Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 29

ఆమె అరచేతులు చల్లబడ్డాయి. ఛ! తను అనవసరంగా భయపడుతోంది. అతను తెలివిద్వారా తన ఆలోచనల్ని తెలుసుకోగలడు.ఆరోజు తను సమాధుల దగ్గరకు వెళుతున్నట్టు తెలిసి అక్కడకి వచ్చాడు. అలాంటిచోట కలుసుకోవడంలో అపాయం లేదు. అందుకే అక్కడకు వచ్చాడు. తను వెళితే రేపు కూడా అతను వస్తాడు.డ్యాన్సు పూర్తయింది.
ఒక్కొక్కరూ వెళ్ళిపోతున్నారు. బ్లన్ట్ అక్కడే వున్నాడు. అప్పుడే మిస్టర్ బర్నెస్ లోపలకు వచ్చాడు. సీత చిన్నపిల్లలా అతని దగ్గరకు పరుగులాంటి నడకతో చేరింది. అతను ఆమెను చూసి ఆప్యాయంగా నవ్వాడు.
"మిస్టర్ బర్నెస్! రేపు నన్ను సమాధులు చూడటానికి పంపించగలరా!" అతను ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. మూడు మాత్రమే చూశాను. ఉదయం పూట గుర్రపుస్వారీ అంటే నాకు చాలా ఇష్టం. పైగా ఇంకా కొన్ని సమాధులు చూడాలి."
"మూడే చూశావా? అయితే మరో నాలుగు చూడాలి. నిన్న ఉదయంలాగే రేపు గుర్రాలనూ, రక్షకభటుల్నీ పంపిస్తాను. అంత పొద్దుంటే లేవగలవా? ఇవాళ చాలా పొద్దుపోయింది గదా?"
"ఫర్వాలేదు లేస్తాను."
"సరే! బ్యాండు వాళ్ళకు "గాడ్ సేవ్ ద కీన్" అనేపాట వాయించమనాలి. అంతటితో ఈ పార్టీ పూర్తవుతుంది" అంటూ ఆ బ్యాండు వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు బర్నెస్... బ్యాండు వాద్యం ప్రారంభం అయింది. అందరూ లేచి నిల్చున్నారు. సీతకు సంగీతం నచ్చింది. తమ రాణిని తల్చుకుంటూ నిల్చుంది. ఆ రాత్రంతా సీత కలతనిద్రలోనే గడిపింది. ఎంత మర్చిపోవాలన్నా బ్లంట్ ప్రవర్తన మర్చిపోలేకపోతున్నది...మరో భయం కూడా వుండి వుండి ఆమె మనసులో తలెత్తుతున్నది.
ఆ చచ్చిపోయిన వాళ్ళలో తన ఫ్రెండు కూడా వున్నాడా? అనే సందేహం! మళ్ళీ అంతలోనే "లేడు!లేడు!వుండడు" అని తనకుతానే సమాధానం చెప్పుకొంటూ భయపడుతున్న మనసును జోకొట్టి నిద్ర పుచ్చడానికి ప్రయత్నిస్తోంది. అతను జీవించే వున్నాడు. అతను చచ్చిపోతే తనకు తెలుస్తుంది. తమ ఇద్దరిమధ్యా సిక్తు సెన్స్ పనిచేస్తున్నది. అతను చచ్చిపోలేదు. అందువల్లనే తను డ్యాన్సు చెయ్యగలిగింది. అతను బతికే వున్నాడు. అందుకే తన మనసు ఉల్లాసంగా వుంది. వాకిలికి వున్న కర్టెన్ కదిలింది. ఏదో నీడలా కన్పించింది. సీత తృళ్ళిపడి లేచి మంచంమీద కూర్చుంది. భయంభయంగా వాకిలికేసి చూసింది. అతను వచ్చాడా? అతను ఎలా వస్తాడు? తలుపు వేసి ఉందిగా? అంతా తన భ్రమ. ఫ్యాన్ గాలికి పల్చగా వున్న డోర్ కర్టెన్ కదులుతున్నది.
