Previous Page Next Page 
జయ - విజయ పేజి 27


    "అది తెలివితక్కువ పని అని యిప్పుడు తెలుస్తోంది!"
    "అతనేమంటాడు?"
    "అతనికి తెలీదీ విషయం! అసలతను ఇక్కడ లేడు."
    "ఎక్కడున్నాడు?"
    "ఢిల్లీలో"
    "అతనికి టెలిగ్రామిచ్చి పిలిపిస్తే?"
    "ఎందుకు?" అడిగింది జయ.
    "వివాహం గురించి మాట్లాడ్డానికి..."
    "అది సాధ్యం కాదక్కా."
    విజయ అదిరిపడింది.
    "ఎందుకని?"
    "నేను చంద్రకాంత్ నే వివాహం చేసుకుంటాను."
    "విజయ నివ్వెరపోయింది.
    "ఏమిటి నువ్వు మాట్లాడుతోంది?" కోపంగా అంది విజయ.
    "తప్పు జరిగిపోయింది!"
    అతని రూపం చూసి ప్రేమించి అన్నీ అర్పించేశాను. ఆ తర్వాత చంద్రకాంత్ ని ప్రేమించాను."
    "కొద్దిసేపటి తర్వాత అడిగింది విజయ." అంటే ఈ విషయం చంద్రకాంత్ కి తెలుసా?
    "తెలీదు."
    "తెలిస్తే అతను నిన్ను పెళ్ళిచేసుకుంటాడా?"
    "తెలీదు."
    ఆమెకు ఇంకా ఇదంతా నిజమని నమ్మబుద్ధి కావటంలేదు. జయ యింతటి సాహసానికి పాల్పడిందంటే ఆశ్చర్యంగా వుంది. అసలామెకు అలాంటి వ్యవహారాల్లోకి దిగేంత వయసుందనే తననుకోవడం లేదిన్నాళ్ళూ.
    "ఇప్పుడీ విషయం అమ్మకి తెలిస్తే ఇంకేమయినా వుందా? అమ్మ గుండె ఆగిపోతుంది! అంతే!"
    "అవునక్కా! అమ్మ ఇక ఈ షాక్ నుంచి కోలుకోలేదు. మంచం పట్టేస్తుంది! నాకు తెలుసా విషయం! అందుకే నీతో చెప్తున్నాను. నువ్వే నన్నీ విషమ పరిస్థితి నుంచి రక్షించాలక్కా! అమ్మనూ, నన్నూ రక్షించాలి." ఆమె మీదకు ఒరిగిపోయి బావురుమని ఏడ్చేయసాగింది జయ. ఆమెను చూస్తూంటే విజయకు దుఃఖం ఆగటం లేదు.
    "ఏయ్! ఏడుస్తావెందుకు. ఏడిస్తే సమస్యలు పరిష్కారమయిపోతాయా ఏమిటి?" చాల్చాల్లే వూరుకో!" మందలింపుగా అంది విజయ.
    "అంతకంటే ఇంకేం చేయాలో తెలీటం లేదక్కా! ఆత్మహత్య చేసుకు ఛస్తే అందరికి సంతోషం కలిగించినదాన్నవుతాను!"
    "ఛట్! పిచ్చి మాటలు మాట్లాడకు! చచ్చిపోవడం ఎందుకు? చచ్చిపోతే నీకొచ్చే చెడ్డ పేరు మాసిపోతుందా? అమ్మ ఎంత కుమిలిపోతుంది? ఏ పరిస్థితినయినా ధైర్యంగా ఎదుర్కోవాలిగాని ఇలా ఏడుస్తూ పిచ్చిపిచ్చి ఆలోచనల్లోకి దిగితే ఎలా?"
    ఏమో అక్కా! నాకేమీ తెలీదు. నువ్వేం చెప్తే అది చేస్తాను. నా మనస్సు చచ్చిపోయింది. కేవలం శరీరం మిగిలివుంది! అంతే!"
    "నాకు ఏమీ తోచడం లేదు జయా! ఇదంతా వెంటనే అమ్మకు చెప్పేయడం మంచిదేమో అనిపిస్తోంది." అంది విజయ కొద్దిసేపు ఆలోచించిన తర్వాత.
    "ఏం చేసినా సరే! అదంతా నువ్వే చూసుకో! నేను మాత్రం అమ్మకు నా మొఖం చూపలేను... నా నోటితో ఇదంతా చెప్పలేను."
    "సరే! అదంతా రేపు చూసుకుందాం గానీ క్రిందకు వెళ్దాం పద! పొద్దుపోయింది" అంది విజయ లేచి నిలబడుతూ.
    ఇద్దరూ డాబా దిగి యింట్లోకి నడిచారు.
    పార్వతి విజయ చెప్పిన మాటలు వింటూనే కంపించిపోయింది. కొద్దిసేపటివరకూ ఆమె నోటివెంబడి మాట రాలేదు. గత కొద్దిరోజులుగా జయ ప్రవర్తన తనకు కలవరం కలిగిస్తూనే వుంది. చదువు మానేస్తాననడం, ఉద్యోగం చేస్తాననడం, ఏదో అపశృతి ధ్వనిస్తూనే వుంది.
    ఓరోజు ఉదయమే స్నేహితురాలింటికని చెప్పి వెళ్ళిపోవడం, ఆ సాయంత్రం వరకూ తిరిగి రాకపోవడం, వచ్చినప్పుడు ఆమె నలిగిన బట్టలూ, రేగిన జుట్టూ అన్నీ తనని కలవర పరచినాయ్.
    కానీ ఆమె మీద ఉన్న నమ్మకం తన ఆలోచనలను అణగద్రొక్కేసింది. అయినా ఆమె అందం ఎప్పుడో కొంప ముంచగలదని అనుకుంటూనే ఉంది. ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది.
    భర్తపోయిన దగ్గరనుంచీ ఏదో గుట్టుగా సంసారం నెట్టుకొస్తోంది తను. ఇద్దరు ఆడపిల్లలకూ ఎలాగోలా వివాహం చేసేస్తే తనకిక ఎలాంటి బరువూ బాధ్యతలు ఉండదని ఆశ పడింది. కానీ విజయ దురదృష్టమేమోగానీ దానికా రాత రాసి వున్నట్లు లేదు. ఎన్ని సంబంధాలు_ఇప్పటికి ఏడెనిమిది మంది ఆమెను చూసి వెళ్ళారు. ఏదీ కుదరందే? పోనీ జయకయినా చేసేస్తే తనకు కొంత మనశ్శాంతి లభిస్తుందని ఆశించింది. ఆ ప్రయత్నాల్లో ఉంది కూడా! ఇప్పుడు హఠాత్తుగా ఈ దారుణం!
    తననెవరాదుకుంటారిప్పుడు?

 Previous Page Next Page