"అమ్మా, రాధా! కనీసం అమ్మకోసమన్నా పెళ్ళి చేసుకోతల్లీ!"
"అమ్మ కోసమని ఎవడినో కట్టుకుని చాలీచాలని జీతంతో, పిల్లలతో, చాకిరీతో యింట్లో మగ్గి పొమ్మంటారా?.....అదే మీ అందరికీ సంతోషమయితే, నా నాశనమే మీకు ఆనందమైతే అలాగే కానీయండి!" ముఖం ఎర్రబడి, విసురుగా అంది అనూరాధ.
"ఏం బాగుందే తల్లీ నీ వరస! పెళ్ళి చేసుకోమంటే అది నీ నాశనం కోరడమా?" అంది శకుంతల.
"కాక మరేమిటి! నువ్వు స్వయంగా అనుభవిస్తూ కూడా, నన్నూ అలాంటి నరకంలో పడేద్దామని చూస్తున్నావు .....నే నయినా సుఖంగా ఉండాలని నీకు లేదా?"
శకుంతల ముఖం వివర్ణమయింది. "నాతో పోల్చుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అందరూ నాలా దురదృష్టవంతులే అవుతారా? నీ పుణ్యం బాగుంటే నువ్వు సుఖపడతావు. నాతో పోల్చుకోడం ఎందుకు? నీ గీత బాగుండ కూడదూ?"
"గీత ఎలా వుంటుందో ముందే ఎలా తెలుస్తుంది?"
"లాభంలేదు నాన్నా!.....ఇది ఉత్త మొండిది! దీనికి ఆ విజయ పోలిక వచ్చింది. వాళ్ళనాన్నచేత నాలుగు తన్నులు తింటేగాని దీనికి బుద్ధిరాదు. దాని ఖర్మ-నేనేం చేస్తాను! వాళ్ళ నాన్న, అదీ ఏం చేసుకుంటారో చేసుకోనీండి. ఇంక దీనితో గొడవపడడం నావల్ల గాదు" శకుంతల నిస్పృహతో నిట్టూర్చింది.
"నేను మైనారిటీ తీరిందాన్ని. నా యిష్టంలేని పని నేను చేయను. ఎవరూ నాచేత బలవంతంగా చేయించలేరు" పెంకెగా అంది రాధ.
"హుఁ!....బాగానేవుంది. మైనారిటీ తీరిందాని వయినంత మాత్రాన యిష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికేనా యింతవరకు చదివిన చదువు ఉపయోగం? ఆ చదువు నీ కిచ్చిన జ్ఞానం యిదేనా? ఓ డిగ్రీ ఉంది కనక తల్లిదండ్రులని ఎదిరించమనా నీకా చదువు నేర్పింది! నిన్ను అనవలసిన పని ఏం ఉంది! మీ నాన్న వద్దంటున్నా నీ సరదా పాడు చేయలేక చదివించి బుద్దితక్కువ పని చేశాను.....అందుకు బాగానే కృతజ్ఞత చూపిస్తున్నావు!" నిష్టూరంగా అంది శకుంతల.
అనూరాధ విసుగ్గా లేచి నిలబడింది. "మీరు కట్టబోయే ఏ గుమాస్తానో పెళ్ళాడి నానా బాధలు పడడం యిష్టంలేక హాయిగా నా బతుకు నేను బతుకుతా ననడం తప్పుడు పనికాదు! చదివిన చదువును దుర్వినియోగపరచడమూ కాదు; తల్లిదండ్రులని ఎదిరించడమూ కాదు; కృతఘ్నత చూపడమూ కాదు.....మీ ర లా అర్ధం చేసుకుంటే నేనేం చెయ్యలేను!"
తల్లి కూతుళ్ళ వాగ్వివాదం వింటున్న జగన్నాథంగారికి చటుక్కున రాధ అభ్యంతరం అర్ధమయినట్టయింది. శకుంతలకేసి చూశారాయన.
"రాధా!" అని గంభీరంగా పిల్చారు. వెళ్ళిపోతున్న రాధ ఆ కంఠస్వరం విని జంకుతూ నిలబడింది. "గుమస్తాని పెళ్ళాడమని ఎవరన్నారు?" అని ప్రశ్నించారాయన లాయరులాగ.