తన భయానికి ముసిముసిగా నవ్వుకొన్నది. మంచంమీద పడుకొని కళ్ళు మూసుకొన్నది. పేరు తెలియని స్నేహితుడ్ని గురించి ఆలోచించసాగింది. అతను తన మీద నమ్మకం పెట్టుకోమన్నాడు. ఆ నమ్మకంతోనే అతను తనకి అండగా నిలుస్తాడని ఆశిస్తున్నది. అతను తప్పకవస్తాడు. తన సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. అతను రేపు ఉదయం టూంబ్స్ లో కన్పిస్తాడు. అంతలోనే ఏదో ఆలోచన మెదడులో పురుగులా పాకింది. అతను సమాధుల్లో ఏం చేస్తుంటాడు? అక్కడే ఎందుకు కన్పిస్తాడు? ఇక్కడెక్కడైనా కన్పించవచ్చుగా? అతను నిజంగా మనిషేనా? ఆ సమాధుల్లో శాశ్వితంగా నిద్రపోతున్న ఎవరో ఒకని ఆత్మ కాదుకదా? ఆత్మల గురించి ఎన్నో కథలు విన్నది. ఎన్నో చదివింది. కొందరు మానవాకారంలో కన్పిస్తారని కూడా విన్నది. తను కొందరు రికార్డు చేసిన అనుభవాల గురించి కూడా చదివింది.
సీతకు వెన్నెముకలో చలి కుదుపుగా వచ్చినట్టుగా అనిపించింది. అంతలో కిటికీలకు వున్న కర్టెన్స్ కదిలినట్టు అయ్యాయి. అంతలో ఏదో దూకినట్టు అయి తృళ్ళిపడింది సీత. అరవాలనుకొంది, అరిచాననే అనుకొంది. కాని ఆమె కంఠం నుంచి శబ్దం బయటపడలేదు. భయం భయంగా కిటికీకేసి చూసింది. నల్లని పిల్లి, గుడ్డి వెలుగులో దాని కళ్ళు మెరుస్తున్నాయ్. ఆమె గట్టిగా కళ్ళు మూసుకొని పెద్దగా అరిచింది. ఎవరో తలుపు కొడుతున్నారు.
"మేమ్ సాబ్! తలుపు తెరవండి!"
సీతకు ఆ కంఠం విని ప్రాణం లేచివచ్చింది. చిన్నగా మంచందిగి, పిల్లివైపుకే చూస్తూ వెనక్కు అడుగులేస్తూ తలుపు తెరిచింది. వరండాలోని ట్యూబులైట్ వెలుగు గదిలోకి ప్రవేశించి, పిల్లి కిటికీ మీదకు దూకి బయటకు వెళ్ళిపోయింది.
"ఏం జరిగింది మేం సాబ్!" సెంట్రి అడిగాడు. నాలుకతో పెదవులు తడుపుకొన్నది. "పిల్లి...పిల్లి..." సెంట్రీ ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశాడు. "అది ఇక్కడ తిరిగే పిల్లేనమ్మగారూ. అది మిష్టర్ బర్నెస్ కు పెట్! అందుకే దాన్ని ఎవరం ఏమీ అనం. పిల్లులంటే భయమా?"
సీత గుండెలనిండా గాలిపీల్చుకొన్నది.
"భయంలేదు. నిద్ర పడ్తుండగా ఏదో దూకినట్టయి అరిచాను. అంతే!" అన్నది. తను అంత చిన్న విషయానికి సిగ్గుపడిపోతూ.
"భయం లేదు. నేను ఇక్కడే తిరుగుతుంటాను. తలుపులు వేసుకొని పడుకోండి" అన్నాడు సెంట్రీ. సీత తలుపులు వేసింది. ఛ. ఏమిటి తను ఇంత పిరికిదా? తను ధైర్యంగా వుండాలని తన స్నేహితుడు చెప్పాడు. ఆమె పేరును సార్థకం చేసుకోవాలన్నాడు.
తను వట్టి ఫూల్. అతనిని తల్చుకుని తను భయపడటం ఏమిటి? అతను సమాధుల్లోనే కాదు, షిప్ లో కూడా కన్పించాడుగా! అతన్ని తను దెయ్యం అనుకోవడం ఏమిటి? తన ఆలోచనల్లోనుంచి నిద్రలోకి జారిపోయింది.

