భార్య మాటలు ఓపక్క వింటూనే ఆయన రిసీవర్ ఎత్తి డయల్ చేశాడు.
"హల్లో!"
"యస్! కృష్ణ స్పీకింగ్!"
అవతలినుంచి కృష్ణ కంఠం విన్పించింది.
ఒక్కక్షణం చౌదరికి కంఠం పెగల్లేదు.
కృష్ణే మాట్లాడుతున్నాడు.
సుధను ఏం చేశాడో?
"కృష్ణా! నేను చౌదరిని మాట్లాడేది."
"గుడ్ మార్నింగ్ సర్!
"గుడ్...గుడ్ మార్నింగ్" ఆయన తడబడ్డాడు. తర్వాత ఏం మాటాడాలో తోచలేదు.
"సర్!" అవతల బాస్ ఏం చెబుతాడోనని ఎదురుచూస్తున్నాడు కృష్ణ.
"సుధ...సుధ ఎలా ఉందీ?" నీళ్ళు నములుతూ అడిగాడాయన.
"షి ఈజ్ ఫైన్! బాగానే వుంది."
"ఆహా! అదికాదు. ఇప్పుడే సుధ ఫోన్ చేసిందటగా?"
"అవును సర్! నేనే చెయ్యమన్నాను."
"నువ్వే చెయమంటే మధ్యలో ఎందుకు కట్ చేశావూ?"
"నేను ఫోన్ కట్ చేశానా? ఎవరు చెప్పారూ?"
కృష్ణ గొంతు కటువుగా విన్పించిందాయనకు. అతనికంతా అయోమయంగా వుంది.
"మీ ఆంటీ చెప్పింది, దట్సాల్ రైట్! ఎందుకు ఫోన్ చేయించావ్? ఏమిటి సంగతి?"
"మిమ్మల్ని ఓసారి రమ్మని."
"సుధ ఓ అరగంటముందే ఫోన్ చేసి ఆ సంగతి చెప్పిందిగా? మళ్ళీ ఎందుకు చేసినట్టు?"
"మీకు సుధ అంతకుముందే ఫోన్ చేసిందా? ఐ-సీ."
ఆయనకు ఊబిలో దిగబడిపోతున్నట్టుగా అయింది.
కృష్ణ నిద్రపోతున్నప్పుడు సుధ ఫోన్ చేసింది. ఆ విషయం అతనికి తెలియకూడదనే అంత హడావిడిగా చేసింది. తను పొరపాటుగా నోరుజారాడు.
"ఓ.కే. కృష్ణా! పదిహేను నిముషాలలో వస్తున్నాను. నువ్వెక్కడికీ వెళ్లొద్దు."
"మీకోసమే వెయిట్ చేస్తూంటాను."
ఆయన ఫోన్ పెట్టేసి, హడావుడిగా డ్రెస్ చేసుకోసాగాడు.
మిసెస్ చౌదరి కాఫీ తెచ్చి అందించింది.
"ఏమిటోయ్ అంతా గొడవగా చెప్పావ్!" కాఫీ సిప్ చేస్తూ అడిగాడు చౌదరి భార్యను.
"ఇదింకా బాగుంది. మాట్లాడుతున్నదల్లా హఠాత్తుగా ఆగి ఆ పిల్ల పెద్దకేక పెట్టి ఫోన్ పెట్టేస్తే, మధ్యలో నేనేదో గొడవగా చెప్పానంటారేం?"
"కేక పెట్టిందా?"
"వేడికాఫీ గబుక్కున మింగి అన్నాడాయన. పొలమారినంత పనయింది.
"అవును! పెద్దగా అరిచి ఫోన్ కిందపడేసినట్టుగా విన్పించింది."
అతను కాఫీ పూర్తిగా తాగలేదు. కప్పు భార్య చేతికిచ్చి ఆదుర్దాగా బయటికి పరిగెత్తుకొచ్చాడు. గేరేజ్ లో నుంచి కారుతీసి స్టార్టు చేశాడు.
కారు తారురోడ్డుమీద పరుగులు తీస్తోంది. అతని ఆలోచనలు అంతకంటే వేగంగా పరుగులు తీస్తున్నాయి.
కృష్ణ ఫోన్ చేయించానంటున్నాడు.
మధ్యలో సుధ పెద్దగా అరిచి ఫోన్ వదిలేసింది అంటుంది తన భార్య.
