Previous Page Next Page 
జైలు పేజి 28


    "జెయిలుకు రోజూ దినపత్రికలు వస్తాయా?"

 

    "ఆఁ. ప్రస్తుతం లీడింగ్ లో వున్న మూడు పత్రికలూ వస్తాయి. రోజూ ఉదయం పేపరు చదవడం అలవాటు. ఇక్కడ ఆ సదుపాయం వుండడం వల్ల బతికిపోయాను"

 

    "మీ మిత్రులు బుద్ధుడు, ఉత్తరుడు ఏమంటున్నారు?"

 

    వార్డర్ ఆర్ముగానికి అర్థం కాకుండా వాళ్ళిద్దరూ ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు. ఆయన ద్వారం దగ్గర నిలబడి విసుగ్గా చూస్తున్నాడు.

 

    "బాగా డిసప్పాయింట్ అయ్యారు. సెకండ్ టైమ్ సక్సెస్ అవుతామని ధైర్యం చెప్పాను."

 

    "అంటే మరోసారి ట్రై చేస్తారా! దట్స్ గుడ్. ఓటమిని చూస్తూనే జావగారిపోయే మనిషి కాదనుకున్నాను నిన్ను చూసినప్పుడే" అడ్మయిరింగ్ గా చూస్తూ అంది.

 

    "ఓటమి కలిగినప్పుడే రెట్టింపు స్పూర్తితో ముందుకు అడుగువేయడమే నాకు యిష్టం."

 

    "దట్స్ ఫైన్" మెచ్చుకోలుగా అంది.

 

    "ప్లాన్ రడీగా వుంది. ఈసారి నువు చేయాల్సింది చాలా వుంది" అన్నాడు మెల్లగా.

 

    "నిన్ను జెయిలు నుంచి తప్పించడానికి ఏమైనా చేస్తాను. ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను."

 

    ఆ మాటలకు అతను కదిలిపోయాడు. కృతజ్ఞతా పూర్వకంగా చూశాడు.

 

    అంతలో జెయిలు తోటలోంచి కేకలు వినిపిస్తే అటూ ఇటూ కదిలి "ఏమిటా అరుపులు" అని అడిగింది.

 

    "మా వాళ్ళు కొత్తపద్ధతిలో నిరసన ప్రదర్శిస్తున్నారు - ఈ ఐడియా నాదే. ఇప్పటివరకు అక్కడే వున్నాను. నువ్వు వచ్చావని తెలిస్తే ఇటొచ్చాను."

 

    "ఎందుకు?"

 

    "ఆనందరావనే ఖైదీ వున్నాడు. అతనికి బాగా పిచ్చి ముదిరిపోయింది. ఇక్కడ కాకుండా జనరల్ ఆస్పత్రిలో అతనికి ట్రీట్ మెంట్ యిప్పించమంటే శ్రీపతి ఒప్పుకోలేదు. ఆయన్ను ఒప్పించేవరకు ప్రతిరోజూ సాయంకాలం ఖైదీలందరూ పిచ్చిపట్టినట్టు నటించాలనుకున్నాను. అదే ఇప్పుడు ప్రారంభమైంది. ఈ అరుపులకు శ్రీపతి జైలుకి వస్తాడనుకుంటున్నాను. ప్రస్తుతం ఇంట్లో ఉన్నాడు."

 

    "ఆనందరావుకి పిచ్చి ఎందుకు పట్టింది?"

 

    "అదో పెద్ద విషాదం. అతను ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తండ్రి ఈ వూర్లో బాగా డబ్బున్నవాడు. తన కూతురు కులంగాని వాడిని పెళ్ళి చేసుకుందని తెలియగానే పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు మరో రెండు రోజులలో వాళ్ళిద్దర్నీ తిరుమలలో పట్టుకున్నారు. తన కూతురిని కిడ్ నాప్ చేశాడని, కేసుపెట్టి ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఆనందరావుకి కిడ్ నాప్ నేరం కింద శిక్ష పడింది. ఇతను జైలుకి వచ్చిన మూడురోజులకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. తన ప్రేయసిని చివరిసారి చూడడానికి పర్మిషన్ అడిగాడు. ఎస్కార్ట్ లేదన్న సాకుతో జైలు అధికారులు అతని కోరికను మన్నించలేదు. దాంతో అతను పిచ్చివాడైపోయాడు."

 

    "దారుణం" ఆమె తన సానుభూతిని ప్రకటించింది. కాసేపు అలా మౌనంగానే వుండిపోయింది తరువాత సర్దుకుని "ఇంతకీ ప్లాన్ చెప్పలేదు" అంది.

 

    "ఈసారి మనం ఫెయిల్ కావడానికి వీల్లేదు. చాలా పకడ్భందీగా ప్లాన్ చేశాను. రెండోసారి జరుగుతున్న ఈ జెయిలు బ్రేక్ లో మనం సక్సెస్ కావాలి."

