Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 28


    ఏం జరిగింది సాగర్ కి? ఎవరయినా ఏదన్నా....?
    నీరసంగా కుర్చీలో కూర్చుంది.
    అసలు తనకేదన్నా ప్రాబ్లమ్ వుంటే సాగర్ ఫోన్ చేసన్నా చెప్పేవాడే.... లేక కనీసం ఫోన్ చేయడానిక్కూడా టైం లేకుండా హఠాత్ గా ముంచుకొచ్చిందా ఏదన్నా....
    అసలు విషయమేమిటో తెలియకుండా ఏమిటిది. తను పిచ్చి పిచ్చిగా....
    వెంటనే బయల్దేరింది అంకిత.
    దారి పొడవునా ఆమె మనసు మనసులో లేదు.
    'సాగర్ _ ప్రమాదం' అనగానే తనలో కలిగిన భావోద్రేకానికి కేవలం స్నేహమే కారణమా...? కాదు__ కాదు__ అని మనసు ఒక ప్రక్కన ఘోషిస్తుంటే తల విదిలించి ఆ ఆలోచనను పారద్రోలేసిందామె.
    యింటికి తాళం కనిపించడంతో నిస్పృహ ఆవరించి వెనక్కి తిరిగిందామె.
    "ఏమ్మా.... ఎవరూ....?" అన్న గొంతు విని వెనక్కి తిరిగింది.
    ప్రక్కింటావిడ నిల్చునివుంది. అంకిత వెనక్కి తిరగ్గానే గుర్తించిందావిడ.
    "ఓ....నువ్వామ్మా?"
    "లేడాండీ?" ఏమనాలో తోచక అన్నమాట అది.
    "లేడమ్మా. అలవాటు ప్రకారం తాళంచేతులిచ్చి వెళ్ళాడు. ఇంద కూర్చో వచ్చేస్తాడేమో"
    తాళం చెవులందించింది అంకితకు.
    తాళం తీసి లోపలికి అడుగుపెట్టింది అంకిత. గది నీట్ గా వుంది.
    కాసేపు చుట్టూ తిరిగి నీళ్ళు తాకింది. తర్వాత టి.వి. పెట్టింది. ఏదో జానపద నృత్యం వస్తోంది. టేబుల్ సర్దసాగింది తోచక. డైరీ ఒకటి కనిపించి కాజువల్ గా అందుకొంది.
    'పరాయివాళ్ళ డైరీ చదవకూడదు' అని మనసు ఘోషిస్తున్నా "సాగర్ తనకు పరాయివాడా" అన్న అదోరకం అనుభూతితోనూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్ నేర్పిన కుతూహలంతోనూ కాగితాలు తిరగేయసాగింది.
    ఒక్కో పేజీ చదివేకొద్దీ ఆమె ముఖంలో రకరకాల భావాలు కదలాడసాగాయి. అదోలాంటి షాక్ కు లోనయ్యిందామె.
    ఇక్కడ అంకిత డైరీ చదవటం ప్రారంభించే సమయానికి అక్కడ ఓ హోటల్లో మారుమూల ఏ.సి. చల్లదనంతలో గత అరగంటలో మూడో టీ తాగుతూ వాచీ చూసుకున్నాడు సాగర్. ఏడుగంటల పదిహేను నిమిషాలయ్యింది టైము.
    ఇంకో గంటలో తనకు ఈ పరీక్ష పూర్తవుతుంది.
    భరద్వాజ ఇక మిగలడు.
    తాను శృతి, శృతి తాను....డబ్బు.
    ఓసారి పక్కనే వున్న ఎయిర్ బాగ్ తడిమాడు.
    అంతక్రితం రోజే శృతి తనకు ఇచ్చి, కాల్చడం తెలిసిన తుపాకి, సైలెన్సర్ తో సహా వుంది అందులో. పోలీస్ డిపార్ట్ మెంట్ లో తన పలుకుబడి వుపయోగించి తెచ్చిందా తుపాకి.