నిజంగా కృష్ణే ఫోన్ చేయించివుంటే మధ్యలో అదరగొట్టాల్సిన అవసరంలేదు. కాకపోతే కృష్ణ సుధచేత బలవంతంగా ఫోన్ చేయించి వుండాలి. ఆమెను ఇంకేదో చెప్పమని బలవంతం చేసివుండాలి. ఆమె నిరాకరిస్తే భయపెట్టి వుంటాడు.
అందుకే సుధ అరిచి ఫోను పెట్టేసింది.
ఎందుకలా చేసి ఉంటాడు?
"ఎందుకేమిటి? పిచ్చివాడి చేష్టలకు అర్ధం ఏముంటుంది?
ఏదో చేశాడు!
కాని తనతో ఎంత నింపాదిగా మాట్లాడాడు? చాలా నార్మల్ గా మాట్లాడాడు.
మరి! ఏం జరిగి ఉంటుంది?
చౌదరి బుర్ర వేడెక్కిపోతున్నది.
ఆలోచనలు తేలిరావడంలేదు.
విషయం అంతుపట్టడంలేదు. ఒకటిమాత్రం నిజం! సంథింగ్ రాంగ్ సంవేర్__
చౌదరి గేటుపక్కగా కారు ఆపాడు. కారు దిగి గబగబా లోపలి నడిచాడు.
"కమాన్ సర్!"
కృష్ణ మెట్లమీద నిలబడి బాస్ కు స్వాగతం పలికాడు.
మొదటి మెట్టుమీదే నిలబడి ఆయన కృష్ణను ఆపాదమస్తకం పరిశీలించసాగాడు. అతనికి కృష్ణలో ఏదో మార్పు వచ్చినట్టు అన్పించింది. కనురెప్పలకింద నీడలు కన్పిస్తున్నాయి. నుదురుమీద ముడతలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
"రెండురోజుల్లో మనిషి ఎంత మారిపోయాడూ?" ఆశ్చర్యంలో మునిగిపోతూ అనుకున్నాడాయన.
"కమిన్ సర్!" కృష్ణ వినయవిధేయతలతో తన అధికారిని ఆహ్వానించాడు.
మాటలో మార్పులేదు. ప్రవర్తన మామూలుగానే వుంది. మరి ఈ గొడవంతా ఏమిటి?
చౌదరికి బుర్రలో అంతా గజిబిజిగా వుంది. ఆలోచిస్తూ ఒక్కొక్క మెట్టే ఎక్కి కృష్ణను అనుసరించాడు.
ఆయన సోఫాలో జారగిలబడి కూర్చున్నాడు.
మోకాళ్ళమీద చేతులు పెట్టుకొని ఆయనకెదురుగా కూర్చున్నాడు కృష్ణ.
విషయం ఎలా మొదలుపెట్టాలో తోచక ఆయన దిక్కులు చూస్తూ కూర్చున్నాడు.
కృష్ణ ప్రారంభించాడు.
"సార్! మీతో ఓ ముఖ్యమైన విషయంగురించి మాట్లాడాలి."
"గో ఎహెడ్ మై బాయ్!" సోఫాలో అర్దుకొని కూర్చున్నాడు డాక్టర్ చౌదరి.
"ఇది నా వ్యక్తిగత సమస్య. మీరు నాకు గౌరవనీయులు. మీమీద గల నమ్మకంతోనే నా సమస్యను మీ ముందు పెడుతున్నాను. పరిష్కార మార్గం మీరే చూడాలి. మీరు నాకు సహాయం చెయ్యాలి."
"ష్యూర్! అలాగే నాకు చేతనయింది చేస్తాను."
"థాంక్యూ సర్! నా వ్యక్తిగత సమస్యలతో మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం నాకు ఇష్టంలేదు. కాని మీరు ముందే కొంత తెలుసుననుకుంటున్నాను....."
"నో! నో! నీ పర్సనల్ విషయాలు నాకేమీ తెలియవు" మధ్యలోనే అందుకొని అన్నాడు. కాని తప్పుచేసి దొరికిపోయినవాడిలా ముఖంపెట్టాడు.
"నా గురించి కాదు. సుధను గురించి మీకు తెలుసు అనుకుంటున్నాను. సుధ నాగురించికూడా మీకు ఏదేదో చెప్పిందని నాకు తెలుసు. నేను నిద్రలో వున్నాననుకొని మీకు ఫోన్ చేసింది. అంతా విన్నాను. ఆ విషయం నాకు తెలియనట్టే రెండోసారి ఆమెచేత మీకు ఫోన్ చేయించాను."
