Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 28


    "ఏదొకటి రాసుకుని కేస్ పెండింగ్ లో ఉంచండి!"
    "సరే."
    అతను లేచి వెళ్ళిపోయాడు.
    దీప భారంగా కళ్ళు మూసుకుంది.
    ఏమిటి విచిత్రం?
    తనెవరో ఎవరికీ తెలీటంలేదు. అవును. తనకే తెలీటంలేదు.
    డాక్టర్ వచ్చి ఆమె చేయి పట్టుకుని చూశాడు.
    "గుడ్! ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు." అన్నాడు చిరునవ్వుతో.
    "నాకు నా విషయాలేమీ గుర్తురావటం లేదు. ఎందుకంటారు?"
    "తలకు తగిలిన దెబ్బ వల్ల! మీరా విషయమేమీ కంగారు పడకండి! రెండు మూడు రోజుల్లో అంతా నార్మల్ అయిపోతుంది"
    దీప కళ్ళు మూసుకుంది భారంగా.
    మళ్ళీ ఆమెను మగత కమ్మేసింది.
    తిరిగి మెలకువ వచ్చేసరికి సాయంత్రం నాలుగవుతోంది.
    ఆ వార్డ్ అంతా పేషెంట్స్ ని చూడ్డానికి వచ్చిన బంధువులతో కిటకిటలాడిపోతోంది.
    అంతా గొడవగా మాట్లాడుకుంటున్నారు.
    ఉదయం జరిగిన విషయాలన్నీ నెమ్మదిగా గుర్తుకొస్తున్నాయామెకి.
    తనను నర్స్, పోలీస్ సబిన్ స్పెక్టర్, డాక్టర్ అందరూ ప్రశ్నించటం.
    తను ఏమీ చెప్పలేకపోవటం.
    తననెవరూ పట్టించుకోవటం లేదు.
    రాత్రి ఎనిమిది గంటలకు నర్స్ తట్టి లేపుతూంటే మెలకువ వచ్చింది మళ్ళీ.
    "ఇవిగో ఈ పాలు తాగండి!" గ్లాసు అందించింది.
    పాలు తాగింది దీప.
    "మీరెవరో మీ వాళ్ళెవరో ఏమయినా గుర్తుకొచ్చిందా?"
    "లేదు."
    "మీరెంతవరకూ చదువుకున్నారో గుర్తుందా?" దీప చకచక ఆలోచించసాగింది.
    మళ్ళీ తలనొప్పి వచ్చేసింది. భయంకరమయిన తలనొప్పి.
    "తలనొప్పి....అబ్బా" అందామె బాధగా.
    "సారీ! మీకు ఇంకా రెస్ట్ అవసరమనుకుంటాను. రేపు మార్నింగ్ వచ్చాక అన్నీ చెబుదురుగాని" ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ నిద్రలో మునిగిపోయిందామె. తిరిగి రాత్రి రెండు గంటలకు మెలకువ వచ్చింది. అప్పుడు ఆమె మరోసారి జరిగిందంతా గుర్తుకి తెచ్చుకోడానికి ప్రయత్నించసాగింది. తన ఇల్లు, తన తండ్రి, తల్లి...
    తన తండ్రిపేరు నిరంజన్.
    అవును. తను సిమ్లాలో చదువుతుండేది.
    ఫ్రెండ్స్ తో శెలవులకు హైద్రాబాద్ వచ్చింది.
    ఆమెకు అంతా గుర్తుకొచ్చేసింది.
    ఇంటికిరావటం, ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్ళటం. ఆగ్రాలో ఉండగా తన తండ్రి చనిపోయిన విషయం తెలిసి వెనక్కు రావటం, ఏడుస్తూ గడపటం, జ్ఞాపకాలు సుడులు తిరుగుతూ వస్తున్నాయ్. ఆ రాత్రి తను మెలకువవచ్చి గదిలోనుంచి బయటికొచ్చి నిలబడేసరికి రంజనీ, ఓ మగ వ్యక్తీ తనను చంపాలని ప్లాన్ చేస్తున్న మాటలు వినటం, తను పారిపోవటం, తన స్కూటర్ ను వెనుకనుంచి ఓ కారు డాష్ ఇవ్వటం.
