ఇంతకుముందు బొంబాయి నుంచి అష్టకష్టాలుపడి తిరిగొచ్చిన అమ్మాయిలు ఇప్పుడేమయ్యారు?
రైల్వేస్టేషన్ లో, బస్టాండులో ఒళ్ళమ్ముకుని కుళ్ళిపోతున్నారు.
తన బ్రతుకు అలాగే... అలాగే దిగజారుతుందా?
నో...
తన బ్రతుకు అలా దిగజారడానికి వీల్లేదు. ఇక్కడే... ఇక్కడే ఎన్ని కష్టాలొచ్చినా వాటికెదురీది తను బ్రతగ్గలదు.
ఒక అనామకురాలిగా తను గంగిరెడ్డిపల్లి వెళ్ళదు.
మరి...?
ఏం చేస్తుంది తను? ఏం చేయగలదు తను?
ఆలోచిస్తోంది నిశాంత.
క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా గడుస్తున్నాయి.
కాటుక కంటినీరులా చిక్కటి చీకటి...
తెరువు వెతుక్కుంటున్న దీర్ఘరాత్రి...
పల్లెటూళ్ళో సుబ్బారెడ్డి మాస్టారిచ్చిన కండువా తీసుకుని గుండెల మీద కప్పుకుంది. తన గుండెలవైపు చూసుకుంది.
అప్పుడర్ధమైంది ఆ కండువాను ఆయనెందుకిచ్చాడో!
బాధగా కళ్ళు మూసుకుంది నిశాంత. రెండు కన్నీటి చుక్కలు ఆ కండువా మీద పడ్డాయి.
ఆ కండువా తల్లి ప్రేమలా చల్లగా వుంది. తండ్రి గుండెలకు హత్తుకున్నట్లుగా వెచ్చగా వుంది. ఒక్కసారామెకు బాల్యం గుర్తుకు వచ్చింది.
ఎన్నెన్నో దృశ్యాలు...
ఆ ఊరు పేదరికం గుర్తుకు రాగానే నిశాంత మనసు భోగిమంట ప్రక్కన కూర్చున్నట్లుగా అయిపోయింది.
పదినిమిషాల తర్వాత-
"మా ఊరిని నేను మార్చలేనా? మా ఊళ్ళో పేదరికం లేకుండా చేయలేనా?" అని అనుకుంది.
ఆ ఆలోచన చాలా చిత్రంగా వుందామెకు.
ఆ ఆలోచనలతోనే బెడ్ మీద వాలిపోయింది.
మగతగా నిద్ర ముంచుకొచ్చిందామెకు.
* * * *
రూమ్ లో పచార్లు చేస్తున్న సిద్దార్ధకు బోర్ గా వుంది.
టేబుల్ మీదున్న వీడియో కేసెట్ ని తీసి వి.సి.ఆర్.లో ఇన్ సెట్ చేసి ఆన్ చేశాడు.
టీవీ స్క్రీన్ మీద జోక్రిబ్ ప్రత్యక్షమయ్యాడు.
రెండు రోజుల క్రితం జోక్రిబ్ తన అనుభవాలను లెక్చర్ గా చెప్పి ఈ కేసెట్ యిచ్చి వెళ్ళిపోయాడు. ప్రసంగం మొదలయింది.
It is difficult to imagine a world without money...
డబ్బులేని ప్రపంచాన్ని మనం వూహించగలమా...? ప్రస్తుతం మానవ వ్యవస్థకు మూలకేంద్రం మనీ! ప్రతి దేశానికీ తనదైన కరెన్సీ వుంది. మానవజాతి పుట్టిన దగ్గర్నుంచి ఏదో ఒక రూపంలో డబ్బు ప్రధాన పాత్ర వహిస్తూనే వుంది.
డబ్బు... మనీ... కరెన్సీ....
డబ్బు అంటే ఏమిటి? కొంతమందికి నాణాలు, మరికొంతమందికి బ్యాంక్ నోటులు, ప్లాస్టిక్ కార్డులు, బ్యాంక్ లోని కరెన్సీ! కానీ చరిత్రలో డబ్బు ఎప్పుడు పుట్టింది? డబ్బుకు విలువ ఎప్పుడొచ్చింది...? ఒకప్పుడు డబ్బు రూపంలో, రాళ్ళ రూపంలో, రాగిరేకుల రూపంలో, ఆల్చిప్పల రూపంలో ఇంకా ఎన్నో రకాలుగా నమ్మలేని విధంగా చలామణిలో వుండేదని తెలిస్తే ఆశ్చర్యపోతాం.
