ఇద్దరి మనసులూ ఇప్పుడు తేలికపడ్డాయి.
మనోజ్, బబిత మొదట ప్రతి చిన్న విషయానికి కయ్యి కయ్యి మనుకున్నారు. మాటల్లో పోలీసు డిపార్టుమెంట్ ని దుయ్యబట్టేది బబిత. అతనూ అలాగే పత్రికల్నీ పత్రికల్లో పనిచేసే వాళ్ళని దుయ్యబట్టేవాడు.
మధ్య మధ్య ఇరువురూ కేసులప్పుడు కలుసుకోవడం, కాక ఛటర్జీ ఇంటిలో ఫ్రెండ్లీగా కలుసుకోవడం వల్ల అపార్ధాలు విడిపోయి ఎత్తిపొడుపు మాటలు తగ్గించుకుని చాలావరకు దగ్గరయ్యారు. ఇప్పుడిప్పుడే వారి మధ్య కొత్త విషయం వారికి తెలియకుండానే చోటు చేసుకుంటోంది.
"ఎక్కడన్నా ఏదయినా కేసు జరిగితే నాకన్న నువ్వు ప్రత్యక్షమవుతున్నావు బబితా! నీలాంటిది మా పోలీసు డిపార్టుమెంట్ లో వుంటే ఈ డిపార్టుమెంట్ కి న్యాయం చేకూరేదేమో!" మనోజ్ అన్నాడు.
"ఊహు! ఎవరు మీ డిపార్టుమెంట్ లో చేరినా న్యాయం చేకూరదు" బబిత అంది.
"అదేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు మనోజ్.
"అదంతే స్వామి! ప్రజలనాడి నాకు బాగా తెలుసుకదా!" కళ్ళెగరిస్తూ అంది బబిత.
"తెలుసు అంటే చాలదు. సాక్ష్యాధారాలతో సహా కావాలి."
"వెరీ సింపుల్! ప్రజలకి పోలీసు వాళ్ళంటే భయం. ఫలానా చోట నేరం జరిగింది అని మీకు ఫోన్ చెయ్యటానికి కూడా పది నిముషాలు ఆలోచిస్తారు. వాళ్లు తీరుబడిగా ఫోన్ చేసి, మీరు అన్నీ చూసుకుని బయలుదేరి వచ్చేసరికి కాలాతీతమయిపోతుంది.
ఈ విషయం అలాకాదు. ప్రతి సెంటర్ కి మా పత్రికకి వార్థలందించే చిన్నా చితకా వర్కర్స్ వుంటారు. ఏదైనా వార్త మాకు వెంటనే అందిస్తే వారికి మేము వెంటన్ ఎంతో కొంత పారితోషికం అందిస్తాము. అందువల్ల మాకు ప్రజలు సహకరిస్తారు.
ఫలానా హత్యకేసు మేము చూసాము అని ఎవరైనా వస్తే. హత్య చేయబడిన వాడిని హంతకుడినీ వదిలేసి విషయం చెప్పటానికి వచ్చిన వాడిని ప్రశ్నలతో వేధించి చంపుతారు మీరు. యామై కరెక్ట్!" బబిత అంది.
"సెంట్ పర్సెంట్ కరెక్టు! కాదంటే తెల్లారి ఫ్రంట్ పేజీలో నా పేరు ఎక్కుతుంది. పత్రికలతో తల గోక్కునే కన్నా, కొరివితో తలగోక్కోడం మంచిది" భయం నటిస్తూ అన్నాడు మనోజ్.
"యూ నాటీ భాయ్!" తన చేతిలో వున్న గడ్డి పరకల్ని విసిరేస్తూ నాలిక కొరుక్కుంది బబిత.
మనోజ్ చటుక్కున బబిత చెయ్యి అందుకోవటం, ఆ చేతిని పెదవుల దగ్గరికి తీసుకువెళ్ళి ముద్దుపెట్టుకోవటం, ఆ వెంటనే తప్పుచేసిన వాడిలాగా చేయి వదిలేస్తూ "సారీ!" అనటం జరిగింది.
"సారీ ఎందుకు?" బబిత ఈ మాట అంది. కానీ, ఎర్రబారిన ఆమె బుగ్గలు మాత్రం మనసులో విషయాన్ని దాచలేకపోయాయి.
ఏదో ఆలోచనరాగా మనోజ్ కళ్ళు తళుక్ మన్నాయి.
"ఈ కేసు విషయంలో ముందంజ వేసింది పోలీసు డిపార్టుమెంటా లేక పత్రికలవారా?" గూఢార్ధంగా అడిగాడు మనోజ్.
