"నిజమేనమ్మా. మావారు రాత్రి పదకొండు గంటలకి క్లబ్బు నించి వచ్చినా చచ్చినట్టు నోర్మూసుకుని పడుంటున్నాను. అదే నేనూ అలా అర్దారాత్రి దాకా తిరిగి వస్తే ఊరుకుంటారా?" సుందరమ్మ అంది.
"మీవారు పదకొండుకెనా వస్తారు నయమే! మా వారు రెండుగంటల లోపు యింటికి చేరితే ఒట్టే ..... ఏం చేస్తాను, చచ్చినట్టు ఊరుకోవడం లేదూ! అప్పుడు లేచి అర్ధరాత్రి అన్నం పెట్టడం లేదూ!" మీనాక్షమ్మ వంత పాట.
"ఉష్! నిశ్సబ్దంగా వుండండమ్మా! ఇలా మధ్య మధ్య మాట్లాడతమనే కధలో చెప్పింది!"
"ఎటొచ్చీ అప్పటికీ ఇప్పటికీ వేష భాషలు మారాయి. కాస్త నాజూకు, చదువు సంస్కారంతో బాటు వచ్చింది. అంత మాత్రానికే మగవాళ్ళు మనకేదో స్వేచ్చా స్వాతంత్ర్యాలు యిచ్చేసినట్టు మనం వాటిని దుర్వినియోగ పర్చి, వాళ్ళ పైన సవారి చేస్తున్నట్టు అపోహపడి బెంగలు పెట్టుకుంటున్నారు. ఆడవాళ్ళకి సీట్లిచ్చాం, గేట్లిచ్చాం, రైలు పెట్టెలు ఇచ్చాం , స్కూళ్ళు ఇచ్చాం, కాలేజీలు యిచ్చాం ఉద్యోగాలు యిచ్చాం యిదంతా ఇచ్చి అనవసరంగా వాళ్ళని నెత్తికెక్కించుకున్నాం, అనుభవిస్తున్నాం అని వాపోతున్నారు పురుష పుంగవులు!
"మాతో సమానంగా చదవనిస్తున్నాం, ఉద్యోగాలు చేయనిస్తున్నాం, మాతో వెంట బెట్టుకొని సినిమాలకి తీసుకెడుతున్నాం, పార్టీలకి ఆహ్వానిస్తున్నాం, డ్రైవింగ్ నేర్పాం, నైలాన్లు కట్టనిచ్చాం, స్లీవ్ లెస్ లు తొడుక్కొనిచ్చాం, రోజుకో హెయిర్ స్టయిల్ మార్చినా సహించాం, చెప్పులు తోడుక్కోనిచ్చాం!.... ఇంకేం కావాలి! మాతో సమానంగా సర్వ హక్కులు మీకూ వున్నాయి! మీకేం లోటు చేశాం?" అని వాళ్ళ విశాల హృదయం చాటుకుంటున్నారు' మగవాళ్ళు. ఇంకా నయం. మాలాగ ఊపిరి తీయనిస్తున్నాం , మిమ్మల్ని భోజనం చేయనిస్తున్నాం అని అననందుకు సంతోషించాలి! ఇంతేకాదు .....మన సుఖం కోసమే స్టవ్ లు, ప్రెషర్ కుక్కర్లు , ఫిజిడేర్లు, గ్రైండర్లు, టోస్టర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇవన్నీ తెచ్చి పెట్టుతున్నామంటే మనం ఆశ్చర్యపడనక్కరాలేదు. ఇవన్నీ ఆడదాని పురోగతి కోసం వాళ్ళు పడే పాట్ల క్రింద జమ ! ఇంతకన్నా ఐరనీ ఇంకేం వుంటుందో నాకు తెలియదు!....."
"హియర్! ....హియర్!" నాలుగైదు కంఠములు ఉత్సాహంగా అరిచాయి. దాంతో సులోచన మరింత ఉత్సాహం పుంజుకుంది.
"మనం చాదువుకున్నందువల్ల వీళ్ళకి చాకలి పద్దులు, బజారు బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు చూసే మంచి రకం గుమస్తాయే కాకుండా, జీతం బత్తెం లేని పంతులమ్మ కూడా దొరికింది పిల్లలకి! మనం ఉద్యోగం చేసినందువల్ల వీళ్ళ సిగరెట్, టీలు, సినిమాల ఖర్చు దర్జాగా వెళ్ళిపోవడమే కాక, మన చీరల ఖర్చు కూడా కలిసి వస్తుంది! పిల్లల ఉచ్చలు, దొడ్లు, వేరు శనగ చెత్త, బత్తాయి తొక్కలు, పిల్లల యేడుపులు, అరుపుల నించి తప్పించుకొని, హాయిగా పేకాటో, పడకో చిత్తగించడానికి మనల్ని వేరే రైలు పెట్టెలో కూర్చో పెట్టి అదీ మన కోసమే అంటున్నారు!......"
"నిజమే బాగా చెప్పారు! అందుకే మావారు యెక్కడికి వెళ్ళినా నన్ను ముందు అడాళ్ళ పెట్టెలో ఎక్కిం చేసి ఇంక గిజామన్నా కనపడకుండా మాయమయిపోతారు. దిగే స్టేషన్ వచ్చేవరకు!" బుగ్గలు నొక్కుకుంది పార్వతమ్మ.