ఈ శతాబ్దంలో డబ్బు కరెన్సీగానూ, నాణాలుగానూ వుంటే, రేపటి శతాబ్దంలో డబ్బు తన రూపాన్ని కంప్యూటర్ ద్వారా పూర్తిగా మార్చుకోవడం మనం నమ్మగలమా?
అసలు డబ్బు ఎప్పుడు పుట్టింది? అన్నదానికి నిర్దుష్టమయిన ఆధారాలు లేవు 4,500 సంవత్సరాల ప్రాచీన మెసపొటామియా (ఇరాన్)లో దొరికిన శాసనాల ప్రకారం వెండి ద్రవ్యంగా వుండేది! వెండిని తూకం వేసి ఆ తూకపు భారానికి తగ్గట్టుగా వస్తువుల మారకం వుండేది. ప్రపంచ వ్యాప్తంగా రకరకాల లోహాలు ఆ కాలంలో ద్రవ్యంగా చెలామణీలో ఉండేదని చరిత్ర చెప్తోంది.
వెండిని, ఇతర లోహాలను షెకెల్స్ రూపంలో తూచేవారు. అరవై షెకెల్స్ వెండి ఒక మీనా అని భావించేవారు క్రీస్తుపూర్వం 1865-1804లో ఉరుక్ దేశాన్ని పరిపాలించిన మహారాజు షిన్ కాసిద్ కాలంలో పన్నెండు మీనాలకు వస్తువులు, మూడు మీనాలకు నూనె, తదితర పదార్ధాల్ని యిచ్చే వారని చారిత్రక ఆధారం వుంది.
ప్రాచీన ఈజిప్టియన్లు కూడా బంగారం, వెండి, రాగి లోహాలను డబ్బుగా వాడేవారు.
ఆరవ శతాబ్దం నుంచి 1930 వరకూ చైనాలో వివిధ లోహాలతో తయారుచేసిన నాణాలున్నా, ఆ నాణాల విలువను గుర్తించడానికి తూకంలో బంగారాన్ని, వెండిని వుపయోగించేవారు.
బర్మాలో, 18వ శతాబ్దంలో అధికారికంగా వెండి డబ్బుగా మారింది. మన రూపాయి సైజుకన్నా కొంచెం పెద్దవిగా, రకరకాల డిజైన్లతో పువ్వుల ఆకారంలో వెండి బిళ్ళల్ని తయారుచేసేవారు. వీటిని ఫ్లవర్ సిల్వర్ అనేవారు. అలాగే రాజరికానికి చెందిన ద్రవ్య వినిమయానికి వస్తువుల తూకానికి యిత్తడితో తయారుచేసిన జంతువుల బొమ్మలను వుపయోగించేవారు.
ప్రాచీన కాలంలో రాళ్ళు, రప్పలు, ఆల్చిప్పలు మన మనీగా చెలామణీ అయ్యాయంటే మనం నమ్మగలమా?
నమ్మలేం కానీ నమ్మక తప్పదు. పసిఫిక్ సముద్ర ప్రాంతానికి చెందిన యాప్ తెగ ప్రజలు రాళ్ళ ముక్కల్ని డబ్బుగా వుపయోగించేవారు. మెక్సికోలో చిన్న రాగి గొడ్డల్ని మనీగా వుపయోగిస్తే, 19వ శతాబ్దంలో ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోను, ప్రాచీన చైనాలోను యినప పారల్లాంటి వస్తువులు మనీగా చెలామణీ అయ్యాయి.
చైనా అక్షరాలు మనకు చాలా వింతగా కనిపిస్తాయి. ఆ అక్షరాలు పుట్టుకకు మూలం, సముద్రంలో దొరికే గవ్వలని తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అవును చైనా లిపి, గవ్వల ఆకారంలోంచే డెవలప్ చేశారు. దానికి కారణం 3500 క్రితం చైనా ప్రజల డబ్బు గవ్వలు కావడమే, అలాగే పదవ శతాబ్దం దగ్గర్నించి 18వ శతాబ్దం వరకూ ఆఫ్రికా, థాయ్ లాండ్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో గవ్వల్నే డబ్బుగా వాడేవారని తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం.
15వ శతాబ్దం నుంచి 1948 వరకూ దక్షిణాఫ్రికాలో రాగి రింగులు డబ్బుగా చెలామణీ అయితే, పసిఫిక్ సముద్ర ప్రాంతంలోని శాంతాక్రజ్ ప్రజలు పక్షి ఈకల్ని డబ్బుగా వాడేవారు. పక్షి ఈకలు ఎంత పెద్దవైతే అంత విలువ వుండేది. అలాగే నార్త్ అమెరికాలోను, ఇండియాలోనూ కొన్ని ప్రాంతాల్లో పూసల్ని డబ్బుగా వాడేవారు.