Previous Page Next Page 
రక్తచందనం పేజి 28


    తను డ్యూటీలో జాయినయిన వారంలోపే వీరూని కానీ, అతని సరుకును కానీ ఎదుర్కొనే సంఘటన....?!
    తను నమ్ముకున్న రెండొందల మంది సిబ్బంది అవసరమయితే ప్రాణాలొడ్డయినా పోరాడతారా....? అందులో వీరూ ఇన్ ఫార్మర్స్ ఎంతమందో....? ఎంత మందున్నా గిరి గీసుకొని వార్ డిక్లేర్ చేశాక వెనుకంజ వేయకపోవచ్చు.
    ది పోలీస్ మెన్ లివ్ అండర్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఏమ్ బుష్ ఎనీ టైమ్....తను ఓ ఇంగ్లీష్ పత్రికలో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది. తమ ఉనికిని మరుగు పరుచుకోవలసిన ఈ సమయంలో ఎలా వారికి ధైర్యాన్ని నూరిపోయటం....? రంజిత్ అలా ఆలోచిస్తున్నంతలో దినేష్ వచ్చాడు.
    రంజిత్ తన చెవిని దినేష్ వైపుకి వంచాడు.
    "వీరూ సరుకు రాబోతుందంట. మరో గంటకో, రెండు గంటలకో రావచ్చట. అభ్యంతరమేమీ చెప్పకుండా వదిలేయటానికే సిద్ధంగా ఉన్నారు. బ్రిడ్జీకి ఆవల ఉన్న తమిళనాడు చెక్ పోస్ట్ సిబ్బంది కూడా అందుకు సిద్ధమైందట" గుసగుసలాడాడు దినేష్!
    రంజిత్ లో ఉత్సాహం రెట్టింపయ్యింది.
    వీరూ తన సరుకు ఏ చెక్ పోస్ట్ గుండా వెళ్ళాలనుకుంటే ఆ చెక్ పోస్ట్ సిబ్బందికి అడ్డుతగలకండని ముందుగానే హెచ్చరిక పంపిస్తాడని తన జీప్ లో వచ్చిన రేంజర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఒకింత గర్వంగా ఫీలయ్యాడు. కాలం భారంగా కదులుతోంది.


                                                   *    *    *    *


    అర్దరాత్రి రెండు గంటలయింది.
    ఉధృతంగా వీస్తున్న చలిగాలికి తట్టుకోలేక విజయ్, మహిమ కిందకు వచ్చేశారు.
    అయినా పడుకొనే ప్రయత్నం చేయలేదు.
    "నువ్వు కోరుకుంటున్నట్లు అతని పూర్వీకుల గురించి తెలుసుకోవాలంటే ఒక్కటే రిలయబుల్ సోర్స్ ఉంది...." విజయ్ చెప్పటం పూర్తికాకముందే సడన్ గా అడిగింది మహిమ_
    "ఏమిటది....?" అని.
    "ప్రకాశం పాలయం చర్చ ఫాదర్....ఆ ఫాదర్ కి దాదాపు ఎనభై ఐదేళ్ళుంటాయి. ప్రకాశం పాలాయం గోపీనాధం గ్రామానికి దగ్గరలో ఉంది. ఆ ఫాదర్ అంటే వీరూకి గౌరవాభిమానాలే కాదు_ భక్తి భావం కూడా ఉందట. వీరూ తరచూ ఆయన్ని కలిపి వెళ్తుంటాడని అంటారు. ఎప్పుడొస్తాడో....ఎలా కలుస్తాడో.... ఎలా వెళ్ళిపోతాడో ఎవరికీ తెలీదు. పోలీసులు నిఘా వేసినా రావటం_కలవటం_వెళ్ళిపోవటం జరుగుతోందట.
    గోపీనాధంలో వీరూ కట్టించిన గుడి ఒకటి ఉందట. జూలై నెలలో ప్రతిసంవత్సరం వచ్చి ఆ గుడిలో పూజలు జరిపించి వెళ్ళిపోతాడట....
    ఐ.సి.ఎస్.లు, ఐ.ఎఫ్.ఎస్.లు, పోలీస్ ట్రైనింగ్ లు, ఎక్బెన్ జీప్ థీరియాటికల్ నాలెడ్జి, అధికారాలు కమ్యూనికేషన్ నెట్ వర్క్, వాహనాలు గెస్ట్ హౌస్ లు, టీ.వీ.లు, బేటాలుమ జీతాలు, టి.ఏ.లు, డి.ఏ.లు, ఎన్ని సౌకర్యాలున్నా, ఒకే ఒక వ్యక్తిని పట్టుకోలేకపోవటం ఏమిటి?
    వీరూ ఖచ్చితంగా నేరస్థుడే_స్మగ్లర్_కాదనలేం. కానీ అతనికి ఏ మోడరన్ ట్రైనింగ్ లేదు. అధికారం లేదు. మరెలా తప్పించుకు తిరుగుతున్నాడు....? అదే ప్రతిఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.... అతను కనుక ఆ మార్గాన్ని ఎన్నుకోకుండా ఏ పోలీసు శాఖలోకో వచ్చి ఉంటే వాట్ విల్ హేపెన్....?!" విజయ్ నిట్టూరుస్తూ అన్నాడు.
    "ఇక పడుకుందాం_రేపే మనం ప్రకాశం పాలాయం వెళుతున్నాం. ఫాదర్ ని కలవబోతున్నాం. బైదిబై ఫాదర్ పేరేమిటి....?" ఉన్నట్లుంది అంది మహిమ.
    "రేపా....?!" విజయ్ విస్తుపోయి అన్నాడు.
    "విత్ యువర్ కైండ్ కోఆపరేషన్ _ ఫాదర్ పేరేమిటి?" తిరిగి అడిగింది.
    విజయ్ నవ్వుతూ అన్నాడు_"జోసెఫ్ అనుకుంటాను. నాకూ ఖచ్చితంగా తెలీదు"
    మరో పది నిమిషాలకు ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు.


