Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 27


    అమాయకపు పిల్లలా నటించబట్టే ఇందర్ కళ్ళు కప్పగలిగానని ప్రతిక్షణం గుర్తుకు రాగా ఏమాత్రం మార్పు లేకుండా మహానటిగా నటించగలిగింది. దానిలో ముఖ్య భాగంగా డ్రస్సు విషయంలోనూ, వంట విషయంలోనూ....

    "నాకు వంట చేయడంరాదు. మా ఇంట్లో గవరాజు, సీనమ్మ ఇద్దరు వంటవాళ్ళున్నారు. ఓ రోజు సర్దాగా కాఫీ కాయడం, టీ తయారు చెయ్యడం మాత్రం నేర్చుకున్నాను" అవంతి చెప్పింది.

    ఇంట్లో ఇద్దరు వంటవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పిల్ల ధనవంతుల ఇంటిపిల్ల అనుకున్నాడు ఇందర్. అమాయకంగా మాటల్లో బయటపడిపోతుంది. గవరాజు, సీనమ్మ అనే వంటవాళ్ళు ఏ ధనవంతుల ఇళ్ళల్లో పనిచేస్తున్నారో చూడాలి. అసలు ఈ అమ్మడుది ఈ ఊరో, మరో ఊరో అనుకున్నాడు.

    "మరి వంట చేయడం నాకూరాదే. ఎలా?" ఇందర్ అన్నాడు.

    "ఏమో" అంది అవంతి.

    "ఏమో అన్నది మాత్రం బాగా వచ్చు. నా ఇష్టం వచ్చినట్లు వంట చేస్తాను. నోరు మూసుకొని తినాలి. సరేనా?"

    సరేనన్నట్లు తలూపింది అవంతి.

    "నేను గొడ్డుకారం తింటాను. పావుకిలో వంకాయలకు అరకిలో ఎండుమిరపకాయలకారం. అరవీశ పచ్చిమిర్చి చేర్చి కూర వండుతాను. తినాలి."

    సరేనన్నట్లు మళ్ళీ తలూపింది అవంతి.

    "ఈ పిల్లకి బొత్తిగా ఏమీ తెలియదు. ఎండ కన్నెరగని రాకుమారిలా ప్రవర్తిస్తున్నది" అనుకున్నాడు ఇందర్.

    "మా చంద్ర వంట అత్యద్భుతంగా చేస్తాడు. ఓసారి వాడి చేతివంట రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు" అని చెప్పాడు.

    "చంద్ర గారు ఊరి నుంచి ఎప్పుడు వస్తారు?" అవంతి వెంటనే అడిగింది.

    "ఎందుకు?"

    "నాకూ వంటరాదు, మీకూ వంటరాదుగా?"

    "ఊ....అయితే?"

    "మీరే చెప్పారుగా, చంద్ర గారు వంట బాగా చేస్తారని...."

    ఆ మాట వినగానే ఇందర్ కి కొలమార లేదుగాని, అంతపని అయ్యింది. మాడు మీద కొట్టుకున్నాడు.

    "మాడు నెప్పా?" అవంతి అడిగింది.

    "ఆ....మాడునిప్పే. దారినపోయేదాన్ని తగిలించుకున్నప్పుడు ఇలా వస్తుంది" ఇందర్ వ్యంగ్యంగా అన్నాడు.

    "మా విస్సన్న తాతగారికీ అంతే. వేడి చేసే పదార్ధాలు తిన్నప్పుడల్లా మాడునెప్పి వస్తూ వుంటుంది" అవంతి నెమ్మదిగా చెప్పింది.

    "గవర్రాజు, సీనమ్మగాక విస్సన్న తాత గారు కొత్త శాల్తీ రంగప్రవేశం చేశాడు" అనుకున్నాడు ఇందర్.

    వంట సంభాషణ వారిరువురి మధ్య అలా సాగింది. ఇంక గుడ్డల విషయం వచ్చింది.

    "అపర్ణా!" ఇందర్ పిలిచాడు.

    "నన్నేనా?" అవంతి అడిగింది.

    "నీవుగాక మరో అపర్ణలు ఎవరూ ఈ ఇంట్లో లేరు. సరేనా?"

    "సరే"

    "నీ వంటి మీద వున్న దుస్తులు తప్ప వేరే చీరలు తెచ్చుకోలేదా?"

    "ఊహూ...."

    "మరెలా?"

    అవంతి ముఖం దించుకుని మౌనం వహించింది. అవంతి తెలివిగా వదిలే అస్త్రాల్లో ఇది తిరుగులేని అస్త్రం.

    "నాకు చాలా డ్రస్ లు వున్నాయి. లాల్చీ, పైజమా- పూలపూల డిజైన్ల లుంగీలు. వాటిలో ఏదైనా ధరిస్తావా?"

    "ఛీ...." అంటూ ఛీత్కారం చేసింది అవంతి.

    ఇందర్ తెల్లబోయాడు.

    "మా ఇంట్లో ఎవరం కూడా ఒకళ్ళ బట్టలు మరొకరు ధరించము. పైగా నేనెప్పుడూ చీరలే కట్టుకుంటాను. పంజాబీ డ్రస్. మ్యాక్సీ, చుడీదార్ లాంటివి వున్నాయిగాని వాటిని ఎప్పుడైనా మోజుగా వుంటే ఇంట్లో ధరిస్తాను. అంతే ఎక్కడైనా ఆడాళ్ళు మగాళ్ళ దుస్తులు వేసుకుంటారా? ఛీ....సినిమాల్లో అంటే వేసుకుంటారుగాని....! దీర్ఘంతీస్తూ అంది.

    "మరెలా?" ఇందర్ అడిగాడు.

    "నా దగ్గర డబ్బులులేవు. నా వంటి మీద వున్నవన్నీ బంగారమే. నేను నా చేతిగాజు ఒకటి మీకిస్తాను. నాకు బజారు నుంచి నాలుగు చీరలు తెచ్చిపెట్టండి."

    "చీరలు తెచ్చి పెడతాగాని గాజు చేతి నుంచి తియ్యకు. సరేగాని వంటరిగా ఇంత బంగారంతో ఇంటి నుంచి వచ్చావు. ఎంత ప్రమాదమో తెలుసా? అందమైన ఆడపిల్ల వంటరిగా రావడం పెద్ద తప్పు అదే పెద్ద ప్రమాదం. వాంటెడు నగలతో రావడం మరీ ప్రమాదం. అదృష్టం బాగుండి ఈ ఇంట్లో కాలు పెట్టావ్. నేను మంచివాడిని కాబట్టి సరి పోయింది. అదిసరే మొత్తం నీ వంటి మీద బంగారం ఎంత వుంటుంది? మనలోమాట పాతికశెవర్లు ఉంటుందా?"

    "పాతికశెవర్లు! భలేవారే మీకు బంగారం విషయం బొత్తిగా తెలియదులాగుంది. నా మెడలో ఈ పెద్ద గొలుసు ఒక్కటే పాతికశవర్లు. నన్ను పెళ్ళికూతురిని చేస్తూ చంద్ర కాంత పిన్ని రాజమణితో ఏమందో తెలుసా? ఈ నక్లెస్ లో వున్న ఒక్కో పచ్చ ఇరవై ఏసివేలు అంది. ఇప్పుడు నా వంటి మీద వున్న బంగారం మొత్తం మూడు వందల తులాలపైన వుంటుందని ప్రభావతి గుణసుందరితో అంటుంటే విన్నాను" అవంతి గర్వంగా చెప్పింది.

 Previous Page Next Page