శ్రీధర్ స్నానం చేశాడు.
మామగారితో కలిసి భోజనం చేశాడు.
ఇద్దరూ లాన్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఇంతలో ఇంపాలా కారు వచ్చి గేటు ముందు ఆగింది.
అమూల్య దిగింది. కారునిండా ఆడా మగా వున్నారు. హాయ్, ఛీరియో, బై మొదలైన మాటలు విన్పిస్తున్నాయి.
శేఖర్ కారు దిగాడు.
అమూల్య చేతిలో చెయ్యి కలుపుతూ బై అన్నాడు.
"బై" అంటూ గేటు తెరుచుకొని లోపలకు వస్తూ ఓ క్షణం తటపటాయించింది.
కృష్ణారావు కూతుర్ని చూస్తున్నాడు.
శ్రీధర్ భార్యను చూస్తున్నాడు.
అమూల్య ఇద్దర్నీ మార్చిమార్చి చూసింది.
"హలో సారీ! ఆలస్యమయింది. ఎంతసేపయింది వచ్చి" అన్నది శ్రీధర్ తో దగ్గిరగా వస్తూ.
"ఎనిమిదిగంటలకు వచ్చాను" నవ్వుతూ అన్నాడు శ్రీధర్.
కృష్ణారావు ఆవలిస్తూ లేచాడు.
శ్రీధర్ కూడా లేచాడు.
* * *
అమూల్య అత్తవారింటికి వచ్చింది. వాళ్ళతో ఎంత కలిసిపోవాలన్నా కలవలేకపోతున్నది. వంటరిగా గదిలో కూర్చుని బాధపడుతూ వుంటుంది. నెలరోజులు ఎలాగో గడిచింది. ఆమెలో అసహనం ఎక్కువైంది.
మామగారు ఇంట్లో వున్నప్పుడు మాత్రం అమూల్య జాగ్రత్తగా వుంటుంది. అమూల్య తనకు తెలియకుండానే మామగారంటే గౌరవం ఏర్పడింది. కారణం ఆయన ప్రతి విషయంలో అమూల్యను సమర్థించడమే.
పగలు జరిగిన చిన్నచిన్న గొడవలు శ్రీధర్ వరకూ వెళ్ళడం లేదు. శ్రీధర్ ఉదయం తొమ్మిది గంటలకు బస్ లో వెళ్ళిపోతాడు. రాత్రి వచ్చేసరికి ఎనిమిది అవుతుంది. ఆ ఇల్లూ ఆ వాతావరణం అమూల్యకు ఇరుగ్గా అనిపిస్తోంది. ఊపిరి సలపనట్టు మధనపడుతుంది.
అమూల్య కాపరానికి వచ్చేసరికి బాత్ రూంలో నాపరాళ్లు వేయించారు. చుట్టూ గోడలు పెట్టించారు. ఇళ్ళు బాగు చేయించారు. డైనింగ్ టేబుల్ కూడా సమకూర్చారు. శ్రీధర్ ప్రావిడెంటు ఫండులో నుంచి పార్ట్ ఫేనల్ విత్ డ్రా చేశాడు. ఇన్సూరెన్సు నుంచి అప్పు తీసుకున్నాడు.
ఆడపిల్లలు పెళ్ళికి ఎదిగివుంటే డబ్బు ఇల్లు బాగుచేయించడానికి ఖర్చు చేస్తుంటే లబోదిబోమంటూ తల్లి మొత్తుకుంది.
"ఏయ్ కమలా."
"అదేమిటే బంగారమ్మా నీకోడలు ఆడబిడ్డల్ని అలా పేరుపెట్టి పిలుస్తుంది?" బుగ్గలు నొక్కుకుంది పక్కింటి శాంతమ్మ.
