Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 28


    కాస్సేపు కూర్చుని వెళ్ళిపోయింది శాంతి. "పిల్ల చిన్నదైనా ఎంత త్యాగబుద్ధి! ఎంత గొప్పబుద్ధి" ఆశ్చర్యబోయాడు కుమార్.
    ఆ తరువాత రెండురోజులదాకా కనిపించలేదు శాంతి. మేరీ టీచర్ నడిగితే గాంధీగారి జన్మదినోత్సవం సందర్భంగా జరగబోయే ఆట పాటల పోటీల్లో శాంతి వుందనీ, ఆ రిహార్సల్స్ జరగడం వల్ల శాంతి రాలేకపోతుందనీ చెప్పింది.
    ఆరోజు శాంతి వచ్చింది. "అంకుల్ నువ్వు తప్పకుండా మా ప్రోగ్రాంకి రావాలి" అంది.
    "ఓ...తప్పకుండా" అన్నాడు. అందుకే మేరీతో కార్యక్రమం మొదలవకముందే వెళ్ళి స్టేజీకి దగ్గరగా కూర్చున్నాడు.
    ఆటల్లోనూ, పాటల పోటీలోనూ శాంతికే మొదటి బహుమతి లభించింది. కుమార్ మనసు సంతోషంతో నిండిపోయింది. "ఆమెను కన్నతల్లిదండ్రులెవరో" తెలుసుకోవాలనిపించింది. కానీ ఆరోజు కార్యక్రమం ముగిశాక శాంతి కనిపించలేదు. మేరీ టీచరు నడిగితే 'ఆ పిల్ల తాతగారు తొందరపడడం వలన ఇంటికి వెళ్ళిపోయారు' అంది.
    మర్నాడు కుమార్ ఏదో ఆలోచిస్తూ కూర్చునుండగా శాంతి వస్తుంది. 'అమ్మా వచ్చావా?' అన్నాడు కుమార్.
    'అంకుల్ నేనొచ్చినట్టు నీకెలా తెలుసు' అంది ఆశ్చర్యపోతూ. ఇన్నాళ్ళ నీ స్నేహంతో నీ అడుగుల చప్పుడు తెలుసుకోలేనా తల్లీ అంటూ దగ్గరకు తీసుకుని చెంపలపై నిమురుతూ "నిన్న మళ్ళీ కనబడలేదేం తల్లీ. నీలాంటి బంగారు తల్లిని కన్న మీ అమ్మనీ, మీ తాతయ్యనీ చూడాలనుకున్నాను. కానీ నువ్వు కనిపించలేదు" అన్నాడు.
    "అంకుల్! నేనిప్పుడు ఎందుకొచ్చానో తెలుసా? నిన్ను మా యింటికి తీసికెళ్ళాలని."
    "ఇప్పుడెందుకమ్మా. మరోసారొస్తాను" అన్నాడు.
    "ఆ...అదేం కుదరదు. ఇప్పుడే రావాలి. తాతయ్యకి కూడా చెప్పేశాను నువ్వొస్తున్నావనీ" అంది. ఇక తిరుగులేనట్టు.
    "వెళ్ళు తమ్ముడూ. కాస్త చేంజ్ గానయినా వుంటుంది. కాసేపు కూర్చుని రా" అంది మేరీ.
    "మీరూ రండి టీచర్" అంది శాంతి.
    "నాకు పనుందమ్మా. అంకుల్ ని తీసుకెళ్ళు" అంది మేరీ.
    కారు కదిలింది జెర్రిపోతులాగా.
    వరండాలో రావుగారు పేపర్ చదువుకుంటూ వున్నారు. కారాగిన చప్పుడు విని తలెత్తి చూశారు. తన కళ్ళని తనే నమ్మలేకపోయారు. శాంతి అజయ్ చెయ్యిపట్టుకుని నడిపించుకొని తీసుకొస్తోంది. అతన్ని చూడగానే ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం, బాధ ముంచుకొచ్చాయి.
    "అజయ్...అ...జ...య్..." అనుకున్నారు మెల్లగా.
    "అమ్మా...మధూ...ఇలా రామ్మా...బాబూ...బాబూ...అజయ్... బాబూ...నువ్వు బతికేవున్నావా నాయనా..." అంటూ అతని దగ్గరకెళ్ళి గట్టిగా కౌగలించుకున్నారు రావుగారు.
