ఆమె నోటిని గట్టిగా అదుముతున్న చెయ్యి ఆమెను అరవనివ్వలేదు. ఇద్దరు వ్యక్తులు తనను పట్టుకొన్నట్టు ఆమెకు అర్థం అయింది. పెనుగులాడి లాభం లేదనుకున్నది. ఎవరు వీళ్ళు? ఎక్కడికి తీసుకెళుతున్నారు? తనను అపహరించాల్సిన అవసరం ఎవరికుంది? తన అపహరణ వల్ల వాళ్ళు పొందబోయే లాభం ఏమిటి? సీతకు ఊపిరి సలపడం లేదు. తన వంటిమీద ఖరీదైన నగలు కూడా లేవు. తన ఫ్రెండు ఎందుకు రాలేదు? వీళ్ళలో ఒకడు... అతను కాదుగదా? నో నో! అలా ఎన్నటికీ జరగదు. అతను ఇలాంటి పని చెయ్యడు, ముఖ్యంగా తన విషయంలో. మరి తను టూంబ్స్ కు వస్తున్నట్టు అతనికి తెలియదా? తను తొందరపడి టైంకు ముందే వచ్చేసింది. తను రాత్రి ఆలోచనా తరంగాల ద్వారా మెసేజ్ పంపించిందిగా, ఆ మెసేజ్ అతనికి అందలేదా? పెనుగులాడి లాభం లేదనుకున్నది.
ఎత్తుకున్నవాడి భుజంమీద తోటకూర కాడలా వేలాడిపోయింది. తనను ఎక్కడికి తీసుకెళుతున్నారు? వాళ్ళు ఏదో ఎత్తు ఎక్కుతున్నారు. గాలి గట్టిగా పీలుస్తున్నది. హిందూ-ముస్లిములు తగాదాలకూ తనకూ ఎలాంటి సంబంధం లేదు. తనను ఎవరు అపహరించారు? హిందువులా? ముస్లిములా? వాళ్ళు ఆమెను ఒక బగ్గీలో పడేశారు. ఒకడు ఆమె నోరు మూసే వుంచాడు. బండి గతుకుల్లో పోతున్నట్లు ఎగిరెగిరి పడుతున్నది.
సీత కూడా గుడ్డల మూటలా బండి ఎగిరి పడినప్పుడల్లా ఎగిరి పడుతోంది. ఒకచోట బండి ఆగింది.
"మొత్తంమీద పట్టుకొచ్చారు. గుడ్!" ఎవరిదో మగ కంఠం సీతకు విన్పించింది. అతను ఇంగ్లీషు మాట్లాడాడు.
"చాలా తేలిగ్గా పట్టేశాం!" రెండో కంఠం.
"ఎవరూ చూడలేదుగా?" మొదటి కంఠం.
"లేదు!" మూడో కంఠం.
"గుడ్! ఆమెను ఎత్తుకొని నావెంటరండి!" మొదటి కంఠం.
ఆ మూడు కంఠాలు సీతకు కొత్తవే! అంతకుముందు ఆ కంఠాలు ఆమె వినలేదు. అందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ఆమెను ఎత్తుకొని కొండపైకి అతిజాగ్రత్తగా ఎక్కుతున్నట్లు ఆమెకు తెలుస్తూనే వుంది. తనను కొండపైకి తీసుకెళ్ళి ఏంచేస్తారు?
వాళ్ళ ఉచ్ఛారణను బట్టి వాళ్ళంతా ఇంగ్లీషువాళ్ళేనని గ్రహించింది.
ఇంగ్లీషు వాళ్ళు తనను కిడ్నాప్ చెయ్యడం ఏమిటి? ఎంత ఆలోచించినా తనను ఇలా కిడ్నాప్ చెయ్యడానికి కారణం బోధపడటం లేదామెకు.
"కిందకి తీసుకెళ్ళండి జాగ్రత్తగా. మెట్లు సరిగా లేవు" మొదటి కంఠం సీతను మోస్తున్న వాళ్ళను ఆజ్ఞాపించింది. ఆమె భగవంతుడ్ని మనసులోనే ప్రార్థించసాగింది. మెట్లు దిగడం పూర్తి అయింది. వాళ్ళు సమతల భూమిమీద నడుస్తున్నారు. కొంతదూరం నడిచి ఆగిపోయారు.
"ఆమెను లోపలికి తీసుకెళ్ళండి. ఆమె ముఖంమీద దుప్పటి తీసేముందు మీ ముఖాలను కప్పుకోండి. కళ్ళ క్రింద భాగం పూర్తిగా మూసేసుకోండి" ఆజ్ఞలు జారీ చేస్తున్న కంఠం అన్నది.
సీతను మూటను పడేసినట్లు బెడ్ మీద పడేశారు. ఆమె ముఖాన్ని కప్పిన దుప్పటి కొద్ది నిమిషాల తర్వాత లాగేశారు. సీత కళ్ళు తెరిచింది. చీకటిగా వుండటం వల్ల వెంటనే ఏమీ కన్పించలేదు. కొంతసేపటికి ఆమె కళ్ళు ఆ చీకటికి అలవాటు పడ్డాయి.