                             *    *    *    *


    తెల్లవారుఝాము మూడు గంటలు....
    మేన్ ఈటింగ్ టైగర్స్ ని చిరుతపులుల్ని వేటాడాలనుకొనే వేటగాడికి సహనం, నేర్పు, ఓర్పు, శారేరక దారుఢ్యం ఉండవలసినట్లే_ అటవీ అంతర్భాగంలో దాగుడుమూతలాడే నేరస్థుల్ని, స్మగ్లర్స్ ని పట్టుకోవాలన్నా ఆ స్థాయి నేర్పు, ఓర్పు ఉండాలి. క్రమంగా చలిగాలి ఉధృతమవుతోంది.
    పల్చటి మంచుపొగ ఆటవీ ప్రాంతాన్ని కమ్ముకుపోతోంది. రెండొందలమంది చలికి ఒణికిపోతూనే, చెవులు రిక్కించి రోడ్డు వైపు, బ్రిడ్జివైపు దృష్టిని నిశితంగా సారిస్తున్నారు ఏ క్షణాన ఏం ముంచుకు వస్తుందోనని.
    రంజిత్ కూర్చున్న ప్రాంతానికి నది కేవలం పదిహేను అడుగుల దూరంలోనే వుంది. మునివేళ్ళపై పొంచి కూచోవటంతో వేళ్ళు, పాదాలు తిమ్మిర్లెక్కిపోయాయి రంజిత్ కి.
    పక్కనేవున్న రేంజర్ అప్పటికే డీలాపడిపోయాడు.
    దినేష్ మాత్రం కన్నార్పటంలేదు.
    అందరికన్నా చివరిగా నక్కి కూర్చున్న శర్మ ఏకాగ్రతతో పరిసరాల్నే గమనిస్తున్నాడు.
    రంజిత్ మునివేళ్ళపైనే రేంజర్ దగ్గరకు పాకి _ "రానట్లేనా....?" అన్నాడు చెవిలో.
    "ప్రతిక్షణం దెబ్బతిన్న చిరుతపులిలా వుంటాడు వీరూ. అతని ఎత్తులు అనూహ్యం. సరుకు ఇటునుంచే ఈ రాత్రికే వెళుతుంది. ఎప్పుడు, ఎలా అన్నది ఆఖరిక్షణం వరకు అతని అనుచరులకే తెలియనివ్వడు" అన్నాడు రేంజర్.
    నది వెండి జలతారులా, అడవి మధ్య పరిచిన వెండిరంగు పట్టుచీరలా వుంది. చెక్ పోస్ట్ లో గార్డ్స్ కునికిపాట్లు పడుతున్నారు.
    తమకి దగ్గర్లోనేవున్న పొదల్లో తమ పై అధికారులు, సిబ్బంది పొంచివున్నట్లు వారికి తెలీదు.
    రేయి గడుస్తున్నా లారీల జాడలేదు.
    మంచుకు తడిసిపోతున్న చెట్లు, పొదలు క్రమంగా కనుమరుగయిపోతున్న భావన....చీమ చిటుక్కుమంటే వినిపించేంత ఆ నిశ్శబ్దం....
    ఉన్నట్లుండి నిశ్శబ్దాన్ని బ్రద్దలుచేస్తూ తీతువు అరిచింది. భయంతో అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.
    అంతలో ఏదో చప్పుడు....
    రంజిత్ చెవుల్ని రిక్కించి విన్నాడు.
    సందేహంలేదు....లారీలు వస్తున్నాయి.
    మరికొద్ది క్షణాలకు వస్తున్నది లారీలేనని స్పష్టంగా తెలిసిపోయింది.
    అందరూ అలర్ట్ అయిపోయారు.
    చెక్ పోస్ట్ గార్డ్స్ ఉలికిపాటుతో లేచి బ్రిడ్జికి అడ్డంగా వున్న సర్వే కడ్డీని పైకి లేపారు. లారీల శబ్దంతో పరిసరాల్లోని నిశ్శబ్దం చెదిరిపోవటంతో గాఢ నిద్రలోవున్న చిన్న జంతువులు నెలవుల్ని వదిలి పరుగులు తీస్తున్నాయి.
    అందరూ తమ చేతుల్లోని గన్స్ ని పొజిషన్ లోకి తీసుకొని, ప్రాణాలమీద ఆశలు వదులుకొని సేఫ్టీ కాచ్ ఆన్ లోకి తెచ్చుకున్నారు.
    రంజిత్ దినేష్ చెవిలో ఏదో చెప్పాడు.
    దినేష్ రేంజర్ చెవిలో ఏదో చెప్పాడు.
    లారీలు మలుపు తిరిగాయి....
    హెడ్ లైట్స్ కాంతి బ్రిడ్జీమీద వారి ముందున్న రోడ్డుమీద పడింది. వరుసగా.... ఒకటి.... రెండు.... మూడు.... నాలుగు లారీలు రొదచేస్తూ వస్తున్నాయి.
    అందరూ మునివేళ్ళపై పైకి లేచారు.
    ఒక్క ఉదుటున మెరుపుదాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. రంజిత్ ఊహించినట్లుగా లారీలు దూసుకుపోలేదు. చెక్ పోస్ట్ దగ్గర ఆగాయి. ఏం చేయాలన్న మీమాంసలోపడ్డ రంజిత్ దినేష్ సూచన మేరకు ఎటాక్ చేయాలనే నిర్ణయానికే వచ్చాడు.

 Previous Page Next Page