కొటేయార్, ఆతూర్, పుడూర్ అనే పల్లెలున్నాయక్కడ. అవన్నీ గోపీనాధానికి దగ్గరే. కాలినడక, గుర్రపు సవారే శరణ్యం.
మైసూర్ టూ గోపీనాధం.
కొల్లెగాళ్ టూ గోపీనాధం కూడా ప్రైవేట్ బస్ లే వెళ్తుంటాయి.
కర్నాటకలో హొగెనకల్ ఫాల్స్, అలంబడి, పొన్నాచి, చెమ్మేడు క్యారీసైట్, గోపీనాధం, ఆడిపాలార్, సిల్విక్కల్ పాలాయం, కౌదల్లీ, కొల్లెగాళ్, హొనూర్, రామాపుర, పాలార్ బ్రిడ్జి, పాలార్ రివర్ పరివాహక ప్రాంతం, నల్లూర్, హుగ్గిమ్, జెల్లి పాలాయం, మక్కం పాలాయం, ప్రకాష్ పాలాయం, తమిళనాడులోని మెట్టూర్, టట్టకేరీ, ఆండీయూర్, గార్గికెండీ, భవానీ ప్రాంతాల్లో వీరూ తన కార్యకలాపాల్ని కొనసాగిస్తుంటాడు.
బండిపూరీ, ముదుమలై, చోడిమత్తి, తితిమతి, నాగర్ హోలే ప్రాంతాలకు కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాడని అంటారు.
హైదరాబాద్ కి చెందిన గొప్ప వేటగాడు కెన్నెత్ ఏండర్సన్ (1910_1974) ఆ ప్రాంతాల్లోనే ఒకప్పుడు మేస్ ఈటర్స్ ని, వైల్డ్ ఎలిఫెంట్స్ ని మట్టుబెట్టి ఆ ప్రాంతాల ప్రజల్ని కాపాడాడు. ఏండర్సన్ వేట కథలు చదివినవారికి ఆ అడవుల గురించి బాగా తెలుస్తుంది...." విజయ్ ఉద్వేగంగా చెప్పుకుపోతున్నాడు.
విజయ్ చెప్పే విధానం మహిమ ఇమాజినేషన్ ని మరింత ఎగ్జైట్ మెంట్ కి గురిచేస్తోంది.
క్షణాలు....నిమిషాలు ఆ కాలనీలో పర్చుకున్న చీకటి నిశ్శబ్దంలో కరిగిపోతున్నాయి.
విజయ్ జస్ట్ హ్యూమన్ ఇంట్రెస్ట్ తో సేకరించిన, అతి విలువైన, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ని మహిమకి ఫీడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
సరీగ్గా అదే సమయంలో....అటవీ అంతర్భాగంలో ఎనిమిది జీపులు, నాలుగు వ్యానులు కిక్కిరిసిన పోలీసులతో, ఫారెస్ట్ సిబ్బందితో పాలార్ నదీ ప్రాంతానికేసి దూసుకుపోతున్నాయి.
వాహనాల శబ్ధాలతో అడవి నిశ్శబ్దం బద్దలయిపోతోంది.
రంజిత్ జీప్ అన్నిటికంటే ముందుగా దూసుకుపోతోంది. ఆ జీప్ లో ఎస్.ఐ.దినేష్, ఆ అటవీప్రాంతం గురించి బాగా తెలిసిన ఫారెస్ట్ రేంజర్ ఒకరున్నారు.
ఈదురుగాలి జోరుగా ఉంది....
ఆ గాలికి వూగిపోతున్న చెట్లు మృత్యుదేవతకి సంకేతంలా ఉన్నాయి.
రంజిత్ లీడర్ షిప్ లో దాడికి వెళ్ళటం వారికి ఒకింత ధైర్యాన్ని కలుగజేసింది. అయినా రెప్ప వాల్చటం కూడా మర్చిపోయినట్లు పరిసరాల్నే గమనిస్తున్నారు.
చిక్కటి చీకటి వాహనాల హెడ్ లైట్స్ కాంతితో చీల్చబడి పోతోంది.
ముందుకురానున్న ప్రమాదంకన్నా, ప్రమాదం గురించిన ఆలోచనలే మనిషిని భయాందోళనలకు గురిచేస్తుంటాయి.
నిజంగా మృత్యువే ఎదురయితే తెగింపుతో, మొండిగా తమ సర్వశక్తుల్ని కూడగట్టుకొని పోరాడతారు. కానీ ఆ లోపు పడే సంఘర్షణే నరకప్రాయమయింది. ఉరిశిక్ష విధించబడిన ఖైదీకి ఉరి మూలంగా పడే హింస అతి స్వల్పం, తానూ ఉరితీయబడబోతానన్న భయమే అత్యంత హేయం_నరకం.
ది ఫియర్ ఆఫ్ డెత్ గ్రోస్ ఈవెన్ ఫాస్టర్ దేన్ డెత్ ఇట్ సెల్ఫ్....
"ఇంకెంత దూరం....?" రంజిత్ ప్రశ్నించాడు.
"దగ్గరకొచ్చాం సార్...." రేంజర్ నెమ్మదిగా అన్నాడు.
"ఈ ప్రాంతం గురించి కొద్దిగా చెప్పు" తిరిగి అన్నాడు రంజిత్ సిగరెట్ వెలిగించుకుంటూ.
"పాలార్ బ్రిడ్జికి ఇవతల కర్నాటక, అటువైపు తమిళనాడు. ఇంటర్ స్టేట్ బోర్డర్ సార్. బ్రిడ్జికి ఇవతల మన స్టేట్ చెక్ పోస్టు ఆవల ఆ స్టేట్ చెక్ పోస్టులున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కడ గంధం చెక్కని సేకరించినా ఇటునుంచే వెళ్ళాలి. ఈ నది దాటందే వెళ్ళటం కష్టం. ఈ నదిని దాటటానికి పాలార్ బ్రిడ్జి ఒక్కటే మార్గం...."
