Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 28

ఆమె తిరిగి చూడలేదు. పరుగు ఆపలేదు. బాత్ రూంలోకి పరుగెత్తింది. అతను అలా పరుగుతీస్తున్న సీతను చూస్తూ నిల్చున్నాడు. బ్లస్ట్ అందంగా ఉంటాడు. అతనిలో ఆడవాళ్ళను ఆకర్షించే అనేక గుణాలు ఉన్నాయి. అతని దృష్టి పడ్డ స్త్రీ అతని బారినుంచి ఇంతవరకూ తప్పించుకోలేదు. అతడు తన తొలి యవ్వనంలోనే ప్రసిద్ధ నాట్యకారిణి 'స్కిటల్స్'ను వశం చేసుకున్నాడు. ఆమెకు ఇంగ్లాండులో నాట్యరాణిగా పేరు ఉండేది. కులీన స్త్రీలు, వివాహితలు ఎందరో అతని చుట్టూ తిరిగారు.
అతనికి వివాహం అయింది. కాని అతని మార్గానికి అడ్డురాలేదు. ఆమెకు అంత సాహసం లేదు. బ్లంట్ లాంటి వ్యక్తి తనకు భర్తగా లభించడమే తన అదృష్టంగా భావించసాగింది. తన భర్త ఏ ఆడదానికీ లాయల్ గా వుండలేడని అతని భార్యకు తెలుసు. అతని దృష్టిలో వ్యామోహం, ప్రేమా- రెండూ ఒకటే! ఒక స్త్రీ ఒకే పురుషుడ్ని అంటిపెట్టుకుని వుండటం అంత బోరింగ్ మరొకటి వుండదని అతని ఉద్దేశ్యం. అతను భార్యతో ఆమాటే అంటూ వుంటాడు.
భర్త మాటలకు తేలిగ్గా నవ్వేస్తూ వుంటుంది. అతనికి సీత తనకు పరిచయం అయిన స్త్రీలందరిలోకీ విశిష్టమైన వ్యక్తిత్వంగలదిగా అన్పించింది. ఆమె కళ్ళల్లో తేలిపోయే కలల్ని ఎన్నోసార్లు దూరం నుంచి చూశాడు. ఆమె ఈ ప్రపంచానికి సంబంధించిన ఆడపిల్లలా కన్పించింది కాదు. ఆమె అందంకంటే ఆమెలోని ఈ ప్రత్యేకతే అతడ్ని అమితంగా ఆకర్షించింది. ఏది ఏమయినా తను కోరి దగ్గరయితే ఆమె తనను తృణికరిస్తుందని అతను అనుకోలేదు. అతనికి సీత తిరస్కారం ఒక ఛాలెంజ్ గా అన్పించింది. ఆమెను లొంగదీసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆమె జీవితంలోకి ఇంకా ఏ మగవాడూ ప్రవేశించలేదని అతని నమ్మకం.
"అవును, ఆమె నాది! ఆమెను నేను లొంగదీసుకోవాలి. ఆమె మరొకరి సొత్తు కాకూడదు." పదేపదే మనసులో కసిగా అనుకున్నాడు బ్లంట్.
                                                               * * *
బ్లంట్ ప్రవర్తనకు సీత భయపడింది. ఒకరకంగా షాక్ తిన్నదని చెప్పాలి. ఆమెకు ఇదిమొదటి అనుభవం. ఇంతవరకూ ఏ మగవాడూ ఆమెతో ఇలా ప్రవర్తించలేదు. పెళ్ళయినవాడూ, సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాడూ అలా ప్రవర్తించడం ఆమెకు ఆశ్చర్యంగా వుంది. ఎంతటి మగవాడయినా స్త్రీ విషయంలో ఇలా ప్రవర్తిస్తాడా? తన కాళ్ళముందు మోకరిల్లుతానన్నాడు! తన ముందు అతను తన హోదాను మర్చిపోయాడు. తన బాధ్యతల్ని విస్మరించాడు. అతను తనను వెంటాడతాడా? అలా చేస్తే తను ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పాలి? బాబాయికి చెప్పేస్తే? అమ్మో! ఇంకేమైనా ఉందా? తప్పంతా తనదేనంటాడు. అసలే బాబాయికి బ్లంట్ అంటే కోపం. వెంటనే తనను ఇంగ్లాండు పంపించేస్తాడు.
