సత్యనారాయణరెడ్డి రూపాయిన్నర కూలీకి రప్పించాడు. వాళ్ళు పొలంలో వంగపోతారనంగా మా ఊరి కూలీలు వాళ్ళకు అడ్డుపడ్డారు.
మరో అయిదు నిమిషాలు ఆలస్యమై వుంటే తలలు తెగేవి. కూలీల మధ్య యుద్ధం మొదలయ్యేది.
సరిగ్గా అప్పుడే జయ పరుగెత్తుకొచ్చింది.
పక్క ఊరి కూలీలకు జరిగిందంతా పూసగుచ్చినట్లు మొదటి నుంచి చెప్పింది.
అప్పటికి మా ఊరి కూలీలు శాంతపడ్డారు.
"కూలీ పెంచమని మేం అడిగాం. మా రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు మీరొచ్చి పన్లోకి డిగితే మేం ఏమైపోవాలి? తట్టా బుట్టా సర్దుకుని వెళ్ళిపోవాలి. ఇది మా ఊరి సమస్య. మేమే రాజీపడతాం. కూలీలం మనం. మనమంతా ఒక్కటే. మనలో మనకు పోటీలొద్దు, పోట్లాటలూ వద్దు. మీ ఊరికి మీరెళ్ళిపొండి. మీ ఊర్లోనూ కూలీ పెంచుకోండి. అంతేగానీ అర్ధ రూపాయి ఎక్కువిస్తున్నారని ఈ ఊరికి వచ్చి మా కడుపులు కొట్టద్దు." అని చేతులెత్తి దండం పెట్టింది జయ.
దాంతో పక్క ఊరి కూలీలంతా చర్చించుకున్నారు.
జయ మాటలు వాళ్ళను బాగా ప్రభావితం చేశాయి. మరో ఊర్లోకి వచ్చి వ్యవహారం పెట్టని వాళ్ళు అప్పటికప్పుడే కొడవళ్ళు పారేసి, తమ ఊరెళ్ళి పోయారు.
అలా మళ్ళీ సమస్య మొదటికొచ్చింది.
సత్యనారాయణరెడ్డి పొలంలో ఒక్క జొన్న కంకి కూడా తెగి కిందపడలేదు.
పక్కఊరి కూలీలను కూడా జయ పంపించివేసిందని తెలియగా సత్యనారాయణరెడ్డి కోపంతో ఉడికిపోయాడు.
"దాన్ని కొప్పట్టుకుని లాక్కు రండి బట్టలిప్పదీసి ఊరేగిస్తాను." అని హుకుం జారీ చేశాడు రెడ్డి తన పాలేర్లకు.
నలుగురు పాలేర్లు కర్రలతో బయల్దేరారు.
అయితే వాళ్ళు మాలపల్లి మర్రి చెట్టు దగ్గర ఆగిపోయారు. ఎదురుగ్గా దారికడ్డంగా ముప్పైమంది దాకా కర్రలతో, కళ్ళల్లో క్రోధంతో నిలబడి వుండడాన్ని చూసి ముందుకు అడుగు వేయడానికి సాహసించలేకపోయారు వాళ్ళు.
వెనక్కు తిరిగి వచ్చేసి పరిస్థితినంతా వివరించారు.
బోనులో పడ్డ పులిలా అయిపోయాడు సత్యనారాయణ రెడ్డి. ఏం చేయాలో ఆయనకు తోచలేదు. పొలంలో గింజలు రాలిపోతున్నాయి. ఇంకో రెండు రోజులుపోతే పంట కోయాల్సిన అవసరమే రాదు. ఓ గింజ ఇంటికి రాదు.
సత్యనారాయణ రెడ్డి ఇరుకున పడిపోయాడని గ్రహించిన రైతులు సంధి కుదర్చడానికి నడుం బిగించారు.
సత్యనారాయణరెడ్డికి నచ్చచెప్పారు. పంతానికి పోతే లక్ష రూపాయిల పంట భూదేవి పరమైపోతుందని హెచ్చరించారు. వేయి మంది జనాభా వున్న కూలీలను దౌర్జన్యంతో భయపెట్టలేమని సర్దిచెప్పారు.
సత్యనారాయణకి మెట్టు కిందకు దిగక తప్పలేదు.
కూలీలకు రూపాయిన్నర ఇవ్వడానికి అంగీకరించాడు.
రైతులు వెళ్ళి మాల పెద్దలకు విషయం చెప్పారు.
ఆ వార్త క్షణంలో మాలపల్లె అంతా గుప్పుమంది. ఆ రోజు వాళ్ళకు పండగయింది. రాత్రంతా కూలీలు పండరి భజనలతో కాలం గడిపారు. జయను ఆకాశానికి ఎత్తేశారు.
మరసటి రోజున మాలపల్లెంతా కదిలింది. సత్యనారాయణరెడ్డి పొలంలో వంగింది. వరి కంకులు తెగి కిందపడ్డాయి. వేరుశనగ భూమిలోనుంచి పైకొచ్చింది. సజ్జ, జొన్న పిట్టలకు దక్కకుండా పోయాయి.
మరో పదిహేను రోజులకు ధాన్యం సత్యనారాయణ రెడ్డి ఇంటికి చేరింది. పొలాలన్నీ బీళ్ళుగా తయారయ్యాయి. నూర్పిళ్ళు మొత్తం పూర్తయ్యాయి.
అందరూ జరిగిందంతా మరిచిపోయారు.
