"ఏమిటి రాధా, నేను ఏదో అడిగితే నువ్వు లెక్చర్లు దంచుతున్నావు! చదువులు బాగానే ఒంటపడుతున్నాయి యీ కాలం పిల్లలకి! హక్కులు, స్వాతంత్ర్యాలు అంటూ పెద్ద పెద్ద మాటలు వల్లిస్తున్నారు....."
"పెద్ద పెద్ద మాటలుకాదు, తాతగారూ! నిజం తెలుసుకుంటున్నారు యినాటి ఆడపిల్లలు."
"అయితే యింతకీ పెళ్ళి చేసుకోనంటావు, అంతేనా?" రాధ జవాబియ్యకుండా ఊరుకుంది.
"రాధా! చిన్న పిల్లవు. నీ కింకా లోకానుభవం చాలదమ్మా! ఏదో పుస్తకాలు చదివి, ఊహించుకుని ఆశయాలు, ఆదర్శాలు అంటూ వల్లిస్తున్నావు కాని, వాస్తవ జీవితంలో ఆ ఆశయాలను పట్టుకుని వేలాడ్డం చాలా కష్టం. ఏదో సరదా కొద్దీ ఉద్యోగం చెయ్యాలని ఉండవచ్చు నీకు. కాని ఆ ఉద్యోగంతో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని మాత్రం అనుకోకు! ఉద్యోగినులకి కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. పెళ్ళి పెడాకులు లేకుండా ఓ ఆడది ఉద్యోగం చేసుకుంటూ బ్రతకడం యీ దేశంలో అంత సులభం కాదు తెలుసా? ఒంటరిగా బతికే వయసు వచ్చిన ఆడపిల్ల చుట్టూ రకరకాల ఉచ్చులు బిగిస్తాయి కొన్ని రాబందులు! అవన్నీ తెంచుకుని ఒంటరికత్తె నెగ్గుకు రావడం నువ్వు ఊహించినంత తేలిక కాదు! అన్ని సమస్యలను, యిబ్బందులను ధైర్యంగా ఎదుర్కొనే మనోబలం అందరికీ ఉండదు....."
"తాతగారూ, ఆ ధైర్యం నాకుంది. మీరు చెప్పేదంతా పాతకాలంనాటి మాట. ఈనాడు వేల కొలది ఆడపిల్లలు చదువు కుని ఉద్యోగం చేస్తున్నారు. ఆడపిల్ల ఉద్యోగం చెయ్యడమన్నది ఈనాడు సర్వసాధారణమైన సంగతి! ఇందులో ఇంత ఆలోచించడానికి, భయపడడానికి ఏముంది?"
"ఏ కాలమైనా ఆడదాని స్థితి ఒకేలాగే ఉందని నువ్వే కదమ్మా అన్నావు యిప్పుడు! ఆడది చదువుకుని ఉద్యోగం చేసినంత మాత్రాన ఆమె కే సమస్యలు ఎదురవ వనడానికి వీలులేదు. అదలా ఉంచు. సరే, పెళ్ళి చేసుకోకుండా ఉద్యోగం చేస్తావు-బాగానే ఉంది! ఇప్పుడు నీకు పట్టుమని ఇరవై రెండేళ్ళు లేవు. నీ ముందు యింకా ఎంతో బ్రతుకుంది! ఒంటరిగా, తోడు నీడ లేకుండా జీవించే జీవితం ముందు ముందు నీకు వెగ టనిపించవచ్చు. అప్పుడు ఓ తోడు జోడు కావాలనిపించవచ్చు. కాని......పై బడిన నీ వయస్సు నీకు అడ్డు నిలుస్తుంది. అప్పుడు నువ్వు ఏం పోగొట్టుకున్నావో, జీవితంలో ఎంత నష్టపోయావో తెలుసుకోగలుగుతావు. కాని లాభం ఉండదు....."
సరిగా ఎప్పుడో విజయకి చెప్పిన మాటలే మళ్ళీ వల్లిస్తున్నందుకు జగన్నాథంగారికి అదోలా అనిపించింది. ఆనాడు చిలక్కి చెప్పినట్టు చెప్పినా విజయ విందా?.....ఇప్పుడు అంతకంటే పది పన్నెండేళ్ళ తరవాత పుట్టిన అనూరాధ మాత్రం వింటుందా తన మాట, తన వెర్రిగాని?
