Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 27


    దాని చమత్కారానికి నవ్వకుండా వుండలేకపోయారందరూ.
    కారు చప్పుడు విని ఎదురెళ్ళారు రావుగారు. "మాధవిని చూస్తూ నేను ఫోన్ చెయ్యలేదమ్మాయ్. అదుగో ఆ గడుగ్గాయే చేసింది" అన్నారు భయపడుతున్నట్లుగా ఫోజుంచి.
    మాధవి నవ్వుతూ "మామయ్యా! రేపు శాంతికి పెళ్ళి చేసి అత్తవారింటికి పంపిస్తే దాంతోపాటే మీరూ వెళ్ళవలసొస్తుంది" అంది.
    "అవునా తాతయ్యా!" అంది పెద్ద ఆరిందలా శాంతి.
    "అవునమ్మా. ఇద్దరం కలిసే వెళదాం మీ అత్తారింటికి" అన్నారు నవ్వుతూ.
    "అంతేలే, అదే బెస్టు" అన్నారు నవ్వుతూ జయరాం. అందరూ నవ్వేశారు.
    "గుడ్ నైట్" చెప్పి సెలవు పుచ్చుకున్నారు జయరాం.
    ఆరోజున అజయ్ కిష్టమైన వంటలన్నీ చేశారు.
    "ఎందుకు మమ్మీ ఇవన్నీ చేశారు" అంది శాంతి.
    మాధవి మాట్లాడలేదు. చిరాగ్గా గోపీనడిగింది శాంతి.
    "ఇవాళ మీ డాడీ పుట్టినరోజు పండుగమ్మా" అన్నాడు.
    "అలాగా!" అంటూ చేసిన పదార్థాలన్నీ ఒక టిఫిన్ క్యారియర్ నిండా నింపి స్కూలుకి పట్టికెళ్ళింది. తిన్నగా అంకుల్ దగ్గరికెళ్ళి "అంకుల్ ఇవాళ మా డాడీ పుట్టినరోజు. ఇవన్నీ తెచ్చాను. మీరూ, మేరీ టీచరు కూడా తినాలి" అంది.
    "ఇవాళ నా పుట్టినరోజు కూడానమ్మా" అన్నాడు కుమార్.
    "అలాగా! మీరూ మా నాన్నా ఒక్కసారే పుట్టారన్నమాట. బలే. ఐతే మా నాన్న వుంటే అచ్చం మీలా వుండేవారన్న మాట" అంది.
    "మీ నాన్నలేరా అమ్మా"
    "లేరంకుల్. దేముడి దగ్గరికెళ్ళిపోయార్ట" బాధగా అంది.
    "శాంతీ!" ఆ మాటలు వినలేనట్టుగా అరిచాడు.
    "తమ్ముడూ! ఇవాళ నీ పుట్టినరోజని నాతో చెప్పలేదేం?" అడిగింది మేరీ.
    "ఈ రోజున పుట్టినవాళ్ళు బహుశా దురదృష్టవంతులు అక్కయ్యా. అతను చచ్చిపోయి వాళ్ళకి లేకుండా పోయాడు శాంతీ వాళ్ళ నాన్న. నేను బతికుండీ మా వాళ్ళకి కాకుండా పోయాను" నిట్టూర్చాడు బాధగా.
    "అలా అనకు తమ్ముడూ! జీసెస్ క్రైస్తు అంతటివాడు ఎన్నో కష్టాలు పడ్డాడు. కష్టాల్లోంచే సుఖం పుడుతుంది. చీకటి కడుపున కాదూ! వెలుగు పుట్టేది" అన్నది.
    "అంకుల్! నువ్వలా విచారంగా వుంటే నేవెళ్ళిపోతా."
    "శాంతీ! నా బాధంతా నీలాంటి మాణిక్యాన్ని కళ్ళారా చూళ్ళేకపోతున్నాననేనమ్మా నా బాధ.
    "అంకుల్! నిన్ను మా డాక్టర్ తాతయ్యకి చూపిస్తాను. మంచి మందిచ్చి నీకు కళ్ళొచ్చేలా చేస్తాడు" అంది చేతులు తిప్పుకుంటూ.
    "పిచ్చిపిల్లా! నీ మాటల్లో నేను భగవంతుణ్ణి చూస్తున్నానమ్మా...ఇంక డాక్టరక్కర్లేదు" అన్నాడు.
    "అలాకాదు అంకుల్. నువ్వు డాక్టర్ తాతయ్య దగ్గరికి రానంటే నేనింకెప్పుడూ ఇక్కడికి రాను" అంటుంది కోపం నటిస్తూ.
    "తమ్ముడూ! నువ్వీ పాపకోసమైనా వచ్చి తీరాలి. సరే అను" అంది మేరీ.
    "సరేనమ్మా"
    "థ్యాంక్యూ అంకుల్" అంది శాంతి సంతోషంగా.
    మర్నాడు సాయంత్రం స్కూలునుంచే వెళ్ళింది అంకుల్ దగ్గరకి. మేరీ. కుమార్ సిద్ధంగా వున్నారు. డాక్టర్ జయరాం దగ్గరికెళ్ళి కళ్ళ స్పెషలిస్టు అపాయిమెంట్ తీసుకుంది మేరీ.
    "అంకుల్! డాక్టరేమన్నాడో రేపు నాతో చెప్పాలి" అంది శాంతి.
    "అలాగేనమ్మా" అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు.
    మర్నాడు పొద్దుటే వెళ్ళి అడిగింది శాంతి.
    "ఆపరేషన్ చేసి వేరే కళ్ళు పెడితే చూపొస్తుంది" అంది మేరీ.
    "కళ్ళెక్కడ దొరుకుతాయి?" అంది శాంతి.
    "కొందరు మహానుభావులు కళ్ళదానం చేస్తారు. అవి పనికొస్తాయి."
    "నిజంగానా?"
    "అవునమ్మా"
    శాంతి ఆలోచనలో పడింది. "టీచర్! అయితే నాదొక కన్ను తీసి అంకుల్ కి పెడితే?" అంది.
    "శాంతీ!" ఆ పిల్ల పిచ్చిప్రేమకి కృతజ్ఞతలెలాచెప్పుకోవాలో తెలీక ఆవేశంలో అరిచాడు కుమార్.
    "ఒద్దు శాంతీ! ఆసుపత్రిలో కళ్ళ బ్యాంకులో కళ్ళు సిద్ధంగా వుంటాయిగా. అవి పెట్టొచ్చు"
    "అయితే తొందరగా పెట్టించండి టీచర్" అంది.
    "అలాగేనమ్మా"   

 Previous Page Next Page