సుధ త్రుళ్ళిపడింది.
"సుధా?"
"ఊఁ"
"జగన్మోహన్!"
"నేను ప్రేమించాను."
"మోనా!"
"నా పాపఫలం!"
"కాదు__నీ ప్రేమకు ప్రతిఫలం!"
"నా జీవితానికి శాపం!"
"ఆ శాపమే ఈనాడు వరంగా మారింది. మోనాను గురించి జగన్ చెప్పడంద్వారానే మోనా తల్లి 'సుధాప్రియ'__లేక 'ప్రియసుధ'- క్లుప్తంగా చెప్పాలంటే సుధ కథ వెల్లడైంది."
సుధ చివాల్న తలెత్తి భర్త కళ్ళల్లోకి చూసింది.
అతని చూపులు చెదిరిపోతున్నట్టుగా అన్పించిందామెకు.
అతను పూర్తిగా పిచ్చివాడైపోయాడు.
తెల్లవారేదాకా అతన్ని బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి.
"సుధా!"
"ఊఁ"
"ఎప్పుడు వెళదాం?"
"ఎక్కడికీ?"
"మద్రాస్ కు."
"ఎందుకూ?"
"డామిట్ కథ మళ్ళీ మొదటికొచ్చింది."
చిరాగ్గా లేచి నిలబడ్డాడు కృష్ణ.
"ఎందుకేమిటి జగన్మోహన్ దగ్గరకెళ్ళవా?"
ఆమె మాట్లాడలేదు.
"పోనీ మీ నాన్నగారి దగ్గరికి వెళతావా?"
"వెళ్ళను! వెళ్ళను!! వెళ్ళను!!!"
పిచ్చిగా అరుస్తూ బెడ్ రూమ్ లోకి పరుగుతీసిందామె.
19
"హలో! హలో! ఆంటీ! నేను సుధను మాట్లాడుతున్నాను. అంకుల్ ను ఓసారి పిలవండి."
"అలాగేనమ్మా! ఎందుకు బేబీ అంత గాభరాగా మాట్లాడుతున్నావ్?"
"అర్జంట్ ఆంటీ! అంకుల్ని పిలవండి ప్లీజ్!"
"ఒక్క క్షణం లైన్ లో వుండు" అంటూ మిసెస్ చౌదరి, రిసీవర్ పక్కన పెట్టి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
"ఏవండీ! ఫోన్ సుధ ఫోన్ లో వుంది. ఏమిటో చాలా కంగారుగ మాట్లాడుతోంది."
భార్య మాట వింటూనే చౌదరి మంచం దిగి నాలుగు అంగల్లో ఫోన్ దగ్గిరకొచ్చాడు.
"హల్లో సుధా!"
"అంకుల్ మీరు త్వరగా వచ్చెయ్యాలి. రాత్రి ఆయన చాలా గొడవ చేశారు. అర్దరాత్రి నన్ను నిద్రలేపి ఏమేమో మాట్లాడారు. నాకు చాలా భయంగా వుంది అంకుల్. అప్పట్నించీ కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తున్నాను. ఆయనకు జబ్బు క్షణ క్షణానికీ ముదిరిపోతున్నట్టుగా వుంది. నిద్రలేస్తే మళ్ళీ ఏం మాట్లాడుతాడో ఏం చేస్తాడో-"
"కృష్ణ ఇంకా లేవలేదా?"
"లేదు అంకుల్. అందువల్లనే ఫోన్ చెయ్యగలుగుతున్నాను అంకుల్. ఆయన నిద్రలేచేసరికి మీరు ఇక్కడుండాలి. బ్రేక్ ఫాస్టు ఇక్కడే చెయ్యొచ్చు. మీరొచ్చేయ్యండి."
"జస్టు ఏ మినిట్ సుధా!"
"నో! అంకుల్, మీరు వెంటనే...."
"నామాట వినమ్మా! రాత్రి నాన్నకు ఫోన్ చేశాను. ఉదయం ఫ్లయిట్ లో వస్తానని చెప్పాడు. ఎయిర్ పోర్టుకు వెళ్ళి మీ నాన్నని తీసుకొద్దామనుకుంటున్నానమ్మా!"