రంజిత్ శ్రద్ధగా వింటూ ముందుకు చూస్తున్నాడు.
"వచ్చేశాం సార్" అన్నాడు రేంజర్.
"స్టాప్ ది జీప్" అన్నాడు రంజిత్.
డ్రైవర్ జీప్ ని సడన్ బ్రేక్ తో ఆపాడు.
ఆటోమేటిగ్గా వెనుక వస్తున్న వాహనాలు ఆగిపోయాయి.
ఇంజన్స్, లైట్స్ ఆఫ్ అయ్యాయి.
ఎవరి గుండె శబ్దం వారికే వినిపించేంత నిశ్శబ్దం....
ఒడల్ని జలదరింపజేసే నీరవం....
"ఇంకెంత దూరం ఉంది....?"
"జస్ట్ ఫర్లాంగ్....కొంచెం ముందున్న ఒక మలుపు జరిగితే కనిపిస్తుంది సార్...."
నది ప్రవహిస్తున్న శబ్దం అస్పష్టంగా వినిపిస్తోంది.
"ఏం చేద్దాం సార్....? బ్రిడ్జి దగ్గర కాపు కాద్దామా?" దినేష్ ప్రశ్నించాడు.
"మనకొచ్చిన వార్త నిజమేనా? ఒకవేళ నిజమే అయినా, ఇటుకేసే వీరూ సరుకు వస్తుందా?" రంజిత్ సందేహించాడు.
"కోటేయూర్ మాదయ్య, తంగవేలు వారసులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ రిలయబుల్ సార్. ఇకపోతే ఒకసారి ఫలానా దారిగుండా తన సరుకు వెళ్ళాలని వీరూ నిశ్చయించుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మార్చడు సార్...." రేంజర్ తనకున్న అనుభవంతో అన్నాడు.
రంజిత్ తల పంకించాడు.
కొత్త ఎస్.పి. ఏం చేయబోతున్నాడు? ఏ ఎత్తు వేయబోతున్నాడు? తమకే ఆజ్ఞ ఇవ్వబోతున్నాడని వెనుక వాహనాల్లో ఉన్న సిబ్బంది ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు.
ఆ భయంకరమయిన కాళరాత్రి ఎలా తెల్లవారుతోంది....? రక్తపాతంతోనా? భీకర పోరాటంతోనా? శవాల గుట్టలతోనా? ప్రతి ఒక్కరు పరిపరి విధాల ఆందోళన చెందుతున్నారు.
"మిష్టర్ దినేష్....వాహనాల్ని రోడ్డుమీంచి తప్పించండి. వీలుగా వుండే పొదలచాటుకి చేర్పించండి. సెర్చ్ లైట్స్, ఫైర్ ఆర్మ్స్ తీసుకొని బ్రిడ్జికి దగ్గరలో, రోడ్డుకి దిగువగా, మనవాళ్ళని కాపు కాయమని చెప్పండి. మనం వచ్చినట్లు కనీసం చెక్ పోస్ట్ స్టాఫ్ కి కూడా తెలియకూడదు.
ముందేం జరుగుతుందో చూద్దాం....
మన చెక్ పోస్ట్ గార్డ్స్ ఏం చేస్తారో....
వాళ్ళ లారీలెలా ముందుకు సాగుతాయో గమనించి, నేను విజిల్ వేస్తాను. అది వినగానే ఒక్కసారి రోడ్డుమీదకు మనవాళ్ళు దూసుకురావాలి. వెళుతున్న లారీలమీదకు కొందరు సెర్చ్ లైట్స్ ఫోకస్ చేయాలి. ఇంకొందరు గురిచూసి వాటి టైర్స్ ని ఫైర్ చేయాలి. కమాన్....మూవ్" అంటూ రంజిత్ ఎగిరి దూకాడు జీప్ లోంచి.
చక చకా అరగంటలోపే రంజిత్ పథకంలోని సగభాగాన్ని అమలుపరచటం జరిగింది.
రోడ్డుకి దిగువలో పొదలచాటున ఉన్న రెండొందలమంది క్షణాల్ని లెక్కేస్తూ బ్రిడ్జికి ఓ పక్క వున్న కడ్డీని అక్కడ పర్చుకున్న పల్చటి వెన్నెలలో చూడగలుగుతున్నారు.
నిండుగా ఒడ్డుని ఒరుసుకుని ప్రవహిస్తున్న నది శబ్దం లయబద్దంగా, మృత్యునాదంలా వినిపిస్తోంది. క్షణాలు కీచురాళ్ళ రొదని, ఆపైన పర్చుకున్న నిశ్శబ్దాన్ని పెనవేసుకు కరిగిపోతున్నాయి.
స్థూపం బేస్ మెంట్ తో చేసిన చిన్న గదిలాంటి దాపులో వున్న చెక్ పోస్ట్ గార్డ్స్ నలుగురు ఏదో మాట్లాడుకోవడం రంజిత్ చెవిన పడింది.
రంజిత్ తన పక్కనే ఉన్న దినేష్ చెవిలో ఏదో చెప్పాడు.
అతను ఆ మరుక్షణం పాములా జరజరా చెక్ పోస్ట్ ప్రాంతంవైపు పాక్కుంటూ వెళ్ళిపోయాడు.
రంజిత్ సిగరెట్ తాగాలన్న కోర్కెను బలవంతంగా అణచుకున్నాడు.
పొదల మాటున ఉన్న సిబ్బంది అతనికి కనిపించే అవకాశం లేదు. అయినా జాగ్రత్త కోసం చూశాడు.