"మరి రేపే వెళ్ళిపోతానంటున్నారేం? నేను ఎన్నో కలలు కన్నాను. నా స్నేహితులందరికీ నిన్ను గర్వంగా పరిచయం చేద్దామనుకున్నాను."
"నాలో అంత గర్వించదగిన గొప్పదనం ఏముంది.
"డబ్బు తప్ప నాకు తెలిసిన వాళ్ళందరి కంటే అన్ని విషయాలలో నువ్వే గొప్పవాడివి." కళ్ళు పెద్దవి చేసుకొని శ్రీధర్ ముఖంలోకి చూస్తూ అంటున్న ఆమెలో పసితనం కన్పించింది.
డబ్బున్న కుటుంబాల్లో కష్టం సుఖం తెలియకుండా పెరిగిన పిల్లలకు లౌకిక జ్ఞానం చాలా ఆలస్యంగా అలవడుతుంది.
"రేపు సాయంత్రం డ్లబ్బుకు వెడదాం మీరు ఉండాలి."
శ్రీధర్ ఆలోచిస్తున్నాడు.
"ఉంటారు కదూ?"
"ఉండను" ఖచ్చితంగా ఉంది అతని కంఠం.
అమూల్య ముఖం చిన్నబోయింది.
"ఈసారి వచ్చినప్పుడు క్లబ్బుకు వస్తాలే" ఆమె సంతృప్తి కోసం అన్నాడు.
"శ్రీధర్ ఒకటి చెప్పనా?"
"చెప్పు."
"నేను కోరింది చేస్తానని మాట యిస్తే చెబుతాను.
"చెయ్యిగలిగింది అయితే తప్పక చేస్తాను."
"నువ్వు ఇక్కడే వుండిపోకూడదూ?"
శ్రీధర్ భార్య ముఖంలోకి వింతగా చూశాడు.
"మీ మమ్మీ చెప్పిందా?"
"లేదు నేను అడుగుతున్నాను."
"అంటే రెండు రోజులకే మొగుడిల్లంటే మొహం మొత్తిందన్నమాట."
"అబ్బే అదేం లేదు. అందుకు కాదు-" ఎందుకో చెప్పడం రానిదానిలా తడబడింది.
"చూడు అమూ అన్ని విషయాలు తెలిసే ఈ పెళ్ళి చేసుకున్నావ్. నీలో అప్పుడే స్ట్రగుల్ ప్రారంభం అయింది."
"అదేమీ లేదు. నాకెలా చెప్పాలో అర్థం కావడం లేదు."
"నాకు నీ మనసులోని మధన బాగా అర్థం అవుతూనే వున్నది. అమూ బాగా ఆలోచించు. నీ భర్త అభిమానం చంపుకొని ఇల్లరికపు అల్లుడిగా ఉండడం నీకు ఇష్టమా. మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడ్ని చూసినట్టే మీ మమ్మీ నన్ను గౌరవిస్తున్నదా? ఇక ఇక్కడే వుంటే... ఆలోచించు నా అవమానం నీకు అవమానం కాదూ?" గడ్డం పుచ్చుకుని ముఖాన్ని తనవైపుకు తిప్పుకుంటూ లాలనగా అన్నాడు శ్రీధర్.
అమూల్య ఆ క్షణంలో అన్నీ మర్చిపోయి అతని గుండెల మీదకు వాలిపోయింది.
ఆషాడమాసం పూర్తి అవుతోంది. అమూల్యకు మళ్ళీ ఆ పల్లెటూరు వెళ్ళాలంటే భయం పట్టుకుంది. శ్రీధర్ ఈనెల రోజుల్లో ఒక్కసారీ రాలేదు. అమూల్యను స్నేహితులు అనేక ప్రశ్నలతో చంపుతున్నారు.
"డాడీ."
"ఏమ్మా."
"ఏం? శ్రీధర్ ఇక్కడ ఉద్యోగం చేస్తానంటున్నాడా?"
"లేదు. నేనే అంటున్నాను."
"అంటే నీకు ఆ ఊరు వెళ్ళడం ఇష్టం లేదన్నమాట."
"అవును డాడీ" తొణక్కుండా అన్నది.
"బాగుందమ్మా నీ వరస. ఎంతమంది ఎన్ని చెప్పినా వినకుండా పెళ్ళి చేసుకున్నావ్. అత్తగారింట్లో పట్టుమని పదిరోజులు లేవు. అప్పుడే మొహం మొత్తిందన్నమాట!"
అమూల్య మాట్లాడలేదు.
ముఖంలో దిగులు స్పష్టంగా కన్పించింది.
ఆ ముఖం చూస్తుంటే కృష్ణారావు మనసు కరిగిపోతున్నది. కాని పైకి లేని గాంభీర్యాన్ని తెచ్చి పెట్టుకున్నాడు.
ఎల్లుండి శ్రీధర్ నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు.
నువ్వు చెబితే వింటాడు.
"ఏమని?"
"ఇక్కడే వుండమని."
"అమూల్య శ్రీధర్ ను నువ్వు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. అతను చాలా అభిమానం కలవాడు. ఇంట్లో ఉంటాడా."
"నేను చెప్పను."
"డాడీ."
"అవునమ్మా. అతను కోరి గుంటూరులో ఉద్యోగం వేయించుకున్నాడు. ఎందుకో తెలుసా? అతని బాధ్యతలు అతనికి తెలుసు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసేంతవరకూ అతను అక్కడ్నుంచి రాడు."
"ఆ తర్వాత వస్తాడనే నమ్మకం వుందా?"
"ఆ తర్వాత నేను చెప్పి ఒప్పించగలను. ఆ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేంతవరకూ ఈ విషయం మర్చిపో."
అమూల్య తండ్రి గదిలోనుంచి బయటికి వస్తూ "హలో శేఖర్" అన్నది ఉత్సాహంగా.
"కృష్ణారావు కూతురు వెళ్ళినవైపే చూస్తూ ఆలోచిస్తున్నాడు.
శనివారం రాత్రి శ్రీధర్ వచ్చాడు. అతను వచ్చేసరికి ఇంట్లో కృష్ణారావు ఒక్కడే వున్నాడు.
అమూల్య క్లబ్బుకు వెళ్ళింది.
అవంతి ఎక్సర్షన్ కు వెళ్ళింది.
కృష్ణారావు భార్య డిన్నర్ కు వెళ్ళింది. శ్రీధర్ వస్తాడని తెలుసు. అయినా ఆమె డిన్నరుకు వెళ్ళిపోయింది. కృష్ణారావును కూడా రమ్మన్నది. కాని అతను వెళ్లలేదు.