాడుతున్నాడు చౌదరి. తనేం మాట్లాడుతున్నాడో అతనికే అర్ధంకావడంలేదు.
   
    "నా నిర్ణయమేదో చెప్పాను. దానిమీద మీ అభిప్రాయం అడుగుతున్నాను" చౌదరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు కృష్ణ.
   
    చౌదరి గుడ్లు తేలవేసి చూశాడు.
   
    "మాట్లాడరేం? అంతకాడికి మీ పెద్దరికం ఎందుకూ? నా స్వంత వ్యవహారాల్లో తలదూర్చడం ఎందుకూ?" కృష్ణ కంఠం తీవ్రంగా వుంది.
   
    డాక్టర్ చౌదరి బిత్తరపోయాడు.
   
    మళ్ళీ పిచ్చివాడి ప్రేలాపన!
   
    ఏంమాట్లాడాలో, ఆ పరిస్థితిలోనుంచి ఎలా బయటపడాలో తోచకదిక్కులు చూడసాగాడు. చెయ్యి తిప్పి టైమ్ చూసుకున్నాడు.
   
    ఇంకా రాలేదే? ఫ్లయిట్ లేటేమో? సీటు దొరకలేదేమో? అసలు బయలుదేరాడో లేదో?
   
    కృష్ణకెదురుగా కూర్చోవడం మళ్ళీ కంచెమీద కూర్చున్నట్లుగా వుంది. మెల్లగా లేచి గుమ్మంలోనుంచి బయటకు చూశాడు.
   
    గేటుముందు టాక్సీ ఆగివుంది. అదిచూసి చౌదరి గుండెలనిండుగా గాలిపీల్చుకున్నాడు.
   
    "అదిగో వచ్చేశారు మీ మామగారు!"
   
    చౌదరి అంటూ గబగబా మెట్లు దిగి గేటుకేసి నడిచాడు.
   
    కృష్ణ కంగారుగ లేచాడు. చౌదరి వెనకే గేటుదాకా నడిచాడు. అతని ముఖం ఎర్రబడింది. అతని కళ్ళలో క్రోధం. ఆశ్చర్యం, నేను ముందంటే నేను ముందంటూ పోటీపడ్తున్నాయి.
   
    టాక్సీలోనుంచి రమణమూర్తి దిగాడు. అతని వెనకే ఓ పాతికేళ్ళ యువతి దిగింది.
   
    కృష్ణ ఆమెకేసి పరిశీలనగా చూశాడు-
   
    తను ఆమెనెక్కడో చూశాడు?
   
    ఎక్కడ?
   
    ఎప్పుడు?
   
    "వాటే ప్లజెంట్ సర్ ప్రైజ్? నువ్వుకూడా వస్తున్నావని మూర్తి చెప్పలేదే?"
   
    "అంకుల్ కు కూడా తెలియదు డాడీ!"
   
    డాడీ!
   
    మనసులో అనుకుంటూ కృష్ణ ఆ యువతినీ చౌదరినీ మార్చి మార్చి చూశాడు.
   
    ఎవరీమె? తనెక్కడ చూశాడు?
   
    అవును! ఆమే! ఎయిర్ హోస్టెస్ మిస్ విమలా చౌదరి__ఈమె డాక్టర్ చౌదరి కూతురా?
   
    "మిస్టర్ కృష్ణా! మీట్ మై డాటర్ విమల!"
   
    చౌదరి ఆమెను కృష్ణకి పరిచయం చేశాడు.
   
    విమానం దిగుతున్న వి.ఐ. పి. ముందు 'నమస్తే' అంటూ నిలబడే ఎయిర్ హోస్టెస్ భంగిమలో విమల మురళీకృష్ణను చూస్తూ నిలబడిపోయింది.

 Previous Page Next Page