హేళనగా నవ్వింది రాధ. "గుమాస్తా కాకపోతే....ఓ మెట్టు పైవాడు! నాన్న అంతకంటే గొప్పవాడిని తీసుకురాబోతున్నారా? తీసుకురాగలరా?"
జగన్నాథంగారు మళ్ళీ శకుంతలవైపు చూశారు. శకుంతల ఏదో చెప్పబోయింది.
"నాన్న తీసుకువచ్చిన రెండు మూడు సంబంధాలు అలాంటివే. ఒకడికి రెండొందలు, యింకొకడికి రెండొందలఏభై జీతం! వాళ్ళు రిటరయే నాటికన్నా అయిదువందలు కళ్ళ చూస్తారో లేదో?"
"అయితే అందుకేనా పెళ్ళి చేసుకోనన్నావు? వాళ్ళ ఉద్యోగాలు నచ్చకపోతే ఆ మాట చెప్పకుండా. అసలు పెళ్ళి వద్దనడం ఎందుకు?" శకుంతల అడిగింది.
"అదే కారణం అయితే, దానికోసం యింత రభస ఎందుకమ్మా రాధా! ఆ మాట చెప్పక పోయావా?" జగన్నాథంగారు అందుకున్నారు. రాధ ముఖం తిప్పుకుంది.
"చెపితే మాత్రం నాన్న అంతకంటే మంచివాడిని తీసుకురాగలరా? ఇంతకీ పెళ్ళి వద్దనడానికి కారణం అదికాదు. నాకు నిజంగానే యిష్టములేదు. పోనీ.....అమ్మ కోసం చేసుకుందామన్నా.....చూస్తూ చూస్తూ కష్టాలను ఎవరు వరిస్తారు?" తిరిగి తన వాదన అందుకుంది రాధ.
"రాధా! సిరిసంపదలలోనే సుఖం, ఆనందం ఉంటాయనుకోకమ్మా, వైవాహిక జీవితంలో ముఖ్యంగా కోరుకోవలసింది సంపద కాదు-అనుకూలుడైన భర్త. అన్యోన్యమయిన దాంపత్యం! ఏ ఏ సిరిసంపదలు యీయలేని ఆనందం దొరుకుతుంది సహృదయుడైన భర్త దొరికితే!" శకుంతల బరువుగా అంది.
జగన్నాథంగారుకూడా అవునన్నట్లు తల పంకించారు. "రాధా! డబ్బులో ఏముందమ్మా, మనసులు కలవాలిగాని. అత నో రెండు వందలు తెస్తే, చదువుకున్నదానివి కనక నువ్వో రెండు వందలు సంపాదించవచ్చు. అప్పుడు హాయిగా ఉండచ్చు!"
"అన్నపూర్ణ పిన్నిని చూడ లేదూ! పెళ్ళినాటికి మీ బాబాయికి నూటయేభయి రూపాయల జీతం! అయినా యిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవారు! ఏం లోటయింది వాళ్ళకి? రాధా, మన తాహతు ఎరిగి మెలగాలి! ఎక్కడో ఏదో ఎవరికో ఉందని మనకూ కావాలంటే ఎలా? మన అంతస్తు చూసుకోవాలి మనం!" కూతురికి మంచి చెడ్డా వివరించబోయింది శకుంతల.
రాధ చిరాగ్గా ముఖం చిట్లించింది.
"సరే-పిన్నికి సుఖంగా గడిచిందని, అందరికీ అలా గడుస్తుందా? అయినా ఆ రోజులు వేరు! అప్పట్లో అవసరాలు వేరు. నూటయేభయి రూపాయలతో నిక్షేపంగా అవసరాలు తీరేవి ఆనాడు! ఇప్పుడు నూటయేబయి కాదుకదా అయిదువందలు వచ్చినా కనీసమైన అవసరాలు కూడా తీరవు. అలా అవస్థలుపడుతూ చేసే కాపురం నా కక్కరలేదు." తెగేసి చెప్పింది రాధ.
"అయితే నువ్వు పెళ్ళి చేసుకోవడం కేవలం యీ కారణం వల్లేనా? నీకు మంచి ఉద్యోగం, హోదా ఉన్నవాడయితే చేసుకోడానికి ఏ అభ్యంతరం లేదన్నమాట. అంతేనా?" సూటిగా అడిగారు జగన్నాథంగారు.