"అయిదు నిమిషాలు ఆగు.... "డ్రెస్ అవుతూ అన్నాడు భాస్వంత్.
"దేనికి?" అసహ్యంగా అడిగింది అతడు ఆగమంటున్నది దేనికో తెలిసినా.
"నీకు తెలుసు."
"నాకు ఒంట్లో బాగోలేదు."
"నీకు బాగున్నదెప్పుడు....?" ఎగతాళిగా అన్నాడు. తాగిన మైకం అతడిచేత అలా చేయించిందో లేక తనేం చేసినా పడుండే ప్రాణిగా నిషాలో మరింత స్పష్టంగా బోధపడిందో, నగ్నంగా మారిన అతను ఆమెమీదికి జరిగాడు.
"చెబుతుంటే మీక్కాదూ?"
నెట్టింది బలంగా.
"ఆర్తీ...." అరిచాడు. బెడ్ మీదనుంచి పరిగెత్తబోతూంటే ఆమె నైటీని బలంగా పట్టుకున్నాడు.
చిరిగిపోయింది.
దుఃఖం ముంచుకొస్తుంటే "ఎందుకు నన్నిలా హింసిస్తున్నారు?"అంది చేతులతో గుండెల్ని కప్పుకుని.
"పిచ్చిపిచ్చిగా మాట్లాడక బెడ్ మీదికి రా."
"నాకిష్టం లేదని చెప్పానుగా!"
"నీ ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు" బెడ్ మీద కూర్చుని బరువుగా వాలిపోతున్న కనురెప్పల్ని తెరుస్తూ అన్నాడు "సో... మర్యాదగా రా...."
"రాకపోతే?"
పైకి లేచాడు "రేప్ చేస్తాను."
"రోజూ మీరు చేసేది అదేగా!"
"నీకు నేను తాళికట్టాను."
"కాదు... " రోజులు తరబడి పేరుకున్న దుఃఖానికి ఒక్కమారుగా గండిపడినట్టయింది. "తాళి పేరిట నా మెడకి ఓ పలుపుతాడు కట్టారు. దాన్ని గుదిబండగా భావిస్తూ నేను కదలలేక మెదలలేక మీ ముందు కదుల్తుంటే మీ కోరిక తీర్చుకోటానికి ఓ లైసెన్స్ వున్నంత సంబంరంగా ప్రతిరాత్రీ నన్ను అనుభవించి మీ మగతనాన్ని నిరూపించుకుంటున్నారు."
నవ్వాడు గర్వంగా. బహుశా అది మందు ప్రబావం కావచ్చు... అదీ కాకపోతే తన మగవాడ్నన్న ధీమా కావచ్చు. ప్రశాంతంగా అన్నాడు "భర్తగా నేను నీకేం తక్కువ చేశాను?"
"భర్తంటే తిండి పెట్టడం ఒక్కటే కాదు.. భార్యకి చేయాల్సింది చాలా వుంది. అసలు మీరు నన్నెప్పుడయినా ఓ మనిషిగా భావించారా? అదిలించి - బెదిరించి నన్ను లొంగదీసుకోవడం తప్ప నాకూ ఓ మనసు వుందని, ఆ మనసుకి ఆలోచించే అలవాటుందని ఎప్పుడయినా అనుకున్నారా? ప్రేమగా దగ్గరకు తీసుకోవటంగానీ, ఆప్యాయతగా మాట్లాడ్డంగానీ, ఒక చిన్న కన్ సర్న్ ని ప్రదర్శించి మానసికంగా నన్ను వూరడించాలనిగానీ ఎప్పుడయినా ఆలోచించారా? ఇంత చదువుకున్నారే... ఇంతమంది స్నేహితులు మీకున్నారే... మీకు తెలీకపోతే మిగతా వాళ్లనయినా చూసి ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు?"
"ఏమిటి లెక్చరిస్తున్నావ్?" గభాల్న ఆమె జుట్టు పట్టుకున్నాడు. "నేను నిన్ను బుజ్జగించి, వూరడించి దగ్గరకు తీసుకోవాలా? అంటే బోడి నీకోసం నేను అంత టైం స్పేర్ చేయాలా? యూ బిచ్... పైగా నేను అందర్నీ చుసి నేర్చుకోవాలా?"
పెళ్లయ్యాక భాస్వంత్ ఇంతగా రెచ్చిపోవడం తొలిసారి.
ఆమె బాధతో మూలుగుతుంటే ఆవేశంగా బెడ్ మీదకి నెట్టాడు.
గభాలున పక్కకు జరిగి పట్టు సడలించుకోబోతే చాచి చెంపమీద కొట్టాడు.
కెవ్వుమంది ఆర్తి.
కళ్లు బైర్లు కమ్మినట్టయింది.
శరీరంలో సత్తువ సన్నగిల్లిపోతున్నా శక్తిని కూడగట్టుకోబోయింది. కాని ప్రయోజనం లేకపోయింది.
ఆమెకు తెలుస్తూనే వుంది.
అతడు దాహంతో కలియబడుతున్నాడు. కాదు.. శాడిస్ట్ లా ఒంటిని నలిపేస్తున్నాడు. కత్తులతో చీరుతున్నట్టు అంతటా కొరికేస్తున్నాడు.
అది సెక్స్ కాదు.. మానభంగమూ కాదు... .శవంతో సంభోగంలాంటి కిరాతకం.
సుఖం లేదు, స్పందనలేదు రాక్షసంగా ఆమెలోకి చొచ్చుకుపోతూ ఆమెను ఓడించటమే ధ్యేయమన్నంత కసితో తన బలాన్ని నిరూపించుకుంటూ అయిదు నిమిషాసు కదిలి కదిలి అలసటగా మీద ఒరిగిపోయాడు.
ఆ తర్వాత అతడు పైకి లేవటం గుర్తుంది.
పక్కన పని పూర్తయినట్టు నిద్రలోకి జారిపోవడమూ జ్ఞప్తికుంది.
కానీ ఆమెకు అర్దంకానిది ఒక్కటే...
తనేమిటీ అన్నది.
మగాడనేకానీ బావ ఆకలికి ఆహుతి కావడమే నీ జీవిత లక్ష్యం అంటూ తాళి కట్టించుకున్న ఆడదానికి అర్దం చెప్పిన సాంప్రదాయమూ... నీకు జోహార్లు.
* * * *
ఉదయం పదిగంటలు కావస్తూంది.
భాస్వంత్ అప్పటికే ఆఫీసుకి వెళ్లిపోయాడు. అయినా బెడ్ మీద నుంచి లేవలేదు ఆర్తి.
ఒళ్ళంతా నొప్పులతో పచ్చిపుండులా వుంది.
అది ఉక్రోషమో, కసో ఆమెకే తెలీదు. ఉదయం భాస్వంత్ కి బ్రేక్ ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయలేదు.
గొడవ చేస్తాడనుకుంది కాని నిశ్సబ్దంగా వెళ్లిపోయాడు ఆ రోజుకి క్షమించేసినట్టుగా.
బడలికగా పైకి లేస్తుంటే ఫోన్ రింగయింది.
ఆయనేనా?
భాస్వంత్ కి ఆఫీస్ నుంచి ఫోన్ చేసే అలవాటు లేదు. కానీ కనీసం రాత్రి జరిగిందానికి క్షమార్పణలు చెప్పుకుంటాడేమో అన్నంత ఆశగా రిసీవరు అందుకుంది.