రాతి గోడలో ఉన్న చిన్న కన్నం నుంచి కొద్దిగా వెలుగు లోపలకు వస్తున్నది. ఆమె తన ఎదురుగా నిల్చుని తన ముఖంలోకే చూస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని చూసింది. ముగ్గురూ కళ్ళకింద భాగాన్ని చేతి రుమాళ్ళతో కప్పేసుకున్నారు. వాళ్ళను అలా చూడగానే సీతకు భయం వేసింది.
"మిస్ అరాన్! నిన్ను ఇక్కడకు ఎందుకు తెచ్చామో తెలుసా?"
సీత "తెలియదు" అన్నట్టు తల ఊపింది. "మీ బాబాయి సర్ హారే వైస్ రాయ్ కి విల్ బర్టు బిల్లు విషయంలో సరైన సలహా ఇవ్వాలి. ఇక్కడికి రాకముందే ఆయన వైస్ రాయ్ తో మాట్లాడాడని తెలిసింది!" అందరిలోకి పొడుగ్గా ఉన్న అతను చెప్పాడు. సీత అయోమయంగా చూసింది ఓ క్షణం.
"విల్ బర్ట్ బిల్లా? దానికీ నాకూ ఏమిటి సంబంధం" ఎలాగో అనగలిగింది.
"నిన్ను కిడ్నాపు చేస్తే మీ బాబాయి నీకోసం అయినా మాకు అనుకూలంగా సలహా ఇస్తాడు."
సీత వాళ్ళను పిచ్చివాళ్ళను చూసినట్టు చూసింది. సీతకు ఒక ఆలోచన వచ్చింది. అవును! లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టిన బిల్లును చాలామంది ఇంగ్లీషువాళ్ళు వ్యతిరేకిస్తున్నారని బాబాయి తనకు చెప్పాడు. ఇండియన్ జడ్జెస్ ఇంగ్లీషు వాళ్ళ కేసులు విచారణ చెయ్యడం ఇష్టంలేదు. అది చాలామంది అవమానంగా భావిస్తున్నారు. పాలించే జాతిని పాలించబడే బానిస జాతి వాళ్ళు శిక్షించడం ఏమిటి అని వారి అభిప్రాయం. ఎంత అహంకారం!"
"ఏమిటి మాట్లాడవు."
సీత ఆలోచనల నుంచి బయటపడింది.
"ఇప్పటికే మా బాబాయి తన అభిప్రాయం వైస్ రాయ్ కి చెప్పాడని నా నమ్మకం. ఇప్పుడు చెయ్యగలిగిందేముంది?"
"అదంతా మాకు తెలియదు. ఇంకా ఆ బిల్లుమీద సమగ్ర చర్చలు జరగలేదు. నీకోసం అయినా మీ బాబాయి ఆ బిల్లును వ్యతిరేకించి తీరాలి."
సీత నుదురుమీద పడుతున్న జుట్టును వెనక్కు నెట్టుకొన్నది. జుట్టు ఆమె చేతికి చల్లగా తగిలింది చమట పట్టడం వల్ల. సీత ధరించిన హాట్ వాళ్ళు ఆమెను పట్టుకొన్నప్పుడే కిందపడిపోయింది.
"మా బాబాయి అంగీకరించకపోతే?"
"నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళవు. ఆకలి దప్పులతో మాడి మాడి చస్తావు."
"అంత ఘోరం చేస్తారా?"
"మీ బాబాయి మాకు చేస్తున్న ఘోరం ఇంతకంటే పెద్దదే" మూడోవాడు అన్నాడు.
మొదటిసారిగా అతను మాట్లాడాడు. "ఇదిగో అమ్మాయ్! నీతో అనవసరంగా వాదించడం నాకు ఇష్టంలేదు. నువ్వు ఈ విధంగా చస్తే ఒక మంచిపని సాధించడం కోసం చచ్చినట్టుగా భావించుకో" అన్నాడు అందరిలోకీ పొడవుగా వున్నవాడు.
"కావచ్చును. కాని నాకూ మీ బిల్లుకూ ఎలాంటి సంబంధం లేదు. ఇక మా బాబాయి సంగతి అంటారా? అతను నామాట వినడు గాక వినడు. అన్యాయంగా నన్ను చిత్రహింసకు గురిచేస్తే మీకు ఏమీ వుండదు" అన్నది సీత.
"ఎవరికోసం వింటాడు? మీ బాబాయి మాకు తప్పక లొంగిపోతాడు. ఇంగ్లీషు వాళ్ళే ఈసారి తన మీద తిరగబడటానికి సిద్ధంగా వున్నారని వైస్ రాయ్ కీ తెలుసు" అనేసి గిర్రున తిరిగి, ఇక చెప్పవలసిందేమీ లేనట్టు అతను బయటికి వెళ్ళిపోయాడు. మిగతా ఇద్దరూ అతన్ని అనుసరించారు. తలుపులు మూసుకొన్నాయి.