ఆరోజంతా అతను గదికి పోలేదు. అతనికి తెలుసు తనకోసం అన్నో, ఎవరో వస్తారని. పిచ్చెక్కినవాడిలా ఎక్కడెక్కడో తిరిగాడు. సాయంత్రం అనుకోకుండా సౌదామినీ ఇల్లువున్న వీధిలోకి పోయాడు. ఆమె డాబామీద నిల్చునివుంది. అతన్ని దూరంనుంచి చూచి, గుర్తుపట్టి చేయెత్తి పిలవసాగింది. రాజారావు ఆమెను చూశాడు. మరుక్షణంలో వెనక్కి తిరిగి ఆమెకు కనిపించకుండా సందు మలుపు తిరిగిపోయాడు.
రాత్రి అతను గదికి వచ్చేసరికి పది దాటింది. ఒళ్ళంతా నీరసంగా, జ్వరం వచ్చినట్లుగా వుంది. ఎలాగో అవస్థపడి తాళంతీసి లోపలకు ప్రవేశించాడు. కళ్ళు తిరుగుతున్నాయి. చప్పున ప్రక్కమీద పడిపోయి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
ఓ పదినిమిషాలు గడిచాయి. ఆ బలహీనమయిన స్థితిలోకూడా అక్కడ ఎవరో వ్యక్తి చేరువలో కూర్చుని, తనవంక నిశితంగా చూస్తున్నట్లు అతనికి అనుభూతి కలిగింది. నెమ్మదిగా కళ్ళువిప్పాడు.
మంజువాణి తన పమిటచెంగుతో అతని కళ్ళు తుడుస్తూ "ఛీ! ఇదేమిటి?" అంది.
అతనామెను తన హృదయానికి అదుముకుని "నన్ను వదిలి వుండొద్దు వాణీ! నేను ఏకాకినై పోయాను. నేను నీతిలేనివాణ్ని" అన్నాడు.
మంజువాణి అతని పెదాలు తన సున్నితమైన తెల్లని వ్రేళ్ళతో మూసి "ఏం మాటలు? నన్ను చంపుకుతిన్నట్లే" అంది.
అతను నిద్రలో పడిపోయాడు.
* * *
ఓ రాత్రివేళ రాజారావుకు మెలకువవచ్చింది. మంజువాణి కోమల శరీరం అతని విశాల వక్షస్థలాన్ని అంటిపెట్టుకుని వుంది. ఆమె నిద్రపోతున్నదో లేదో అతనికి తెలియలేదు.
"మంజూ!" అని పిలిచాడు.
"ఊఁ" అన్నది ఆమె అతని గుండెపై.
"నిన్నెందుకో మంజూ! అని పిలవాలనిపించింది. నువ్వు ఇవాళ మరింత చేరువకు వచ్చావు. నిన్నిహ విడిచి నేను ఏమీ చెయ్యలేనని తెలుసుకున్నాను. అవునూ... ఇందాకటినుంచి నువ్వు నిద్రపోలేదూ?"
"పోయినట్లేవుంది. కాని పోలేదనుకుంటాను. మీకు కులాసాగా వుందా ఇప్పుడు?"
"మంజూ! నీలాంటిదాన్ని నేను నువ్వు అని పిలుస్తున్నాను. నన్ను 'మీరు' అని సంబోధిస్తావేం నువ్వు?"
"మిమ్మల్ని అలాగే పిలవాలిగనుక."
"మంజూ! బహుశా అయినవాళ్ళందరికీ. దూరమైపోతాను ఇహ, తెలిసిపోయింది అందరకూ నా వ్యవహారం గురించి. ఇహ నాకు వాళ్ళ దగ్గర గౌరవం లేదు. నన్ను పురుగుక్రింద, నీచుడి క్రింద చూస్తారు. మంజూ ఒకనాడు నేను సత్యవతిని తిరస్కరించాను. కాని ఇప్పుడు నా పేరు ఎత్తలేక అసహ్యంతో ఆమె శరీరం రోమాంచితమవుతుంది."
ఆమె గాద్గదికంగా "ఇదంతా నావల్లే వచ్చింది మీకు. నేను మీ జీవితాన్ని నాశనం చేశాను. ఎటూగాకుండా చేశాను. నా తప్పుకు క్షమాపణ ఎలా లభిస్తుంది? నన్ను కసితీరా నరికెయ్యండి."
