"బాప్ రే! ఈ పిల్ల పిల్లకాడు బంగారు పిచ్చుక" అనుకున్న ఇందర్ ఓ పర్యాయం అవంతి ఒంటిమీద ఉన్న నగలను పరికించి చూసి మనస్సులో డబ్బురూపేణా ఎంత చేస్తుందో ఖరీదు కట్టాడు. లెక్క కుదరడం లేదు.
"ఏంటి ఆలోచిస్తున్నారు?" అవంతి అడిగింది.
"ఇంత బంగారం ఒంటి మీద వుండడం మంచిదికాదు. ఆనక నేను నీకు సింపుల్ గా చీరలు తెస్తాను. యీ పెళ్ళికూతురు చీరతో పాటు నగలన్నీ తీసేసి ఓ బ్రీప్ కేసులో దాయి."
"ఎందుకు?"
"అదుగో అలా అనుమానంగా చూడకు. నేను భరించలేను. ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. అన్ని నగలు శరీరం మీద ఉంటే చిరాకుగా లేదా?"
"చిరగ్గానే ఉంది."
"మరి వుంది కదా అందుకే చక్కని సలహా ఇచ్చాను. నేను మంచివాడిని కాబట్టి ఎదుటి వారి కష్టంకనిపెట్టి ఉచితంగా మంచి సలహాలు ఇస్తుంటాను. బ్రీఫ్ కేసు, బ్రీఫ్ కేసు తాళం చెవి నీకిస్తాను. నగలు దానిలో పెట్టి తాళం వేసి అది నీదగ్గరే వుంచుకో. నీ మంచి కోసం చెపుతున్నాను అంతే."
అవంతి చెక్కిట చేయి పెట్టుకొని ఆలోచనలో పడింది.
"నేను దొంగని, మోసగాడిని అయితే నిన్ను కొట్టి లాక్కుంటాగదా? అలా నేను చేయడంలేదంటే అర్ధం నేను దొంగని కానట్టేకదా!"
"అవును నువ్వు దొంగవి కావు. దొంగ చచ్చినాళ్ళ మొహం తుమ్మల్లో పొద్దుగూకి నట్లుంటుంది. మా బుచ్చికక్కి మాహ్త్రం మనుషులు తేనె బూసిన కత్తులు. తియ్యగా ఉందని నాలుకమీద పెట్టుకుంటే నాలుక తెగగోసినట్లు ప్రవర్తిస్తారు. మాయదారి చచ్చినోళ్ళు అంటుంది." అవంతి చెప్పింది విని ఇందర్ గతుక్కు మన్నాడు.
"సరే మీరు చీరెలతోపాటు పెట్టె కూడా తెండి. అన్నీ దానిలో పెట్టి తాళం వేస్తాను. మీరు గాజు తీసుకోనన్నారుగా! తర్వాత మా బుచ్చికక్కితో చెప్పి ఎంతడబ్బులు అయితే అంతా ఇచ్చేస్తాను."
అవంతి చెప్పగానే "ఆ....అలా చేద్దాం" అన్నాడు ఇందర్.
ఉన్నట్లుండి ఒక ప్రశ్న వేసింది అవంతి. "మీరు ఏం చేస్తుంటారు అని....
"ఏదో చిన్న జాబ్. అంత చెప్పుకో దగ్గది కాదు" ఇందర్ నసుగుతూ చెప్పాడు.
"మా బుచ్చికక్కి అయితే ఏమంటుందో తెలుసునాండీ?"
"ఏమంటుందేమిటి?"
"ఉద్యోగం పురుషలక్షణం అంటుంది."
"నీకన్నా నీ బుచ్చికక్కి నయం. ఆ మహా ఇల్లాలుని ఓసారి కళ్ళారా చూస్తే బాగుండును" అనుకున్నాడు ఇందర్.
"మా బుచ్చికక్కిని మీరు చూడలేదు గానీండి భలే తమాషాగా మాట్లాడుతుంది. దొంగ కూడా ఓ విధంగా గొప్పవాడు అంటుంది."
"ఏం మాట్లాడను! ఎబ్బే ఏం లేందే! ఆ....ఇందాక ఏమిటి అన్నది. దొంగ కూడా గొప్పవాడనా! ఎలా?"
"నాకేం తెలుసు?"
"అదేంటి ఇప్పుడేగా దొంగ కూడా ఓ విధంగాగొప్పవాడు అని చెప్పలేదూ?"
"అది నేను కాదు చెప్పింది. మా బుచ్చికక్కి."
"ఆ....అదే....మీ బుచ్చికక్కి చెప్పింది నువ్వు చెప్పావుగా అదన్న మాట, దొంగ ఎలా మంచివాడో మీ బుచ్చికక్కి ఎప్పుడైనా చెప్పిందా?"
"ఓ...."
"ఏమని?"
"మంచివాడు దొంగ అని చెప్పలేదు, గొప్పవాడు దొంగ అని చెప్పింది. దొంగతనం చేసి పట్టుబడితే వాడు నిజంగా దొంగ వెధవని. పట్టుపడని దొంగ మాత్రం గొప్పవాడుట. ఉద్యోగం పురుషలక్షణం ఎలాగో దొంగ వృత్తి చేసే దొంగకి దొంగతనాలు లక్షణమట. ఏ వృత్తిలో పైకి వచ్చినా వాడు నిజంగా గొప్పవాడేట."
"అహో! బుచ్చికక్కీశ్వరీ! నీ దివ్య దర్శనం చేసుకోని నా జన్మ ఎందుకు?" అనుకుంటూ ఇందర్ కళ్ళు మూసుకున్నాడు.
అవంతి సృష్టించిన బుచ్చికక్కి రూపం ఇందర్ కళ్ళకి విశ్వరూపంగా గోచరించింది.
"ఎందుకు కళ్ళు మూసుకున్నారు?" అవంతి అడిగింది.
"దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను"
"ఎందుకు?"
"మంచివాళ్ళని చల్లగా చూడమని"
"ఓహ్...." ఏదో అర్ధమైనట్లు అంది అవంతి.
ఇందర్ అప్పటికప్పుడే ప్లాను వేస్తూ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ వుండిపోయాడు.
"మీరు ఏమి ఉద్యోగం చేస్తున్నారో చెప్పలేదు" అవంతి అడిగింది మళ్ళీ.
"చిన్న కంపెనీలో బుల్లి జాబ్. వాళ్ళ కంపెనీ సరుకులు అన్ని వూళ్ళలో వెయ్యటానికి నన్ను నెలకి పదిహేను రోజులు ఊళ్ళు తిప్పుతుంటారు. అలా తిరిగినందుకు వేరే బేటా ఇస్తారు. ఏమిస్తే ఏమి లాభం. మొత్తం వెయ్యి రూపాయలు కూడా రావు" చంద్రతో అబద్ధం చెప్పినట్లే ఇందర్ ఇప్పుడు అవంతితో కూడా అబద్ధం చెప్పాడు.