    ఆ పలుకుబడే తమకు రేపు శ్రీరామరక్ష.
    పట్టుబడితే....
    ఆ ఆలోచనను నెట్టేశాడు సాగర్! శృతి లేని జీవితం కన్నా ఉరే మంచిదనిపించిందతనికి.
    కనీసం అప్పుడయినా శృతి మత్తును వదిలి కాస్త పదునుగా ఆలోచించలేదు సాగర్.
    అదే అతను చేసిన ఆఖరి తప్పు.
    సాగర్ మూడో కప్పు టీ పూర్తిచేసే సమయానికి హడావుడిగా అతని ఇంటికి తాళం వేసి చెవి పక్కింట్లో ఇచ్చి రోడ్డున పడింది అంకిత. ఒకే ఒక ఆటో కనిపించింది కనుచూపు మేరలో. ఆ ఆటోకేసి నడిచింది అంకిత.
    ఇక్కడ అంకిత ఆటో కేసి వేగంగా నడవడము, అక్కడ భరద్వాజ ఇంటిలో ఆయన ప్రయివేట్ ఆఫీసు గదిలోని ఫోన్ రింగ్ కావడం ఒకేసారి జరిగాయి.
    ఫోన్ ఎత్తాడు భరద్వాజ. అవతల డి.ఎస్.పి. విశాల్.
    "హలో భరద్వాజ హియర్"
    "గుడీవినింగ్ సర్. డి.ఎస్.పి. విశాల్ దిస్ సైడ్"
    "హలో....ఏమిటీ హఠాత్తుగా మాపై పడింది మీ కన్ను?"
    "ఏం లేదు _ ఐదు నిమిషాల క్రితం మీ ఇంట్లోంచి ఎవరో హబీబ్ అట వచ్చాడు"
    "హబీబా? ఊళ్ళో లేడే. హి ఈజ్ ఎక్స్ పెక్టెడ్ టుమారో"
    "ఏమో.... తిరిగి వచ్చేశాడేమో. మీరేదో ప్రమాదంలో వున్నారని అతడి నమ్మకమట. కాస్త మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని అడగటానికొచ్చాడు"
    నవ్వేశాడు భరద్వాజ.
    "సిల్లీ. నేనంటే చాలా ప్రేమ వాడికి"
    "ఓ.... ఎలాంటి వాడతను?"
    "అప్పుడే మొదలెట్టేశారా? నాకెలాంటి భయమూ లేదు మహాప్రభో. వాడి మాటలు పట్టించుకోకండి"
    "అది నా ప్రశ్నకు సమాధానం కాదు"
    "హి ఈజ్ సిన్సియర్....లాయర్....చాలా?"
    "సాగర్ ఎవరు?"
    "సాగరా? ఎవరూ?"
    "మీ కంపెనీలో...."
    "ఓ.... అతనా.... ఔను. హి ఈజ్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్స్ డివిజన్ ఏం....? ఏం జరిగింది?"
    "ఏం లేదు.... వివరాలు కావలసి వచ్చినయ్.... అతను మంచివాడేనా?"
    "చాలా మంచి కుర్రాడు...."
    మీ పోలీస్ డిపార్ట్ మెంట్ తో ఇదే గొడవ! కాలికేస్తే తలకీ_ తలకేస్తే కాలికీ_ఇంకేమయినా అడగాలా! ఎందుకంటే అయామ్ లిటిల్ బిజీ."
    "ఓ.కే.... ఏదన్నా అవసరమొస్తే నన్ను కాంటాక్ట్ చేయడంలో వెనకాడవద్దు, ఆఫ్టరాల్.... వుయ్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్...."
    విశాల్ గంభీరంగా అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు.
    అవతల ఫోన్ డిస్కనెక్ట్ కాగానే తను కూడా ఫోన్ క్రెడిల్ చేసి తల ఎత్తిన భరద్వాజ తెల్లబోయాడు అతని నోట మాట రాలేదు.

 Previous Page Next Page