"ఏమిటి తాతగారూ, మీరంతా మరీ యిదిగా చెపుతున్నారు!" రాధ ఆయన మాటలు చాదస్తంగా జమ కట్టి తేలిగ్గా అంది. "ముందు కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తాను. మీ రన్నట్లు ఒంటరిగా ఉండడం అంతగా కష్టం అనిపిస్తే అప్పుడు చేసుకుంటాను పెళ్ళి....ఈ రోజుల్లో ముఫ్ఫయ్యేళ్ళు వచ్చాక కూడా ఎంత మంది చేసుకోడం లేదు పెళ్ళిళ్ళు?"
"రాధా!.....నువ్వు నీ సంగతే ఆలోచించుకుంటున్నావు కాని, యింటి సంగతి ఏమైనా ఆలోచిస్తున్నావా? మీ అమ్మ తండ్రీ కూతుళ్ళు యిద్దరి మధ్య నలిగి ఎంత బాధపడుతూందో నీకేమైనా తెలుస్తుందా? నీకు మీ నాన్న కోపం సంగతి తెలియదా? నువ్వు పెళ్ళి చేసుకోననడం కూడా మీ అమ్మనేరం కింద జమకట్టి మాట్లాడే మీ నాన్న సంగతి నీకు తెలియదా? మీ అమ్మ యింట్లో పడే యాతన నీకు అసలు ఏమైనా తెలుసా"
"నాకు అంతా తెలుసు తాతగారూ!.....కాని.....నేను యిప్పుడు పెళ్ళి చేసుకోననడం వాళ్ళ మంచి కోసమే అంటున్నాను! నాన్న సంపాదన సంగతి మీకు తెలియదా? ఆ సంపాదనతో సంసారం పోవడమే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నాకు పెళ్ళి చేయాలంటే, కాస్త పొలం అమ్మాలి. ఆ తిండి గింజలు కూడా కరువయే పరిస్థితిస్తుంది. లేదా అప్పు చేయాలి! నా ఒక్కరితో సరా- యింకా ముగ్గురున్నారు పెళ్ళికి! తమ్ముళ్ళున్నారు చదువులకి. ఈ ఖర్చులన్నింటికి డబ్బు ఎక్కడనుంచి తెస్తారు?.....ఇదంతా ఆలోచించి నేను డిగ్రీ వుంది, ఉద్యోగం చేసి నాన్నకి కాస్త సాయపడతా'నంటే, నేనేదో తప్పుడు పని చేస్తున్నట్లు అందరూ యింత రాద్ధాంతం చేస్తున్నారేమిటి?" కోపంగా అంది రాధ.
"ఆడపిల్లవు! నీ పెట్టుపోతలకోసం ఎవరాశించారు తల్లీ! మళ్ళీ చేసి అత్తవారింటికి పంపి కన్నందుకు బాధ్యత నెరవేర్చుకోవాలని మా ఆదుర్దా.......ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తే గాని నడిచే స్థితిలో లేదంటావా యిల్లు?" పక్కనే ఉండి అంతా వింటున్న శకుంతల లోపలికి వస్తూ అంది. తన తండ్రి ఎదుట కూతురు తన సంసారాన్ని బొత్తిగా హీనంగా చిత్రించడం సహించలేకపోయింది.
"ఆ....నడుస్తూంది! నేనేం చిన్నపిల్లనా? నా కా మాత్రం తెలియదనుకున్నావా?"
"చాల్లే ఊరుకో, మీకేం లోటయింది యిప్పుడు?"
"ఏం లోటా? మనం యింకా ఉన్నతంగా బతికే మార్గం వున్నప్పుడు అది ఎందుకు వదులుకోవాలి! నేను ఏ కాలేజీలోనో ఉద్యోగం చేసి మూడు నాలుగు వందలుతెస్తే యింటికి ఎంత ఆసరాగా వుంటుంది ఆడబ్బు? నా సంపాదనకూడా ఉంటే, యిప్పటిలా అన్నింటికి తడుముకోనక్కర లేదుగా!"
"ఇంక ఊరుకుంటావా లేదా? ఆడపిల్లవి ఉద్యోగం చేసి సాయం చేస్తానంటే మీ నాన్న ఏమంటారో తెలుసునా?"
"ఏమంటారు? ముందు తిడతారు.....తరవాత సంతోషిస్తారు. డబ్బు చేదా ఏమిటి నాన్నకి!....." నిర్లక్ష్యంగా అంది రాధ.
"ఇదీ వరస నాన్నా! ఆయన చూస్తే అలా ఎదురు తిరుగుతారు, ఇది యిలా వుంది!"
జగన్నాథంగారు నిట్టూర్చాడు.