ఆమె ఆలోచిస్తున్నది. ఆమె కళ్ళవెంట నీరు కారుతున్నది. బావురుమని ఏడవాలని వుంది. ఎవరికయినా తన కష్టం చెప్పుకోవాలని ఉంది. ఇంగ్లాండులో తను గడిపిన జీవితం తల్చుకుని కుళ్ళికుళ్ళి ఏడ్చింది. మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళవలసి వస్తుందేమోననే ఆలోచన ఆమెను భయపెడుతున్నది. ఇండియా వచ్చాకే తనకు ఓ మనిషిగా గుర్తింపు వచ్చింది. ఈ విషయం బాబాయికి తెలియకూడదు. తనే ఎలాగయినా బ్లంట్ బారినుంచి తప్పించుకొని తిరగాలి.
సీతకు తన అజ్ఞాత స్నేహితుడు గుర్తొచ్చాడు. అవును! అతనికి చెప్పాలి. అతనే రక్షించగలడు. అతనే తనను మృత్యు ముఖంనుంచి రక్షించాడు. అతని బోధన వల్లనే నా జీవితం మీద ఆశల్ని పెంచుకొన్నది. అతని ద్వారానే తను జీవితాన్ని ప్రేమించడం నేర్చుకొన్నది. అవును! అతనే తనను ఈ కష్టం నుంచి కాపాడాలి, అతను రావాలి! అతను వస్తాడు! తప్పక వస్తాడు! ఆమె మరొకరితో డ్యాన్సు చేస్తూ ఆ అజ్ఞాత స్నేహితుడ్ని తల్చుకోసాగింది. అతను వస్తాడు! తను కష్టంలో ఉంది. తన కోరిక అతనికి ఈపాటికి తెలిసే వుంటుంది. పిలుపు అతని బుర్రకు అందే వుంటుంది. ఇంకా అతని బలమైన చేతులు తనను గట్టిగా పట్టుకొన్నట్టే అన్పిస్తోంది. చూడగానే ఆమెకు మళ్ళీ భయంపట్టుకొన్నది. ఇంకానయం తోటలోకి వెళ్ళలేదు. అప్పుడు తను అరిచి గీపెట్టినా ఎవరికీ విన్పించేదికాదు. అతనంటే తనకు అసహ్యం! అతన్ని చూసి తనెందుకు భయపడాలి. భయపడుతున్నట్టు అతనికి తెలిస్తే ఇంకా భయపెడ్తాడు. అతన్ని లక్ష్యపెట్టకూడదు. ఒక అనామకుడిలా నిర్లక్ష్యంగా చూడాలి!
"నువ్వు సంతోషంగా లేవు. నాతో డ్యాన్సు చెయ్యడం ఇష్టంలేదా? లేక ఇంకేమయినా కారణం వుందా?" ఆమెతో డ్యాన్సు చేస్తున్నతను అడిగాడు సీతముఖంలోకి చూస్తూ.
"ఏం...ఏం లేదే! సాయంత్రం బజార్లో అల్లర్లు ప్రారంభమయ్యాయని విన్నాను. దాన్ని గురించే ఆలోచిస్తున్నాను" అన్నది సీత.
"ఈపాటికి పరిస్థితులు అదుపులోకి వచ్చి వుంటాయనే భావిస్తున్నాను. సమయానికి తగిన చర్య తీసుకోకపోతే ఇలాంటి అల్లర్లు ఒక పట్టాన అణగవు, చాలా దారుణాలు జరుగుతాయి" అన్నాడు ఆమె పార్ట్నర్.