ఏం పిల్లా! నువ్వు ఎంత పట్నం పిల్లవైనా ఆడబిడ్డల్ని అలా పిలవకూడదు. ఆడబిడ్డ అంటే అర్థమొగుడు తెలుసా?" తన గదిలోనుంచి కమల్ని పిలుస్తూ బయటకు వచ్చిన అమూల్యతో అన్నది శాంతమ్మ.
అమూల్య చీదరింపుగా శాంతమ్మకేసి చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది.
"చూడమ్మా. ఎవరైనా ఉన్నప్పుడు కమలా, విమలా అంటూ కేకలు పెట్టకు" అన్నది బంగారమ్మ.
"మరి ఏమని పిలవాలి? వాళ్ళ పేర్లు అవేగా?"
"ఆడబిడ్డను పేరుతో పిలవడం మన సంప్రదాయం కాదు."
"ఇదుగో అత్తయ్య ఇలాంటి పాత చింతకాయపచ్చడి కబుర్లు నాకు చెప్పకండి. మా పట్నం సంప్రదాయం మొగుణ్ని కూడా పేరు పెట్టి పిలవడమే. నేనూ మీ అబ్బాయిని శ్రీధర్ అనే పిలుస్తాను. పాపం మీరు వినలేదేమో!" అన్నది అమూల్య.
బంగారమ్మ తెల్లబోయి చూసింది కోడలి ముఖంలోకి. బంగారమ్మకు కోడలికి ఎన్నో నేర్పించాలని ఉన్నది. గిరజాల జుట్టు పెంచుకోమని చెప్పాలని ఉన్నది. ఇంట్లో వున్నంతసేపు ఆ గోసాయి గౌను మానేసి లక్షణంగా చీర కట్టుకోమని చెప్పాలని ఉన్నది.
కాని అందులో ఏ ఒక్కటీ చెప్పే ధైర్యం లేదు.
శ్రీధర్ కు తప్ప అమూల్య ముందు ఆ ఇంట్లో అందరికీ ఆత్మన్యూనతా భావం ఏర్పడింది.
ప్రతి ఆదివారం ఇద్దరూ గుంటూరు వెళ్తారు. ఉదయం వెళ్ళి రాత్రి పొద్దుపోయిగాని రారు. కనీసం అమూల్యకు ఆమాత్రపు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడం తన బాధ్యతగా భావిస్తున్నాడు శ్రీధర్. ఇందుకు తండ్రి ప్రోత్సాహం కూడా ఉన్నది.
కమలా, విమలా అన్నతో మొదటి చనువుతో మాట్లాడలేకపోతున్నారు. లోలోపల అసూయతో దహించుకు పోతున్నారు. బంగారమ్మలో కూడా సహనం నశించింది. కొడుకు కోడలి కొంగు పట్టుకుని తిరుగుతున్నాడనే భావం ఆమెలో చోటుచేసుకుంది.
ఆరోజు దేనికోసమో హడావిడిగా వెతుకుతున్నది అమూల్య.
"ఇంకా స్నానం చెయ్యలేదా?" శ్రీధర్ స్నానం చేసి బట్టలు వేసుకుని బయటకి వచ్చి భార్యతో అన్నాడు.
"ఏమిటి వదినా వెతుకుతున్నావ్" విమల అడిగింది.
"నా సోప్ బాక్స్ కన్పించడం లేదు" విసుగ్గా అన్నది అమూల్య.
"బాత్ రూంలోనే వుంది."
"బాత్ రూంలోనా" అక్కడెవరు పెట్టారు.
"నేనే తీశాను వదినా"
"ఎందుకూ?"
"స్నానం చెయ్యడానికి ఇంట్లో సబ్బు అయిపోయింది. అందుకే వదినా అదేం సబ్బూ చాలా బాగుంది. ఎంత మంచి వాసనో."
అమూల్య తెల్లబోయి చూసింది.
"అలా చూస్తావేం వదినా? నీ సబ్బంతా అరగదీశాననుకుంటున్నావా."