Previous Page Next Page 
ఆక్రోశం పేజి 28


    ఆధునిక చరిత్రలో మొట్టమొదటిసారిగా నాణాలు క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో టర్కీ దేశంలో లిడియా రాజ్యంలో ప్రవేశపెట్టబడ్డాయి. లోహాలు, నాణాలుగా రూపుమాపడం అదే ప్రథమం. ఆ నాణాలు వేర్వేరు బరువుల్లో వుండేవి. ఆ బరువుల్ని సూచించేందుకు వాటిమీద బొమ్మలుండేవి. ఈ నాణాలు తయారుచేసే పద్ధతిని మీటింగ్ అంటారు. "లిడియన్ రాజులు తమ నాణాలపై సింహపు తలను గుర్తుగా ముద్రించేవారు" ఆ తర్వాత ఈ నాణాలు లిడియా నుంచి యూరప్ కు, యూరప్ నుంచి రష్యా, ఇటలీ, చైనా, థాయ్ లాండ్, జపాన్ ల్లోకి ప్రవేశించాయి. ఆయా దేశాలు, తమ తమ నాణాల తయారీలో రకరకాల పద్ధతుల్ని అనుసరించాయి. లిడియా గుండ్రంగా, కోలగా నాణాలు తయారుచేస్తే, రోమ్ లో పర్స్ సైజులో ఏనుగుబొమ్మతో నాణాలుండేవి. పార, కత్తి, రింగు సైజులలో నాణాలు రాగా, జపాన్ లో 12-19 శతాబ్దాల మధ్య ఏర్పడిన మిలటరీ పాలనకు గుర్తుగా షోగన్స్ బొమ్మల నాణాలు, ఏర్పడ్డాయి. ఇవన్నీ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి నాణాలు.

 

    డబ్బుగా కాగితం :

 

    బ్యాంకునోట్లు, డాక్యుమెంట్ల రూపంలో డబ్బు చలామణీ కావడం. పదవ శతాబ్దంలో చైనాలో ప్రారంభమైంది. 11వ శతాబ్దంలో చైనా ప్రభుత్వం ముద్రించిన రసీదులు డబ్బుగా చలామణీలోకి వచ్చింది. ఈ పేపర్ మనీని యివ్వడానికి చైనాలో అప్పట్లో దేవాలయాలు బ్యాంకులుగా పనిచేసేవి.

 

    మొట్టమొదట 1665లో మని ఆర్డర్ అనే ఇప్పటి పద్ధతి లండన్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. జాన్ లెవీన్ అనే వ్యక్తి, తన సేవకుడికి యాభై పౌండ్లు ఇమ్మని మోరిసే క్లీటన్ అనే వ్యాపారస్తులకు ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరం ఆధారంగా ఆ సేవకుడు ఆ యాభై పౌండ్లనూ పొందాడు. ఈ పద్ధతే రకరకాలుగా మారి మని ఆర్డర్ పద్ధతికి దారి తీసింది.

 

    మొట్టమొదటిసారిగా 1661లో నాణాల కొరత కారణంగా స్వీడిష్ స్టాక్ హోం బ్యాంక్ 100 డాలర్ల విలువతో ప్రింట్ పేపర్ ని తయారు చెయ్యడం జరిగింది. కరెన్సీ ముద్రణ చరిత్ర యిలా ప్రారంభమైంది. ఆ తర్వాత 1665లో అదే సంవత్సరంలో జోర్గాన్ ధోర్ మోహ్ లెన్ అనే వ్యాపారి ముద్రించిన నోట్లను డబ్బుగా ప్రచారంలోకి తెచ్చాడు.

 

    ఫ్రాన్స్ లో జాన్ లా అనే వ్యక్తి పేపర్ మనీకి ఆద్యుడే కాక, 1718లో పారిస్ ఒక బ్యాంక్ ని ఏర్పాటు చేసి, బ్యాంకింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు. 17వ శతాబ్దంలో పేపర్ మనీ బ్రిటన్ లోకి రాగా, 1786లో ఇటలీలోకి, తర్వాత్తర్వాత అన్ని దేశాలకు పాకిపోయింది. మొట్టమొదట కమర్షియల్ బ్యాంక్స్ పేపర్ మనీని వాడడం హాంకాంగ్ లో 1954లో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పేపర్ మనీతో పాటు నాణాల వాడకం కూడా హెచ్చింది. వింత వింత డిజైన్లతో, నాణాలు తయారు కాజొచ్చాయి. అలాగే బ్యాంకు నోట్లు (కరెన్సీనోట్లు) తయారయ్యాయి. అదే సమయంలో ఫాల్స్ బ్యాంకునోట్లు, నాణాలు కూడా మార్కెట్లోకొచ్చాయి. 1835లో మొట్టమొదట ఫోర్జరీ నోటు బ్యాంకు ఆఫ్ రోమ్ లో బయటపడడం ఆశ్చర్యకర విషయం-

 

    16వ శతాబ్దంలో వ్యాపారానికి మూలకేంద్రంగా ఆధునిక కరెన్సీని గుర్తించడం జరిగింది. అలాగే యుద్ధాలు కూడా ఆయా దేశాల్లోని యువకులకు, డబ్బు ఎర చూపి, సైనికులుగా మార్చి శత్రుదేశాలపై దండయాత్రకు పంపడంతో పాటు, యుద్ధంలో గెలిచిన సైనికులకు డబ్బును బహుమతిగా ఇవ్వడం కూడా ప్రారంభమైంది.

