Previous Page Next Page 


    "ఏడ్చినట్లుంది. మనకు తిండెవరు పెడతారు?"
    "నేను మెయిన్ రోడ్డుమీద నిలబడి రోజూ వచ్చేపోయే కార్లను చూస్తుంటాను. ఏదొక రోజు ఏ కోటీశ్వరుడి కారో చెడిపోక తప్పదు కదా! వెంటనే నేను రిపేర్ చేస్తానన్నమాట. అతను నన్ను మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమంటాడు. మీ ఎస్టేట్ కి మేనేజర్ గా పని చేయాలనుందని చెప్తాను. వెంటనే మనకి ఉద్యోగం, కారూ..."
    "విజయ్, ఇలా కలలు కనటమే నాకిష్టం వుండదు. బి ప్రాక్టికల్. ఇప్పుడు ఈ పోస్ట్ కి అప్లయ్ చేసెయ్."
    "కానీ నాకు పోటీగా చాలామంది వస్తే?"
    "వాళ్ళ అప్లికేషన్ లన్నీ చింపి పారేస్తాను"
    "ఆల్ రైట్" అన్నాడతను.


                          *    *    *    *    
    

    "వాట్?" అన్నాడు మార్కండేయులు ఆశ్చర్యంగా.
    "ఎస్ మైడియర్ ఫాదరిన్లా! ప్రకాష్ అద్భుతమయిన కథ తయారుచేశాడు. ఆ కథతో సిన్మా తీస్తే హిట్టవటం ఖాయం" అన్నాడు భవానీశంకర్.
    "అవును డాడీ! ప్రకాష్ ని మీరూరికే అండరెస్టిమేట్ చేస్తారు కానీ మిగతా వాళ్ళంతా తెగ ఓవరెస్టిమేట్ చేస్తారు డాడీ! పాపం బోర్న్ జీనియస్"
    "జీనియస్ ఇన్ డిస్ గైస్" అన్నాడు భవానీశంకర్.
    ప్రకాష్ కొంచెం సిగ్గుపడ్డాడు "అవునంకుల్! ఎందుకులే అని నేనూ ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదా విషయం."
    "అలాగా?"
    "అవునంకుల్!"
    "ఇంతకూ ఏం సబ్జెక్ట్ అది? శోభన్ బాబూ టైప్ సబ్జెక్టేనా? ఒక హీరో - భార్యా, ప్రియురాలు- అర్ధాలు, అపార్థాలు, విపరీతార్థాలూ, త్యాగాలూ - ఇవన్నీ వుంటాయా?" ఆశగా అడిగాడు మార్కండేయులు.
    "ట్రాష్" అరిచాడు ప్రకాష్.
    "ప్యూర్ ట్రాష్" అన్నాడు భవానీశంకర్.
    "అలాంటి సబ్జెక్ట్స్ తీస్తే జనం వెంబడిపడి తంతారు మైడియర్ ఫాదరిన్లా! అలాంటి సబ్జెక్ట్స్ చూసే రోజులు పోయినయ్"
    "ఒకవేళ తీసినా కిందటిసారి మీరు సగం తీసి ఆగిపోయిన పిక్చర్ లాగా అయిపోతుంది కూడా."
    "ఐసీ"
    "అందుకే సరికొత్త సబ్జెక్ట్ రడీ చేశానంకుల్"
    "ఏమిటది?"
    "నక్సలిజం మీద"
    "నక్సలిజం మీదా?"
    "అవునంకుల్- నక్సలైట్ అయిడియాలజీ మీద సబ్జెక్ట్ అన్నమాట. మొత్తం యూనిట్ అంతా ఆదిలాబాద్ అడవుల్లోకెళ్ళి అక్కడి జీవిత యథాతథంగా చిత్రీకరిస్తామన్నమాట!"
    "అందులో గద్దర్ పాటలు ఒక ఎట్రాక్షన్"
    "ఓహో! గద్దర్ సాంగ్స్ బాగుంటాయ్. నేను కూడా విన్నాను"
    "ఎవడికోసం వింటారు? జనం క్రేజ్ గా ఎగబడి కొంటున్నారు కాసెట్స్ అంత పాపులర్"
    "ఆ సినిమా జనం బాగా చూస్తారంటారా?" అనుమానంగా అడిగాడు.
    "చూడటమా? విరగబడిపోతారనుకోండి! నా అనుమానం ఏమిటంటే కర్రలతో మన వెనుకపడతారని."
    "మన వెనుకా?" గాబరా పడ్డాడు మార్కండేయులు "మన వెనుకెందుకు?"
    "రిలీజయిన నెలరోజులయినా టిక్కెట్లు దొరకటం లేదన్న కోపంతో."
    "అదా! టిక్కెట్లు దొరకడం లేదన్న కోపంతో!" అంటూ రిపీట్ చేశాడు మార్కండేయులు ఆ దృశ్యం ఒకసారి ఆనందంగా వూహించుకుంటూ.
    "ఇకమరి షూటింగ్ కెళ్దామా అంకుల్?" అడిగాడు ప్రకాష్.
    "అప్పుడేనా?"
    "టైమ్ లేదంకుల్! ఎందుకంటే ఇప్పటికిప్పుడే అరడజను మంది ఈ సబ్జెక్టుల మీద కథలు తయారుచేస్తున్నారు."
    మార్కండేయులుకి ఆశ పుట్టింది "ఆల్ రైట్! ఎగ్రీడ్! కానీ కండిషన్"
    ప్రకాష్ బెదురుగా చూశాడు "ఏమిటంకుల్ అది?"
    "ఆ సినిమా ప్లాప్ అయితే మొత్తం డబ్బు నీ పేర వున్న ఆస్తిలో కట్ చేసేసుకుంటాను."
    ప్రకాష్ గతుక్కుమని భవానీశంకర్ వైపు చూశాడు.
    "ఓ.కె. ఫాదరిన్లా! ఎగ్రీడ్"
    మార్కండేయులు మరోసారి చకచక ఆలోచించాడు.
    "మన సినిమాకి బిజినెస్ అవుతుందంటావా?"
    భవానీశంకర్ పగలబడి నవ్వాడు.
    "మీది వెరీ పూర్ స్టాండర్డ్ ఫాదరిన్లా. కొశ్చెన్ వేసేప్పుడు అందులో క్వాలిటీ వుందా లేదా అనే విషయం చూడాలి. మనం ఆ సినిమా తీస్తున్నట్లు ఎనౌన్స్ మెంట్ ఇవ్వగానే మనాఫీస్ ముందు పోలీసుల లాఠీఛార్జ్ జరుగుతుంది."
    మార్కండేయులు ఉలిక్కిపడ్డాడు.
    "లాఠీఛార్జ్? ఎవరిమీద?"
    "ఇంకెవరు- జిల్లాలవారీ బయ్యర్లు"
    మార్కండేయులు కళ్ళముందు మళ్ళీ ఆ దృశ్యం అందంగా కనిపించింది "ఆల్ రైట్" అన్నాడతను.
    భవానీశంకర్, ప్రకాష్ బయటకు నడవగానే భవానీశంకర్ కౌగిలించుకున్నాడు ప్రకాష్.
    "అద్భుతం బ్రదర్. అంకుల్ నా మాట వినటం ఇదే మొదటిసారి"

 Previous Page Next Page