"ఇప్పటికైనా నా భావాలను నువ్వు అర్థం చేసుకున్నావనే అనుకొంటున్నాను. ఇండియా స్వంతంత్ర దేశంగా అంటే హోమ్ రూల్ లోనే వుండాలని..."
"ఆ విషయం విన్నాను" మాట పూర్తికాకుండానే సీత అన్నది.
"వైస్ రాయ్ కూడా అభిప్రాయాలతో కొంతవరకు ఏకీభవిస్తున్నాడనే చెప్పగలను. ఆయనకు మీ బాబాయి అంటే చాలా గౌరవం. అలాగే మిస్టర్ కార్డరీ అంటే కూడా..." ఆగి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె మౌనంగా వుండిపోయింది.
"నువ్వు చాలా అందంగా ఉంటావు. అంతేకాదు, చాలా తెలివైనదానివి కూడా. మీ బాబాయికి నాగురించి చెప్పి, నేను ప్రతిపాదించిన బిల్లు పాసయ్యేలా చూడమని చెప్పు"
సీత ఆశ్చర్యంగా చూసింది. ఆ తర్వాత పకపక నవ్వింది. సీతను ఆమె బాబాయి ఎంత గౌరవిస్తాడో, ప్రేమిస్తాడో ఆమెకు బాగా తెలుసు. ఇంగ్లాండులో వుండగా తిట్లు తినని రోజు చాలా అరుదు. సీతను తప్పులు పట్టే టైంలేదు. హారే రాసే స్క్రిప్టును కాపీ చెయ్యడానికి ప్రభుత్వమే సెక్రటరీలను యిచ్చింది. యిచ్చింది. ఇప్పుడు ఆ పనిలేనందువల్లనే సీతకు బాబాయి తిట్లు తప్పాయి.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
"మా బాబాయి దగ్గర నాకు ఇలాంటి విషయాలు చర్చించేటంత చనువులేదని చెప్పడానికి బాధపడుతున్నాను. ఆయన దృష్టిలో నేను చిన్నపిల్లను. ఇలాంటి పెద్ద విషయాల్లో జోక్యం కలుగజేసుకోకూడదు."
"నీనుంచి ఇలాంటి సమాధానమే వస్తుందని నాకు తెలుసు" అని ఆగి ఓ క్షణం ఆమె ముఖంలోకి చూసి మళ్ళీ అన్నాడు.
"నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆడదానికి ముఖ్యంగా కావల్సింది అందం. తెలివితేటలు కాదు."
అతని కంఠంలోని మెత్తదనానికి ఆమె ఆశ్చర్యపోయింది. అతని చూపులు కూడా అదోలా వుండి సీతను ఇబ్బంది పెట్టసాగాయి. సీతకు అక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపోవాలనిపించింది.
"నీకు ఇండియా గురించి ఎన్నో తెలుసుకోవాలని వుంది కదూ?"
"అవును" ఉత్సాహంగా అన్నది సీత.
ఆమె మాటలు పూర్తికాకుండానే అతను ఆమెను రెండు చేతులతో పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. బిగికౌగిలిలో బంధించాడు.
"నేను నీకు ఇండియా గురించి ఎన్నో విషయాలు చెబుతాను" అన్నాడు తన ముఖాన్ని ఆమె ముఖం మీదకు తెస్తూ.
అతను తనను ముద్దు పెట్టుకునే ప్రయత్నంలో వున్నాడని సీతకు అర్థం అయింది.
ఒక్కసారి విదిలించుకొని అతని బంధం నుంచి దూరంగా జరిగింది. అతను వెంటనే ఆమెను బాహుబంధంలో ఇరికించాడు. "నో!నో!వద్దు!వద్దు" అంటూ పెనుగులాడసాగింది ఆమె.
"ఏం ఎందుకు వద్దు. నువ్వు నాకు కావాలి" అంటూ ఆమె గడ్డం పట్టుకొని ముఖాన్ని పైకి ఎత్తాడు.
"వద్దు!వద్దు! నాకిష్టం లేదు. నీకు నన్ను బలవంతం పెట్టే అధికారం లేదు. నన్ను వదులు" పెనుగులాడుతూనే అన్నది ఆమె.
