Previous Page Next Page 
జయ - విజయ పేజి 28


    జయనేం చెయ్యాలి? మెడ పిసికి చంపాలా? ఇంట్లో నుంచి గెంటెయ్యాలా? ఈ వార్త బయటకొచ్చిందంటే బంధువులందరిలో ఎంత అవమానం తనకి? తనెంత చులకన అయిపోతుంది?
    అసలు వాళ్ళిద్దరి జీవితం సంగతేమిటి?
    జయకిక వివాహం అన్న ప్రసక్తే వుండదు. దానితోపాటు విజయ జీవితం కూడా సర్వనాశనమే!
    చెల్లెలికి చెడ్డపేరు వచ్చినా, అక్కకు చెడ్డ పేరు వచ్చినా ఇద్దరి జీవితాలూ నాశనమవ్వాల్సిందే.
    ఇది మన సమాజంలో జరుగుతున్న న్యాయం.
    రెండురోజుల వరకూ దుఃఖంలోనే మునిగిపోయింది పార్వతి. ఇరవయి నాలుగ్గంటలూ మంచం మీద పడుకుని జబ్బు మనిషిలా అయిపోయింది. ఎంతో కాలం నుంచి మంచం పట్టినట్లు కనిపిస్తుంది చూసేవారికి. చివరకు విజయే కలుగజేసుకుని ఆమెకు ధైర్యం చెప్పింది.
    "ఏదొకటి త్వరగా ఆలోచించాలమ్మా! లేకపోతే దాని బ్రతుకు బుగ్గయిపోతుంది" అందామె ఆవేదనగా.
    "నేనేం చేయను విజయా? నాకేమీ తోచడం లేదు" దుఃఖం దిగమింగుకుంటూ అందామె.
    "పోనీ ఏ డాక్టరు దగ్గరకైనా తీసుకెళ్ళి అబార్షన్ చేయిస్తే?" అడిగింది విజయ.
    "అయ్యో! ఇంకేమైనా వుందా? ఊరందరికీ ఇట్టే తెలిసిపోతుంది. అంతకంటే దానికింత విషం పెట్టి చంపడం మంచిది" కన్నీళ్లు తుడిచేసుకుంటూ అందామె.
    "మరేం చేద్దామంటావో చెప్పు" అసహనంగా అడిగిందామె.
    పార్వతి ఆలోచనలో పడింది. ఆలోచిస్తున్నకొద్దీ జయ మీద పేరుకుపోయిన అసహ్యం, కోపం తరిగిపోసాగినయ్. తను తొందరపడి జయను నిందిస్తోంది గాని ఇలా తొందరపాటు పనులు చేసే ఆడపిల్లలు ఎంతమంది లేరు? ఎందరి విషయాలు నలుగురికీ తెలుస్తున్నాయ్?
    అన్నీ రహస్యాలు గానే మిగిలిపోతున్నాయ్.
    అది వాళ్ళందరి తప్పు కూడా కాదు. ఈరోజుల్లో నాగరికత ఇది! కోరిన వారితో శారీరక సుఖం పొందటం తప్పు కానేకాదు. అందుకే కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయ్. అందుకే శీలం విలువ దిగజారిపోయింది. ఇప్పుడు జయను రక్షించాలంటే ఒకే ఒక్క మార్గం వుంది. వెంటనే దానికి వివాహం చేసేయడం! అంతే!
    అవతలి వ్యక్తులతో అబద్దమాడి వారిని మోసగించైనా సరే ఆమెకు వివాహం జరిపించాలి.
    ఆ ఆలోచన కొంత తెరపి ఇచ్చినట్లనిపించిందామెకి.
    "విజయా! ఇప్పుడు మన పరువు ప్రతిష్టా గంగలో కలవకుండా వుండాలంటే వెంటనే ఏదొక సంబంధం చూసి దానికి ముడి పెట్టెయ్యాలి! అంతకుమించి వేరే మార్గంలేదు" అంది ఆశగా.
    విజయ తెల్లబోయింది.
    జయ సమస్యకు పరిష్కారం వివాహమా?    