 

    "ఓ.కే... ఇంతకీ నేనేం చేయాలి?"

 

    అతను సీరియస్ గా చెప్పుకుపోతున్నాడు.

 

    ఆమె శ్రద్ధగా వింటోంది.

 

    ఇదిలా ఉండగా జెయిలర్ వామనరావుతో కలిసి శ్రీపతి జెయిల్లో అడుగుపెట్టాడు.

 

    తన ఆఫీసుకు వెళ్ళి కారిడార్ లో నిలుచుని తోటలోకి చూశాడు.

 

    అక్కడ దాదాపు వందమంది ఖైదీలు పిచిపట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. కొందరు అరుస్తుంటే - మరికొందరు డాన్స్ చేస్తున్నారు. కొందరు జుట్టు పీక్కుంటుంటే, మరికొందరయితే ఎదుటివాళ్ళను కొరకడానికి ప్రయత్నిస్తున్నారు.

 

    "వాటీజ్ దిస్ నాన్సెన్స్?" శ్రీపతి కోపంతో ఉలికిపోతూ ప్రశ్నించాడు.

 

    "కొత్తరకం నిరసన సార్. ఆనందరావుకి ట్రీట్ మెంట్ ఇప్పించేంతవరకు ప్రతి సాయంకాలం అరగంటపాటు ఇలానే పిచ్చిపట్టినట్టు యాక్టు చేస్తారట సార్."

 

    "ఐసీ... ఇంతకీ ఎవరి ఐడియా ఇది?"

 

    "ఇదంతా చేస్తోంది తిలక్ సార్"

 

    ఆ మాట వినగానే అంతకు ముందు తన భార్య కోరిన కోరిక గుర్తుకొచ్చింది శ్రీపతికి ఇలాంటివాడిని తనింట్లో కన్విక్ట్ ఆఫీసర్ గా నియమించుకుంటే ఏమైనా వుందా? కానీ తప్పదు. ఆ మిస్సైల్ నుంచి తప్పించుకోవాలంటే తను రిస్కు తీసుకోక తప్పదు.

 

    "ఇంతకీ అతను ఎక్కడున్నాడు?"

 

    "ఎవరో ఓ అమ్మాయి వచ్చింది సార్. విజిటర్స్ గదిలో వుంది సార్."

 

    "ఎవరా అమ్మాయి?"

 

    "రిజిస్టర్ లో మాత్రం సునంద అని రాస్తుంది సార్. కానీ ఆమె అసలు పేరు అది కాదేమోనన్న డౌట్ వుంది సార్."

 

    "అలాంటి అనుమానం వుంటే ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు. ముందువెళ్ళి ఆమెను పంపించేసిరా. ఇంకెప్పుడూ ఆమెకు పర్మిషన్ యివ్వకు. ఏ ఖైదీ కోసం ఎవరొచ్చినా ముందుగా నాకు చెప్పు. ఆమె మాత్రం ఇంకెప్పుడూ లోపలికి ఎలో చేయకు. సరేనా? వెళ్ళి ఆమెను పంపించేయ్."

 

    వామనరావు విజిటర్స్ గదిలోకి రావడం తిలక్ తన ప్లాన్ ని వివరించడం ఒకేసారి జరిగాయ్!

 

    "ఈ ప్లాన్ కూడా బ్రహ్మాండంగా వుంది. అన్నీ ఆరేంజ్ చేశాక మీరు ఎప్పుడు మొదలుపెట్టాలో వచ్చి చెబుతాను" అంది మెరుస్తున్న కళ్ళతో లాలస.

 

    అక్కడికి వామనరావు రావడంతో ఆమె మాటలను ఆపి ఏమిటన్నట్టు చూసింది.

 

    "మీ టైమ్ అయిపోయింది. ఇక మీరు వెళ్ళచ్చు. ఇప్పటికే మా దొర మండిపోతున్నాడు" ఆమెతో అని తలనొప్పి తిలక్ తో "ఇక నువు లేవచ్చు" అన్నాడు.

 

    తిలక్ మౌనంగా లేచి వెళ్ళొస్తానన్నట్టు లాలసను చూసి నవ్వాడు.

 

    ఆమె కూడా బయలుదేరింది.

 

    తిలక్ తోటలోకి రావడంతో ఖైదీలందరూ చుట్టూ చేరారు. నాయకుడు వచ్చాడన్న ఆనందంతో వాళ్ళు మరికాస్తంత ఉత్సాహంగా పిచ్చిని అభినయిస్తున్నారు.

 

    పైన వుండి ఇదంతా చూస్తున్న శ్రీపతికి ఒళ్ళు మండిపోతోంది. ఇలా యీ అరుపులు మరికాసేపు వింటే తనకే పిచ్చిపట్టేటట్టు వుందనుకున్నాడు.   

 Previous Page Next Page