"ఎవరో నాకు తెలుసు! మీకేమి తెలుసో ముందుగా మీరు చెప్పండి" బబిత అడిగింది.
"పోలీసు డిపార్టుమెంటే గెలిచింది" గర్వంగా చెప్పాడు మనోజ్.
"కాదు!" స్థిరంగా అంది బబిత.
"అయితే తమరా?"
"కాదు!"
"అదెలా కుదురుతుంది. ఎవరో ఒకరు ముందడుగు వెయ్యాలికదా! ముందడుగు వేసింది ఎవరో ముందు నన్ను చెప్పమన్నావు! ఏది చెప్పినా 'నో' అని అన్నావు. అదెలా కుదురుతుంది?"
"ఎందుకు కుదరదు లక్షణంగా కుదురుతుంది. ఈ విషయంలో ముందంజ వేసింది పోలీసు డిపార్టుమెంటూ కాదు. పత్రికల వాళ్లూకాదు ఒక ప్రేమికుడు" బబిత చాలా నైస్ గా చెప్పింది.
ఆనందంతో మనోజ్ ముఖం వెలిగింది.
"థాంక్యూ!" అన్నాడు.
అప్పటికప్పుడే ప్రేమనుంచీ పెళ్ళిదాకా పోయాయి వారి మాటలు.
"నగరంలో సంచలనం కలిగిస్తున్న కొత్తకేసు 'ది గిఫ్ట్' హంతకుడిని పట్టుకున్నదాకా, మనం పెళ్ళి మాట తలపెట్టకూడదు. ఈ ప్రేమలూ, దోమలూ మనం డ్యూటీలో లేనంతవరకే. డ్యూటీలో వున్నంతవరకూ నేను పత్రికా రిపోర్టర్ నే, మీరు ఇన్ స్పెక్టరే. ఎవరి కర్తవ్యం వారు నిర్వహిద్దాం!" బబిత అంది.
కేసు విషయం వాళ్ళకి గుర్తుకు వచ్చేసరికి, ప్రేమ విషయం మరిచిపోయారు.
డ్యూటీలో లేకపోయినా.
ఆమె ఒక ప్రెస్ రిపోర్టరూ, జర్నలిస్టూ.
అతను ఒక ఇన్ స్పెక్టర్.
21
"మావయ్యా!"
మనోజ్ అప్పటికే రెండుసార్లు పిలిచాడు ఛటర్జీని.
ఛటర్జీ పైపు పీలుస్తూ పరధ్యానంగా ఆలోచిస్తూ వుండిపోయాడు.
రెండుసార్లు ఛటర్జీని పిలిచిన మనోజ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఆయన పలకకపోవటంతో మావయ్యని చూస్తూ ఆలోచనలో పడ్డాడు.
"మావయ్య చాలా విచిత్రమైన వ్యక్తి .మగవాళ్ళలో ఇంత మెతకమనిషి ఇంత సెన్సిటివ్ అయిన మనిషి ఎవరూ వుండరేమో! ఆయన ఎంతో విజ్ఞానమూర్తి విజ్ఞానానికి తగిన గుర్తింపే రాలేదు.
మూర్ఖుల్ని అందలం ఎక్కించడం, అపార విజ్ఞానవంతుల్ని అధఃపాతాళానికి నెట్టి వేయడం, ఈ దేశంలో వాళ్ళకి తెలిసినంతగా మరే దేశం వాళ్ళకీ తెలియదేమో! స్వార్ధపరులు పెచ్చు మీరుతూంటే, మూగవాళ్ళయి పోతున్నారు మంచివాళ్లు...."
మనోజ్ మావయ్య గురించీ ఆలోచిస్తూంటే, పైపు పీల్చటం పూర్తిచేసిన ఛటర్జీ ఆలోచనా స్రవంతిలోంచి వూడిపడి, "మనోజ్!" అంటూ ముందు నెమ్మదిగా పిలిచాడు.
మనోజ్ వినిపించుకోకపోవడంతో, ఈ తఫా "మనోజ్" అంటూ మరికాస్త గట్టిగ పిలిచాడు.
మనోజ్ ఆలోచనలు చెదిరిపోయాయి.
"పిలిచావా మావయ్యా!" అన్నాడు.
"ఒకసారి కాదు రెండుసార్లు పిలిచాను" ఛటర్జీ చెప్పాడు.
మావయ్య దీర్ఘాలోచన చేస్తున్నాడని తను పరధ్యానంగా దీర్ఘాలోచనలో పడిపోయాడు. ఆ మాట గుర్తుకు రాగానే మనోజ్ కి నవ్వు వచ్చింది.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?" ఛటర్జీ అడిగాడు.