Previous Page Next Page 
అభయారణ్యం పేజి 27

  

    ఇక్కడ ఖచ్చితంగా ఏ పదం వాడాలో తెలీనట్టు ఆగిపోయింది.
 
    "అదే! నేను మీకు గుర్తుకొచ్చేటంత దగ్గర కాగలిగినందుకు ఆనందంగా వుంది."

    "అంతా అబద్దం."

    "కాదు నిజం."

    "అసలు మనం దగ్గరెక్కడయ్యాం" తేజా గొంతులో ఆమె వూహించలేని చిలిపితనం ధ్వనించింది. "ఫోన్  లోనే మాట్లాడుకుంటున్నాం. అంతేగా!"

    "ఇది చాలు తేజా! ఈ మాత్రం అదృష్టం నాకు చాలు" కంపించిపోతూ అంది "ఇంతకు మించి స్నేహాన్ని నేను కోరడం లేదు అహం! అసలు మిమ్మల్ని ఎప్పటికీ  కలవను. కలవదలుచుకోవటం లేదు."

    "అదేం?"

    "నేను అంత అందంగా వుండను."

    రెండు నిమిషాల మౌనం తర్వాత అన్నాడు తేజా - "అర్దమైంది ఆర్తీ!"

    ఎందుకిలా నోరు జారానూ అనుకుంటూనే "ఏమిటి?" అంది తడబడుతూ.

    "నువ్వు దాంపత్య జీవితంలో సుఖపడటంలేదు."

    "అబద్దం!" అతడి ఏకవచనం చాలా ఆందోళన కలిగించింది.

    "కాదు నిజం."

    "ఎందుకలా అనుకుంటున్నారు?"

    "సుఖపడటమే నిజమైతే...." నిట్టూర్పుగా అన్నాడు "నువ్వు నీ అందం గురించి మాటాడేదానివికాదు.  అవును ఆర్తీ! నేను కలవాలనుకున్నది నీతో ఒక స్నేహితుడిలా ముఖాముఖీ మాట్లాడటానికి. నిన్ను యింకోలా...."

    "వద్దు. నేను స్లిప్పయ్యాను" అసహనంగా అరిచింది.

    "నేనలా మాట్లాడటం తప్పే."

    "మన మాటలు మనమున్న పరిస్థితుల్ని ప్రజెంట్ చేస్తాయి."

    "లేదు... నేను ఆనందంగా వున్నాను."

    "అలా మభ్యపెట్టుకుంటున్నావు."

    "అదికాదు...."

    "ఆర్తీ.... నిన్ను వెంటనే చూడాలనుకుంటున్నాను."

    "ఇప్పుడా?"

    "ఒంటరిగా వున్నానన్నావుగా?"

    "కానీ ఆయన ఏ క్షణంలో అయినా రావచ్చు."

    "ఆయన లేనప్పుడైతే సరేనా?"

    "అవును" అనబోయి ఆగిపోయింది.

    స్వేదంతో తడిసిపోతూ ఆందోళనగా తనింత దిగజారి మాట్లాడుతుందేం అనుకుంది.
 
    "జవాబు కావాలి ఆర్తీ!"

    "వద్దు. మనం ఎప్పటికీ కలుసుకోవద్దు."

    "హద్దులు దాటిపోతానన్న భయమా?"

    "ప్లీజ్! మీరలా మాట్లొడొద్దు."

    "నిన్ను  నువ్వు మోసం చేసుకుంటున్నావ్ ఆర్తీ...! నీకు నన్ను చూడాలనుంది.. కలుసుకోవాలనుంది.. నీ ఒంటరితనంనుంచి నిన్ను నువ్వు కాపాడుకోటానికి అవసరమైతే నాతో శారీరకంగా...."

    "ప్లీజ్ .. స్టాపిట్."

    ఉలికిపాటుగా అరిచింది.

    కాదు... నిద్రలేచింది.

    అంటే ఇంతసేపూ తను కలగంటూందా?

    బెడ్ లైటు కాంతిలో చుట్టూ నిశ్సబ్దం.

    ఫంక్షను కెళ్లిన భాస్వంత్ ఇంకా తిరిగి రాలేదని బోధపడింది.    

    అస్థిమితంగా బెడ్ మీద నుంచి దిగి టీపాయ్ మీదున్న గ్లాసులో నీళ్ళు తాగింది.

    ఏమిటి?

    ఎందుకిలా జరిగింది?

    కేవలం తేజాతో మాట్లాడింది రెండు మూడుసార్లు.

    ఆమాత్రం దానికే అతడిమీద అంత యిష్టాన్ని పెంచుకుందా?

    ఇది కలని సరిపెట్టుకోటానికి మనసంగీకరించడం లేదు.

    ఇప్పటిదాకా తను కలలో మాట్లాడింది తనకు తెలియకుండా నిక్షిప్తంగా  మనసులో పేరుకుంటున్న ఏ కూడని భావానికో రూపంలా వుంది.

    దాంపత్య జీవితంలో పేరుకుపోతున్న అశాంతికి ఇలా వూరట వెదుక్కుంటున్నట్లు స్పష్టంగా అర్దమైపోతూంది.

    తేజా కూడా ఇలానే ఆలోచిస్తున్నాడా?

    లేక తను అతడిలా ఆలోచించడాన్ని కోరుకుంటోందా?

    తను కోరుకోవడమే నిజం కాకపోతే అతడెందుకిలా మాట్లాడతాడు?

    రచయితలంతా అవకాశవాదులేనా?

    అవునని చాలామంది అంటూంటారుగా!

    బడలికగా కళ్లు మూసుకుంది ధ్యానంలా.

    తేరుకోటానికి రెండు నిమిషాలు పట్టింది.

    తను గాడితప్పుతూంది. 

    కాదు... తనున్న పరిస్థితులు తన చేత యిలా ఆలోచింపచేస్తున్నాయి.

    అడుగుల చప్పుడు వినిపించింది.

    భాస్వంత్ వచ్చాడు తాగినట్టున్నాడు కొద్దిగా తూలుతున్నాడు.

    ఆ క్షణంలో అతడిపై అణువంత ఏహ్యభావం ఏర్పడితే అది ఆమె తప్పెలా అవుతుంది?

    ఓ ఖైదీలా బ్రతకమని శాసించిన ఈ పెద్దమనిషే తనిలా ఆలోచించడానికి కారణమనుకుంటూ ముసుగుతన్ని పడుకోవాలనుకుంది.

    బెడ్ పై ఒత్తిగిల్లి పడుకున్న ఆమెపై చేయి పడింది.

    తెలుసు అది భాస్వంత్ దని.
 

 Previous Page Next Page