ఆమెను మరింత గట్టిగా తన హృదయానికి హత్తుకుని "ఇప్పటివరకూ ఇద్దరం ఒకరినొకరు నరుక్కున్నాం. అది చాలదూ? పద, ఎక్కడికైనా లేచి పోదాం" అన్నాడు రాజారావు దృఢనిశ్చయంతో.
"మావారు?" అంది మంజువాణి.
"నాకోసం నువ్వు కఠినురాలవుకాలేవా మంజూ!" అన్నాడు రాజారావు దీనంగా.
ఓ క్షణం నిశ్శబ్దంగా గడిచింది. నిండయిన నిశ్శబ్దం. అప్పుడు అంది మంజువాణి సన్నని కంఠస్వరంతో: "మీకు నేను ఎలా అర్థమవుతాను రాజా? రెండు శక్తులమధ్య, రెండు ప్రేమలమధ్య నలిగిపోతున్న అభాగ్యురాలిని నేను నాలో కఠినత్వంతోబాటు కర్తవ్యంకూడా ఉంది. ఎన్నోసార్లు మీకు చెప్పకుండా తప్పించుకుంటూ వచ్చాను రాజా, వాతావరణాన్ని అసహ్యమయం చేశాను. మరి అంతకంటే నీచురాల్ని కాలేను. వద్దు. మన్నించండి. నన్ను మళ్ళీ అడక్కండి. నన్ను మరింత పతనం చేయవద్దు."
"పో మంజూ!" అన్నాడు రాజారావు బలహీనస్వరంతో.
అతనిజుట్టు నిమురుతూ మంజువాణి, "సత్యవతి మిమ్మల్ని విస్మరించలేదు. మీ అభిజాత్యం, వాళ్ళ అహంభావం ఆ పిల్ల జీవితాన్ని పాడుచేయటానికి మినహా మరెందుకూ పనికిరావు. మీది అపోహే. క్షమించగలదు సత్యవతి - ఆడది" అన్నది.
"ఎవరికి కావాలి మంజూ! ఈ కోరని క్షమాపణలు?"
"ప్రకృతిలో రాజీపడడమే జీవితపరమార్థం. దానికి విరుద్ధంగా..."
"నన్నేడిపించకు మంజూ! జరిగిపోయిందేదో జరిగిపోయింది. అది మరింత కెలికి చంపకు."
ఆమె ముందుకు జరిగి అతని ముఖంలో ముఖంపెట్టి అంది రహస్యంగా "మరి - ఎన్నటికైనా వియోగం."
"ఉష్" రాజారావు నేత్రాలలో నీరు చిమ్మింది. దాన్ని తుడవటానికై ఆమె చేతిని ఎత్తబోయింది. అతనాచేతిని అలానే పట్టుకుని ముఖం ఎత్తి ఆమె పెదవుల్ని చుంబించాడు. కన్నీరు కారుస్తూ ఆమె అలానే వుండిపోయింది. ఇద్దరి కన్నీళ్ళు కలిసిపొయ్యాయి.
* * *
మరునాడు తనకోసం ఎవరైనా వస్తారని భావించాడు. అలా జరుగలేదు. తనవాళ్ళంతా ఆరోజే ఊరు వెళ్ళిపోయినట్లు తెలిసింది. అతను తనకేదో అవమానం జరిగినట్లు భావించాడు. తాను ఎప్పటికయినా ఇంటికిపోక తప్పదు. అక్కడి పరిస్థితి - అబ్బా!
ఇలా అయిదారు రోజులు గడిచిపోయాయి. జీవచ్ఛవంలా కాలేజీకి పోయి వస్తున్నాడు. ఒకరోజు వంట్లో ఏదో నలతగావున్నట్లు అనిపించింది. అయినా మొండిగా తోసేసుకుని తిరిగాడు. ఆ రాత్రి బాగానే నిద్రపట్టింది. కాని మరునాడు ప్రక్కమీదనుంచి లేవబోయేసరికి సాధ్యంకాలేదు. విపరీతమైన నిస్సత్తువ, బాధ అనిపించింది. అతని ఒళ్ళు కాలిపోతోంది.
పాంచాలి వచ్చాక ఆమెతో హోటలునుంచి ఫ్లాస్కుతో కాఫీ తెప్పించుకుని తాగాడు. ఆమె అర్థం చేసుకుంది. క్రిందకి వెళ్ళి ఈ విషయం అప్పటికప్పుడు చాటింది.