Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 28

"స్వప్నా?" అన్నాడు ఆర్ద్రంగా.
స్వప్న బదులు చెప్పలేదు.
"స్వప్నా! నన్ను నమ్ము! నా పక్కన ఉన్నంతవరకూ నీకు ఏ ప్రమాదమూ రాదు! రానివ్వను! ప్లీజ్ నవ్వుతూ ఉండు! ఒక్క పదిరోజుల్లో నిన్ను మీ ఇంటిదగ్గర క్షేమంగా దింపే బాధ్యత నాది! ష్యూర్ థింగ్!"
'పదిరోజులు' అని వినబడగానే మోకాళ్ళలో తల దాచుకుని వెక్కుతూ ఉండిపోయింది స్వప్న.
ఓదార్పుగా భుజం మీద చెయ్యి వెయ్యబోయాడు.
సివంగిలా అతన్ని తోసేసి, రౌద్రంగా చూసింది స్వప్న. "డోన్టు డేర్ టు టచ్ మీ! మాయమాటలు చెబుతూ అతి చనువు తీసుకోవాలని చూడకు! భూతాలరాజు మోటుగా మీద మీద పడుతున్నాడు! నువ్వు మాటలతో మత్తుమందు జల్లాలని... అసలు మగాళ్ళందరూ ఇంతే! ఆడపిల్లను చూస్తే చాలు!"
"షటప్! యూ స్వీట్ లిటిల్ ఇడియట్!"
ఆవేశంగా చెయ్యి ఎత్తింది స్వప్న. తన బలమైన పిడికిలితో ఆమె ముంజేతిని పట్టుకుని ఆపాడు సందీప్.
"వదులు!" అని విసురుగా విడిపించుకుని, చేతి వైపు చూసుకుంది స్వప్న. అతను పట్టుకున్నచోట ఒరుసుకుని ఎర్రగా కందిపోయింది చెయ్యి. బాధకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళకు మోచెయ్యి అడ్డం పెట్టుకుని కూర్చుండిపోయింది.
ఇంక ఆ సమయంలో ఆమెతో మాట్లాడి లాభం లేదనిపించింది సందీప్ కి. లేచి నిలబడ్డాడు. వళ్ళంతా చిరచిరలాడుతోంది. ఎదురుగుండా ఉన్న కొలను ఆహ్వానిస్తున్నట్లు కనబడుతోంది. తనివితీరా స్నానం చెయ్యాలనిపించింది. బట్టలు విడిచేసి, అండర్ వేర్ తో నీళ్ళలో దిగాడు.
చల్లగా హాయిగా, ఉన్నాయి నీళ్ళు. తీరిగ్గా ఈదుతూ, పరిస్థితిని అంచనా వేసి చూసుకున్నాడు సందీప్.
తను మమ్మీని వెదుకుతూ బయలుదేరినప్పుడు పరిస్థితులు ఇలా వికటిస్తాయని ఊహించలేదు. ఎక్సెలెంట్ కండిషన్లో ఉన్న జీపు ఉంది. నెల రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి.
వీటి సాయంతో, మరీ ఆడుతూ పాడుతూ కాకపోయినా, అంత శ్రమ ఏమీలేకుండానే మమ్మీ ఉన్నచోటుని చేరుకోగలననుకున్నాడు తను.
కానీ చిత్రంగా మారాయి పరిస్థితులు ఇప్పుడు. తమతోబాటు మరో గ్యాంగు మనుషులు కూడా మమ్మీని వెదుకుతూ బయలుదేరారని అర్థమయింది. వాళ్ళు అడుగడుగుకీ అడ్డంకులు కలిగిస్తున్నారు. ఈ అడవుల్లో మనుషులని తినడానికి అలవాటు పడ్డ పెద్ద పులి ఒకటి తిరుగుతోంది. సందు దొరికితే తనను అంతంచేసి పారిపోవడానికి భూతాలరాజు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉన్నాడు.
వీటన్నిటికీ తోడు, ఈ అమ్మాయిని రక్షించి, వెంట తీసుకెళ్ళవలసిన బాధ్యత కూడా నెత్తిమీద పడింది. అదికూడా ఎలాంటి అమ్మాయి ? పెంపుడు కుక్కలాగా మారాం చెయ్యకుండా వెంట నడిచే రకం కాదు. పొగరుబోతు పోట్ల గిత్త లాంటిది. ముక్కుకి తాడేసి లాక్కెడుతున్నంత ప్రయాసగా ఉంది తనకు.
ఉన్న చిక్కులు సరిపోనట్లు, ప్రత్యేక ఆకర్షణలాగా, భూతాలరాజూ, స్వప్నల మధ్య ఏర్పడ్డ వ్యతిరేక భావం ఒకటి!
గాడ్ ఓ గాడ్ !
ఈత మిగించి ఒడ్డు ఎక్కాడు సందీప్. తక్షణం అతనికి జరగరానిది ఏదో జరిగినట్లు స్ఫురించింది.
స్వప్న లేదు అక్కడ! భూతాలరాజు కూడా లేడు!
కీడు శంకించింది అతని మనసు. వెంటనే అడుగుజాడల కోసం, ఇతర సూచనల కోసం వెదకడం మొదలెట్టాడు. భూతాలరాజు అడుగుజాడలని అతను తేలికగానే గుర్తుపట్టాడు. ఏదో బరువు మోస్తున్నట్లు కొంచెం లోతుగా ఉన్నాయి.
స్వప్న కాలి గుర్తులు ఎక్కడా లేవు.
అంటే స్వప్నని మోసుకుంటూ వెళ్ళాడన్న మాట భూతాలరాజు! బాస్టర్డ్!
గన్ తాలూకు సేఫ్టీ కాచ్ రిలీజ్ చెసిం రెడీగా పట్టుకుని ముందుకు నడిచాడు సందీప్. ఒక ముళ్ళ కంచెకి పొడుగాటి తలవెంట్రుకలు ఒక పదిదాకా చిక్కుకుని ఉన్నాయి. అందుకుని చూశాడు... అవి స్వప్న కేశాలే! ఆమె జడ పిరుదులని దాటి వస్తుంది.

 Previous Page Next Page