                                              * * *
తెలతెలవారుతుండగా సీత నిద్రలేచింది. స్నానం చేసి బయటకు వెళ్ళడానికి సిద్ధం అయింది.
తను బ్రేక్ ఫాస్టు చేసింది. హారే వచ్చేంతవరకు ఎదురుచూసే సమయం లేదు. తన బాబాయికి ఒక నోట్ రాసి, అక్కడ వడ్డించే కుర్రాడికి ఇచ్చి, అతడు రాగానే ఇవ్వమన్నది. తను గుర్రపుస్వారీ చెయ్యడానికి వెళుతున్నట్లు రాసింది. అంతలో ముందురోజు వచ్చిన సిపాయిలే వచ్చారు. ఆమె తనకు కేటాయించిన గుర్రం ఎక్కింది. ఇరుపక్కల సిపాయిలు తమతమ గుర్రాల మీద ఆమెను అనుసరించారు.
ఆమెకు త్వరగా సమాధుల్ని చేరుకోవాలని ఉంది. గుర్రాన్ని వేగంగా నడుపుతోంది. చుట్టూ వున్న ప్రదేశాల్ని చూడటం లేదు. అవన్నీ అంతకు ముందురోజు చూసినవే. ఆమెకు తన స్నేహితుడ్ని త్వరగా చూడాలని వుంది. నగరం దాటింది. బెరాక్సు దాటింది. టూంబ్స్ దగ్గరౌతున్నాయి. ఆమెలో ఉత్సాహం పెల్లుబికింది. గుండె దడ హెచ్చింది. అది భయంవల్ల కలిగింది కాదు. అన్నిటికంటే చూడవలసింది కులీకుతుబు షా సమాధి నిర్మించాడని కూడా చెప్పాడు. ఓసారి ఆ సమాధిని బాగా చూడాలనుకొన్నది సీత. గుర్రం దిగింది. సిపాయిలు సీత ఎక్కిన గుర్రంతోపాటు తమ గుర్రాలను ఒక చెట్టునీడకు చేర్చారు. వాళ్ళు కూడా అక్కడే కూర్చున్నారు. వాళ్ళను ఆమె మొదటిరోజే తనతో రావద్దని చెప్పింది. సీత ఆతృతగా మూడో సమాధి మెట్లు ఎక్కి లోపలకు వెళ్ళింది. అక్కడే తన స్నేహితుడు కనిపిస్తాడని ఆమె ఆశ. కారణం మొదటిరోజు సమాధులోనే కన్పించాడు.
కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది. ఎండలో రావడం వల్ల టూంబ్స్ లోపల బాగా చీకటిగా కన్పించింది. ఒక మూల క్రీనీడలో ఏదో ఆకారం కదలినట్లుగా అయింది. వచ్చావా? నువ్వు రావేమోనని భయపడ్డాను" అన్నది వుత్సాహంగా సీత. ఆమె ప్రశ్నకు సమాధానం లేదు. నీడలా కన్పిస్తున్న ఆకారం కదలలేదు. ఆ పక్కనే మరో ఆకారం కూడా వున్నట్లుగా అన్పించింది. ఏమిటా నీడలు? ఎవరివి? అతను కాదు, అతనైతే వెంటనే తన ముందుకు వస్తాడు. పైగా మరో వ్యక్తితో అసలు రాడు. చీకట్లో వున్న ఆకారాలు కొద్దిగా కదలినట్లుగా అన్పించింది. సీత గుండెలు ఝల్లుమన్నాయ్.
"ఎవరు?" అన్నది. సమాధానం రాలేదు.
గిర్రున వెనక్కి తిరిగింది సీత. రెండో మెట్టు మీద కాలు పెట్టిందో లేదో ఏదో వస్తువు తన తలమీదుగా ముఖాన్ని కప్పేసింది. ఆమె అరవబోయింది. అప్పటికే ఎవరిదో చెయ్యి ఆమె నోటిని గట్టిగా మూసింది. ఆమెను ఎవరో ఎత్తి భుజంమీద వేసుకొన్నారు. సీత నెత్తిమీదుగా దుప్పటి ఉన్నట్లు గ్రహించింది. పెనుగు లాడింది. అరవాలనుకొన్నది.

 Previous Page Next Page