"దట్సాల్ రైట్! నువ్వు చెప్పదల్చుకున్నదేదో సూటిగా నాతో చెప్పు. నిర్మొహమాటంగా, నిష్కర్షగా చెప్పు. సుధతో మాట్లాడి ఆమె తప్పు వుంటే సరిదిద్దుకొనేలా చేస్తాను. పెళ్ళయిన ఒకటి రెండు సంవత్సరాలు భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడం సహజం. అదంతా టెంపరరీ. టెంపర్ మెంటల్ గా అడ్జస్టు అయేంతవరకూ యిలాంటి ఇబ్బందులు తప్పవు. నా పెళ్ళయిన మూడేళ్ళవరకూ మీ ఆంటీ నాతో ప్రతి చిన్న విషయానికీ పేచీపడుతూనే వుండేది. విమల పుట్టిన తర్వాతనే మా సంసారంలో ప్రశాంతత ఏర్పడింది. మీరింకా చిన్నవాళ్ళు. జీవితం ముందున్నది. ఒకర్లో మరొకరికి లోపాలు కన్పించావచ్చును. ప్రతి వ్యక్తికీ ఏవో బలహీనతలు ఉంటూనే ఉంటాయి. ఏ బలహీనతా లేని సంపూర్ణ మానవుడు ఇంకా పుట్టలేదు. పోతే_"
"సార్! మీరంతా తెలిసే ఇలా మాట్లాడుతున్నారో, కొంతే తెలిసి మాట్లాడుతున్నారో అసలేమీ తెలియకనే మాట్లాడుతుననారో నా కర్ధం కావడంలేదు" కృష్ణ కంఠంలో ధ్వనించిన తీవ్రతకు ఆయన అదరిపడ్డాడు.
"ఐ మీన్" చీకట్లో దేవుడిలాడుతున్నట్టయిపోయింది అతడి పని.
"మా సమస్య సర్దుబాటు చేసుకోగలిగేది అయితే ఇంతవరకూ రాదు. మీతో చెప్పాల్సిన అవసరంకూడా వచ్చేదికాదు. ఘోరమైన అన్యాయం జరిగింది సుధకు. పెద్దమోసం జరిగింది నాకు. ఈ రెండు అనర్ధాలకు కారణభూతుడు సుధ తండ్రి....నాకు మామ....మీకు బాల్యస్నేహితుడు....పోలీసాఫీసరు మూర్తి...."
"మిస్టర్ కృష్ణా! ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది?" ఆయన గొంతు పెద్దదిచేసి అన్నాడు.
"అంతేకాదు- ఇందులో మీ పాత్రకూడా అంతో-ఇంతో ఉండే ఉండాలి" కసికసిగా అన్నాడు కృష్ణ.
"కృష్ణా!"
ఆయన మహాకాయం సోఫాలో కదిలిపోయింది. కణతలమీది నరాలు పొంగాయి-
"ఐయాం సారీ సర్! నిజం మాట్లాడుతున్నాను. ఎవరు ఎంత దాచినా దాగని సత్యం ఇది. అందరినీ కొంతకాలం, కొందరిని ఎల్లకాలం నమ్మించవచ్చునేమోకాని అందరినీ ఎల్లకాలం ఎవరూ నమ్మించలేరు. మా మామ రమణమూర్తి - ఛ! ఛ! మామ అనుకొంటే అసహ్యం వేస్తోంది. ఆ స్కౌండ్రల్... ...."
"వాట్ నాన్ సెన్స్ యూ ఆర్ టాకింగ్?" ఆయన చప్పున లేచి నిలబడ్డాడు.
అంతలోనే అతనికి ఏదో మెరుపులా స్పురించింది. వెంటనే చల్లబడిపోయాడు.
తను మానసికస్థితి సరిగాలేని మనిషితో మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడింది సీరియస్ గా తీసుకొని రియాక్ట్ అవడం శుద్ద అవివేకం. అలా అయితే తనకూ అతనికి తేడా ఏమిటి?
ఇప్పుడు తనకు అర్ధమౌతోంది. సుధ అంత ఖంగారుగా ఎందుకు ఫోన్ చేసిందో? తనముందే ఇలా మాట్లాడుతున్నాడే ఈ పిచ్చివాడు? ఇహ సుధతో ఎలా మాట్లాడాడో తను ఊహించగలడు.