"అసలు ఏం జరిగింది?"
"నాకు బాగా తెలియదు. కొందరు వ్యక్తులు యిలాంటి అల్లర్లు లేవదీస్తారు. చివరకు అమాయకులు బలైపోతారు"
"ఎలాంటి గొడవలు?"
"అదే హిందువులు, ముస్లిముల మధ్య మత పరమయిన ద్వేషాన్ని రెచ్చగొడ్తారు. మత మౌఢ్యం చాలా భయంకరంగా వుంటుంది. రక్తపాతం జరుగుతుంది. మానవత్వాన్ని పూర్తిగా విస్మరిస్తారు. పగ, ద్వేషం రెండే ఆ సమయంలో వారిలో వుంటాయి."
"అంత భయంకరంగా చంపుకొంటారా?"
"అవును!"
"మైగాడ్" అని ఆగి "మనవాళ్ళు అలా ఒకర్నొకరు చంపుకోకుండా ఆపలేరా?" అన్నది సీత.
"మనవాళ్ళ ప్రయత్నం అదే! అప్రమత్తంగావున్నా తరచుగా ఇలాంటి మతకలహాలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే వుంటాయి" ఆమె నడుంమీద చెయ్యివేసి డ్యాన్సు చేస్తూనే చెప్పసాగాడు. దూరంగా నిల్చుని బ్లంట్ వాళ్ళను గమనించడం సీత చూస్తూనే వుంది.
"ఎక్కడో ఏదో చేస్తాడు. ఆ నిప్పు మరోచోట రాజుకొని భగ్గున మండుతుంటుంది. ముఖ్యంగా ఒక వ్యక్తికోసం మనవాళ్ళు గాలిస్తున్నారు. అతనే ప్రస్తుతపు అల్లర్లకు కారణం అని మా అభిప్రాయం."
"అతనెవరు?" సీత ఆత్రంగా అడిగింది.
"నాకు తెలియదు ఎవడో వున్నాడని మా అనుమానం. అతను ఇటీవలే ఈ ప్రాంతాలకు చేరాడని కూడా మా అనుమానం. ఇంతకంటే నాకు ఏమీ తెలియలేదు. నేనేమీ చెప్పలేను" అన్నాడు ఆమె డ్యాన్స్ పార్ట్నర్.
వీళ్ళకు ఎవరికీ తెలియదు. నీ అవసరం నాకుంది. నేను కష్టాల్లో పడబోతున్నాను. నువ్వెక్కడ వున్నా నా ఆలోచనలు నీకు అందుతాయని చెప్పావు. అవసరం అయినప్పుడు వస్తానన్నావు. మరెందుకు రావు? ప్లీజ్! త్వరగా రావా? నాకు ఒక్కసారి కన్పించి వెళ్ళవా?" సీత మనసులోనే పదేపదే అనుకోసాగింది.
"దాదాపు అరడజను మందైనా చంపబడ్డారు, ఇరవయిదాకా గాయపడ్డారు. ఈ రాత్రికి ఇక గొడవలుండవనే అనుకుంటున్నాను."
మిష్టర్ కార్ స్టయిర్స్ - ఆమె డ్యాన్సు పార్టనర్ అన్నాడు.
సీత వళ్ళు జలదరించినట్టయింది భయంతో. అరడజను మంది చనిపోయారా? ఎవరో వాళ్ళు, అందులో తన...నో!నో! అలా జరగదు. తనే పిచ్చిగా ఆలోచిస్తున్నది. రేపు టూంబ్స్ దగ్గరకు వెళితే? అవును వెళ్ళాలి. అక్కడ అతను కన్పిస్తాడు. అంటే అతను ఎప్పుడూ సమాధుల్లోనే వుంటాడా?

 Previous Page Next Page