Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 28

"అబ్బే... నేను చెప్తే లాభం లేదనుకుంటా...!" పెదాలు చప్పరిస్తూ అన్నాడు డంబాల డింబారావు.        
    "అదేంటి... నీకు చుట్టం అని అంటున్నావు! కల్సి చదువుకున్నాం అని అంటున్నావు... నువ్వు చెప్తే ఎందుకు చెయ్యడు?" ఆశ్చర్యంగా అడిగాడు రామలింగం.
    "అదో కథలే..." నిట్టూర్చాడు డింబారావు. "మేమిద్దరం అయిదో క్లాసు చదివేప్పుడు ఒకే బెంచిమీద పక్కపక్కన కూర్చునే వాళ్లం... ఓరోజు నేను కంపాస్ బాక్స్ లో రేగిపళ్లు వేస్కుని స్కూలుకి వెళ్లా. నేను పాఠం శ్రద్ధగా వింటున్న సమయంలో వాడు నా కంపాస్ బాక్స్ లోని రేగిపళ్లు దొంగతనంగా తీస్కుని తినెయ్యసాగాడు. నేను క్లాసు మధ్యలో చూడనే చూశా... క్లాసు అయ్యాక వాడి నడ్డిపూసలు కదిలేలా తన్నాను... అంతే ఆరోజునుండి వాడు నా జట్టు కటీఫ్ చేసేసి నాతో మాట్లాడ్డం మానేశాడు. నేనూ మాట్లాడ్డం మానేశాను... ఆరోజు నుండీ ఈ రోజు దాకా మా మధ్య మాటలు లేవు..." చెప్పడం పూర్తి చేసి కులాసాగా నవ్వాడు డింబారావు.
    రామలింగం నెత్తి ఫటఫటా కొట్టుకున్నాడు.
   డంబాల డింబారావు ఇంకో అరగంట సేపు తనకు ఏ ఏ ప్రముఖ వ్యక్తులు ఫ్రండ్సో, ఇన్ ప్లుయెన్స్ ఉన్నవారు ఎవరెవరు తనకి చుట్టాలో చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు.
    రామలింగం బుర్రవాచిపోయింది.
    ఒక వారం గడిచిపోయింది.
    రామలింగం యింటికి మద్రాసు నుండి ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు కుయ్యారావు వచ్చాడు. కుయ్యారావు రామలింగానికి దూరపు బంధువు అవుతాడు. హైదరాబాద్ లో ఆ మర్నాడు అతని కాన్సర్ట్ ఉంది. హోటల్లో దిగడం ఎందుకులే  అని రామలింగం ఇంట్లో దిగాడు.
    రామలింగానికి హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది.
    ఇన్నాళ్లూ డింబారావు తనకి ప్రముఖులు వాళ్లూ వీళ్లూ తెలుసని చెప్తుంటే నోరు వెళ్ళబెట్టుకుని విన్నాడు. తనకీ ఓ ప్రముఖ వ్యక్తి తెల్సు... 'డింబారావుకి కుయ్యారావు గురించి గొప్పగా చెప్పాలి!' అనుకున్నాడు.
    ఇన్నాళ్ళూ కుయ్యారావు గురించి గుర్తు రానందుకు తనని తాను తిట్టుకున్నాడు.
    వరండాలో కూర్చుని కుయ్యారావూ, రామలింగం మాట్లాడ్తుండగా డంబాల డింబారావు వచ్చాడు.
    డింబారావు కూర్చోగానే రామలింగం కుయ్యారావుని డింబారావుకి పరిచయం చేయాలనే ఉత్సాహంతో "నీకు ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు కుయ్యారావు తెల్సుకదా?" అని అడిగాడు.
    రామలింగం ఖంగుతినేలా డింబారావు వాగడం మొదలు బెట్టాడు.
    "వాడా?... వాడు తెలీకపోడం ఏంటి? వాడు కూడా నాకు క్లాస్ మేట... సుద్దమొద్దు... వాడికి అన్నింట్లో జోరో మార్కులే ... ఓసారి భలే గమ్మత్తయిందిలే... క్లాసులోనే నిక్కర్లో ... హిహిహి... అయిపోయింది. వాడికి" ఒక చేత్తో ముక్కు మూస్కుని రెండోచేయి పైకెత్తి రెండువేళ్ళు చూపించాడు.
    కుయ్యారావు కూడా ముక్కు మూస్కుని కళ్లు చిట్లించి డంబాల డింబారావు వంక చూశాడు.
    "ఇప్పడతన్ని చూస్తే గుర్తుపడ్తావా?" అడిగాడు రామలింగం.
    భలేవాడివే ... చిన్నప్పటినుండి ఇప్పటిదాకా మా స్నేహం కొనసాగుతూనే ఉంది. అసలు వాడికి సంగీతం నేర్చుకోమని సలహా ఇచ్చింది నేనే... వాడికి అంత మంచిసలహా ఇచ్చి వాడి ఉన్నతికి కారకుడినైన నేనంటే చచ్చేంత అభిమానం... మొన్నీ మధ్య పనిమీద మద్రాసెళ్లి వాళ్లింట్లోనే దిగాను..." అని చెప్పి కుయ్యారావు వంక చూస్తూ" ఈయనెవరూ?... మీ బంధువులా?... ఇందాకట్నుండీ నాకు పరిచయమే చెయ్యలేదు?" అన్నాడు డంబాల డింబారావు.
    "ఎక్కడ... నేను పరిచయం చేద్దామని అనుకునేంతలో అడ్డు తగిలి నువ్వే ఎడాపెడా మాట్లాడేయసాగావే...ఈయనే ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు కుయ్యారావు... మాకు బంధువు అవుతాడు" చెప్పాడు రామలింగం.
    డంబాల డింబారావు ఢమాల్ మని కిందపడిపోయాడు. ఆరోజు నుండి డింబారావు రామలింగం యింటికి రావడం మానేశాడు.
                             *    *    *
                       అల్లుడుగార్కి దీపావళి బహుమతి
      