    ఇందుకు జయ అంగీకరిస్తుందా? ఒకవేళ ఆమె అంగీకరించినా అలా ఆమె చేసిన పాపానికి యెవరో ఒక ముక్కు ముఖం తెలీని వ్యక్తిని మోసగించటం తప్పుకాదూ? అంత మోసం చెయ్యడం న్యాయమేనా? ఆ పాపాన్ని అతనిపై రుద్దడం సబబేనా?" కానీ తల్లి అన్నట్లు అంతకంటే చేయగలిగింది మాత్రం ఏముందీ?
    అబార్షన్ చేయించడమనేది అంత తేలికైన విషయం కాదు. ఎంత రహస్యంగా దాచినా అది నలుగురికీ తెలియక తప్పదు. ఆ తరువాత ఇక దాని జీవితము చిరిగిన విస్తరాకు అవుతుంది.
    "అయినా ఇంత హఠాత్తుగా దానికి వివాహం చేయడం ఎలాగమ్మా? అదీ అంత తేలికైన విషయం కాదుగా?"
    "మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ తరువాత ఇంక ఆ భాగవంతుడిదే భారం. అంతకంటే చేయగలిగిందేముంది?" విరక్తిగా అందామె.
    విజయ ఇంకేమీ మాట్లాడలేదు.
    ఆ రాత్రంతా ముగ్గురూ నిద్రలేకుండానే గడిపేశారు. జయ అసలు గదిలోనుంచి బయటకు రావడం మానేసింది.
    మరునాడు విజయకు ఉత్తరం వచ్చింది ఇంటికి. కవరు మీద చంద్రకాంత్ పేరు కనబడేసరికి ఆత్రుతగా ఉత్తరం బయటకు లాగి చదవసాగింది.
    విజయా!
    నమస్తే! మీరు ఇంత హఠాత్తుగా మీ ఊరు ఎందుకు వెళ్ళిపోయారో తెలీదు. మీ ఆఫీస్ కి ఫోన్ చేసేవరకూ మీరు హైదరాబాద్ లో లేరన్న విషయం తెలీదు నాకు. కనీసం నాకయినా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయారు? ఆదివారము నాడు సినిమా కెళ్దామని మాట ఇచ్చి ఇలా అన్యాయం చేయడం న్యాయమేనా? విజయా? మీరు వెళ్ళి ఆఫీస్ కి శెలవుపెట్టి ఇంటికి వచ్చేశాను. భోజనం చేయబుద్ధి కావటం లేదు. తక్షణం మీ ఊరువచ్చి మమ్మల్ని చూడాలన్న బలమైన కోరికను ఎంతో ప్రయత్నంతో అణచుకున్నను. విజయా! ఈ ఒక్కరోజు నిజంగా నా జీవితంలో ఇంతకు ముందెన్నడూ అనుభవించని నరకం అనుభవించాను. మీరు నా ప్రేమను ఇంకా ఉపేక్షించటం జరిగితే నేనేమైపోతానో నాకే తెలీదు. విజయా! మిమ్మల్ని ప్రేమించడం నా తప్పా? అలాగయితే ఇంత అందంగా, ఆకర్షణీయంగా ఉండటం మీ తప్పు కాదూ?
    నా జీవితంలో ప్రవేశించే హక్కు ఇంకెవరికీ లేదు విజయా!
    దయచేసి ఈ దీనుడిని కరుణించు! మీరు 'ఊ' అంటే చాలు.
    ఎలాంటి ఆలస్యం లేకుండా మనం వెంటనే ఒకటవుదాము. మీరు నా వారయితే ఇంక ఈ ప్రపంచంలో నేను కోరుకునేదీ, సాధించాల్సిందీ ఏమీ వుండదు. ఆ ఉత్తరానికి వెంటనే జవాబు రాకపోతే నేనే మీ యింటికొచ్చేస్తాను. మీ ఇంటిముందే కూర్చుని మీరు మన వివాహానికి అంగీకరించేవరకూ నిరాహారదీక్ష ప్రారంభిస్తాను. అంతే! ఏం నిర్ణయించుకుంటారో వెంటనే నిర్ణయించుకోండి.
                                                                     ఎప్పటికీ మీ
                                                                      చంద్రకాంత్.

 Previous Page Next Page