    ఆమె భయంతో వణికిపోయింది.
    అవును. తనను ఎవరిదో కారు కావాలని డాష్ ఇచ్చింది.
    ఎవరై ఉంటారు? ఎవరి కారయి ఉంటుందది?
    తను కిటికీలోనుంచి ఒక్క క్షణం చూసింది. ఆ డిమ్ లైట్ లో అతని మొఖం అస్పష్టంగా కనిపించింది.
    అతనిని అంతకుముందెప్పుడూ తను చూడలేదు. అతని పక్కన తన స్టెప్ మదర్ శ్రీరంజని.
    వాళ్ళు తననెందుకు చంపాలనుకున్నారు.
    మళ్ళీ తలనొప్పి. తెరలుతెరలుగా వస్తోంది.
    ఎందుకో తెలీదు. కానీ తనను చంపేయడానికి జరిగిందా ప్రయత్నం.
    ఎందుకు చంపాలనుకున్నారు? తనతో శత్రుత్వం లేదే ఆమెకు? అసలు తను పుట్టిన దగ్గర్నుంచీ సిమ్లాలోనే చదువుకుంది. అక్కడే హాస్టల్లో ఉండేది. సెలవుల్లో కూడా సాధారణంగా హైద్రాబాద్ వచ్చేది కాదు.
    తన తండ్రే వచ్చి తనను హాలిడే టూర్ కి తీసుకెళ్ళేవాడు. మరింత శ్రీరంజనికి తనమీద శత్రుత్వం ఎందుకు?
    ఆలోచిస్తున్నకొద్దీ తలనొప్పి పెరిగిపోతోంది.
    మధ్యమధ్యలో ఆలోచించటం ఆపక తప్పటం లేదు.
    అకస్మాత్తుగా ఆమెకు సిమ్లాలో తను చూసిన ఓ హిందీ సినిమా గుర్తుకొచ్చింది. అందులో తల్లీదండ్రీ చనిపోయిన ఓ అమ్మాయి ఆస్తి కోసం ఆమె బంధువులే ఆమెను హత్య చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ విషయం తెలిసి ఆమె తన ప్రియుడి సాయంతో ఆ ప్రమాదం నుంచి బయటపడుతుంది.
    హఠాత్తుగా ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఒక్కసారిగా విపరీతమయిన తలనొప్పి. చటుక్కున మంచంమీద నుంచి లేచి కూర్చుంది. భయం నరాల్లోనుంచే పాకుతోన్న ఫీలింగ్. ఒకవేళ తనను కూడా చంపేస్తే! ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది?
    ఇంకెవరున్నారు? తన మారుటి తల్లి శ్రీరంజని! అయితే శ్రీరంజనే తనను హత్యచేయడానికి ప్రయత్నించిందా?
    మరి ఆ మగవ్యక్తి ఎవరు?
    తనంతకు ముందెప్పుడూ చూడలేదతనిని.
    నర్స్ వచ్చిందామె బెడ్ దగ్గరకు.
    "ఏమిటి కూర్చున్నారు? ఎనీ ప్రాబ్లెమ్?" అడిగిందామె సౌమ్యంగా."
    "నో నథింగ్" భయంగా అందామె.
    "పడుకోండి!" ఆమె దీపను మళ్ళీ పడుకోబెట్టింది. చేతికి గుచ్చిన గ్లూకోజ్ సిరెంజ్ లన్నీ తీసేసిందామె.
    దీపకు నిద్రపట్టటం లేదు.
    తనీ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో తెలీటంలేదు. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళితే తనను తప్పకుండా చంపేస్తారు.
    తను బ్రతికి బయటపడాలంటే ఇంటికి వెళ్ళకూడదు. ఇంకెక్కడికయినా పారిపోవాలి. కానీ ఎక్కడికి పోగలదు?

 Previous Page Next Page