   "పోస్ట్...!" గుమ్మంలోంచి అరిచాడు పోస్టుమెన్.
    ఆనందరావు పోస్టుమెన్ చేతిలోంచి కవరందుకుని చింపి ఉత్తరం చదివాడు.
           ప్రియమైన అల్లుడుగారికి,
           ఇచ్చట అంతా క్షేమం. అచ్చట మీరంతా క్షేమమని తలుస్తాను.వచ్చేవారం దీపావళి పండుగ వస్తుందని     మీకు తెలుసు. మీ పెళ్ళయిన తరువాత ఇదే మొదటి దీపావళి పండుగ కాబట్టి మీరు,అమ్మాయి మా ఇంటికి రావలసిందిగా కోరుతున్నాం. మీకు పెళ్ళయిన తరువాత మొదటి సంక్రాంతి పండక్కి వచ్చారు. మొదటి ఉగాది పండక్కి వచ్చారు.మొదటి దసరా పండక్కి వచ్చారు... అలాగే మొదటి దీపావళి పండక్కి ఎలాగూ వస్తారని తెల్సి మీరు రాకముందే మేమే రమ్మని రాస్తే కనీసం మేము రమ్మంటేనే మీరు వచ్చారనే ఆత్మతృప్తయినా మీకు మిగుల్తుందని ఇలా ఆహ్వానిస్తూ రాస్తున్నాం. మీకేమైనా అర్జంటు పనులుంటే రాకపోయినా మరేం ఫర్వాలేదు. మేము ఏమీ అనుకోము. ఆ మాత్రం మీ బాధని అర్థం చేసుకోపోతే ఎలా? అమ్మాయిని అడిగామని చెప్పండి. ఇక్కడి అందరూ మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నారు.
   
                                                                             ఉంటాను బాబు
                                                                                                                 ఇట్లు
                                                                                                        అశ్రునయనాలతో
                                                                                                        మీ బీద మాంగారు
    ఉత్తరం చదివిన ఆనందరావు ఆనందంతో కెవ్వుమని అరిచాడు. అతని భార్య సరస్వతి కూడా సంతోషంతో కెవ్వుమని అరిచింది.
    "నేనైతే కొత్తల్లుడిని కాబట్టి పండుగ బహుమతిగా నాకేమైనా ఇస్తారని కెవ్వుమని అరిచాను.. నువ్వెందుకు అలా అరిచావ్?" ఆనందరావు సరస్వతిని అడిగాడు.
    "మరి పుట్టింటికి వెళ్తున్నానంటే నాకానందంగా ఉండదూ... అందుకే నేనట్టా అరిచా..."
    "కెవ్వు..." పోస్టుమెన్ గూబపగిలేలా ఇంకా గట్టిగా అరిచాడు.
    ఆనందరావు, సరస్వతి ఉలిక్కిపడి కిందపడ్డారు.
    "నువ్వెందుకంత చేటున అరిచావ్?... మా ఆనందమే నీకానందమా!..." కిందనుండి లేచి బట్టలకంటిన దుమ్ము దులుపుకుంటూ చిర్నవ్వుతో పోస్టుమెన్ ని అడిగాడు ఆనందరావు.
    "మీ అనందం నాకానందం ఎందుకౌతుందది?... మాంగారి ఇంటినుండి మీరు దోచుకొచ్చేదాంట్లో నాకేమైనా వాటా ఇస్తున్నారా ఏమైనానా?..." మొహం చిట్లిస్తూ అన్నాడు పోస్టుమెన్.
    "మరెందుకట్టా మమ్మల్ని కిందపడేశావ్. ఆ?"
    పోస్టుమెన్ తలొంచుకుని సిగ్గుపడ్డాడు.
    "మరేమో నేను మీకంటె కొత్తల్లుడిని!... నా పెళ్ళి పోయిన వారంలోనే అయ్యింది. మీకు ఇది మొట్టమొదటి దీపావళి పండగైతే నాకు ఇదే మొదటి పండగ... అంచేత నాకు మా మాంగారు మీ కంటె మాంచి బహుమతులు ముట్టజెప్తారు!... కెవ్వ్ వ్వ్..." మరోసారి సంతోషంతో కేకేసి వెళ్ళిపోయాడు పోస్టుమెన్.
    ఆ కేకకి మరోసారి ఉలిక్కిపడి దబ్బున కిందపడ్డాడు ఆనందరావు.
    "చూశారా?... వాడి సంతోషం గమనించే నేనిందాక పడినప్పట్నుండీ లేవకుండా ఇలానే కింద కూర్చున్నా మళ్ళీ పడాల్సి వస్తుందని... మీలాంటి తెలివితక్కువ వాళ్ళకిచ్చిమా అమ్మానాన్నలు నా గొంతు కోశారు..." కళ్ళు తుడుచుకుంది సరస్వతి.
    దీపావళికి రెండ్రోజుల ముందు భార్యని తీసుకుని మాంగారు పరబ్రహ్మం ఇంటికి బయలుదేరాడు ఆనందరావు.

 Previous Page Next Page