 

    రాయిగానూ, రప్పగానూ మొదలైన మనీ, ప్రపంచ వ్యాపార వ్యవస్థకు, మానవ జీవన కేంద్రానికి మూలం కావడానికి అట్టే సమయం పట్టలేదు. డబ్బు కోసం, సముద్రంలో పయనించే నౌకలమీద దోపిడీలు ప్రారంభమయ్యాయి. డబ్బుమీద, బంగారమ్మీద పెరిగిన వ్యామోహం, యుద్ధాల వరకూ వెళ్ళడం ప్రారంభించింది.

 

    బంగారం మీద పెరిగిన వ్యామోహానికి అప్పటికీ యిప్పటికీ ఏకైక ఉదాహరణ కింగ్ మిడాస్ కథ.

 

    కింగ్ మిడాస్ శక్తికి మెచ్చి దేవతలు ప్రత్యక్షం అయ్యారు. వరం కోరుకొమ్మని అడిగారు. తను స్పృశించిన ప్రతి వస్తువూ బంగారం కావాలని కోరుకున్నాడు మిడాస్ రాజు. దేవతలు అనుగ్రహించారు. కానీ రాజు సంతోషం, దుఃఖంగా మారడానికి అట్టే సమయం పట్టలేదు. తను తినే ఆహారం, పానీయం అన్నీ బంగారుమయమై పోయాయి. దాంతోపాటు మిడాస్, కుమార్తె కూడా స్వర్ణ ప్రతిమ అయిపోయింది. చివరకు ఆ రాజుకు దుఃఖమే మిగిలింది.

 

    అలాగే ప్రపంచంలో మొదటి నమ్మకద్రోహం ఈ డబ్బువల్లే జరిగింది. ముప్పై వెండి నాణాల కోసం ఏసుక్రీస్తు ప్రియశిష్యుడైన జుడాస్, క్రీస్తు గురించి విలువైన సమాచారాన్ని శత్రువుల కందించాడు. క్రీస్తు మరణానికి కారకుడయ్యాడు.

 

    అలాగే ప్రేమ, మమతలకు కూడా, బంగారు నాణాల గుర్తులుగా బ్రిటన్ లో, అమెరికాలోనూ కొన్నాళ్ళ క్రితం చలామణీలో వున్నాయి. ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమకు గుర్తుగా, బంగారు నాణాలపై తమ పేర్లను ముద్రించుకుని, ఒకరినొకరు బహుమతిగా యిచ్చుకునేవారు. అలాగే చావుకు కూడా. ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంగా ఆ వ్యక్తి పేరుతో నాణాలు విడుదల చేయడం ఒక సంప్రదాయంగా మారింది.

 

    వివిధ లోహాల నాణాల్ని బంగారు నాణాలు శాసిస్తుంటే, బంగారు నాణాల్ని, కాగితపు నోటు శాసిస్తోంది. రాన్రానూ డబ్బు వినిమయంలో చెక్కులు ప్రవేశించాయి. అందులోనూ ప్లాస్టిక్ బ్యాంక్ కార్డులు.

 

    1970లో ఒక పత్రికలో ఒక వ్యాసం రాసిన ఒక రచయిత, తన పారితోషికాన్ని, ఒక బ్రతికున్న ఆవు చర్మం మీద రాసి పంపగా అదే చెక్కుగా, దాన్ని డబ్బుగా మార్చుకున్నాడా రచయిత.

 

    ఇప్పటివరకూ మనకు తెల్సిన బ్యాంక్ కార్డ్ లు, ప్లాస్టిక్ కార్డ్ లు, ఇటీవల ఫ్రాన్స్ లో స్మార్ట్ కార్డులొచ్చాయి. మైక్రోస్కోపిక్ కంప్యూటర్ కార్డులు ఈ కార్డుల్లోనే వున్న చిన్న కంప్యూటర్లో, ఆ కస్టమర్ డబ్బుకు సంబంధించిన ఎకౌంట్స్ వుంటాయి. ట్రాన్ జాక్షన్ వివరాలుంటాయి.

 

    టెలిఫోన్ కార్డులు, ఛార్జ్ కార్డులు కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో వున్నాయి. టెలిఫోన్ కార్డులకు సంబంధించి, మనం నిర్దేశించిన మొత్తం ఆ డిపార్టుమెంటుకు కడతాం. ఆ డిపార్టుమెంటు మనకు టెలిఫోన్ కార్డు ఇస్తుంది. ఆ కార్డుద్వారా ఏ పబ్లిక్ టెలిఫోను బూత్ దగ్గర్నించైనా మనం టెలిఫోను చేసుకోవచ్చు.

 

    క్రెడిట్ కంపెనీలు, షాప్స్ యిచ్చే కార్డులు ఛార్జ్ కార్డ్ లు. మొదట మనం ఎక్కడైనా మనకు అవసరమైన సరుకుల్ని కొంటాం. ఆ తర్వాత నగదు రూపంలోగానీ, చెక్ రూపంలోగానీ ఆ మొత్తాన్ని చెల్లించే సదుపాయం ఈ కార్డు మనకిస్తుంది.

 

    భవిష్యత్తులో డబ్బు :

 

    కంప్యూటర్ ద్వారా, డబ్బు వినియోగం విషయంలో యిప్పటికీ అనేక దేశాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. మన దగ్గర ఒక కాలిక్యులేటరు, ఒక కీ బోర్డు వుంటే చాలు. మనకు కావల్సిన కరెన్సీ మనకు వెంటనే అందుతుంది. ఆ కరెన్సీకి సంబంధించిన ఇన్ ఫర్ మేషన్ ఆ కాలిక్యులేటర్లో చిప్స్ రూపంగా వుంటుందని పరిశోధకులంటున్నారు.

 Previous Page Next Page