తిరిగి మా ఊర్లో సందడి ప్రారంభమైంది.
కబాడీ జరుగుతోంది. రాత్రయితే పండరి భజనలతో గ్రామం భక్తి ముసుగును కప్పుకుంటోంది. రైతులింట్లో పులి జూదాలు, దాయాలు ప్రారంభమయ్యాయి. మాలలంతా కూలీ గ్రాసంతో రెండు పూటలా తింటున్నారు. వైషమ్యాలన్నీ మాసిపోయాయి. సత్యనారాయణ రెడ్డి కూడా కూలీలతో మునుపటిలా వుంటున్నాడు. మళ్ళీ ఊరంతా కళకళలాడిపోతోంది. సత్యనారాయణ రెడ్డి జయని తన దగ్గర పనిమనిషిగా పెట్టుకున్నాడు. దీనికి జనం మరింత సంతోషించారు.
అంతక్రితం కలెక్షన్లు లేవని, ఒక రోజే వుండి వెళ్ళిపోయిన నాటక కంపెనీ తిరిగి మా ఊరొచ్చి వారం రోజులపాటు రకరకాల పౌరాణికాలు వేసింది. రెండు రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ లు వచ్చి మంచి లాభాలనే మోసుకుని వెళ్లాయి.
రకరకాల కాలక్షేపాలతో ఊరు చిన్న పిల్లలా ఎగిరెగిరి పడుతోంది.
సరిగ్గా ఆ సమయంలో మా ఊరొచ్చాడు పెరుమాళ్."
"ఎవరతను?" కీర్తి టెన్షన్ తో అడిగింది.
"మంత్రగాడు."
"ఆఁ?
"అవును పెరుమాళ్ మంత్రగాడనే ఆ ఊరికంతకీ తెలుసు. దాదాపు అయిదేళ్ళ నుంచి క్రమం తప్పకుండా మేనెలలో వచ్చి మోడీ పెట్టేవాడు."
"మోడీ అంటే?"
"మ్యాజిక్ షో అన్నమాట. వీథిలో జరిగే మ్యాజిక్ షో. కాస్తంత మొరటుగా వుండే విద్యలను ప్రదర్శించడాన్ని మోడీ అంటారు. ఎర్రగా కాల్చిన ఇనుప గుండును చేతుల్లో పట్టుకోవడంలాంటి వాటిని ప్రదర్శించడం అమ్మమాట. పెరుమాళ్ మంచి మాటకారి కూడా. దాంతో అతను ఊరికి వచ్చాడంటే చాలు జనం ఆనందంతో కేరింతలు కొట్టేవాళ్లు.
పెరుమాళ్ విద్యలన్నీ కనికట్టు అని కొందరంటే, మరికొందరు మంత్రాలని నమ్మేవారు. కొందరు అవన్నీ క్షుద్ర విద్యలంటే, ఇంకొందరు చేతి లాఘవమణి అనేవారు. మొత్తంమీద పెరుమాళ్ పెద్ద మంత్రగాడనే పేరుండేది.
పెరుమాళ్ ఊర్లోకి వచ్చాడనే వార్త క్షణాల్లో గుప్పుమంది. ఒక రెండు రోజులపాటు మోడీతో మంచి కాలక్షేపమని అందరూ గంతేశారు.
పెరుమాళ్ అంత క్రితం రోజు సాయంకాలమే ఊర్లోకి వచ్చాడు. రాగానే ఆనవాయితీ మేరకు సత్యనారాయణ రెడ్డి వసారాలో దిగాడు. ఊర్లోకి ఏ నాటక కంపెనీ వచ్చినా, ఏ డ్యాన్స్ ట్రూప్ వచ్చినా ఆయన వరండాలోనే వుండేవారు. ఆ ఇంటి వరండానే పెద్ద ఇల్లంత వుండేది.
వచ్చినవాళ్ళు వరండాలో వుండి, తమ ఎద్దుల బండ్లను ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో వదిలేశారు. ఎద్దులకు, ఆవులకు సత్యనారాయణ రెడ్డి వాముల్లోని గడ్డిని వేసేవారు.
రేపు మోడీ పెడుతున్నానని సత్యనారాయణరెడ్డికి చెప్పాడు పెరుమాళ్. ఆయన అనుమతి తీసుకున్నాక ఊర్లోని మిగిలిన రైతుల ఇళ్ళకు వెళ్ళి చెప్పాడు.
ఆ తరువాత చుట్టుపక్కల గ్రామాల్లో అంతా దండోరా వేయించాడు.
మరుసటి రోజు ఉదయానికల్లా జనం గుంపులు, గుంపులుగా రావడం మొదలెట్టారు.
హరిజనవాడకూ, ఊరికీ మధ్యనున్న పెద్ద మర్రి చెట్టు నీడలో మోడీని ఏర్పాటు చేశాడు పెరుమాళ్.
అప్పుడు ఉదయం తొమ్మిది గంటలైంది. అప్పటికే ఎండ చురుగ్గా కాస్తోంది. చెట్టు నీడ కింద కార్పెట్ లా పరుచుకుని వుంది.
చాలా సందడిగా వుందక్కడ. ఊర్లోని జనం అంతా అక్కడకు వస్తున్నారు. పక్క ఊర్లోంచి కూడా జనం బాగానే వస్తున్నారు. పెరుమాళ్ మోడీ అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కంతా మంచి పేరుంది.