"అవును."
"అక్కడెందుకు పడివున్నాను?
"బాగుంది! మీరెందుకు పడివున్నారో మాకేం తెలుస్తుంది? అసలు మీ ఇల్లెక్కడ? మీ ఇంటికేమయినా ఫోన్ నెంబరుందా?"
"ఫోన్ నెంబరుంది" ఉత్సాహంగా అంది దీప.
"ఎంత?"
దీప ఏదో చెప్పబోయింది. అంతవరకూ గుర్తున్నట్లనిపించిన నెంబర్ హఠాత్తుగా గుర్తులేకుండా పోయింది.
"గుర్తుకురావటం లేదు."
"పోనీ ఇంటి అడ్రస్ చెప్పగలరా?"
"చెప్తాను" ఆమె ఆలోచనలకు మళ్ళీ బ్రేక్ పడిపోయింది.
అవును. తనింటి అడ్రస్ ఏమిటి?
ఎందుకిలా మర్చిపోతోంది?
తనింటి అడ్రస్ గుర్తురాకపోవడమేమిటి?
"చెప్పరేం? అడ్రస్ కూడా గుర్తులేదా?"
"గుర్తురావటం లేదు."
"బాగుంది! ఇంటి అడ్రసే మర్చిపోతారా ఎవరయినా?" విచిత్రంగా చూస్తూ అంది నర్స్.
"పోనీ పేరు చెప్పండి?"
దీప చెప్పబోయి ఠక్కున ఆగిపోయింది.
అవును! తన పేరేమిటసలు? తలనొప్పి మొదలయింది.
మైగాడ్! నా పేరే గుర్తుకురావటం లేదా? ఏం జరుగుతోందసలు?"
ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్, ఆఖరికి తన పేరూ....
"పోనీ మీ భర్త పేరూ, మీ ఫాదర్ పేరూ, జాబ్, మదర్ పేరూ, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరయినా సరే."
తలనొప్పి ప్రారంభమయింది.
ఆలోచించటం ప్రారంభించగానే తలనొప్పి.
ఏదయినా గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నించినా తలనొప్పే.
తన తండ్రి పేరేమిటి? తనకు భర్త ఉన్నాడా? పెళ్ళయిందా?
పోనీ తన తల్లి?
తన తండ్రేం చేస్తుంటాడు?
ఏమీ తెలీటంలేదు. అంతా అగమ్యగోచరంగా వుంది.
అసలు తనెవరు?
ఉలిక్కిపడింది దీప.
అవును. తనెవరు?
తనెవరో తనకే తెలీదా?
తన పేరు మర్చిపోతే మర్చిపోయి ఉండవచ్చు ఆ షాక్ కి.
కానీ అసలు తనెవరో కూడా తెలీకపోతే-టూమచ్.
"సరే ఆ పోలీస్ సబిన్ స్పెక్టర్ బయట వెయిట్ చేస్తున్నాడు. నీ దగ్గర స్టేట్ మెంట్ తీసుకోవాలట."
"ఏం స్టేట్ మెంట్?"
"అదే...నీకీ దెబ్బలెలా తగిలాయ్, రోడ్డు మీద ఎందుకు పడి వున్నావ్ అన్నీ చెప్పాలి."
నర్స్ వెళ్ళగానే సబిన్ స్పెక్టర్ లోపలికొచ్చాడు.
ఆ పక్కనే ఉన్న స్టూల్ ఆమె బెడ్ కి సమీపంగా లాక్కుని కూర్చుని తన డైరీ తీసి పెన్ పట్టుకున్నాడు.
"మీ పేరు?"
"నా పేరా...నాపేరు సరోజ, ఊహు కాదు కాదు లక్ష్మీ...అహా..అదీకాదు... జయ...ఊహు..."
సబిన్ స్పెక్టర్ ఆశ్చర్యంగా ఆమెవేపు చూశాడు.
"మీ పేరు మీకు తెలీదా?"
"గుర్తురావటం లేదు." దీనంగా అందామె.
"తలనొప్పి! అబ్బా...తల పగిలిపోతుంది."
"పోనీ మీ ఫాదర్ పేరు?"
ఆమె మళ్ళీ ఆలోచనలో పడింది.
మళ్ళీ తలనొప్పి.
"అబ్బా..."తలను చేత్తో జాగ్రత్తగా నొక్కుకుంటూ అందామె.
"ఏం జరిగింది?"
"గుర్తు రావటం లేదు."
"మీ ఇల్లెక్కడో తెలుసా నీకు"
"ఊహు! తెలీదు...ఊహు! గుర్తురావటం లేదు"
"ఫోన్ నెంబర్, లేక పక్కింటి వాళ్ళ ఫోన్ నెంబర్...ఏదోకటి గుర్తుకొస్తుందేమో చూడు!"
"ఏదీ గుర్తురావటం లేదు"
"ఈ దెబ్బెలా తగిలింది మీకు"
"తెలీదు"
సబ్ ఇన్ స్పెక్టర్ కి అనుమానం వచ్చింది.
"ఇవన్నీ నిజమే చెప్తున్నారా? అబద్ధాలు చెప్తున్నారా?"
"నిజమే. ఆలోచించినా గుర్తు తెచ్చుకోడానికి ట్రైచేసినా తల పగిలిపోతుందేమో అన్నంత నొప్పి"
అతను మరికొన్ని ప్రశ్నలు వేసి లేచి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.
అప్పటికే నర్స్ డాక్టర్ తో దీప పరిస్థితి వివరిస్తోంది.
డాక్టర్ సబిన్ స్పెక్టర్ వేపు చూశాడు.
"అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదు. ఆమె బలమయిన హెడ్ ఇంజురీ అయింది కాబట్టి ఒకసారి జ్ఞాపకశక్తి దెబ్బతినడానికి అవకాశం ఉంది! క్రమేపీ మళ్ళీ కోలుకుని తిరిగి జ్ఞాపకశక్తి పొందే అవకాశం ఉంది."
"క్రమేపి అంటే ఎన్నిరోజులు?" అడిగాడు సబిన్ స్పెక్టర్.
"చెప్పలేము. పదిరోజుల్లో రావచ్చు. లేదా పదేళ్ళు పట్టవచ్చు."
"అంతవరకూ మా రికార్డ్స్ సంగతేమిటి?"