    "నాన్నా..." బావురుమన్నాడు అజయ్.
    మాధవి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. ఆశ్చర్యంతో అతనిదగ్గరికెళ్ళి "ఎమన్దే౧ ఎలా జరిగిందండీ ఇంత ఘోరం? మనిషి వుండగానే పోయినట్టు ఎందుకు చెప్పారండీ?" విలపించింది.
    పొరబాటు జరిగిపోయింది మాధవీ. ఆమె చెయ్యి పట్టుకున్నాడు అజయ్.
    మాధవి మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తీసికెళ్ళింది. అజయ్ ని చూసి ఆనందంతో తబ్బిబ్బయిపోయారు గోపీ, గౌరీ, గోవిందమ్మా.
    మాధవి లోపలికెళ్ళి కాణీ అంత కుంకం బొట్టు పెట్టుకుని మనసారా దేముడికి దండం పెట్టి వచ్చింది.
    "అమ్మా తల్లీ అతను అంకుల్ కాదమ్మా. మీ నాన్న. నువ్వు నిజంగా నా బంగారు తల్లివేనమ్మా. నీవల్లే నా బాబు మళ్ళీ నా ఇంటికొచ్చాడు" శాంతిని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించారు.
    శాంతి 'నాన్నా' అంటూ అజయ్ ఒళ్ళో కూర్చుంది. "నువ్వు నా చిట్టితల్లివా శాంతీ! నేనెంత అదృష్టవంతుణ్ణి!" శాంతిని ముద్దులతో నింపేశాడు
    గోపీ, గౌరీ, మాధవి, రావుగారు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటే గతాన్నంతా కథలా వినిపించాడు అజయ్. జరిగిన సంఘటనలన్నీ చర్చించుకుంటూ భోజనాలు కానిచ్చారు. కారు పంపించి మేరీ టీచర్నీ, సామాల్నీ తెప్పించారు.
    మేరీ టీచరు చాలా సంతోషించింది. "విధి విచిత్రంగా గారడీలు చేస్తుంది బాబూ! ఇక్కడిక్కడే వున్నా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఎవరికి ఎవరూ ఏమీ కానట్లుగానే వుండడం, ఈ రోజున బాంధవ్యం బయటపడి అందరినీ కలపడం, నిజంగా ఆశ్చర్యం కదూ! అవునూ! మీ పేరు 'అజయ్' అయితే 'కుమార్' అని ఎందుకు చెప్పారు?
    "మిలిటరీలో అందరూ కుమార్ అనే పిలిచేవారు. "నా పూర్తిపేరు అజయ్ కుమార్"
    ఏది ఏమైనా నన్ను నీ దగ్గర వుంచుకుని ఈ ఊరి నుంచి పోకుండా కాపాడినందుకు, స్వంత తమ్ముడులాగా చూసుకున్నందుకు కృతజ్ఞుణ్ణి" అన్నాడు అజయ్.
    మర్నాడు స్నేహితులందరినీ పిలిచి విందు ఏర్పాటు చేశారు రావుగారు. డాక్టర్ జయరాం, రుక్మిణి ఉదయాన్నే వచ్చేశారు. ఒకటే కోలాహలం. "అజయ్ కది పునర్జన్మతో సమానం. పోయాడనుకున్న మనిషి మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత తిరిగి రావడం మీ అదృష్టం, మాధవి అదృష్టం, బేబీ అదృష్టం" అంటూ అభినందించారు అందరూ.
    కాసేపటికి అంతా వెళ్ళిపోయారు. జయరాం, రుక్మిణి ఆనాటికి అక్కడే వుండిపోయారు.
    "ఆపరేషన్ చేస్తే కళ్ళొస్తాయా డాక్టర్ గారూ" అడిగారు రావుగారు.
    "వస్తాయి. త్వరలోనే ఆ ఏర్పాటు చేస్తాను" అన్నాడు జయరాం.
    "నాన్నకి నాదో కన్నిచ్చేస్తాను తాతయ్యా. ఒక కన్నుతో నేనూ, నాన్న కూడా అన్నీ చూడొచ్చు" అంది శాంతి.

 Previous Page Next Page