"అధికారమా? అందమైన ఆడదాన్ని ముద్దు పెట్టుకునే అధికారం పురుషుడికి వుంది. దూరంగా కన్పించే నక్షత్రంగా నన్ను నువ్వు ఆకర్షించావు. నిన్ను చూసినపట్నుంచీ ఈ క్షణం కోసమే ఎదురుచూశాను" అన్నాడు బ్లన్ట్.
సీత ఒక్కసారిగా అతన్ని దూరంగా తోసేసింది. అతను పడబోయి నిలదొక్కుకున్నాడు.
"నీకు పెళ్ళయింది, నీ భార్య పక్కగదిలో డ్యాన్సు చేస్తున్నది."
"అయితే?"
"నాకు నువ్వు ఇలా ప్రవర్తించడం ఇష్టంలేదు. మళ్ళీ నా జోలికిరాకు."
"సీత! ఆహా! నీ పేరు ఎంత తియ్యగా వుంది. ఇంగ్లీషులో డబ్ అన్న పదం కంటేసీట్ గా వుంది. సీత అనే పేరు పేరుకుతగ్గ అందం నీది. నీ అందం ముందు నేను మోకరిల్లడానికి వెనుకాడను."
"ప్లీజ్! ఇంకేమీ చెప్పొద్దు."
"చెబుతాను. నువ్వు నేను చెప్పేది వినితీరాలి. నా భార్య గురించి నువ్వు భయపడవలసిన పనిలేదు. ఆవిడ నన్ను అర్థం చేసుకోగలదు. ఎవరైనా గొడవ చేస్తారనే భయం కూడా నీకు అక్కరలేదు. నాకు వ్యతిరేకంగా ఎవరూ నోరి విప్పరు" అన్నాడు బ్లంట్.
రెండడుగులు ముందుకు వేశాడు. సీత రెండడుగులు వెనక్కు వేసింది. అతను చేతులు చాపాడు.
"వద్దు వద్దు" చేతులు అడ్డుపెడ్తూ వెనక్కు వెయ్యసాగింది.
"నన్నూ, నా ప్రేమను అర్థం చేసుకో!"
"హు, ప్రేమ కాదు. కామం. నీ భార్యకు నువ్వు ఆడవాళ్ళతో తిరగడానికి అభ్యంతరంలేకపోవచ్చును. కాని నాకు ఉంది. భార్య ఉన్నవాడు మరో స్త్రీ పరిచయం నాకు సహించదు" అన్నది సీత.
బ్లన్ట్ నవ్వాడు. అందంగా నవ్వాడు. ఆడవాళ్ళంతా ముందు ఇలాగే మాట్లాడతార్లే అన్నట్టుగా నవ్వాడు.
"నీ సౌందర్యం ముందు నేను మోకరిల్లాను. నువ్వు నా ప్రేమను తిరస్కరిస్తున్నావు. నువ్వు నాకు లొంగిపోక తప్పదు. ఆడవాళ్లు ముందు తమకిష్టమైన మగవాళ్ళను ముందు తిరస్కరిస్తారు. ఈ విషయంలో నాకు చాలా అనుభవం వుంది. ఎంతోమంది ఆడవాళ్ళు ముందు ఇలాగే బెట్టుచేసి, ఆ తర్వాత సంపూర్ణంగా తమ సర్వస్వాన్నీ నాకు నైవేద్యంగా పెట్టారు."
సీత గిర్రున వెనక్కు తిరిగింది.
సీత భుజంమీద బలంగా చెయ్యివేసి, గుచ్చి పట్టుకున్నాడు.
"బాగా విను! నేను ఈ మాత్రానికే నిరాశ చెంది ప్రేమించిన ఆడదాన్ని వదిలేసేవాడ్ని కాదు. నిన్ను పూర్తిగా లొంగదీసుకుంటాను" అన్నాడు కసిగా.
సీత నీళ్ళల్లో తడిసిన పావురంలా వణికిపోయింది. బేలచూపులు చూసింది. అతను నవ్వాడు. మేకపిల్లను చూసి తోడేలు నవ్వినట్లుగా అన్పించింది సీతకు. సీత అతని చేతిని తన గోళ్ళతో గిచ్చింది. అతను ఒక్కసారిగా తన చేతిని ఆమె భుజంమీద నుంచి తీశాడు. సీత పరుగు తీసింది. వెనకనుంచి బ్లన్ట్ నవ్వు విన్పించింది. అది ఒక ప్రేమికుడి నవ్వులా లేదు. విలన్ నవ్వులా అన్పించింది.