"నాన్న వస్తున్నారా? హమ్మయ్య!" గుండెలనిండుగా గాలి పీల్చుకుంది.
"అంకుల్ ఫ్లయిట్ వచ్చేదాకా మీరు వైట్ చెయ్యొద్దు, నాన్న తనే వచ్చేస్తార్లెండి. మీరు వెంటనే వచ్చేయండి."
"అలాగే! వస్తా! డోంట్ వర్రీ?"
"పది పదిహేను నిముషాల్లో వస్తారుగా?"
"ష్యూర్! ఓకే!"
చౌదరి రిసీవర్ పెట్టేసి బాత్ రూమ్ లోకి నడిచాడు. గబగబా గడ్డం గేచుకొని షవర్ కింద నిలబడ్డాడు.
నైస్ చాప్!
హఠాత్తుగా ఇలా అయిపోయాడు. మద్రాస్ వెళ్ళినప్పుడు అక్కడేం జరిగిందో?
అసలు అతనికీ జబ్బు లోగడే ఉందేమో? అది ఇప్పుడు ఉధృతంగా బయటపడిందా?
మోస్టు ఆన్ ఫార్చునేట్! పూర్ గరల్!
మూర్తి పోలీసాఫీసరై వుండీ, కృష్ణ బ్యాగ్రౌండ్ తెలుసుకాకుండానే పిల్లనిచ్చాడా?
ఆరునెలలగా అతను తనదగ్గిర జూనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. ఎప్పుడూ అతనిలో ఎలాంటి ఉద్రేకం కన్పించలేదు. అవకతవకగా ఎప్పుడూ మాట్లాడలేదు. చాలా గంభీరంగా, ప్రశాంతంగా ఉంటాడు అలాంటివాడు అకస్మాత్తుగా ఇలా ఎలా మారిపోయాడు? లేక సుధేఇదంతా చేస్తున్నదా?
ఈమధ్య సుధ మానసిక అనారోగ్యానికి గురికాలేదుకదా? నిన్నామె చెప్పిందంతా ఆమె ఊహించుకునేది కావచ్చా!
ఏమిటీ గొడవ?
అంతా గందరగోళంగా, గజిబిజిగా వుంది.
ఆలోచిస్తుంటే తనకే మతిపోయిందేమోననిపిస్తోంది__ఎవరిని సైకియాట్రిస్టు దగ్గిరకు తీసుకెళ్ళాలి?
"మిమ్మల్నేనండీ! అబ్బా! ఎంతసేపండీ!"
బయటినుంచి చౌదరిభార్య బాత్ రూం తలుపు బాదుతోంది.
గాభరాగా తలుపుతీశాడు చౌదరి.
చౌదరి భార్య రెండడుగులు వెనక్కువేసి "మీకేమన్నా మతిపోయిందాఏం? టవల్ చుట్టుకురండి" అంది.
చౌదరి కంగారుపడ్డాడు. టవల్ చుట్టుకొని బయటికొచ్చాడు.
"ఏమిటి మధ్యలో నీ గోల?" చౌదరి భార్యను చూస్తూ అన్నాడు.
"మళ్ళీ సుధ ఫోన్ చేసిందంటుంటే?" గొంతు పెద్దదిచేసి అంది చౌదరి భార్య.
ఆయన ఫోన్ కేసి పరుగుతీశాడు.
"మళ్ళీ అటు పరిగెడ్తారెందుకూ? ఫోన్ పెట్టేసుండటం కన్పించడంలా?" పెదవి విరుస్తూ అందామె.
"మరి ఫోన్ చేసిందన్నావుగా?"
"తెలివి తెల్లారినట్టే వుంది. ఫోన్ చేసింది, వెంటనే పెట్టేసింది. మాట్లాడుతూనే పెట్టేసింది. మధ్యలో ఏదో జరిగినట్టుంది. మీరు త్వరగా బయలుదేరి వెళ్ళండి. నేను స్నానంచేసి చిన్నగా వస్తాను."