"దయచేసి ప్రసంగం మధ్యలో మాట్లాడవద్దని ఇంకోసారి మనవి చేస్తున్నాను. మాట్లాడాలని వున్న వారంతా ఆమె దిగినాక మాట్లాడవచ్చు" సెక్రటరీ శారదాదేవి ఇంకోసారి హెచ్చరించింది.
'అయ్యో! రాత! మాకేం వచ్చు. ప్రసంగాలు, ఉపన్యాసాలు , దిబ్బ! ఏదో మాట వచ్చింది గాబట్టి అన్నా!" మూతి త్రిప్పుకుంది పార్వతమ్మ.
"కానీండి, సులోచనగారూ!"
"రైలు పెట్టెల లాగే సినిమాలూ! ఏడుపులూ, గోలకి దూరంగా వుందామన్న స్వార్ధం తప్ప, మనమీద అపేక్ష యెంత మాత్రం గాదు! అలాగే స్కూళ్ళు, కాలేజీలునూ! చదివే మన సంఖ్య కూడా ఎక్కువయింది. కాబట్టి విడిగా వుంటే కాస్త మగవాళ్ళు బుద్దిగా చదువుతారని మనల్ని వేరుగా పడేశారు! అందర్లోనూ సంస్కారులమని, అధునికులమనీ బురఖా కప్పుకోడానికి పెళ్ళాన్ని పార్టీలకి సినిమాలకి తీసుకెడుతున్నారు. పత్రికలలో పేజీలు కేటాయించామన్న దొక క్రొత్త ఘనకార్యం! అరవై డెబ్బై పేజీల పుస్తకంలో ఓ రెండు పేజీలు ఆడవాళ్ళ పేరుతొ ప్రచురించి, అందులో సగం మగవాళ్ళ ప్రశ్నోత్తరాలతో సరిపెట్టి, ఎంత విశాల హృదయం చాటుకుంటున్నారు మగవాళ్ళు! పత్రికలూ చదివేవారిలో అధిక సంఖ్యాకులు స్త్రీలు కాబట్టి , వాళ్ళని ఆకర్షించి, సంతృప్తి పరచి సేల్సు ఎక్కువ చేసుకోవాలన్న వ్యాపార దృష్టి తప్ప ఇంకేం లేదని ఎవరికి తెలియదనో! ఆడది కలం పడితేనే చాలని మన కధలలో ఏ పసా లేకుండానే ప్రైజులు ఇచ్చేస్తున్నారట! ఆడవాళ్ళ పురోభివృద్దికి పాటు పడడంలో యిదో మార్గమట! ఆడదీ అవకాశం .......... స్త్రీ తమని అన్ని విషయాలలోనూ మించగాలదన్న నిజం ఒప్పుకోలేక , యీ రాస్తున్న ఆడవాళ్ళందరికి మగవాళ్ళే రాసి పెడ్తున్నారని చాతుకుని సంతృప్తి పడుతున్నారు మగవాళ్ళు!
"డ్రైవర్ని పెట్టుకుంటే డబ్బు ఖర్చని, డ్రైవింగ్ నేర్పి పిల్లల్ని స్కూళ్ళకి, దింపమని, వాళ్ళు చేసే పనులు కూడా మన నెత్తిన రుద్ది బజారు పనులు చేయించడం, అదీ స్త్రీ జాతి అభ్యుదయానికి అంటే ఏడవాలా నవ్వాలా? ఈ కరువు కాలంలో ఓ పావుగజం గుడ్డ తగ్గినా తగ్గడమేనని వాళ్ళకి తెలియకనా, స్లీవ్ లెస్ లు తొడుక్కొనిచ్చేది! అలాగే నైలాన్లు, డ్రలాన్లు, టేర్లిన్లు చాకలి ఖర్చు తగ్గుతుందనే కట్టనిస్తున్నారు. ఇంక మన జుట్టుని మనం రకరకాల సింగారించుకోడానికి కూడా వాళ్ళే జాలిపడి పర్మిషన్ యిస్తున్నట్టు మాట్లాడుతుంటే ...... ఇంక దానికి జవాబు ఏముంటుంది?!...... నిజానికి మన శరీరాల మీదనే మనకి హక్కు లేదన్న సంగతి నేనుచెప్పనక్కర లేకుండానే మీ కందరికీ తెలుసు!......"
అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.
"మన క్కావాల్సింది యేదన్నా సాధించాలంటే ముందు కావాల్సింది మన మంతా ఐకమత్యంతో ఒక త్రాటి మీద నడవడం! అది లేనినాడు యెన్ని సభలు, చర్చలు ఉపన్యాసాలు జరిగినా శుష్క దండుగ! మరింతగా నలుగురిలోనూ ఎగతాళి చేయబడడం తప్ప జరిగేదెం వుండదు!" సులోచన తన మాటల ప్రభావం అందరి మీద ఎలా పని చేస్తుందో నని పరికించి చూసి కూర్చుంది. సభ్యులు యధావిధి చప్పట్లు చరిచారు.
"ఈసారి మీరు మాట్లాడండీ లలితగారూ! మీరు ఉద్యోగినులు కదా! ఉద్యోగాలు చెయ్యనిచ్చాం అని ప్రగల్భాలు పలికే మగవారికి సమాధానంగా అందులో జరిగే అన్యాయా లేమిటో వివరించండి!" శారదాదేవి కోరింది.